సెమినరీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు
వివిధ రకాల బోధనా పరిస్థితులు మరియు అభ్యాసకుల కొరకు సూచనలు


“వివిధ రకాల బోధనా పరిస్థితులు మరియు అభ్యాసకుల కొరకు సూచనలు,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“వివిధ రకాల బోధనా పరిస్థితులు మరియు అభ్యాసకుల కొరకు సూచనలు,” రక్షకుని విధానములో బోధించుట

చిత్రం
కుటుంబానికి బోధిస్తున్న మనుష్యులు

వివిధ రకాల బోధనా పరిస్థితులు మరియు అభ్యాసకుల కొరకు సూచనలు

రక్షకుని విధానములో బోధించుట యొక్క సూత్రాలు ఏ బోధనా అవకాశానికైనా వర్తిస్తాయి—గృహములో, సంఘములో మరియు ఎక్కడైనా. అయితే, ప్రతీ అవకాశం దాని స్వంత ప్రత్యేక పరిస్థితులతో వస్తుంది. ఈ విభాగం వివిధ అభ్యాసకులు మరియు బోధనా పరిస్థితుల కొరకు నిర్దిష్టమైన అదనపు సూచనలను అందిస్తుంది.

గృహము మరియు కుటుంబము

సువార్తను బోధించుటకు మరియు నేర్చుకొనుటకు గృహము ఉత్తమమైన ప్రదేశం

“సువార్త నేర్చుకొనుటకు కేంద్రము” గా గృహము ఉండాలని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు (“మార్గదర్శకులైన కడవరి దిన పరిశుద్ధులగుట,” లియహోనా, నవ. 2018, 113). సంఘములో లేదా సెమినరీలో జరిగే బోధన విలువైనది మరియు అవసరమైనది, అయితే అది గృహములో జరిగే బోధనకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడింది. మనకు మరియు మన కుటుంబాలకు సువార్త అభ్యాసానికి ప్రధాన ప్రదేశము మరియు ఉత్తమమైన స్థలము గృహము.

కానీ దాని అర్థం, మంచి సువార్త అభ్యాసము గృహములో దానంతట అదే జరుగుతుందని కాదు; దానికి చిత్తశుద్ధితో కూడిన కృషి అవసరం. మీరు “మీ ఇంటిని మార్చడం” లేదా “మీ ఇంటిని పునర్నిర్మించుకోవడం” అవసరమని అధ్యక్షులు నెల్సన్ సూచించారు—గోడలు పడగొట్టడం లేదా కొత్త నేలను జోడించడం ద్వారా కాదు, కానీ బహుశా మీ గృహములోని మొత్తం ఆత్మను అంచనా వేయడం ద్వారా, ఆ ఆత్మకు మీ సహకారాన్ని జతచేయడం ద్వారా (“మార్గదర్శకులైన కడవరి దిన పరిశుద్ధులగుట,” 113). ఉదాహరణకు, మీ గృహములోని సంగీతం, వీడియోలు మరియు ఇతర మీడియా; గోడలపై చిత్రాలు; మరియు మీ కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే మరియు ప్రవర్తించే విధానాన్ని పరిగణించండి. ఈ విషయాలు పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఆహ్వానిస్తాయా? మీరు వ్యక్తిగతంగా మరియు కుటుంబ సమేతంగా సువార్త నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయిస్తున్నారా? కుటుంబ సభ్యులు మీ గృహములో ఉన్నప్పుడు వారు ప్రేమగా, సురక్షితంగా మరియు దేవునికి దగ్గరగా ఉన్నారని భావిస్తున్నారా?

మీ గృహములోని ఆత్మీయ వాతావరణంపై మీకు నియంత్రణ ఉందని మీరు భావించకపోవచ్చు. అదే జరిగితే, మీకు వీలైనంత ఉత్తమ ప్రభావాన్ని కలిగి ఉండండి మరియు సహాయం కోసం ప్రభువును అడగండి. నీతియుక్తమైన మీ ప్రయత్నాలను ఆయన గౌరవిస్తారు. మీరు సువార్తను బోధించడానికి మరియు నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు, మీరు ఆశించిన ఫలితాలను వెంటనే చూడకపోయినప్పటికీ, మీరు విజయం సాధిస్తున్నారు.

