లేఖనములు
2 నీఫై 25


25వ అధ్యాయము

నీఫై సరళత్వమందు సంతోషించును—యెషయా ప్రవచనములు అంత్యదినములలో గ్రహించబడును—యూదులు బబులోను నుండి తిరిగి వచ్చెదరు, మెస్సీయను సిలువ వేయుదురు మరియు చెదిరిపోయి శిక్షింపబడుదురు—వారు మెస్సీయ యందు విశ్వసించినప్పుడు పునఃస్థాపించబడుదురు—లీహై యెరూషలేమును వదిలివచ్చిన ఆరువందల సంవత్సరముల తరువాత ఆయన మొదటిసారిగా వచ్చును—నీఫైయులు మోషే ధర్మశాస్త్రమును పాటించుదురు, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన క్రీస్తు నందు విశ్వాసముంచెదరు. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఇప్పుడు నీఫైయను నేను, నేను వ్రాసిన మాటలను గూర్చి కొంత మాట్లాడెదను, అవి యెషయా నోటి ద్వారా పలుకబడినవి. యెషయా అనేక విషయములను పలికెను, అవి నా జనులలో అనేకులు గ్రహించుటకు కష్టమైనవిగా ఉండెను; ఏలయనగా యూదుల మధ్య ప్రవచన విధానమును గూర్చి వారెరుగరు.

2 నీఫైయను నేను, యూదుల విధానమును గూర్చి ఎక్కువగా వారికి బోధించలేదు. ఏలయనగా వారి క్రియలు అంధకార క్రియలైయుండెను మరియు వారి కార్యములు హేయకరమైన కార్యములైయుండెను.

3 కావున వారు దేవుని తీర్పులను తెలుసుకొనునట్లు, ఆయన పలికియున్న మాట ప్రకారము అవి సమస్త జనముల పైకి వచ్చునని ఎరుగునట్లు నేను నా జనుల కొరకు, నేను వ్రాయు ఈ విషయములను ఇకపై పొందబోవు వారందరి కొరకు వ్రాయుచున్నాను.

4 కావున ఇశ్రాయేలు వంశస్థులైన నా జనులారా ఆలకించుడి, నా మాటలకు చెవి యొగ్గుడి; యెషయా మాటలు మీకు సరళముగా లేనప్పటికీ, ప్రవచనము యొక్క ఆత్మతో నింపబడిన వారందరికి అవి సరళముగా ఉన్నవి. కానీ నా యందున్న ఆత్మను బట్టి నేను మీకొక ప్రవచనము నిచ్చుచున్నాను; నేను నా తండ్రితో పాటు యెరూషలేము నుండి బయటకు వచ్చిన సమయము నుండి నాలోనున్న సరళత్వమును బట్టి నేను ప్రవచించెదను; ఏలయనగా నా జనులు నేర్చుకొనునట్లు వారితో సరళముగానుండుట యందు నా ఆత్మ ఆనందించును.

5 నా ఆత్మ యెషయా మాటల యందు ఆనందించును, ఏలయనగా నేను యెరూషలేము నుండి బయటకు వచ్చితిని, నా కన్నులు యూదుల క్రియలను చూచియుండెను, యూదులు ప్రవక్తల మాటలను గ్రహించెదరని నేనెరుగుదును మరియు యూదులకు బోధింపబడినట్లు వారికి బోధింపబడితే తప్ప, యూదులకు చెప్పబడిన విషయములను వారివలె గ్రహించగలిగిన ఇతర జనులెవ్వరును లేరు.

6 కానీ నీఫైయను నేను, నా పిల్లలకు యూదుల పద్ధతి ప్రకారము బోధించలేదు; అయితే, నేను స్వయముగా యెరూషలేములో నివసించినందువలన దాని చుట్టూ ఉన్న ప్రాంతములను గూర్చి నేనెరుగుదును; యెషయా పలికిన దానిని బట్టి యూదుల మధ్య జరిగిన దానిని నేను నా పిల్లలకు వివరించితిని, దేవుని తీర్పులను గూర్చి నా పిల్లలకు చెప్పియుంటిని మరియు నేను వాటిని వ్రాయను.

