లేఖనములు
2 నీఫై 31


31వ అధ్యాయము

క్రీస్తు ఎందుకు బాప్తిస్మము పొందెనో నీఫై చెప్పును—రక్షణ పొందుటకు మనుష్యులు క్రీస్తుననుసరించి బాప్తిస్మము తీసుకొని, పరిశుద్ధాత్మను పొంది, అంతము వరకు స్థిరముగానుండవలెను—పశ్చాత్తాపము మరియు బాప్తిస్మము తిన్నని, ఇరుకైన మార్గమునకు ద్వారమైయున్నవి—బాప్తిస్మము తర్వాత ఆజ్ఞలను పాటించు వారికి నిత్యజీవము కలుగును. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 నా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు నీఫైయను నేను మీకు ప్రవచించుట ముగించెదను మరియు నిశ్చయముగా జరుగవలెనని నేను ఎరిగియున్న కొద్ది విషయములను మాత్రమే నేను వ్రాయగలను; నా సహోదరుడైన జేకబ్ మాటలలో కొన్నింటిని మాత్రమే నేను వ్రాయగలను.

2 కావున క్రీస్తు యొక్క సిద్ధాంతమును గూర్చి నేను పలుకవలసిన కొద్ది మాటలు తప్ప, నేను వ్రాసియున్న విషయములు నాకు చాలును; నా ప్రవచనము యొక్క సరళత్వమును బట్టి నేను మీతో సరళముగా మాట్లాడెదను.

3 నా ఆత్మ సరళత్వమందు ఆనందించును; ఏలయనగా ఈ మాదిరిగా ప్రభువైన దేవుడు నరుల సంతానము మధ్య పనిచేయును; గ్రహింపు కొరకు ప్రభువైన దేవుడు వెలుగును ప్రసాదించును; ఏలయనగా ఆయన మనుష్యులతో వారి భాష ప్రకారము వారు గ్రహించునట్లు మాట్లాడును.

4 అందువలన లోకపాపములను మోసుకొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్లకు బాప్తిస్మమిచ్చు ప్రవక్తను గూర్చి ప్రభువు నాకు చూపియున్నాడని నేను మీతో చెప్పియున్నానని మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుచున్నాను.

5 ఇప్పుడు దేవుని గొఱ్ఱెపిల్ల పరిశుద్ధుడైయుండి సమస్త నీతిని నెరవేర్చుటకు నీటి ద్వారా బాప్తిస్మము పొందవలసియుండగా, అపవిత్రులమైయున్న మనము ఇంకెంత ఎక్కువగా నీటి ద్వారా బాప్తిస్మము పొందవలసియున్నాము?

6 నా ప్రియమైన సహోదరులారా నీటి ద్వారా బాప్తిస్మము పొందుట వలన దేవుని గొఱ్ఱెపిల్ల సమస్త నీతిని ఎట్లు నెరవేర్చెనని నేను మిమ్ములను అడుగుచున్నాను?

7 ఆయన పరిశుద్ధుడైయుండెనని మీరెరుగరా? కానీ ఆయన పరిశుద్ధుడైయున్నప్పటికీ, శరీరానుసారముగా తననుతాను తండ్రి యెదుట తగ్గించుకొనుచున్నాడని నరుల సంతానమునకు చూపుచు, తండ్రి ఆజ్ఞలను పాటించుటలో తాను ఆయనకు లోబడియుండెదనని తండ్రికి సాక్ష్యమిచ్చుచున్నాడు.

8 కావున ఆయన నీటితో బాప్తిస్మము పొందిన తరువాత, పరిశుద్ధాత్మ ఆయనపై ఒక పావురము వలె దిగివచ్చెను.

9 ఆయన వారి కొరకు మాదిరిగా ఉంచినట్లు ఇది నరుల సంతానమునకు వారు ప్రవేశించవలసిన తిన్నని మార్గమును, ఇరుకైన ద్వారమును చూపించుచున్నది.

10 మీరు నన్నుఅనుసరించుడి అని ఆయన నరుల సంతానముతో చెప్పెను. కావున నా ప్రియమైన సహోదరులారా, తండ్రి ఆజ్ఞలను పాటించుటకు సమ్మతించకుండా మనము యేసును అనుసరించగలమా?

11 పశ్చాత్తాపపడుడి, పశ్చాత్తాపపడుడి, నా ప్రియ కుమారుని నామమందు బాప్తిస్మము పొందుడి అని తండ్రి చెప్పెను.

12 కుమారుని స్వరము కూడా నాతో ఇట్లనెను: నా నామమందు బాప్తిస్మము పొందిన వానికి నాకిచ్చినట్లుగానే తండ్రి పరిశుద్ధాత్మను ఇచ్చును; కావున నన్ను అనుసరించి, నేను చేయగా మీరు చూచియున్న క్రియలను చేయుడి.

