లేఖనములు
2 నీఫై 26


26వ అధ్యాయము

క్రీస్తు, నీఫైయులకు పరిచర్య చేయును—నీఫై తన జనుల నాశనమును ముందుగా చూచును—వారు ధూళి నుండి మాట్లాడుదురు—అన్యజనులు అసత్య సంఘములను, రహస్య కూడికలను నిర్మించుదురు—యాజకవంచనలను ఆచరించరాదని ప్రభువు మనుష్యులను ఆజ్ఞాపించుచున్నాడు. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 నా పిల్లలారా మరియు నా సహోదరులారా, క్రీస్తు మృతులలో నుండి లేచిన తరువాత తననుతాను మీకు ప్రత్యక్షపరచుకొనును; ఆయన మీతో పలుకు మాటలే మీరు ఆచరించవలసిన ధర్మశాస్త్రము.

2 ఏలయనగా అనేక తరములు గడచిపోవునని, గొప్ప యుద్ధములు మరియు వివాదములు నా జనుల మధ్య కలుగునని నేను చూచియున్నానని మీతో చెప్పుచున్నాను.

3 మెస్సీయ వచ్చిన తరువాత ఆయన పుట్టుక, ఆయన మరణము మరియు పునరుత్థానమును గూర్చిన సూచనలు నా జనులకు ఇవ్వబడును; దుర్మార్గులకు ఆ దినము గొప్పదిగాను భయంకరమైనదిగాను ఉండును, ఏలయనగా వారు నశించెదరు; ప్రవక్తలను పరిశుద్ధులను వెలుపలికి త్రోసివేసి, వారిని రాళ్ళతో కొట్టి సంహరించిన కారణముగా వారు నశించెదరు; అందువలన పరిశుద్ధుల రక్తము యొక్క మొర వారికి వ్యతిరేకముగా నేలలో నుండి దేవుని యొద్దకు ఆరోహణమగును.

4 గర్విష్ఠులు, దుర్మార్గముగా ప్రవర్తించువారు కొయ్యకాలు వలె ఉన్నందున, వారందరు కాల్చివేయబడు దినము వచ్చునని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

5 ప్రవక్తలను, పరిశుద్ధులను చంపు వారిని భూమి యొక్క అగాధ స్థలములు మ్రింగివేయునని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు; పర్వతములు వారిని కప్పివేయును, సుడిగాలులు వారిని తీసుకొనిపోవును, కట్టడములు వారిపై కూలి, వారిని ముక్కలుగా నలుగగొట్టి, పొడిచేయును.

6 వారు ఉరుములతోను మెరుపులతోను భూకంపములతోను సకలవిధముల నాశనములతోను దర్శింపబడుదురు; ఏలయనగా ప్రభువు యొక్క కోపాగ్ని వారిపై మండుననియు వారు కొయ్యకాలు వలె ఉందురనియు రాబోవు దినము వారిని కాల్చివేయుననియు సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

7 నా జనులలో సంహరింపబడిన వారి నష్టమును బట్టి నా ఆత్మ ఎంతో బాధపడి, వేదన చెందుచున్నది. ఏలయనగా నీఫైయను నేను దానిని చూచియుంటిని, అది ప్రభువు సముఖమున నన్ను దహించివేయుచున్నది; కానీ, మీ మార్గములు న్యాయమైనవని నేను నా దేవునికి మొరపెట్టవలెను.

8 అయితే సమస్త హింసను ఎదుర్కొని, ప్రవక్తల మాటలను ఆలకించి, వారిని నాశనము చేయక క్రీస్తు కొరకు ఇయ్యబడిన సూచనల కొరకు నిలకడగా ఎదురుచూచు నీతిమంతులే నశించని వారు.

9 నీతిమంతుడైన కుమారుడు వారికి ప్రత్యక్షమగును; ఆయన వారిని స్వస్థపరచును, మూడు తరములు గడచిపోవు వరకు వారు ఆయనతో సమాధానము కలిగియుందురు మరియు నాలుగవ తరములో అనేకులు నీతియందు గతించిపోవుదురు.

10 ఈ సంగతులు గడచిపోయినప్పుడు, నా జనులపైకి వేగముగా నాశనము వచ్చును; ఏలయనగా నా ఆత్మ బాధలను ఎదుర్కొనినను నేను దానిని చూచియున్నాను; కావున అది జరుగునని నేనెరుగుదును; వారు వ్యర్థముగా తమను అమ్మివేసుకొందురు; వారి గర్వము, వారి మూర్ఖత్వమునకు బహుమానముగా వారు నాశనమును పొందుదురు; ఏలయనగా వారు అపవాదికి లోబడి, వెలుగును కాక అంధకార క్రియలను ఎన్నుకొందురు; కావున వారు నరకమునకు పోవలెను.