7 కానీ నా సరళత్వమును బట్టి నేను నా ప్రవచనమును కొనసాగించుచున్నాను, దాని యందు ఏ మనుష్యుడు పొరపడడని నేనెరుగుదును; అయినప్పటికీ యెషయా ప్రవచనములు నెరవేరు దినములలో అవి సంభవించు సమయములను మనుష్యులు నిశ్చయముగా ఎరిగియుందురు.

8 అందువలన అవి నరుల సంతానమునకు విలువైనవి, అట్లు కావని తలంచువానితో నేను ప్రత్యేకముగా మాట్లాడుదును మరియు నా మాటలను నా స్వజనులకే పరిమితము చేసెదను; ఏలయనగా అంత్యదినములలో అవి వారికి అత్యంత విలువైనవిగా ఉండునని నేనెరుగుదును; ఆ దినమందు వారు వాటిని గ్రహించెదరు; కావున వారి మేలుకొరకు నేను వాటిని వ్రాసితిని.

9 దుష్టత్వమును బట్టి యూదుల మధ్య ఒక తరము నాశనము చేయబడినట్లుగా వారి దుష్టత్వములను బట్టి తరతరముల వరకు వారు నాశనము చేయబడిరి; ప్రభువు యొక్క ప్రవక్తల చేత వారికి ముందుగా తెలుపబడకుండా వారెవరును ఎన్నడును నాశనము చేయబడలేదు.

10 కావున, నా తండ్రి యెరూషలేమును వదిలివచ్చిన వెంటనే వారిపైకి వచ్చు నాశనమును గూర్చి వారికి తెలియజేయబడెను; అయినను వారు తమ హృదయములను కఠినపరచుకొనిరి; నా ప్రవచనము ప్రకారము బబులోనుకు చెరగా కొనిపోబడిన వారు తప్ప, మిగిలిన వారు నాశనము చేయబడిరి.

11 ఇప్పుడు, నాలో ఉన్న ఆత్మను బట్టి నేను దీనిని చెప్పుచున్నాను. వారు కొనిపోబడినప్పటికీ వారు తిరిగి వచ్చి, యెరూషలేము దేశమును స్వాధీనపరచుకొందురు; కావున, వారి స్వాస్థ్యమైన దేశమునకు వారు తిరిగి పునఃస్థాపించబడుదురు.

12 కానీ వారు యుద్ధములు, యుద్ధములను గూర్చిన వదంతులు కలిగియుందురు; తండ్రి యొక్క అద్వితీయుడు అనగా భూమ్యాకాశముల సృష్టికర్త తననుతాను శరీరము నందు వారికి ప్రత్యక్షపరచుకొను దినము వచ్చినప్పుడు, వారి దుష్టత్వములు, వారి హృదయకాఠిన్యము మరియు మెడబిరుసుతనమును బట్టి వారు ఆయనను తిరస్కరించుదురు.

13 వారు ఆయనను సిలువ వేయుదురు; ఆయన మూడు రోజుల పాటు సమాధిలో ఉంచబడిన తరువాత, తన రెక్కల యందు స్వస్థత కలిగియుండి, మృతులలోనుండి లేచును; ఆయన నామమందు విశ్వసించు వారందరు దేవుని రాజ్యమందు రక్షింపబడుదురు. అందువలన ఆయనను గూర్చి ప్రవచించుటకు నా ఆత్మ సంతోషించుచున్నది, ఏలయనగా నేను ఆయన దినమును చూచితిని మరియు నా హృదయము ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచుచున్నది.

14 మెస్సీయ మృతులలో నుండి లేచి తన జనులకు, తన నామమందు విశ్వాసించు వారందరికి తనను ప్రత్యక్షపరచుకొనిన తరువాత, యెరూషలేము మరలా నాశనము చేయబడును; ఏలయనగా దేవునికి, ఆయన సంఘ జనులకు వ్యతిరేకముగా పోరాడు వారికి ఆపద.

15 అందువలన యూదులు సమస్త జనముల మధ్య చెదరగొట్టబడుదురు; బబులోను కూడా నాశనము చేయబడును; యూదులు ఇతర జనముల చేత చెదరగొట్టబడుదురు.