గృహములో నేర్చుకోవడం అనేది సంబంధాలపై ఆధారపడి ఉంటుంది

“మీరు బోధించే వారిని ప్రేమించండి” అనేది సువార్త బోధనకు సంబంధించిన అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది, కానీ గృహములో ప్రేమ చాలా సహజంగా రావాలి మరియు చాలా లోతుగా అనుభూతి చెందబడాలి. మీ గృహము తక్కువ ఆదర్శంగా ఉన్నప్పటికీ, అది సువార్త బోధకు కేంద్రంగా ఉంటుంది, ఎందుకంటే మన అత్యంత శాశ్వతమైన సంబంధాలు అక్కడే నిర్మించబడతాయి. గృహము వెలుపల ఉన్న బోధకులు, బోధకులుగా ఎక్కువ అనుభవం లేదా శిక్షణను కలిగి ఉండవచ్చు, కానీ గృహములో ఉండే ప్రేమపూర్వక, శాశ్వతమైన సంబంధాల సామర్థ్యాన్ని వారు ఎప్పుడూ నకలు చేయలేరు. కాబట్టి ఆ సంబంధాలను పెంచుకోండి. మీ కుటుంబ సభ్యుల మాటలు వినడానికి, వారిపై నమ్మకం మరియు అవగాహన పెంచుకోవడానికి అవసరమైన సమయాన్ని వెచ్చించండి మరియు కృషి చేయండి. గృహములో సువార్త బోధించడానికి మరియు నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలకు ఇది ఒక దృఢమైన పునాదిని ఏర్పరచడంలో సహాయపడుతుంది.

గృహములో నేర్చుకోవడం అనేది ప్రణాళికాబద్ధంగా ఉంటుంది, కానీ ఆకస్మికంగా కూడా ఉంటుంది

చాలా సంఘ తరగతులు వారానికి ఒకసారి ప్రణాళిక చేయబడిన ప్రారంభం మరియు ముగింపుతో జరుగుతాయి, అయితే గృహములో ఎల్లప్పుడూ అలా ఉండదు. ప్రణాళిక చేయబడిన గృహ సాయంకాల పాఠం లేదా కుటుంబ లేఖన అధ్యయనాన్ని మీరు కలిగి ఉండవచ్చు, కానీ కుటుంబంలో బోధనా అవకాశాలు తరచుగా అనధికారిక, రోజువారీ క్షణాలలో సంభవిస్తాయి—భోజనం తింటున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, ఆట ఆడుతున్నప్పుడు, పని లేదా పాఠశాలకు వెళ్ళేటప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు లేదా కలిసి సినిమా చూస్తున్నప్పుడు. ఒక వర్షపు తుఫాను ఆత్మీయ తుఫానుల నుండి రక్షకుడు మనకు ఎలా ఆశ్రయం కల్పిస్తారు అనే దాని గురించి మాట్లాడే అవకాశం కాగలదు. కష్టమైన నిర్ణయం తీసుకోవలసియున్న యువకుడు వ్యక్తిగత బయల్పాటు గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండవచ్చు. భయపడిన బిడ్డ ఆదరణకర్త గురించి మీరు చెప్పే సాక్ష్యం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఒకరిపట్ల మరొకరు తప్పుగా ప్రవర్తించే లేదా చెడుగా ప్రవర్తించే పిల్లలు పశ్చాత్తాపం మరియు క్షమాపణ గురించి బోధించబడవచ్చు.

అటువంటి క్షణాలు ప్రణాళిక చేయనివి కాబట్టి, మీరు సాంప్రదాయ పాఠం కోసం సిద్ధపడే విధంగా వాటి కొరకు సిద్ధపడలేరు. అయినప్పటికీ, మీరు ఆత్మ పట్ల సున్నితంగా ఉండుట మరియు “ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుటకు” ప్రయత్నించుట ద్వారా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోగలరు (1 పేతురు 3:15). ఏ క్షణమైనా బోధన లేదా నేర్చుకునే క్షణం కావచ్చు.

