లేఖనములు
2 నీఫై 1


నీఫై రెండవ గ్రంథము

లీహై మరణము యొక్క వృత్తాంతము. నీఫై సహోదరులు అతనికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుదురు. అరణ్యములోనికి వెళ్ళిపొమ్మని ప్రభువు నీఫైని హెచ్చరించును. అరణ్యమందు అతని ప్రయాణములు మరియు మొదలగునవి.

1వ అధ్యాయము

ఒక స్వతంత్రదేశమును గూర్చి లీహై ప్రవచించును—అతని సంతానము ఇశ్రాయేలు పరిశుద్ధుని తిరస్కరించిన యెడల, వారు చెదరగొట్టబడి శిక్షింపబడుదురు—నీతి కవచమును ధరించుకొమ్మని అతడు తన కుమారులకు ఉద్భోధించును. సుమారు క్రీ. పూ. 588–570 సం.

1 నీఫైయను నేను, నా సహోదరులకు బోధించుట ముగించిన తరువాత, మా తండ్రి లీహై కూడా అనేక విషయములు వారితో చెప్పెను మరియు యెరూషలేము దేశము నుండి వారిని బయటకు తెచ్చుటలో ప్రభువు వారి కొరకు ఎట్టి గొప్ప కార్యములను చేసియుండెనో వారికి మరలా చెప్పెను.

2 జలములపై వారు చేసిన తిరుగుబాటులను గురించి, వారు సముద్రములో మునిగిపోకుండా వారి ప్రాణములను కాపాడుటలో దేవుని కనికరములను గురించి అతడు వారితో చెప్పెను.

3 వారు పొందిన వాగ్దానదేశమును గూర్చి కూడా అతడు వారితో చెప్పెను—మనము యెరూషలేము దేశము నుండి బయటకు పారిపోవలెనని మనలను హెచ్చరించుటలో ప్రభువు ఎంతో కనికరము కలిగియుండెను.

4 ఏలయనగా నేనొక దర్శనమును చూచితిని, దానిలో యెరూషలేము నాశనము చేయబడెనని తెలుసుకొంటిని; మనము యెరూషలేమునందే ఉండిన యెడల మనము కూడా నశించియుండేవారమని అతడు చెప్పెను.

5 కానీ మనము బాధలను ఎదుర్కొన్నప్పటికీ, మనము ఒక వాగ్దానదేశమును పొందితిమి, ఆ దేశము సమస్త దేశములను మించి కోరదగినది; ఆ దేశము నా సంతానమునకు స్వాస్థ్యముగా ఉండునని ప్రభువైన దేవుడు నాతో నిబంధన చేసెను. ప్రభువు ఈ దేశమును నాకు, నా సంతానమునకు మరియు ఆయన హస్తము ద్వారా ఇతర దేశముల నుండి బయటకు నడిపించబడు వారందరి కొరకు శాశ్వతముగా నియమించెనని అతడు చెప్పెను.

6 అందువలన, ప్రభువు హస్తము ద్వారా తీసుకొనిరాబడిన వారు తప్ప ఈ దేశములోనికి ఎవరును రారని లీహైయను నేను, నా యందున్న ఆత్మ యొక్క ప్రభావమును బట్టి ప్రవచించెదను.

7 అందువలన, ఈ దేశము ఆయన తీసుకొనివచ్చు వానికొరకు ప్రతిష్ఠించబడినది; ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి వారు ఆయనను సేవించిన యెడల, అది వారి కొరకు ఒక స్వతంత్ర దేశముగా ఉండును; కావున, వారు ఎన్నడూ చెరలోనికి తీసుకొని రాబడరు; అట్లయిన అది దుర్నీతిని బట్టియే అగును; ఏలయనగా దుర్నీతి పెరిగిన యెడల, దేశము వారి నిమిత్తము శపించబడును, అయితే నీతిమంతుల కొరకు అది నిత్యము ఆశీర్వదింపబడును.

