లేఖనములు
2 నీఫై 10


10వ అధ్యాయము

యూదులు తమ దేవుడిని సిలువ వేయుదురని జేకబ్ వివరించును—ఆయన యందు విశ్వాసముంచుట మొదలుపెట్టు వరకు వారు చెదరగొట్టబడుదురు—అమెరికా ఏ రాజు పరిపాలించని స్వతంత్ర దేశమైయుండును—మీరు దేవునితో సమాధానపడి, ఆయన కృప ద్వారా రక్షణ పొందుడి. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, జేకబ్ అను నేను, నేను చెప్పిన నీతివంతమైన కొమ్మను గూర్చి మీతో మరలా మాట్లాడెదను.

2 ఏలయనగా, మనము పొందిన వాగ్దానములు మనకు శరీరానుసారమైనవి; కావున, మన సంతానములో అనేకులు అవిశ్వాసమును బట్టి శరీరమునందు నశించుదురని నాకు చూపబడినప్పటికీ, దేవుడు అనేకులపట్ల కనికరముగానుండును; మరియు వారి విమోచకుని గూర్చి నిజమైన జ్ఞానమును ఇచ్చు దానికి వారు వచ్చునట్లు, మన సంతానము తిరిగి పునఃస్థాపించబడును.

3 ఇప్పుడు, నేను మీతో చెప్పినట్లుగా క్రీస్తు (ఇది ఆయన పేరైయుండునని గత రాత్రి దేవదూత నాతో చెప్పెను) యూదుల మధ్య అనగా లోకము యొక్క మిక్కిలి దుష్ట భాగమైయున్న వారి మధ్య వచ్చుట అవసరము; వారు ఆయనను సిలువ వేయుదురు—అది మన దేవునికి తగును మరియు తమ దేవుడిని సిలువ వేయు ఏ ఇతర జనాంగము భూమి పైన లేదు.

4 ఏలయనగా ఆ గొప్ప అద్భుతములు ఇతర జనముల మధ్య చేయబడిన యెడల, వారు పశ్చాత్తాపపడి ఆయనే తమ దేవుడని ఎరుగుదురు.

5 కానీ యాజకవంచనలు మరియు దుష్టత్వములను బట్టి యెరూషలేములోనున్న వారు, ఆయన సిలువ వేయబడునట్లు ఆయనకు వ్యతరేకముగా తమ మెడలను బిరుసు చేసుకొందురు.

6 కావున, వారి దుష్టత్వము కారణముగా వారిపై నాశనములు, కరువులు, తెగుళ్ళు, రక్తపాతము వచ్చును; మరియు నాశనము చేయబడని వారు జనములన్నిటి మధ్య చెదిరిపోవుదురు.

7 కానీ, ప్రభువైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేనే క్రీస్తునని వారు నా యందు విశ్వాసముంచు దినము వచ్చినప్పుడు, భూమిపైన వారి స్వాస్థ్యమైన దేశములకు వారు పునఃస్థాపించబడుదురని నేను వారి పితరులతో నిబంధన చేసియున్నాను.

8 వారు తమ దీర్ఘ విభజన నుండి, సముద్ర ద్వీపముల నుండి మరియు భూమి యొక్క నాలుగు చెరగుల నుండి సమకూర్చబడుదురు; వారిని వారి స్వాస్థ్యమైన దేశములకు తీసుకొని పోవుటలో అన్యజనుల యొక్క జనములు నా కన్నుల యందు గొప్పగా ఉండునని దేవుడు సెలవిచ్చుచున్నాడు.

9 అన్యజనుల రాజులు వారిని పోషించు తండ్రులుగాను, వారి రాణులు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు; అందువలన, అన్యజనులకు దేవుని వాగ్దానములు గొప్పవి; ఏలయనగా ఆయన దానిని పలికెను మరియు వ్యాజ్యెమాడువాడెవడు?

10 కానీ, ఈ దేశము మీ స్వాస్థ్యమైన దేశముగా ఉండునని, ఈ దేశముపై అన్యజనులు ఆశీర్వదింపబడుదురని దేవుడు సెలవిచ్చెను.

11 ఈ దేశము అన్యజనులకు ఒక స్వతంత్ర దేశమైయుండును, ఈ దేశముపై అన్యజనులను పరిపాలించు రాజులెవ్వరూ ఉండరు.

12 ఈ దేశమును సమస్త ఇతర జనములకు వ్యతిరేకముగా నేను బలపరిచెదను.

13 సీయోనుకు వ్యతిరేకముగా పోరాడువాడు నశించునని దేవుడు సెలవిచ్చుచున్నాడు.

14 నాకు వ్యతిరేకముగా ఒక రాజును ఏర్పరుచువాడు నశించును. ఏలయనగా, నేను ప్రభువును, పరలోకము యొక్క రాజును, వారి రాజునైయుందును మరియు నా మాటలు వినువారికి నిత్యము ఒక వెలుగుగా ఉందును.