గృహములో నేర్చుకోవడం అనేది చిన్న, సరళమైన, స్థిరమైన ప్రయత్నాలను కలిగి ఉంటుంది

గృహములో సువార్త బోధించడానికి వారి ప్రయత్నాలు విజయవంతం కానప్పుడు తల్లిదండ్రులు కొన్నిసార్లు నిరుత్సాహపడతారు. ఒక్కొక్కటిగా పరిగణిస్తే, ఒక గృహ సాయంకాలం, లేఖన అధ్యయన సమయం లేదా సువార్త సంభాషణ ఎక్కువ సాధించినట్లు అనిపించకపోవచ్చు. కానీ కాలక్రమేణా స్థిరంగా పునరావృతమయ్యే చిన్న, సాధారణ ప్రయత్నాల సమీకరణ అప్పుడప్పుడు సంభవించే స్మరణీయ క్షణం లేదా అద్భుతమైన పాఠము కంటే మరింత శక్తివంతమైనది మరియు బలపరిచేది కాగలదు. “అన్ని విషయములు సరైన సమయములో వచ్చును” అని ప్రభువు సెలవిచ్చెను. “కాబట్టి, మంచి చేయుట యందు విసుగులేకయుండుడి, ఏలయనగా మీరు ఒక గొప్ప కార్యమునకు పునాది వేయుచున్నారు. మరియు చిన్నవిషయముల నుండి గొప్ప సంగతులు సంభవించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 64:32–33; ఆల్మా 37:6–7 కూడా చూడండి). కాబట్టి వదలకండి మరియు ప్రతీసారి ఏదైనా గొప్పగా సాధించడం గురించి చింతించకండి. కేవలం మీ ప్రయత్నాలలో స్థిరంగా ఉండండి.

గృహములో, నేర్చుకోవడం మరియు జీవించడం అనేవి విడదీయరానివి

గృహములో సువార్త తక్షణ సంబంధాన్ని పొందుతుంది. అక్కడ అనుదినము మీరు ఎవరితో కలిసి సువార్త నేర్చుకుంటున్నారో వారితో కలిసి మీరు దానిని జీవిస్తారు. వాస్తవానికి, ఎక్కువ సమయం మనం సువార్తను నేర్చుకొనేది సువార్తను జీవించడం ద్వారానే. కాబట్టి మీరు గృహములో సువార్తను నేర్చుకుని, బోధిస్తున్నప్పుడు, మీరు నేర్చుకుంటున్న దానితో మీరు చేస్తున్న పనులను అనుసంధానించడానికి మార్గాలను వెదకండి. మీ గృహములో, సువార్త అనేది మీరు మాట్లాడే విషయముగా మాత్రమే కాకుండా మీరు జీవించడానికి కృషి చేసేదిగా ఉండనివ్వండి.

చిత్రం
పిల్లలకు బోధిస్తున్న స్త్రీ

కుటుంబంలో బోధనా అవకాశాలు తరచుగా అనధికారిక, రోజువారీ క్షణాలలో సంభవిస్తాయి.

పిల్లలకు బోధించుట

పిల్లలకు వైవిధ్యం కావాలి

పిల్లలందరూ భిన్నంగా ఉంటారు మరియు వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు, వారి అవసరాలు మారుతాయి. మీ బోధనా పద్ధతులను మార్చుకోవడం వారి విభిన్న అవసరాలను తీర్చడంలో మీకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, క్రింది వాటిని ఉపయోగించడాన్ని పరిగణించండి:

  • కథలు. అనుదిన జీవితానికి సువార్త ఎలా వర్తిస్తుందో చూడడానికి కథలు పిల్లలకు సహాయపడతాయి. లేఖనాల నుండి, మీ స్వంత జీవితం నుండి, మీ కుటుంబ చరిత్ర నుండి లేదా సంఘ పత్రికల నుండి కథలను, ముఖ్యంగా రక్షకుని గురించిన కథనాలను ఉపయోగించండి. చిత్రాలను పట్టుకోవడం, పదబంధాలను పునరావృతం చేయడం లేదా భాగాలను అభినయించడం ద్వారా పిల్లలను కథలో చేర్చడానికి మార్గాలను ప్రణాళిక చేయండి.

  • దృశ్య సహాయకాలు. చిత్రాలు, వీడియోలు మరియు వస్తువులు పిల్లలకు సువార్త సూత్రాలను అర్థం చేసుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి సహాయపడతాయి. ChurchofJesusChrist.orgలోని Media Libraryలో అనేక చిత్రాలు మరియు వీడియోలను చూడవచ్చు.

  • సంగీతము. కీర్తనలు మరియు ఇతర పవిత్రమైన పాటలు పిల్లలు దేవుని ప్రేమను అనుభూతి చెందుటకు, ఆత్మను అనుభూతి చెందుటకు మరియు సువార్త సత్యాలను నేర్చుకొనుటకు సహాయపడతాయి. రాగాలు, లయలు మరియు సాధారణ కీర్తనలు పిల్లలు రాబోయే సంవత్సరాల్లో సువార్త సత్యాలను గుర్తుంచుకోవడానికి సహాయపడతాయి. మీరు పిల్లలతో పాడేటప్పుడు, పాటలలో బోధించిన సూత్రాలను కనుగొనడంలో మరియు అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడండి.

