లేఖనములు
2 నీఫై 2


2వ అధ్యాయము

పరిశుద్ధ మెస్సీయ ద్వారా విమోచన కలుగును—ఎన్నుకొను స్వేచ్ఛ (స్వతంత్రత) జీవించుటకు, అభివృద్ధి చెందుటకు అత్యవసరము—మనుష్యులు ఉనికిలోనికి వచ్చునట్లు ఆదాము పతనమాయెను—మనుష్యులు స్వేచ్ఛ మరియు నిత్యజీవమును ఎన్నుకొనుటకు స్వతంత్రులైయున్నారు. సుమారు క్రీ. పూ. 588–570 సం.

1 ఇప్పుడు జేకబ్, నేను నీతో మాట్లాడెదను: అరణ్యములో నా శ్రమదినములలో నీవు నా ప్రథమ సంతానానివి. నీ సహోదరుల కఠినత్వము వలన నీ బాల్యములో నీవు బాధలను, అధిక దుఃఖమును అనుభవించితివి.

2 అయినప్పటికీ జేకబ్, అరణ్యములోని నా ప్రథమ సంతానమా, నీవు దేవుని గొప్పతనమును ఎరుగుదువు; ఆయన నీ బాధలను నీ ప్రయోజనము కొరకు ప్రతిష్ఠించును.

3 అందువలన నీ ఆత్మ ఆశీర్వదింపబడును, నీవు నీ సహోదరుడైన నీఫైతో క్షేమముగా నివసించెదవు; నీ దినములు నీ దేవుని సేవలో గడిచిపోవును. కావున, నీ విమోచకుని నీతిని బట్టి నీవు విమోచింపబడితివని నేనెరుగుదును; ఏలయనగా, కాలము పరిపూర్ణమైనప్పుడు మనుష్యులకు రక్షణ తెచ్చుటకు ఆయన వచ్చునని నీవు చూచియున్నావు.

4 నీ యౌవనమందు నీవు ఆయన మహిమను చూచియుంటివి; అందువలన, శరీరమందు ఆయన పరిచర్య చేసిన వారి వలే నీవు కూడా ఆశీర్వదింపబడియున్నావు. ఏలయనగా ఆత్మ నిన్న, నేడు మరియు నిత్యము ఏకరీతిగా ఉన్నది. నరుని పతనము నుండి మార్గము సిద్ధపరచబడియున్నది మరియు రక్షణ కొరకు వెల చెల్లించనవసరము లేదు.

5 మంచి చెడులను తెలుసుకొనుటకు నరులు సమృద్ధిగా బోధింపబడియున్నారు మరియు ధర్మశాస్త్రము నరులకియ్యబడెను. ధర్మశాస్త్రము ద్వారా ఏ శరీరియు నీతిమంతునిగా ఎంచబడడు; లేదా ధర్మశాస్త్రము ద్వారా నరులు కొట్టివేయబడియున్నారు. అనగా ఐహిక ధర్మశాస్త్రము ద్వారా వారు కొట్టివేయబడిరి; ఆత్మీయ ధర్మశాస్త్రము ద్వారా కూడా వారు మంచి దాని నుండి నశించి, శాశ్వతముగా దౌర్భాగ్యులైరి.

6 అందువలన, పరిశుద్ధ మెస్సీయ యందు మరియు ఆయన ద్వారానే విమోచన వచ్చును. ఏలయనగా, ఆయన కృపాసత్యసంపూర్ణుడైయున్నాడు.

7 విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మలు కలిగిన వారందరి కొరకు ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చుటకై ఆయన పాపమునకు పరిహారముగా తననుతాను అర్పించుకొనును; ఇతరులెవ్వరి కొరకు ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యములు నెరవేర్చబడవు.

8 అందువలన, పరిశుద్ధ మెస్సీయ యొక్క మంచితనము, కనికరము మరియు కృప ద్వారా తప్ప దేవుని సన్నిధిలో ఏ శరీరియు నివసించలేడని వారు తెలుసుకొనునట్లు భూనివాసులకు ఈ విషయములను తెలియజేయుట ఎంతో ముఖ్యమైనది, ఆయన శరీరానుసారముగా తన ప్రాణమును అర్పించి, ఆత్మ యొక్క శక్తి ద్వారా తిరిగి దానిని పొందును, ఆ విధముగా లేపబడవలసిన వారిలో మొదటివానిగా ఉండి మృతుల పునరుత్థానమును తెచ్చును.

9 నరుల సంతానమంతటి కొరకు ఆయన విజ్ఞాపన చేయునందువలన, ఆయన దేవునికి ప్రథమఫలముగా ఉన్నాడు; ఆయన యందు విశ్వాసముంచువారు రక్షింపబడుదురు.

