లేఖనములు
2 నీఫై 28


28వ అధ్యాయము

అంత్యదినములలో అనేక అబద్ధ సంఘములు నిర్మించబడును—వారు అబద్ధమైన, వ్యర్థమైన, మూర్ఖపు సిద్ధాంతములను బోధించెదరు—అబద్ధ బోధకుల వలన విశ్వాస భ్రష్టత్వము పెరుగును—అపవాది మనుష్యుల హృదయములలో విజృంభించును—అతడు సకల విధముల అబద్ధ బోధలను బోధించును. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఇప్పుడు నా సహోదరులారా, ఆత్మ నన్ను బలవంతము చేసినట్లుగా నేను మీతో మాట్లాడియుంటిని; అందువలన అవి నిశ్చయముగా జరుగవలెనని నేనెరుగుదును.

2 ఆ గ్రంథము నుండి వ్రాయబడు విషయములు నరుల సంతానమునకు, ముఖ్యముగా ఇశ్రాయేలు వంశస్థుల శేషమైన మన సంతానమునకు చాలా విలువైనవిగా ఉండును.

3 ఆ దినమున ప్రభువుకు చెందకుండా నిర్మించబడిన సంఘములు ఒకదానితో మరొకటి ఇట్లు చెప్పును: ఇదిగో నేను, నేను ప్రభువుకు చెందినవాడను; మరియు ఇతరులు చెప్పుదురు: నేను, నేను ప్రభువుకు చెందినవాడను; ఆవిధముగా ప్రభువుకు చెందని సంఘములను నిర్మించిన ప్రతివాడు చెప్పును.

4 వారు ఒకరితోనొకరు వాదించుకొందురు; వారి యాజకులు ఒకరితోనొకరు వాదించుకొందురు; వారు తమ జ్ఞానమును బట్టి బోధించుదురు మరియు వాక్‌శక్తినిచ్చు పరిశుద్ధాత్మని తిరస్కరించుదురు.

5 వారు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుని శక్తిని తిరస్కరించుదురు; మరియు వారు జనులతో ఇట్లందురు: మమ్ములను ఆలకించుడి, మీరు మా సూక్తిని వినుడి; ఏలయనగా, ఈ దినమున దేవుడు లేడు; ప్రభువు మరియు విమోచకుడు తన పనిని చేసియున్నాడు, ఆయన తన శక్తిని మనుష్యులకు ఇచ్చియున్నాడు;

6 ఇదిగో మీరు నా సూక్తిని ఆలకించుడి; ప్రభువు చేత ఒక అద్భుతము చేయబడినదని వారు చెప్పిన యెడల, దానిని నమ్మకుడి; ఏలయనగా ఈ దినమున ఆయన అద్భుతములు చేయు దేవుడు కాడు; ఆయన తన పనిని చేసియున్నాడు.

7 తినుము, త్రాగుము, సంతోషించుము, ఏలయనగా రేపు మనము చనిపోవుదుము; మరియు మనము క్షేమముగా ఉందుము అని చెప్పువారు అనేకులు ఉందురు.

8 ఇట్లు చెప్పువారు కూడా అనేకులు ఉందురు: తినుము, త్రాగుము, సంతోషించుము; అయినప్పటికీ దేవునికి భయపడుము—చిన్న పాపము చేయుటను ఆయన సమ్మతించును; కొద్దిగా అబద్ధమాడుము, ఒకని మాటలను బట్టి అతని నుండి ప్రయోజనము పొందుము, మీ పొరుగువాని కొరకు ఒక గొయ్యి త్రవ్వుము, ఇందులో ఎట్టి హానియూ లేదు; ఈ కార్యములన్నియు చేయుము; ఏలయనగా రేపు మనము చనిపోవుదుము; మనము దోషులైన యెడల, దేవుడు మనలను కొద్ది దెబ్బలు కొట్టును మరియు అంతమందు మనము దేవుని రాజ్యములో రక్షింపబడెదము.