బహుళ ఇంద్రియాల ప్రమేయం ఉన్నప్పుడు చాలామంది పిల్లలు ఉత్తమంగా నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకునేటప్పుడు వారి దృష్టి, వినికిడి మరియు స్పర్శ ఇంద్రియాలను ఉపయోగించడంలో సహాయపడే మార్గాలను కనుగొనండి. కొన్ని సందర్భాలలో, మీరు వారి వాసన మరియు రుచి యొక్క వివేకాన్ని ఉపయోగించడానికి మార్గాలను కూడా కనుగొనవచ్చు!

పిల్లలు సృజనాత్మకంగా ఉంటారు

ఒక సువార్త సూత్రానికి సంబంధించినది ఏదైనా గీయడానికి, నిర్మించడానికి, రంగులు వేయడానికి లేదా వ్రాయడానికి మీరు పిల్లలను ఆహ్వానించినప్పుడు, ఆ సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవడంలో మీరు వారికి సహాయపడతారు మరియు వారు నేర్చుకున్న వాటి గురించి వారికి స్పష్టమైన జ్ఞాపికలను అందిస్తారు. వారు నేర్చుకున్న వాటిని ఇతరులతో పంచుకోవడానికి వారు తయారుచేసిన వాటిని కూడా వారు ఉపయోగించవచ్చు. ఫ్రెండ్ పత్రిక యొక్క ప్రతీ సంచికలో పిల్లల కోసం సృజనాత్మక కార్యకలాపాలు ఉంటాయి.

పిల్లలు జిజ్ఞాస కలిగియుంటారు

పిల్లలు ప్రశ్నలు అడిగినప్పుడు, వాటిని అవాంతరాలుగా కాకుండా అవకాశాలుగా చూడండి. పిల్లల ప్రశ్నలు వారు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తాయి మరియు వారి ప్రశ్నలు వారు ఏమి ఆలోచిస్తున్నారు మరియు అనుభూతి చెందుతున్నారనే దాని గురించి మీకు విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి. వారి ఆత్మీయ ప్రశ్నలకు సమాధానాలు లేఖనాలలో మరియు జీవించి ఉన్న ప్రవక్తల మాటలలో కనుగొనబడగలవని చూడడానికి వారికి సహాయం చేయండి.

పిల్లలు విఘాతం కలిగించినప్పుడు కూడా వారికి ప్రేమ అవసరం

కొన్నిసార్లు ఒక బిడ్డ ఇతరుల అభ్యాసానికి అంతరాయం కలిగించే విధంగా ప్రవర్తిస్తాడు. చాలావరకు ప్రవర్తనాపరమైన ఆటంకాలు తీరని అవసరం వలన పెరుగుతాయి. అలా జరిగినప్పుడు, పిల్లవాడు ఎదుర్కొనే సవాళ్ళ గురించి ఓపికగా, ప్రేమగా ఉండండి మరియు అర్థం చేసుకోండి. అతడు లేదా ఆమెకు సానుకూల మార్గాలలో పాఠంలో పాల్గొనడానికి మరిన్ని అవకాశాలు అవసరం కావచ్చు—ఉదాహరణకు, చిత్రాన్ని పట్టుకోవడం, ఏదైనా గీయడం లేదా లేఖనాన్ని చదవడం వంటివి.

ఒక బిడ్డ అంతరాయం కలిగించడం కొనసాగించినట్లయితే, అతడితో లేదా ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడడం సహాయకరంగా ఉండవచ్చు. ప్రేమ మరియు ఓర్పు గల ఆత్మతో, మీ అంచనాలను వివరించండి మరియు అతడు లేదా ఆమె వాటిని చేరుకోగలరనే మీ విశ్వాసాన్ని వ్యక్తపరచండి. అతడు లేదా ఆమె మంచి ఎంపికలు చేసినప్పుడు ఆ బిడ్డను ప్రశంసించండి.

పిల్లలకు పంచుకోవడానికి చాలా విషయాలున్నాయి

పిల్లలు ఏదైనా క్రొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు, సహజంగానే దానిని ఇతరులతో పంచుకోవాలని అనుకుంటారు. ఒకరికొకరు, వారి కుటుంబ సభ్యులకు మరియు వారి స్నేహితులకు సువార్త సూత్రాలను బోధించే అవకాశాలను పిల్లలకు ఇవ్వడం ద్వారా ఈ కోరికను ప్రోత్సహించండి. మీరు బోధిస్తున్న సూత్రాలకు సంబంధించి వారి ఆలోచనలు, భావాలు మరియు అనుభవాలను మీతో పంచుకోమని కూడా వారిని అడగండి. సరళమైన, స్వచ్ఛమైన మరియు శక్తివంతమైన అంతరార్థములను వారు కలిగియున్నారని మీరు కనుగొంటారు.