10 అందరి కొరకు విజ్ఞాపన చేయునందువలన, మనుష్యులందరు దేవుని యొద్దకు వచ్చెదరు; అందువలన, ఆయనయందున్న సత్యము మరియు పరిశుద్ధతను బట్టి, ఆయన చేత తీర్పు తీర్చబడుటకు వారు ఆయన సన్నిధిలో నిలువబడుదురు. కావున ప్రాయశ్చిత్తము యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చుటకు నిర్ణయించబడిన శిక్షను, అనగా నిర్ణయించబడిన సంతోషమునకు వ్యతిరేకముగా ఉన్న ఆ శిక్షను విధించుట పరిశుద్ధుడు ఇచ్చిన ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యములను నెరవేర్చును—

11 ఏలయనగా అన్ని విషయములలో వ్యతిరేకత ఉండుట అవసరము. అరణ్యములోని నా ప్రథమ సంతానమా, అట్లు కానియెడల నీతి లేదా దుష్టత్వము, పరిశుద్ధత లేదా దుర్దశ, మంచి లేదా చెడు సంభవించవు. అన్ని విషయములు ఒక దానిలో మిశ్రమముగా ఉండుట అవసరము; వ్యతిరేకత లేని యెడల దానికి జీవము మరణము, క్షయము అక్షయము, సంతోషము దుఃఖము, గ్రహించుట గ్రహించలేకపోవుట అనునవి లేకుండా అది మరణించిన దాని వలే ఉండును.

12 కావున, అది నిరుపయోగమైనదిగా సృష్టింపబడియుండవలెను; దాని సృష్టి యొక్క ఉద్దేశ్యము నందు ఏ ప్రయోజనము లేకయుండవలెను. అందువలన అది దేవుని జ్ఞానమును, ఆయన నిత్య సంకల్పములను, శక్తిని, కనికరమును, దేవుని న్యాయములను నాశనము చేయవలెను.

13 మరియు ధర్మశాస్త్రము లేదని మీరు చెప్పిన యెడల, పాపము లేదని కూడా మీరు చెప్పుదురు. పాపము లేదని మీరు చెప్పిన యెడల, నీతి లేదని కూడా మీరు చెప్పుదురు. నీతి లేని యెడల, సంతోషము లేదు. నీతి లేదా సంతోషము లేని యెడల, శిక్ష లేదా దుర్దశ ఉండదు. మరియు ఈ విషయములు లేని యెడల, దేవుడు లేడు. దేవుడు లేని యెడల, మనము ఉండము, భూమియూ ఉండదు. ఏలయనగా, పని చేయుటకు గాని లేదా పని చేయబడుటకు గాని సృష్టి యుండేది కాదు. కావున, అన్నియు అదృశ్యమైపోవలెను.

14 ఇప్పుడు నా కుమారులారా, ఈ విషయములను నేను మీ ప్రయోజనము, అభ్యాసము కొరకు మీతో చెప్పుచున్నాను; ఏలయనగా ఒక దేవుడున్నాడు, ఆయన సమస్తమును, పరలోకములు మరియు భూమి రెండింటిని, వాటియందున్న సమస్తమును, పనిచేయువాటిని, పనిచేయబడువాటిని సృష్టించెను.

15 ఆయన మన మొదటి తల్లిదండ్రులను, భూజంతువులను మరియు ఆకాశపక్షులను సృష్టించిన తరువాత, మానవుల కొరకు తన నిత్య సంకల్పములను నెరవేర్చుటకు, సృష్టించబడిన వాటన్నిటిపై ఒక వ్యతిరేకత ఉండుట అవసరమాయెను; జీవ వృక్షమునకు వ్యతిరేకముగా నిషేధించబడిన ఫలము ఉండెను; మొదటిది మధురముగాను రెండవది చేదుగాను ఉండెను.

16 అందువలన, ప్రభువైన దేవుడు నరునికి తననుతాను నిర్వహించుకొను సామర్థ్యమునిచ్చెను. నరుడు దేనిచేతనైనా ఆకర్షించబడితే తప్ప అతడు తననుతాను నిర్వహించుకొనలేడు.

17 నేను చదివిన విషయముల ప్రకారము, వ్రాయబడిన దానిని బట్టి ఒక దేవదూత పరలోకము నుండి పడిపోయెనని లీహైయను నేను నమ్మవలెను; ఏలయనగా, దేవుడు చెడుగా ఎంచినదానిని కోరియుండి అతడు అపవాది ఆయెను.

18 అతడు పరలోకము నుండి పడిపోయి శాశ్వతముగా దౌర్భాగ్యుడాయెను, గనుక అతడు మానవజాతియంతటి దుస్థితిని కోరెను. అందువలన అతడు, అనగా అపవాదియైన ఆ పురాతన సర్పము, సమస్త అబద్ధములకు తండ్రియైన అతడు హవ్వతో—నిషేధింపబడిన ఫలమును తినుము, నీవు మరణించవు, కానీ దేవుని వలే మంచి చెడులను ఎరిగియుందువనెను.

