లేఖనములు
2 నీఫై 30


30వ అధ్యాయము

పరివర్తన పొందిన అన్యజనులు నిబంధన జనులతో లెక్కింపబడుదురు—లేమనీయులు, యూదులనేకులు వాక్యమును నమ్మి సంతోషభరితులగుదురు—ఇశ్రాయేలీయులు పునఃస్థాపించబడుదురు, దుష్టులు నాశనము చేయబడుదురు. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, నేను మీతో మాట్లాడెదను; అన్యజనుల కంటే మీరు ఎక్కువ నీతిమంతులని మీరు తలంచుటను నీఫై అను నేను అనుమతించను. ఏలయనగా మీరు దేవుని ఆజ్ఞలను పాటించితే తప్ప మీరందరూ అదే విధముగా నశించెదరు; మరియు పలుకబడిన మాటలను బట్టి అన్యజనులు పూర్తిగా నాశనము చేయబడిరని మీరు తలంచరాదు.

2 పశ్చాత్తాపపడు అన్యజనులందరు ప్రభువు యొక్క నిబంధన జనులగుదురు; పశ్చాత్తాపపడని యూదులందరు త్రోసివేయబడుదురు; ఏలయనగా పశ్చాత్తాపపడి, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన ఆయన కుమారుని యందు విశ్వాసముంచు వారితో తప్ప మరెవ్వరితోను ప్రభువు నిబంధన చేయడని నేను మీతో చెప్పుచున్నాను.

3 ఇప్పుడు నేను యూదులు మరియు అన్యజనులను గూర్చి కొంత ఎక్కువగా ప్రవచించెదను. ఏలయనగా నేను మాట్లాడియున్న ఆ గ్రంథము ఉనికిలోనికి వచ్చి, అన్యజనులకు వ్రాయబడి తిరిగి ప్రభువుకు ముద్ర వేయబడిన తరువాత, వ్రాయబడిన మాటలను విశ్వసించు వారు అనేకులుందురు; వారు వాటిని మా సంతానము యొక్క శేషమునకు తీసుకువెళ్ళెదరు.

4 అప్పుడు మా సంతానము యొక్క శేషము మమ్ములను గూర్చి, ఏవిధముగా మేము యెరూషలేము నుండి బయటకు వచ్చితిమనే దానిని గూర్చి మరియు వారు యూదుల యొక్క వంశస్థులని తెలుసుకొందురు.

5 యేసు క్రీస్తు యొక్క సువార్త వారి మధ్య ప్రకటించబడును; కావున వారు తమ పితరులను గూర్చిన జ్ఞానమునకు, యేసు క్రీస్తును గూర్చి తమ పితరులకు గల జ్ఞానమునకు పునఃస్థాపించబడుదురు.

6 అప్పుడు వారు ఆనందించెదరు; ఏలయనగా అది దేవుని నుండి వారికి ఒక దీవెనయని వారు తెలుసుకొందురు; వారి కన్నుల నుండి అంధకారపు పొరలు రాలుట ఆరంభించును; వారి మధ్య నుండి అనేక తరములు గతించిపోక మునుపే వారు శుద్ధమైన, సంతోషకరమైన జనులగుదురు.

7 చెదిరిపోయిన యూదులు కూడా క్రీస్తునందు విశ్వసించుట మొదలుపెట్టుదురు; వారు భూముఖముపై సమకూడుట మొదలుపెట్టుదురు; క్రీస్తు నందు విశ్వసించు వారందరు సంతోషకరమైన జనులగుదురు.

8 ప్రభువైన దేవుడు భూమిపై తన జనుల యొక్క పునఃస్థాపనను తెచ్చుటకు సమస్త జనములు, వంశములు, భాషలు మరియు ప్రజల మధ్య తన కార్యమును ప్రారంభించును.

9 ప్రభువైన దేవుడు నీతినిబట్టి బీదలకు తీర్పుతీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును; తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను హతమార్చును.

10 ప్రభువైన దేవుడు జనుల మధ్య ఒక గొప్ప చీలికను కలుగజేసి, దుష్టులను నాశనము చేయు సమయము వేగముగా వచ్చును; ఆయన దుష్టులను అగ్నిచేత నాశనము చేయవలసి వచ్చినను తన జనులను విడిచిపెట్టును.

11 అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు విశ్వాస్యతయు నడికట్టుగా ఉండును.

12 తోడేలు గొఱ్ఱెపిల్లతో వాసము చేయును, చిరుతపులి మేకపిల్లతో పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.

13 ఆవులు, ఎలుగులు కూడి మేయును; వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును; ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.

14 పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును, మిడినాగు పుట్ట మీద పాలువిడిచిన పిల్ల తన చేయి చాచును.

15 నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు, సముద్రము జలముతో నిండియున్నట్లు లోకము ప్రభువును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.

16 అందువలన సమస్త జనముల సంగతులు తెలియజేయబడును; సమస్త విషయములు నరుల సంతానమునకు తెలియజేయబడును.

17 బయలుపరచబడని రహస్యమేదియు లేదు; వెలుగు నందు ప్రత్యక్షపరచబడని అంధకార క్రియ ఏదియు లేదు; విప్పబడకుండా భూమిపై ముద్రవేయబడినది ఏదియూ లేదు.

18 అందువలన నరుల సంతానమునకు బయలుపరచబడిన సంగతులన్నియు ఆ దినమున బయలుపరచబడును; మరియు దీర్ఘకాలము పాటు నరుల సంతానము యొక్క హృదయములపై సాతాను ఇక ఎన్నడూ అధికారము కలిగియుండడు; ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, నేను నా మాటలను ముగించెదను.