8 ఈ దేశము ఇతర జనములకు తెలియకుండునట్లు ఇంకను రహస్యముగా ఉంచబడుట వివేకమైయున్నది. ఏలయనగా, స్వాస్థ్యము కొరకు స్థలము లేకుండునట్లు అనేక జనములు ఈ దేశమును నింపివేయుదురు.

9 అందువలన, ప్రభువైన దేవుడు యెరూషలేము దేశము నుండి ఎవరిని బయటకు తీసుకొనివచ్చునో వారు ఆయన ఆజ్ఞలను పాటించియున్నంత కాలము ఈ భూముఖముపై వర్ధిల్లుదురని లీహైయను నేను ఒక వాగ్దానమును పొందియుంటిని. ఈ దేశమును వారు మాత్రమే స్వాధీనపరచుకొనునట్లు సమస్త జనముల నుండి రహస్యముగా ఉంచబడుదురు. వారు ఆయన ఆజ్ఞలను పాటించిన యెడల, ఈ భూముఖముపై వారు ఆశీర్వదింపబడుదురు, వారిని వేధించుటకు లేదా వారి స్వాస్థ్యమైన దేశమును తీసుకొనుటకు అక్కడ ఎవడును ఉండడు; వారు నిత్యము క్షేమముగా నివసించెదరు.

10 కానీ, ప్రభువు హస్తము నుండి అంత గొప్ప ఆశీర్వాదములు పొందిన తరువాత వారు విశ్వాసమందు క్షీణించు సమయము వచ్చినప్పుడు—భూమి యొక్క సృష్టి గురించి, సకల మానవుల గురించి జ్ఞానము కలిగియుండి, లోక సృష్టి నుండి ప్రభువు యొక్క గొప్ప అద్భుతకార్యములను ఎరిగియుండి, విశ్వాసము ద్వారా సమస్తమును చేయుటకు శక్తి ఇవ్వబడి, ఆది నుండి సమస్త ఆజ్ఞలను కలిగియుండి, అపారమైన ఆయన మంచితనము ద్వారా ఈ ప్రశస్థమైన వాగ్దానదేశములోనికి తేబడి—వారు ఇశ్రాయేలు పరిశుద్ధుడిని, నిజమైన మెస్సీయను, వారి విమోచకుడిని మరియు వారి దేవుడిని తిరస్కరించు దినము వచ్చిన యెడల, నీతిమంతుడైయున్న ఆయన తీర్పులు వారిపైకి వచ్చునని నేను చెప్పుచున్నాను.

11 అనగా ఆయన ఇతర జనములను వారి యొద్దకు తెచ్చి, వారికి శక్తినిచ్చును మరియు వారి ఆధీనములోనున్న దేశములను వారి నుండి ఆయన తీసివేసి, వారు చెదిరిపోవునట్లు, కొట్టివేయబడునట్లు చేయును.

12 ఒక తరము నుండి మరియొక తరము గతించుచుండగా వారు రక్తపాతములు, గొప్ప శిక్షలతో దర్శింపబడుదురు; అందువలన నా కుమారులారా, మీరు నా మాటలను జ్ఞాపకముంచుకొనవలెనని, ఆలకించవలెనని నేను కోరుచున్నాను.

13 మీరు మేలుకొని, గాఢ నిద్ర నుండియే కాక నరకపు నిద్ర నుండి కూడా మేలుకొని, మీరు బంధించబడియున్న ఘోరమైన సంకెళ్ళు అనగా నరుల సంతానమును దుఃఖకరమైన, బాధాకరమైన నిత్య అగాధమునకు చెరగా కొనిపోవునట్లు బంధించు ఆ సంకెళ్ళను వదిలించుకొనవలెనని నేనెంతగానో కోరుచున్నాను.