పిల్లలు ఆత్మను అనుభవించగలరు, కానీ ఆయన ప్రభావాన్ని గుర్తించడంలో వారికి సహాయం కావాలి

పరిశుద్ధాత్మ వరమును ఇంకా పొందని పిల్లలు కూడా ఆయన ప్రభావాన్ని అనుభూతి చెందగలరు, ప్రత్యేకించి వారు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి నేర్చుకుంటున్నప్పుడు. వారు నీతియుక్తమైన ఎంపికలను చేసినప్పుడు, వారు ఆత్మ ద్వారా రక్షకుని ఆమోదాన్ని అనుభవించగలరు. ఆత్మ మనతో సంభాషించే వివిధ మార్గాల గురించి పిల్లలకు బోధించండి. ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించడంలో వారికి సహాయపడండి. ఇది వారి జీవితాంతం వ్యక్తిగత బయల్పాటును వెదకడంలో మరియు దానిపై పనిచేసే అలవాటును అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడుతుంది.

యువతకు బోధించుట

యువతకు గొప్ప సామర్థ్యం ఉంది

ప్రభువు సేవలో విశేషమైన పనులు చేయగల సామర్థ్యం యువతకు ఉంది. యౌవనస్థుల ఆత్మీయ సామర్థ్యాలపై దేవునికి నమ్మకం ఉందని లేఖనాలలో నమోదు చేయబడిన అనేక అనుభవాలు వివరిస్తున్నాయి. మీరు వారిని విశ్వసిస్తున్నారని యువతకు అనిపిస్తే, వారి దైవిక సామర్థ్యంపై వారికి విశ్వాసం పెరుగుతుంది మరియు వారు సాధించగలిగిన వాటిచేత వారు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. వారు ఏమి కాగలరని పరలోక తండ్రికి తెలుసో చూడడానికి వారికి ప్రేమతో సహాయం చేయండి. వారిని ప్రేమించడాన్ని మరియు ప్రోత్సహించడాన్ని కొనసాగించడం ద్వారా, ఓర్పుగా వారితో పనిచేయడం ద్వారా మరియు వారిపై ఎన్నటికీ ఆశ వదులుకోకుండా ఉండడం ద్వారా రక్షకుని మాదిరిని అనుసరించండి.

యువత తమ గురించి నేర్చుకుంటున్నారు

మీరు బోధించే యువత వారి సాక్ష్యపు పునాదులను ఏర్పరచుకొనుచున్నారు. వారు తమ నమ్మకాలను మరియు దృఢవిశ్వాసాలను కనుగొనే ప్రక్రియలో ఉన్నారు. వారి జీవిత గమనాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. ఈ విపత్కర సమయాలలో ఆత్మీయంగా జీవించడానికి మరియు వారి కోసం ప్రభువు యొక్క నియమితకార్యాన్ని నెరవేర్చడానికి, మీరు బోధించే యువత తమ శోధనల సమయంలో శక్తిని ఎలా పొందాలో, వారి ప్రశ్నలకు సమాధానాలను మరియు “దేవునికి సాక్షులుగా నిలబడే” ధైర్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది (మోషైయ 18:9).

కేవలం విషయాలు చెప్పబడడం ద్వారా కాకుండా తార్కికం మరియు అనుభవం ద్వారా విషయాలను నేర్చుకోవాలనే కోరిక యువతలో పెరుగుతోంది. యువతకు బోధించాలంటే మంచి వినికిడి నైపుణ్యాలు అవసరం అని దీని అర్థము. వారిని అర్థం చేసుకున్నామని యువత భావించినప్పుడు, వారు సలహా మరియు మార్గదర్శకత్వం కోసం మరింత సంసిద్ధులుగా భావిస్తారు. ప్రభువుకు వారు తెలుసునని, ప్రశ్నలు మరియు పరీక్షలతో వారు కుస్తీపడుతున్నప్పుడు వారికి సహాయం చేస్తారని వారికి భరోసా ఇవ్వండి. అనుదిన ప్రార్థన, లేఖన అధ్యయనం మరియు ఇతరులకు సేవ చేయడం ద్వారా వారు ఆయన యందు తమ విశ్వాసాన్ని సాధన చేయవచ్చు. సంఘ తరగతులలో పాల్గొనడానికి మరియు వారి స్వంతంగా అధ్యయనం చేయడానికి యువతను ప్రోత్సహించడం వారి దైవిక వారసత్వం యొక్క సాక్ష్యాన్ని నిర్మించే వ్యక్తిగత అనుభవాలను కలిగి ఉండుటకు సహాయపడగలదు.