11 ప్రభువు ఆత్మ ఎల్లప్పుడు నరునితో పోరాడదు. ఆత్మ నరునితో పోరాడుట చాలించినప్పుడు, వేగముగా నాశనము వచ్చును, ఇది నా ఆత్మను బాధించుచున్నది.

12 యేసే ఆ క్రీస్తని యూదులను ఒప్పించుటను గూర్చి నేను మాట్లాడియున్నట్లుగా యేసే క్రీస్తని, నిత్యదేవుడని అన్యజనులు కూడా ఒప్పించబడుట అవసరమైయున్నది.

13 ఆయన యందు విశ్వాసముంచు వారందరికీ, అంతేకాకుండా ప్రతి జనము, వంశము, భాష మరియు ప్రజలకు, వారి విశ్వాసమును బట్టి నరుల సంతానము మధ్య గొప్ప అద్భుతములు, సూచకక్రియలు, ఆశ్చర్యకార్యములు చేయుచూ పరిశుద్ధాత్మ శక్తిద్వారా ఆయన తననుతాను ప్రత్యక్షపరచుకొనును.

14 కానీ అంత్యదినములను గూర్చి, ప్రభువైన దేవుడు ఈ విషయములను నరుల సంతానము యొద్దకు తెచ్చు ఆ దినములను గూర్చి నేను మీకు ప్రవచించుచున్నాను.

15 నా సంతానము మరియు నా సహోదరుల సంతానము తమ విశ్వాసమందు క్షీణించి అన్యజనులచేత శిక్షింపబడిన తరువాత, ప్రభువైన దేవుడు వారికి వ్యతిరేకముగా వారి చుట్టూ శిబిరము వేసి, వారికెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బవేసిన తరువాత, వారు ఇక లేకుండునట్లు ధూళిలోనికి అణచబడినప్పటికీ పరిశుద్ధుల మాటలు వ్రాయబడును, విశ్వాసుల ప్రార్థనలు వినబడును మరియు తమ విశ్వాసము నందు క్షీణించిన వారందరూ మరువబడరు.

16 నాశనము చేయబడియున్నవారు నేల నుండి వారితో మాటలాడుదురు, వారి మాటలు నేలనుండి ఒకడు గుసగుసలాడు నట్లుండును, వారి స్వరము కర్ణపిశాచి కలవాని స్వరమువలె ఉండును; ఏలయనగా అది నేల నుండి వచ్చుచున్నట్లు అతడు వారిని గూర్చి గుసగుసలాడునట్లు ప్రభువైన దేవుడు అతనికి శక్తి నిచ్చును; వారి మాటలు ధూళిలో నుండి గుసగుసలాడును.

17 ఏలయనగా ప్రభువైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: వారి మధ్య చేయబడు కార్యములను వారు వ్రాయుదురు మరియు అవి ఒక గ్రంథమునందు వ్రాయబడి ముద్రవేయబడును. తమ విశ్వాసమందు క్షీణించిన వారు వాటిని పొందరు; వారు దేవుని సంగతులను నాశనము చేయటకు ప్రయత్నించెదరు.

18 కావున నాశనము చేయబడిన వారు వేగముగా నాశనము చేయబడిరి; బాధించువారి సమూహము గాలికి ఎగురు పొట్టువలె ఉండును. హఠాత్తుగా ఒక్క క్షణములోనే ఇది జరుగునని ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు.

19 తమ విశ్వాసమందు క్షీణించిన వారు అన్యజనుల చేత మొత్తబడుదురు.

20 అన్యజనులు తమ నేత్రముల యొక్క గర్వమందు హెచ్చించుకొనియున్నారు మరియు వారి అవరోధము యొక్క గొప్పతనమును బట్టి తొట్రిల్లియున్నారు, దానిని బట్టి వారు అనేక సంఘములను నిర్మించిరి; అయినప్పటికీ వారు దేవుని శక్తిని, అద్భుతములను తిరస్కరించెదరు; పేదలను బాధించి, వారు లాభము పొందునట్లు వారి స్వంత జ్ఞానమును, స్వంత పాండిత్యమును తమకు తామే బోధించుకొందురు.

21 మరియు అసూయలు, జగడములు, ద్వేషమును కలుగజేయు అనేక సంఘములు నిర్మించబడియున్నవి.

22 ప్రాచీనకాలములలో ఉన్నట్లుగా అపవాది కూడికలను బట్టి రహస్య కూడికలు కూడా ఉన్నవి, ఏలయనగా అపవాది ఈ క్రియలన్నిటి యొక్క స్థాపకుడు; నరహత్య మరియు అంధకార క్రియల యొక్క స్థాపకుడు; ముఖ్యముగా తన బలమైన త్రాళ్ళతో శాశ్వతముగా బంధించు వరకు అతడు వారిని మెడపట్టి ఒక మెత్తని త్రాడుతో నడిపించును.