14 మేలుకొని, ధూళి నుండి లెమ్ము! వణకుచున్న తండ్రి మాటలను ఆలకించుము, అతని అవయవములను మీరు త్వరలో చల్లని మరియు అచటి నుండి ఏ ప్రయాణికుడు తిరిగి రాజాలని నిశ్శబ్దమైన సమాధిలో ఉంచవలసియున్నది; ఇంకొద్ది రోజులకు అందరివలె నేను మరణించెదను.

15 కానీ, ప్రభువు నా ఆత్మను నరకము నుండి విమోచించియున్నాడు; నేను ఆయన మహిమను చూచియున్నాను. ఆయన ప్రేమ యొక్క బాహువులలో నేను శాశ్వతముగా చుట్టబడియున్నాను.

16 ప్రభువు యొక్క కట్టడలను, న్యాయవిధులను పాటించుటను మీరు జ్ఞాపకముంచుకొనవలెనని నేను కోరుచున్నాను; మొదటి నుండి ఇదే నా ఆత్మ యొక్క ఆరాటమైయున్నది.

17 ఎప్పటికప్పుడు నా హృదయము బాధతో కృంగియుండెను, ఏలయనగా మీ హృదయ కాఠిన్యము వలన ప్రభువైన మీ దేవుడు తన సంపూర్ణ ఉగ్రతలో మీపైకి వచ్చునేమోనని, మీరు కొట్టివేయబడి శాశ్వతముగా నాశనము చేయబడుదురేమోనని;

18 లేదా అనేక తరముల పాటు మీ పైన శాపము వచ్చునేమోనని; మీరు ఖడ్గము చేత కరువు చేత దర్శింపబడి, ద్వేషింపబడుదురేమోనని, అపవాది చెర మరియు చిత్తము ప్రకారము నడిపించివేయబడుదురేమోనని నేను భయపడితిని.

19 ఓ నా కుమారులారా, ఇవి మీపై రాకుండునట్లు మీరు ప్రభువు యొక్క అత్యుత్తమమైన మరియు అనుగ్రహము పొందిన జనులుగా ఉండవలెను. కానీ, ఆయన చిత్తము జరుగును. ఏలయనగా, ఆయన మార్గములు ఎల్లప్పుడు నీతివంతమైనవి.

20 మరియు నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము మీరు దేశమందు వర్ధిల్లుదురు; కానీ, మీరు నా ఆజ్ఞలను పాటించకుండా ఉన్నంత కాలము మీరు నా సన్నిధి నుండి కొట్టివేయబడుదురని ఆయన చెప్పెను.

21 ఇప్పుడు నా ఆత్మ మీ యందు ఆనందము కలిగియుండునట్లు, మిమ్ములను గూర్చిన సంతోషముతో నా హృదయము ఈ లోకమును విడిచిపెట్టునట్లు, నేను దుఃఖము మరియు విచారముతో సమాధిలోనికి వెళ్ళకుండునట్లు, నా కుమారులారా ధూళి నుండి లేచి, పరిణతి చెందుడి. మీరు చెరలోనికి రాకుండునట్లు సకల విషయములలో ఐక్యత కలిగి, ఏక మనస్సు, ఏక హృదయమందు కృతనిశ్చయముతో ఉండుడి;

22 ఒక బాధాకరమైన శాపముతో మీరు శపించబడకుండునట్లు, మీ నాశనమునకు, అనగా మీ శరీరాత్మలు రెండింటి నిత్య నాశనమునకు న్యాయవంతుడైన ఆ దేవుని కోపమును మీపై పొందకుండునట్లు—

23 నా కుమారులారా మేలుకొనుడి; నీతి కవచమును ధరించుకొనుడి. మీరు బంధించబడియున్న సంకెళ్ళను వదిలించుకొని, ధూళి నుండి లేచి, అంధకారము నుండి బయటకు రండి.