చాలామంది యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో సౌకర్యంగా ఉన్నారు

మీరు బోధించే యువత వారి స్వంత ఎలక్ట్రానిక్ పరికరాలను కలిగి ఉంటే, ఈ పరికరాలు అభ్యాసాన్ని మెరుగుపరచడానికి సాధనాలు అని గుర్తుంచుకోండి. సువార్త గ్రంథాలయములో ఉన్న వారి ఎలక్ట్రానిక్ లేఖనాలను మరియు ఇతర వనరులను ఎలా ఉపయోగించాలో వారికి బోధించండి. రాబోయే పాఠాల కొరకు సిద్ధపడుటకు మీరు యువతకు సందేశాలు మరియు లింక్‌లను కూడా పంపవచ్చు.

చిత్రం
ఆదివారపు బడి తరగతి

వారు ఏమి కాగలరని పరలోక తండ్రికి తెలుసో దానిని యువత అర్థం చేసుకోవాలి.

వయోజనులకు బోధించుట

వయోజనులు వారి అభ్యాసానికి బాధ్యత తీసుకోగలరు

వయోజన అభ్యాసకులు సువార్త నేర్చుకునే పరిస్థితులలో తమ కోసం తాము పని చేయగలరు (2 నీఫై 2:26 చూడండి). ముందుగా ఏదైనా అధ్యయనం చేయడం ద్వారా సువార్త చర్చలకు సిద్ధపడమని వారిని ఆహ్వానించండి మరియు వారు ఆత్మ ద్వారా నేర్చుకుంటున్న వాటిని పంచుకోమని వారిని ప్రోత్సహించండి. ఏ సువార్త సూత్రాలను కలిసి తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నారని కూడా మీరు వారిని అడగవచ్చు.

నేర్చుకునేటప్పుడు పెద్దలు వారి అనుభవాలను మూలాధారముగా ఉపయోగిస్తారు

యోబు ఇలా అన్నాడు, “వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది” (యోబు 12:12). సాధారణంగా, జ్ఞానం మరియు ఆత్మీయ అవగాహన సంవత్సరాల తరబడి అనుభవం తరువాత వస్తాయి. మీరు వయోజనులకు బోధిస్తున్నప్పుడు, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యందు వారి విశ్వాసాన్ని పెంపొందించిన అనుభవాలను పంచుకోవడానికి వారిని ఆహ్వానించండి. వారు అధ్యయనం చేస్తున్న సువార్త సూత్రాలు నిజమని వారు ఎలా తెలుసుకున్నారనే దాని గురించి సాక్ష్యమివ్వడానికి ఇది వారికి అవకాశాలను ఇస్తుంది. అనుభవాలను పంచుకోవడం మీరు బోధించే వారి మధ్య సంబంధాలను కూడా పెంపొందిస్తుంది మరియు “అందరు ఆత్మీయాభివృద్ధిని పొందుటకు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:122) సహాయపడుతుంది.

వయోజనులు ఆచరణాత్మక వినియోగాన్ని కోరుకుంటారు

మీరు బోధించే వయోజనులకు వారి వృత్తులు, సమాజాలు, సంఘ పిలుపులు మరియు కుటుంబాలలో అనేక పాత్రలు మరియు బాధ్యతలు ఉండవచ్చు. వారు సువార్తను అధ్యయనం చేస్తున్నప్పుడు, తాము నేర్చుకుంటున్న విషయాలు ఆ పాత్రలలో వారికి ఎలా సహాయపడగలవని వారు తరచుగా ఆలోచిస్తారు. వారి ప్రత్యేక పరిస్థితులకు దేవుని వాక్యం ఎలా సందర్భోచితంగా ఉందో చూడడానికి వారిని ఆహ్వానించండి. సువార్త సూత్రాలు ఏవిధంగా అర్థవంతమైనవి మరియు వారి జీవితాలకు ఎలా వర్తిస్తాయి అని వారిని అడగడం ద్వారా మీరు దీన్ని చేయవచ్చు.

పెద్దలు సంక్లిష్టమైన మార్గాలలో ఆలోచించగలరు

వారి అనుభవం మరియు జ్ఞానం కారణంగా, సువార్త ప్రశ్నలకు ఎల్లప్పుడూ సులభమైన సమాధానాలు ఉండవని పెద్దలకు తెలుసు. ఒక లేఖన భాగానికి బహుళ అర్థాలు ఉండవచ్చని వారు అభినందిస్తారు మరియు ఒక సువార్త సూత్రాన్ని వివిధ జీవిత పరిస్థితులకు వారు అన్వయించగలరు. సువార్త సూత్రాలు ఒకదానికొకటి మరియు వారి జీవితంలో జరుగుతున్న దానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఆలోచించమని వారిని ఆహ్వానించండి. పాల్గొనడాన్ని మరియు చర్చను ప్రోత్సహించండి, తద్వారా వారు ఒకరు కలిగియున్న ప్రత్యేక దృక్కోణాల నుండి మరొకరు నేర్చుకోగలరు.