15 కావున ఈ కారణముచేత మరియు వారు శరీరమందున్నప్పుడే నేను వారికి చేసెదనని నరుల సంతానముతో నేను చేసియున్న నా నిబంధనలు నెరవేరునట్లు నేను అంధకారపు రహస్య క్రియలను, హత్యలను మరియు హేయక్రియలను తప్పక నాశనము చేయవలెను.

16 అందువలన, సీయోనుకు వ్యతిరేకముగా పోరాడు యూదుడు మరియు అన్యజనుడు, బందీ మరియు స్వతంత్రుడు, స్త్రీ మరియు పురుషుడు నశించెదరు; వారే సమస్త భూమి యొక్క వ్యభిచారులు; నా పక్షమున లేని వారు నాకు విరోధముగానున్నారని దేవుడు సెలవిచ్చుచున్నాడు.

17 ఏలయనగా, వారు శరీరమందున్నప్పుడే నేను వారికి చేసెదనని నరుల సంతానమునకు నేను చేసిన నా వాగ్దానములను నేను నెరవేర్చెదను.

18 కావున నా ప్రియమైన సహోదరులారా, మన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను నీ సంతామును అన్యజనుల చేత బాధించెదను. అయినప్పటికీ, అన్యజనులు వారికి ఒక తండ్రివలే యుండునట్లు నేను వారి హృదయములను మృదువుగా చేసెదను; అందువలన అన్యజనులు ఆశీర్వదింపబడి, ఇశ్రాయేలు వంశస్థుల మధ్య లెక్కింపబడుదురు.

19 కావున, నేను ఈ దేశమును వారి స్వాస్థ్యమైన దేశముగా నీ సంతానమునకు మరియు నీ సంతానము మధ్య లెక్కింపబడు వారికి శాశ్వతముగా ప్రతిష్ఠించెదను; ఏలయనగా, అది సమస్త దేశములను మించిన శ్రేష్ఠమైన దేశమని దేవుడు నాకు సెలవిచ్చుచున్నాడు; అందువలన, దానిపై నివసించు మనుష్యులందరు నన్ను ఆరాధించునట్లు చేయుదునని దేవుడు సెలవిచ్చుచున్నాడు.

20 ఇప్పుడు, నా ప్రియమైన సహోదరులారా, కనికరము గల మన దేవుడు ఈ విషయములను గూర్చి అంత గొప్ప జ్ఞానమును మనకు దయచేసియున్నాడని చూచి, మనము ఆయనను జ్ఞాపకము చేసుకొని, మన పాపములను విడిచిపెట్టి, దిగులు చెందకయుండెదము, ఏలయనగా మనము వదిలివేయబడలేదు; కానీ మనము మన స్వాస్థ్యమైన దేశము నుండి బయటకు తరిమివేయబడితిమి; అయితే మనము ఒక శ్రేష్ఠమైన దేశమునకు నడిపించబడితిమి; ఏలయనగా ప్రభువు సముద్రమును మనకు మార్గముగా చేసియున్నాడు మరియు మనము సముద్ర ద్వీపముపైన ఉన్నాము.

21 కానీ సముద్ర ద్వీపములపైన ఉన్న వారికి ప్రభువు యొక్క వాగ్దానములు గొప్పవి; ద్వీపములు అని చెప్పుచున్నందున, దీనికంటే ఎక్కువ ద్వీపములు ఉండవలెను మరియు అక్కడ కూడా మన సహోదరులు నివసించుచుండవలెను.

22 ఏలయనగా, ప్రభువైన దేవుడు ఎప్పటికప్పుడు ఆయన చిత్తము మరియు ఇచ్ఛానుసారముగా ఇశ్రాయేలు వంశములను నడిపించెను. ఇప్పుడు, వేరుచేయబడిన వారినందరిని ప్రభువు జ్ఞాపకము చేసుకొనినందువలన, ఆయన మనలను కూడా జ్ఞాపకము చేసుకొనును.

23 కాబట్టి, మీ హృదయములను సంతోషపరచుకొనుడి మరియు శాశ్వతమరణము యొక్క మార్గమును లేదా నిత్యజీవము యొక్క మార్గమును ఎంచుకొనుటకు—మిమ్ములను మీరు నిర్వహించుకొనుటకు మీరు స్వతంత్రులైయున్నారని జ్ఞాపకముంచుకొనుడి.

24 కావున నా ప్రియమైన సహోదరులారా, మిమ్ములను అపవాది మరియు శరీరము యొక్క చిత్తమునకు కాక దేవుని చిత్తమునకు సమాధానపరచుకొనుడి; మరియు మీరు దేవునితో సమాధానపడిన తరువాత, కేవలము దేవుని కృప యందు మరియు ద్వారానే మీరు రక్షింపబడితిరని జ్ఞాపకముంచుకొనుడి.

25 మీరు దేవుని నిత్య రాజ్యములోనికి చేర్చుకొనబడునట్లు, మీరు దైవ కృప ద్వారా ఆయనను స్తుతించునట్లు, దేవుడు పునరుత్థాన శక్తి ద్వారా మరణము నుండి, ప్రాయశ్చిత్తము యొక్క శక్తి ద్వారా శాశ్వతమరణము నుండి మిమ్ములను లేపును గాక, ఆమేన్‌.