9 ఈ మాదిరిగా అబద్ధమైన, వ్యర్థమైన, మూర్ఖపు సిద్ధాంతములను బోధించువారు అనేకులు ఉందురు, వారు తమ హృదయములందు గర్వించి తమ ఆలోచనలు ప్రభువుకు కనబడకుండా లోలోపల వాటిని మరుగు చేయజూచెదరు; వారు చీకటిలో తమ క్రియలు జరిగించెదరు.

10 పరిశుద్ధుల రక్తము నేల నుండి వారికి వ్యతిరేకముగా మొరపెట్టును.

11 వారందరు త్రోవ తప్పి, చెడిపోయియున్నారు.

12 గర్వము కారణముగా, అబద్ధ బోధకులు మరియు అబద్ధ సిద్ధాంతముల కారణముగా వారి సంఘములు చెడిపోయి, గర్వముతో నిండియున్నవి; వారు గర్వము వలన అహంకారులైయున్నారు.

13 వారి అందమైన పరిశుద్ధాలయములు, వారి నాణ్యమైన వస్త్రముల కారణముగా వారు పేదలను దోచుకొందురు; సాత్వీకులను, హృదయమందు దీనులను హింసింతురు; ఏలయనగా వారు తమ గర్వము వలన అహంకారులైయున్నారు.

14 వారు మెడబిరుసు గల పొగరుబోతులు; క్రీస్తు యొక్క వినయముగల అనుచరులు కొద్దిమంది తప్ప, మిగిలిన వారందరు గర్వము, దుష్టత్వము, హేయక్రియలు మరియు వ్యభిచారముల కారణముగా త్రోవ తప్పియున్నారు; అయినప్పటికీ వారు మనుష్యుల సూక్తుల ద్వారా బోధింపబడినందున అనేక సందర్భములలో తప్పు చేయునట్లు వారు నడిపింపబడుదురు.

15 తమ హృదయముల గర్వమందు అహంకారులైయున్న జ్ఞానులు, పండితులు, ధనవంతులు మరియు అబద్ధ బోధలు బోధించుచు, వ్యభిచారములు చేయుచు ప్రభువు యొక్క సరియైన మార్గమును చెరుపు వారందరికి ఆపద, ఆపద, ఆపద కలుగును గాక అని సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఏలయనగా వారు నరకములోనికి త్రోయబడుదురు.

16 నీతిమంతులను పనికిరానివారిగా యెంచువారికి, మంచిదానికి వ్యతిరేకముగా దూషించి దానికి ఎట్టి విలువయూ లేదని చెప్పువారికి ఆపద! ఏలయనగా ప్రభువైన దేవుడు భూనివాసులను వేగముగా దర్శించు దినము వచ్చును; ఆ దినమున దోషమందు పూర్తిగా పండిన వారు నశించెదరు.

17 కానీ, భూనివాసులు తమ దుష్టత్వము, హేయక్రియలను బట్టి పశ్చాత్తాపపడిన యెడల వారు నాశనము చేయబడరని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

18 అయితే ఆ గొప్ప హేయకరమైన సంఘము, సమస్త భూమి యొక్క వ్యభిచారిణి మట్టిలోనికి దొర్లిపడవలెను, దాని పతనము గొప్పగా నుండవలెను.

19 ఏలయనగా అపవాది రాజ్యము వణకవలెను, దానికి చెందిన వారు పశ్చాత్తాపపడుటకు పురిగొల్పబడవలెను, లేని యెడల అపవాది వారిని శాశ్వతమైన తన సంకెళ్ళతో బంధించును మరియు వారు కోపమునకు పురిగొల్పబడి, నశించుదురు.

20 ఆ దినమున అతడు నరుల సంతానము యొక్క హృదయములలో విజృంభించును మరియు మంచిదానికి వ్యతిరేకముగా వారిని కోపమునకు పురిగొల్పును.