చిత్రం
తరగతి బోధిస్తున్న స్త్రీ

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుపై తమ విశ్వాసాన్ని నిర్మించిన అనేక అనుభవాలను వయోజనులు పంచుకోవచ్చు.

అంగవైకల్యము గలవారికి బోధించుట

ప్రతీ వ్యక్తి అభివృద్ధి చెందడానికి మరియు పురోగమించడానికి సహాయపడండి

“దేవుడు ప్రపంచంలోకి పంపిన అన్ని మనస్సులు మరియు ఆత్మలకు విస్తరించే అవకాశం ఉంది” అని జోసెఫ్ స్మిత్ బోధించారు (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 210). దేవుని పిల్లలందరూ జ్ఞానాన్ని పెంపొందించుకోగలరని మరియు అభివృద్ధి చెందగలరని భావించండి. ప్రతీ వ్యక్తికి ఎలా సహాయం చేయాలో తెలుసుకొనుటకు మీకు సహాయం చేయమని ప్రభువును అడగండి.

నిర్దిష్ట అవసరాల గురించి తెలుసుకోండి

అభ్యాసకులు లేదా వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో మాట్లాడండి. ప్రతీ వ్యక్తి ఉత్తమంగా ఎలా నేర్చుకుంటారో మరియు ఏ వ్యూహాలు చాలా సహాయకారిగా ఉన్నాయో తెలుసుకోండి. అనుభవం మరియు అంతర్దృష్టులు ఉన్న ఇతర నాయకులు మరియు బోధకులతో కూడా మీరు ఆలోచన చేయవచ్చు. సహాయకరమైన బోధనా వ్యూహాల కోసం disabilities.ChurchofJesusChrist.org చూడండి.

సానుకూల వాతావరణాన్ని సృష్టించండి

ప్రతీఒక్కరూ సురక్షితంగా మరియు ప్రేమగా భావించే సానుకూల వాతావరణాన్ని సృష్టించండి. వైకల్యాలున్న అభ్యాసకులందరూ ఒకేలా ఉంటారని అనుకోకండి మరియు ప్రతీ వ్యక్తితో ప్రేమగా, గౌరవంగా వ్యవహరించండి. దయగా మరియు అంగీకరించువారిగా ఉండమని ఇతరులను ప్రోత్సహించండి.

అందరూ పాల్గొనగలరని నిర్ధారించుకోండి

శారీరక పరిమితులు లేదా నేర్చుకోవడానికి ఇబ్బందులు గలవారితో సహా అభ్యాసకులందరూ నేర్చుకోగలరని నిర్ధారించడానికి ప్రోత్సాహకార్యక్రమాలలో చిన్న మార్పులు చేయవచ్చు. ఉదాహరణకు, ఏదైనా ప్రోత్సాహకార్యక్రమం చిత్రాన్ని చూపించమని సూచిస్తే, దానికి బదులుగా దృష్టి లోపం ఉన్న అభ్యాసకులను చేర్చడానికి మీరు సంబంధిత పాటను పాడవచ్చు.

స్థిరమైన నిత్యకృత్యాలు మరియు నిర్మాణాన్ని ఏర్పాటు చేయండి

నిత్యకృత్యాలను ఏర్పాటు చేయడానికి ఒక మార్గం కార్యక్రమపట్టికతో ప్రకటనపత్రాన్ని తయారు చేయడం. మీ కార్యక్రమపట్టిక‌లో ప్రార్థనలు, బోధనా సమయం మరియు కార్యాచరణ సమయం ఉండవచ్చు. కార్యక్రమపట్టిక‌‌ను అనుసరించడం కొంతమంది అభ్యాసకులకు అనిశ్చితి మరియు ఆందోళన భావాలను తగ్గించవచ్చు.

సవాలుతోకూడిన ప్రవర్తనలు ఎందుకు సంభవిస్తాయో అర్థం చేసుకోండి

ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తించేలా ప్రభావితం చేసే వైకల్యాలు లేదా పరిస్థితుల గురించి తెలుసుకోండి. సవాలు చేసే ప్రవర్తనలు తలెత్తినప్పుడు ఏమి జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. అభ్యాసకులకు మెరుగైన మద్దతునిచ్చేందుకు పరిస్థితిని ఎలా సవరించాలో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి.