23 ఇదిగో నా ప్రియమైన సహోదరులారా, ప్రభువైన దేవుడు అంధకారములో పని చేయడని నేను మీతో చెప్పుచున్నాను.

24 ఆయన లోకమునకు ప్రయోజనకరమైన దానిని తప్ప మరిదేనిని చేయడు; ఏలయనగా ఆయన తన ప్రాణమును పణంగాపెట్టి మనుష్యులందరినీ తన వైపు ఆకర్షించునంతగా లోకమును ప్రేమించెను. అందువలన ఆయన రక్షణలో పాలుపొందమని ఆయన అందరిని ఆజ్ఞాపించును.

25 నా యొద్ద నుండి తొలగిపొమ్మని ఆయన ఎవరికైనను చెప్పునా? లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను; కానీ భూదిగంతముల నుండి మీరందరు నా యొద్దకు రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే పాలు తేనెలను కొనుడి అని ఆయన చెప్పుచున్నాడు.

26 ఆయన ఎవరినైనను సమాజ మందిరములలోనుండి లేదా ఆరాధనా మందిరములలోనుండి వెలుపలికి పొమ్మని ఆజ్ఞాపించెనా? లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను.

27 ఎవరినైనను తన రక్షణలో పాలుపొందరాదని ఆయన ఆజ్ఞాపించెనా? లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను. కానీ ఆయన దానిని మనుష్యులందరికి ఉచితముగా ఇచ్చెను; మనుష్యులందరినీ పశ్చాత్తాపపడుటకు ఒప్పించవలెనని ఆయన తన జనులను ఆజ్ఞాపించెను.

28 ఆయన మంచితనము నందు పాలుపొందరాదని ప్రభువు ఎవరినైనను ఆజ్ఞాపించెనా? లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను; కానీ మనుష్యులందరు ఒకే విధమైన హక్కు కలిగియున్నారు మరియు ఎవరును నిషేధించబడలేదు.

29 యాజకవంచనలు ఉండరాదని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు; యాజకవంచనలు అనగా మనుష్యులు లాభము పొందునట్లు, లోకము చేత ప్రశంసించబడునట్లు బోధించి, తమను తాము లోకమునకు వెలుగుగా స్థాపించుకొనుట; కానీ వారు సీయోను శ్రేయస్సును ఆశించరు.

30 ప్రభువు ఈ విషయమును నిషేధించియున్నాడు; కావున మనుష్యులందరు దాతృత్వము కలిగియుండవలెనని ప్రభువైన దేవుడు ఆజ్ఞ ఇచ్చెను, ఆ దాతృత్వమే ప్రేమ. మరియు దాతృత్వము లేని యెడల వారు వ్యర్థులు; దాతృత్వము కలిగియున్న యెడల వారు సీయోనులోనున్న పనివారిని నశింపనియ్యరు.

31 కానీ సీయోనులోని పనివాడు సీయోను కొరకు పని చేయును; ఏలయనగా వారు ధనము కొరకు పని చేసిన యెడల వారు నశించెదరు.

32 ఇంకను మనుష్యులు నరహత్య చేయరాదని, అబద్ధమాడరాదని, దొంగిలించరాదని, తమ దేవుడైన ప్రభువు యొక్క నామమును వ్యర్థముగా తీసుకొనరాదని, అసూయపడరాదని, ద్వేషము కలిగియుండరాదని, ఒకనితోనొకడు వాదించరాదని, వ్యభిచారములు చేయరాదని మరియు ఈ క్రియలలో దేనిని వారు చేయరాదని ప్రభువైన దేవుడు ఆజ్ఞాపించెను; ఏలయనగా వాటిని చేయువారు నశించెదరు.

33 ఈ దోషములేవియూ ప్రభువు నుండి రావు; ఆయన నరుల సంతానము మధ్య మంచిని చేయును; ఆయన నరుల సంతానమునకు సరళమైనది తప్ప మరిదేనిని చేయడు; వారందరిని తన వద్దకు రమ్మని, తన మంచితనము నందు పాలుపొందమని ఆయన ఆహ్వానించుచున్నాడు; తన యొద్దకు వచ్చువానిని, నల్లవారైనా తెల్లవారైనా, బందీలైనా స్వతంత్రులైనా, పురుషులైనా స్త్రీలైనా ఎవ్వరిని ఆయన నిరాకరించడు. ఆయన అన్యజనులను జ్ఞాపకము చేసుకొనును; యూదుడు మరియు అన్యజనుడు ఇరువురూ దేవునికి ఒకే రీతిగా ఉన్నారు.