24 మనము యెరూషలేమును వదిలిన సమయము నుండి మహిమకరమైన దృష్టి కలిగియుండి, ఆజ్ఞలను పాటించి, ప్రభువు హస్తములలో ఒక సాధనమైయుండి మనలను వాగ్దానదేశములోనికి తెచ్చిన మీ సహోదరునికి వ్యతిరేకముగా మరెన్నడూ తిరగబడకుడి; ఏలయనగా అతడు లేని యెడల, మనము అరణ్యములో ఆకలితో నశించియుండేవారము; అయినప్పటికీ, మీరు అతని ప్రాణమును తీయుటకు ప్రయత్నించిరి; అతడు మీ మూలముగా అధిక దుఃఖమును అనుభవించెను.

25 మీ మూలముగా అతడు తిరిగి బాధపడునేమోనని నేను అధికముగా భయపడి కంపించుచున్నాను; ఏలయనగా అతడు మీపై శక్తిని, అధికారమును ఆశించెనని మీరు నిందించియున్నారు; కానీ అతడు మీపై శక్తి లేదా అధికారమును ఆశించలేదని, అతడు దేవుని మహిమను, మీ స్వంత నిత్య శ్రేయస్సును ఆశించెనని నేనెరుగుదును.

26 అతడు మీతో నిష్కపటముగా ఉండిన కారణముగా మీరు సణిగితిరి. అతడు గద్దింపును ఉపయోగించెనని, మీతో కోపముగా ఉండెనని మీరనుచున్నారు; అయితే, అతని గద్దింపు అతని యందున్న దేవుని వాక్యపు శక్తి యొక్క గద్దింపైయుండెను; మీరు కోపమని పిలుచుచున్నది దేవుని యందున్న దానిని బట్టి సత్యమైయుండెను, అతడు దానిని నియంత్రించుకొనలేక మీ దుర్ణీతులను గూర్చి ధైర్యముగా విశదపరచెను.

27 మీరు లోబడవలెనని మిమ్ములను అతడు ఆజ్ఞాపించునట్లు నిశ్చయముగా దేవుని శక్తి అతనిలో ఉండెను. అది అతడు కాదు, కానీ అది అతనియందున్న ప్రభువు యొక్క ఆత్మ; అతడు మాట్లాడుటను నియంత్రించుకోలేనంతగా అది అతని నోటిని తెరిచెను.

28 ఇప్పుడు నా కుమారుడా లేమన్‌, మరియు లెముయెల్, శామ్, ఇష్మాయెల్ కుమారులైన నా కుమారులారా, మీరు నీఫై స్వరమును ఆలకించిన యెడల మీరు నశించరు. మీరతనిని ఆలకించిన యెడల, నేను ఒక దీవెనను అనగా నా మొదటి దీవెనను మీకిచ్చుచున్నాను.

29 కానీ మీరు అతడిని ఆలకించని యెడల, నేను నా మొదటి దీవెనను అనగా నా దీవెనను తీసివేయుదును మరియు అది అతనిపై నిలుచును.

30 ఇప్పుడు జోరమ్, నేను నీతో మాటలాడుదును: ఇదిగో నీవు లేబన్‌ సేవకుడవు; అయినప్పటికీ, నీవు యెరూషలేము దేశము నుండి బయటకు తీసుకొని రాబడితివని, నా కుమారుడైన నీఫైకి నిరంతరము ఒక నిజమైన స్నేహితుడిగా ఉన్నావని నేనెరుగుదును.

31 అందువలన, నీవు విశ్వాసముగానుండిన కారణముగా అతని సంతానముతో పాటు నీ సంతానము ఆశీర్వదింపబడును. వారు దీర్ఘకాలము ఈ భూముఖముపై వర్ధిల్లుచూ నివసించెదరు. వారి మధ్య అధర్మము తప్ప మరేదియు ఈ భూముఖముపై వారి అభివృద్ధికి శాశ్వతముగా హాని లేదా భంగము కలిగించదు.

32 కావున మీరు ప్రభువు ఆజ్ఞలను పాటించిన యెడల, ప్రభువు ఈ దేశమును నా కుమారుని సంతానముతో పాటు నీ సంతానము యొక్క భద్రత కొరకు ప్రతిష్ఠించును.