వైకల్యాలున్న వ్యక్తులకు బోధించడం గురించి మరింత సమాచారం కొరకు, disabilities.ChurchofJesusChrist.org చూడండి.

చిత్రం
యువతుల తరగతి

ప్రతీఒక్కరూ అంగీకరించబడినట్లు మరియు ప్రేమించబడినట్లు భావించేలా బోధకులు సానుకూల అభ్యాస వాతావరణాన్ని సృష్టించగలరు.

వర్చువల్ బోధన

సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా తెలుసుకోండి

మీ తరగతి లేదా సమావేశానికి ముందు, మీరు ఉపయోగించబోయే సాంకేతికత గురించి తెలుసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించండి. వాటిలో వీడియోలు లేదా చిత్రాలను ఎలా పంచుకోవాలి వంటి కొన్ని లక్షణాలను అన్వేషించండి. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో ఒక “నమూనా” సమావేశం జరపడాన్ని పరిగణించండి.

చాలా వార్డులు మరియు స్టేకులు ఒక సాంకేతిక నిపుణుడిని కలిగి ఉంటాయి. వర్చువల్ సమావేశాలతో అనుభవం ఉన్న ఇతరులు కూడా మీకు తెలిసి ఉండవచ్చు. వారి సలహా లేదా నడిపింపు కొరకు అడగండి.

సంభవనీయమైన పరధ్యానాలను తొలగించండి

సాధ్యమైతే, మీ సమావేశానికి హాజరు కావడానికి నిశ్శబ్ద స్థలాన్ని కనుగొనండి. వెనుక నుండి వచ్చే శబ్దాలు ఆటంకపరచగలవు. అదేవిధంగా చేయమని లేదా వారు మాట్లాడనప్పుడు మైక్రోఫోనులు ఆపి ఉంచమని అభ్యాసకులను ప్రోత్సహించండి.

కెమెరాను ఉపయోగించండి

సాధ్యమైతే, అభ్యాసకులు మీ ముఖాన్ని చూడగలిగేలా మీ కెమెరాను ఆన్‌చేసి ఉంచండి. అభ్యాసకులను కూడా కెమెరాలు ఆన్‌చేసి ఉంచమని ఆహ్వానించండి (కానీ తప్పనిసరి కాదు). ఇది ఐక్యత మరియు పరస్పర మద్దతునిచ్చే స్ఫూర్తిని సృష్టించడంలో సహాయపడుతుంది.

వర్చువల్ చాట్ ఫీచర్‌ని ఉపయోగించండి

అనేక వర్చువల్ సమావేశ కార్యక్రమాలు చాట్ విండోలో ప్రశ్నలు లేదా వ్యాఖ్యానాలను టైపు చేయడానికి పాల్గొనేవారిని అనుమతిస్తాయి. కొన్ని వర్చువల్‌గా తమ చేతులను పైకెత్తడానికి కూడా పాల్గొనేవారిని అనుమతిస్తాయి. ఈ వైఖరులను గూర్చి అభ్యాసకులు తెలుసుకోనివ్వండి. చాట్‌లో పైకి లేచిన చేతులు లేదా వ్యాఖ్యలను చూడడానికి మీరు ఎవరినైనా నియమించాలనుకోవచ్చు, తద్వారా మీరు చర్చను నడిపించడంపై మీ దృష్టిని కేంద్రీకరించవచ్చు.

అభ్యాసకులను చేర్చుకోవడానికి మార్గాలను కనుగొనండి

వర్చువల్ అభ్యాస పరిస్థితులు కొన్నిసార్లు వ్యక్తులు కనిపించడాన్ని మరియు వినడాన్ని కష్టతరం చేస్తాయి. పాల్గొనాలనుకునే వారిని చేర్చుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు దీని అర్థం చిన్న సమూహాలను సృష్టించడం (ఉదాహరణకు, పెద్ద ఆదివారపు బడి తరగతిని విభజించడం ద్వారా). కొన్నిసార్లు దీని అర్థం ఒక నిర్దిష్ట మార్గంలో పాల్గొనమని అభ్యాసకులను ముందుగా అడగడం. సాంకేతికత యొక్క పరిమితులు ఆసక్తి గల వ్యక్తులు మరియు నేర్చుకోవడానికి ఇష్టపడే వ్యక్తుల గురించి మీరు మరచిపోయేలా లేదా పట్టించుకోకుండా ఉండేలా చేయనివ్వకండి.