16 వారు చెదరగొట్టబడిన తరువాత దేవుని కుమారుడైన క్రీస్తునందు, మానవజాతియంతటికి అనంతమైన ప్రాయశ్చిత్తమందు విశ్వసించుటకు వారు ఒప్పింపబడువరకు అనేక తరముల పాటు తరతరముల వరకు ఇతర జనముల ద్వారా ప్రభువైన దేవుడు వారిని శిక్షించినప్పుడు—అప్పుడు వారు క్రీస్తు నందు విశ్వసించి, ఆయన నామమందు తండ్రిని శుద్ధ హృదయములతోను శుభ్రమైన హస్తములతోను ఆరాధించి, మరియొక మెస్సీయ కొరకు ఇక ఏమాత్రము ఎదురు చూడని దినము వచ్చినపుడు, ఆ సమయమున వారు ఈ విషయములను విశ్వసించుట అత్యవసరమగు దినము వచ్చును.

17 తప్పిపోయిన మరియు పతనమైన స్థితి నుండి తన జనులను పునఃస్థాపించుటకు ప్రభువు రెండవమారు తన చేయి చాచును. కావున ఆయన నరుల సంతానము మధ్య ఒక అద్భుతకార్యమును మరియు ఒక ఆశ్చర్యకార్యమును చేయుట మొదలుపెట్టును.

18 ఆయన తన మాటలను వారికి బయలుపరచును, ఆ మాటలు వారిని అంత్యదినమున తీర్పు తీర్చును; వారి చేత తిరస్కరించబడిన నిజమైన మెస్సీయను గూర్చి వారిని ఒప్పించుటకు, మెస్సీయ రావలెనని వారు ఇక ఏమాత్రము ఎదురు చూడనవసరము లేదని వారిని ఒప్పించు ఉద్దేశ్యము నిమిత్తము అవి వారికి ఇవ్వబడినవి. ఏలయనగా జనులను మోసపుచ్చు అబద్ధ మెస్సీయ తప్ప మరెవడును రాడు; ప్రవక్తలచేత చెప్పబడిన మెస్సీయ ఒక్కడే మరియు ఆ మెస్సీయయే యూదుల చేత తిరస్కరింపబడువాడు.

19 ప్రవక్తల మాటల ప్రకారము, నా తండ్రి యెరూషలేమును వదిలివచ్చిన సమయము నుండి ఆరువందల సంవత్సరములకు మెస్సీయ వచ్చును; ప్రవక్తల మాటల ప్రకారము మరియు దేవుని దూత మాట ప్రకారము ఆయన పేరు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అయ్యుండును.

20 ఇప్పుడు నా సహోదరులారా, మీరు పొరపడకుండునట్లు నేను స్పష్టముగా చెప్పితిని; ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొని వచ్చి, జనములు విషసర్పముల చేత కాటువేయబడిన తరువాత, మోషే వారి యెదుట పైకెత్తిన సర్పము వైపు వారు కన్నులెత్తి చూచిన యెడల, వారిని స్వస్థపరచునట్లు మోషేకి శక్తినిచ్చి, మోషే బండను కొట్టినప్పుడు దాని నుండి జలములు ఉప్పొంగి వచ్చునట్లు అతనికి శక్తి నిచ్చిన ప్రభువైన దేవుని జీవముతోడు ఈ విషయములు నిజమైనవని నేను మీకు చెప్పుచున్నాను మరియు ప్రభువైన దేవుని జీవముతోడు ఈ యేసు క్రీస్తు నామము తప్ప, నేను చెప్పియున్న దానిని బట్టి మనుష్యుడు రక్షింపబడుటకు ఆకాశము క్రింద ఇయ్యబడిన ఇతర నామమేదియు లేదు.

21 ఈ హేతువును బట్టి, భూమి నిలిచియున్నంత కాలము అతని సంతానము నాశనము కాదని యోసేపుకు చేయబడిన వాగ్దానము నెరవేరునట్లు ప్రభువైన దేవుడు, నేను వ్రాయుచున్న ఈ విషయములు భద్రపరచబడునని, కాపాడబడునని, తరతరములకు నా సంతానమునకు అందజేయబడునని నాతో వాగ్దానము చేసెను.

22 కావున ఈ విషయములు భూమి నిలిచియున్నంత కాలము తరతరములకు వెళ్ళును; అవి దేవుని చిత్తము మరియు ఇష్టమును బట్టి వెళ్ళును; వాటిని కలిగియున్న జనములు వ్రాయబడియున్న మాటలను బట్టి వాటిచేత తీర్పుతీర్చబడుదురు.