19 ఆదాము హవ్వలు నిషేధింపబడిన ఫలమును తినిన తరువాత, ఏదెను తోట నుండి బయటకు, భూమిని దున్నుటకు వెళ్ళగొట్టబడిరి.

20 వారు పిల్లలను కని, ఆ విధముగా భూమి పైనున్నసమస్త జనులను తెచ్చిరి.

21 వారు శరీరమందున్నప్పుడు పశ్చాత్తాపపడునట్లు నరుల సంతానము యొక్క దినములు దేవుని చిత్తమును బట్టి పొడిగించబడెను; అందువలన, వారి స్థితి ఒక పరిశీలనాస్థితి ఆయెను మరియు ప్రభువైన దేవుడు నరుల సంతానమునకిచ్చిన ఆజ్ఞలను బట్టి వారి సమయము పొడిగించబడెను. ఏలయనగా, మనుష్యులందరూ పశ్చాత్తాపపడవలెనని ఆయన ఆజ్ఞ ఇచ్చెను; వారు తమ తల్లిదండ్రుల అతిక్రమమును బట్టి తప్పిపోయిరని నరులందరికి ఆయన చూపెను.

22 ఇప్పుడు, ఆదాము అతిక్రమము చేయని యెడల అతడు పతనమైయుండేవాడు కాడు, కాని అతడు ఏదేను తోటలోనే ఉండిపోయేవాడు. మరియు సృష్టించబడినవన్నీ, అవి సృష్టించబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నవో అదే స్థితిలో ఉండేవి. అవి అంతము లేకుండా శాశ్వతముగా అట్లే ఉండేవి.

23 మరియు వారు సంతానము లేకయుండేవారు; వారు దుస్థితినెరుగనందున ఆనందము లేకుండా అమాయకపు స్థితిలో ఉండేవారు; వారు పాపమునెరుగనందున మంచిని చేయకయుందురు.

24 కానీ, సమస్తమును ఎరిగిన ఆయన వివేకమందు అన్నియు చేయబడినవి.

25 మనుష్యులు ఉనికిలోనికి వచ్చునట్లు, వారు సంతోషమును కలిగియుండునట్లు ఆదాము పతనమాయెను.

26 కాలము సంపూర్ణమైనప్పుడు నరుల సంతానమును పతనమునుండి విమోచించుటకు మెస్సీయ వచ్చును. ఆ గొప్ప అంత్యదినమున ధర్మశాస్త్రము యొక్క శిక్ష ద్వారా తప్ప, వారు పతనము నుండి విమోచింపబడిన కారణముగా మంచి చెడులను ఎరిగియుండి, దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి తమపై నిర్వహించబడుటకు కాక తమనుతాము నిర్వహించుకొనుటకు శాశ్వతముగా స్వతంత్రులైయున్నారు.

27 అందువలన నరులు శరీరమును బట్టి స్వతంత్రులైయున్నారు; నరులకు ప్రయోజనకరమైనవన్నీ వారికి ఇవ్వబడినవి. నరులందరి యొక్క గొప్ప మధ్యవర్తి ద్వారా స్వేచ్ఛను, నిత్యజీవమును కోరుకొనుటకు లేదా అపవాది యొక్క చెర మరియు శక్తిని బట్టి చెరను, మరణమును కోరుకొనుటకు వారు స్వతంత్రులైయున్నారు; ఏలయనగా నరులందరు అతని వలే దౌర్భాగ్యులుగా ఉండవలెనని అతడు కోరుచున్నాడు.

28 ఇప్పుడు నా కుమారులారా, మీరు గొప్ప మధ్యవర్తి వైపు చూడవలెనని, ఆయన గొప్ప ఆజ్ఞలను ఆలకించవలెనని, ఆయన మాటలకు విశ్వాసముగా ఉండవలెనని, ఆయన పరిశుద్ధాత్మ యొక్క చిత్తానుసారము నిత్యజీవమును కోరుకొనవలెనని నేనాశించుచున్నాను.

29 శరీర చిత్తానుసారము మరియు దానియందున్న దుష్టత్వమును బట్టి శాశ్వత మరణమును కోరుకొనకుము, అది అపవాది తన రాజ్యములో మీపై ఏలునట్లు మిమ్ములను బంధించి, నరకమునకు తెచ్చుటకు అతని ఆత్మకు శక్తినిచ్చును.

30 నా కుమారులారా, నేను ఈ కొద్ది మాటలను నా పరిశీలనాకాలపు చివరిదినములలో మీ అందరితో మాట్లాడితిని; ప్రవక్త మాటలను బట్టి నేను మంచి భాగమును కోరుకొంటిని మరియు మీ ఆత్మల శాశ్వత సంక్షేమము తప్ప నాకు మరే ఉద్దేశ్యము లేదు, ఆమేన్‌.