21 ఇతరులను అతడు శాంతపరచి, శరీర సంబంధమైన భద్రతాభావమునిచ్చును, దానిని బట్టి వారిట్లందురు: సీయోనులో అంతయు క్షేమమే; సీయోను వర్ధిల్లును, అంతయూ క్షేమమే—ఆ విధముగా అపవాది వారి ఆత్మలను మోసపుచ్చి, జాగ్రత్తగా వారిని నరకములోకి నడపించివేయును.

22 ఇతరులను అతడు అతిగా పొగడి, నరకము లేదని వారితో చెప్పును; నేను అపవాదిని కాను, అటువంటివారెవరు లేరని వారితో అనును; ఆ విధముగా విడుదల లేనట్టి భయంకరమైన తన సంకెళ్ళలో బంధించువరకు అతడు వారి చెవులలో గుసగుసలాడును.

23 వారు మరణముతో, నరకముతో బంధించబడియున్నారు; మరణము, నరకము, అపవాది మరియు వాటి ద్వారా బంధించబడిన వారందరు దేవుని సింహాసనము యెదుట నిలబడవలసియున్నది మరియు వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడవలసియున్నది; అచటి నుండి వారు తమ కొరకు సిద్ధము చేయబడిన స్థలమునకు, అనగా అంతములేని బాధయైన ఆ అగ్ని గంధకములుగల గుండములోనికి వెళ్ళవలెను.

24 కాబట్టి సీయోనులో అలక్ష్యముగా ఉన్నవానికి ఆపద!

25 అంతయు క్షేమమే అని చెప్పువానికి ఆపద!

26 మనుష్యుల సూక్తులను ఆలకించి దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ వరమును తిరస్కరించు వానికి ఆపద!

27 మేము పొందియున్నాము, ఇకపై మాకు అవసరము లేదని చెప్పువానికి ఆపద!

28 క్లుప్తముగా, దేవుని సత్యము కారణముగా వణికి, కోపపడు వారందరికి ఆపద! ఏలయనగా, బండ మీద కట్టబడిన వాడు దానిని సంతోషముతో అందుకొనును; ఇసుక పునాదిపై కట్టబడిన వాడు తాను పడిపోవుదునేమోనని వణుకును.

29 మేము దేవుని వాక్యమును పొందియున్నాము, మాకు ఇంకను దేవుని వాక్యము అవసరము లేదు, మాకు చాలినంత ఉన్నదని చెప్పు వానికి ఆపద!

30 ఏలయనగా ప్రభువైన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను నరుల సంతానమునకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చెదను; నా సూక్తులను ఆలకించు వారు, నా సలహాకు చెవియొగ్గు వారు ధన్యులు, వారు జ్ఞానము నేర్చుకొందురు; ఏలయనగా స్వీకరించువానికి నేను మరి ఎక్కువ ఇచ్చెదను, మాకు చాలును అని చెప్పు వారి నుండి వారు కలిగియున్నది కూడా తీసివేయబడును.

31 మనుష్యుని యందు నమ్మకముంచువాడు లేదా శరీరమును తన బాహువుగా చేసుకొనువాడు లేదా వారి సూక్తులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇవ్వబడితే తప్ప, మనుష్యుల సూక్తులను ఆలకించువాడు శాపగ్రస్తుడు.

32 అన్యజనులకు ఆపద! అని సైన్యములకధిపతియగు ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఏలయనగా అనుదినము నేను వారివైపు నా చేతులు చాపినప్పటికీ వారు నన్ను తిరస్కరించుచున్నారు; అయినప్పటికీ వారు పశ్చాత్తాపపడి నా యొద్దకు వచ్చిన యెడల, నేను వారిపట్ల కనికరము చూపించెదనని ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు; ఏలయనగా నా చేయి దినమంతయూ చాపబడియున్నదని సైన్యములకధిపతియగు ప్రభువైన దేవుడు సెలవిచ్చుచున్నాడు.