23 క్రీస్తు నందు విశ్వాసముంచమనియు దేవునితో సమాధానపడుడనియు మా సంతానమును మా సహోదరులను కూడా ఒప్పించునట్లు మేము వ్రాయుటకు శ్రద్ధగా కృషి చేయుచున్నాము; ఏలయనగా మనము సమస్తము చేసిన తర్వాత కూడా మనము కృప చేతనే రక్షింపబడియున్నామని మేము ఎరుగుదుము.

24 మేము క్రీస్తు నందు విశ్వసించుచున్నప్పటికీ, మేము మోషే ధర్మశాస్త్రమును పాటించుచున్నాము మరియు ధర్మశాస్త్రము నెరవేరు వరకు క్రీస్తు వైపు నిలకడగా ఎదురు చూచుచున్నాము.

25 ఏలయనగా ఈ ఉద్దేశ్యము నిమిత్తమే ధర్మశాస్త్రము ఇయ్యబడెను; అందువలన ధర్మశాస్త్రము మా కొరకు మృతమాయెను మరియు మా విశ్వాసమును బట్టి మేము క్రీస్తు నందు సజీవులముగా చేయబడియున్నాము; అయినను ఆజ్ఞలను బట్టి మేము ధర్మశాస్త్రమును పాటించుచున్నాము.

26 మేము క్రీస్తును గూర్చి మాట్లాడుచున్నాము, క్రీస్తు నందు ఆనందించుచున్నాము, క్రీస్తును గూర్చి బోధించుచున్నాము, క్రీస్తును గూర్చి ప్రవచించుచున్నాము, మరియు మా సంతానము వారి పాప పరిహారము కొరకు ఏ మూలాధారము వైపు చూడవలెనో తెలుసుకొనునట్లు మా ప్రవచనములను బట్టి మేము వ్రాయుచున్నాము.

27 అందువలన, మా సంతానము ధర్మశాస్త్రము యొక్క మృతమైన స్థితిని తెలుసుకొనునట్లు మేము ధర్మశాస్త్రమును గూర్చి మాట్లాడుచున్నాము; ధర్మశాస్త్రము యొక్క మృతమైన స్థితిని ఎరుగుట ద్వారా వారు క్రీస్తు నందున్న ఆ జీవము కొరకు నిరీక్షించెదరు మరియు ధర్మశాస్త్రము ఏ ఉద్దేశ్యము నిమిత్తము ఇయ్యబడినదో ఎరిగియుందురు. ధర్మశాస్త్రము క్రీస్తు నందు నెరవేరిన తరువాత, దానిని వదిలి వేయవలసినప్పుడు వారు తమ హృదయములను ఆయనకు వ్యతిరేకముగా కఠినపరచుకొనవలసిన అవసరము ఉండదు.

28 ఇప్పుడు నా జనులారా, మీరు మెడబిరుసు గల జనులు; మీరు అపార్థము చేసుకొనకుండునట్లు నేను మీతో స్పష్టముగా చెప్పియున్నాను; నేను పలికియున్న మాటలు మీకు వ్యతిరేకముగా ఒక సాక్ష్యము వలే నిలుచును; ఏ మనుష్యునికైనను సరియైన మార్గము బోధించుటకు అవి చాలును; ఏలయనగా క్రీస్తు నందు విశ్వసించుట మరియు ఆయనను తిరస్కరింపకుండుటయే సరియైన మార్గము; ఆయనను తిరస్కరించుట ద్వారా మీరు ప్రవక్తలను, ధర్మశాస్త్రమును కూడా తిరస్కరించుదురు.

29 ఇదిగో, సరియైన మార్గము క్రీస్తునందు విశ్వసించి, ఆయనను తిరస్కరించకుండుటయేనని నేను మీతో చెప్పుచున్నాను; క్రీస్తే ఇశ్రాయేలు పరిశుద్ధుడు; కావున మీరు ఆయన యెదుట వంగి నమస్కరించవలెను, మీ పూర్ణ శక్తి, మనస్సు, బలముతో మరియు మీ సంపూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించవలెను; మీరిది చేసిన యెడల, మీరెంతమాత్రము బయటకు త్రోసివేయబడరు.

30 మరియు మోషేకు ఇయ్యబడిన ధర్మశాస్త్రము నెరవేరు వరకు అవసరమైనంత మట్టుకు దేవుని ఆచరణలను, విధులను మీరు పాటించవలెను.