13 అందువలన నా ప్రియమైన సహోదరులారా, మీరు దేవుని యెదుట ఎట్టి వేషధారణ, మోసము లేకుండా హృదయము యొక్క పూర్ణ ఉద్దేశ్యముతో కుమారుని అనుసరించుచూ, మనఃపూర్వకముగా మీ పాపములకు పశ్చాత్తాపపడుచూ, బాప్తిస్మము ద్వారా క్రీస్తు నామమును మీపై ధరించుకొనుటకు మీరు సిద్ధముగా ఉన్నారని తండ్రికి సాక్ష్యమిచ్చుచూ ఆయన వాక్యానుసారము మీ ప్రభువును, మీ రక్షకుడిని నీటిలోనికి అనుసరించిన యెడల మీరు పరిశుద్ధాత్మను పొందెదరని నేనెరుగుదును; అప్పుడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మము వచ్చును; మీరు దేవదూతల వలె మాట్లాడగలరు మరియు ఇశ్రాయేలు పరిశుద్ధునికి స్తుతులు చెల్లించగలరు.

14 కానీ ఇదిగో నా ప్రియమైన సహోదరులారా, కుమారుని స్వరము నాతో ఇట్లు చెప్పెను: మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి నీటి ద్వారా బాప్తిస్మము చేత నా ఆజ్ఞలను పాటించెదరని తండ్రికి సాక్ష్యమిచ్చి, పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మము పొంది ఒక క్రొత్త భాషలో, ముఖ్యముగా దేవదూతల భాషలో మాట్లాడగలిగిన తరువాత నన్ను తిరస్కరించిన యెడల, మీరు నన్ను ఎరుగకపోవుటయే మీకు మేలైయుండును.

15 మరియు తండ్రి యొక్క స్వరము ఇట్లు చెప్పుట నేను వింటిని: నా ప్రియ కుమారుని మాటలు యథార్థమైనవి, నమ్మకమైనవి. అంతము వరకు స్థిరముగానుండు వాడు రక్షించబడును.

16 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, దీనిని బట్టి సజీవుడగు దేవుని కుమారుని యొక్క మాదిరిని అనుసరించుటలో మనుష్యుడు అంతము వరకు స్థిరముగా ఉంటే తప్ప అతడు రక్షింపబడలేడని నేనెరుగుదును.

17 అందువలన మీ ప్రభువు, మీ విమోచకుడు చేయగా నేను చూచియున్నానని మీతో చెప్పియున్న ఆ క్రియలను చేయుడి; ఏలయనగా, ఏ ద్వారము గుండా ప్రవేశించవలెనో మీరు తెలుసుకొనవలెనన్న హేతువు చేతనే అవి నాకు చూపబడెను. మీరు ప్రవేశించవలసిన ద్వారము పశ్చాత్తాపము మరియు నీటి ద్వారా బాప్తిస్మము; తరువాత అగ్ని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మీకు పాప పరిహారము కలుగును.

18 అప్పుడు మీరు నిత్య జీవమునకు నడిపించు ఈ తిన్నని, ఇరుకైన మార్గమందున్నారు; మీరు ఆ ద్వారము గుండా ప్రవేశించియున్నారు; మీరు తండ్రీ కుమారుల యొక్క ఆజ్ఞల ప్రకారము చేసియున్నారు; మీరు మార్గము గుండా ప్రవేశించిన యెడల మీరు పొందెదరని ఆయన చేసిన వాగ్దానము నెరవేరునట్లు మీరు తండ్రీ కుమారులను గూర్చి సాక్ష్యమిచ్చు పరిశుద్ధాత్మను పొందియున్నారు.

19 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ తిన్నని, ఇరుకైన మార్గమున ప్రవేశించిన తరువాత, సమస్తము చేయబడెనా? అని నేను అడుగుచున్నాను; లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా, రక్షించుటకు శక్తిమంతుడైన వాని మంచితనముపై పూర్తిగా ఆధారపడుచూ, ఆయన యందు స్థిరమైన విశ్వాసముతో, క్రీస్తు వాక్యము వలన తప్ప మరేవిధముగాను మీరు ఇంత దూరము రాలేదు.

20 అందువలన క్రీస్తు నందు నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్కయు మనుష్యులందరి యొక్కయు ప్రేమను కలిగియుండి మీరు శ్రద్ధగా ముందుకు సాగవలెను. కావున మీరు క్రీస్తు వాక్యమును విందారగించుచూ ముందుకుసాగి, అంతము వరకు స్థిరముగానుండిన యెడల మీరు నిత్యజీవము పొందెదరని తండ్రి సెలవిచ్చుచున్నాడు.

21 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, ఇదియే మార్గము; దేవుని రాజ్యమందు మనుష్యుడు రక్షింపబడుటకు పరలోకము క్రింద ఇయ్యబడిన మరే ఇతర మార్గము గాని నామముగానీ లేదు; ఇదే క్రీస్తు యొక్క సిద్థాంతమైయున్నది, మరియు నిత్యము ఏక దేవుడైయున్న ఆ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఒకేఒక సత్యమైన సిద్థాంతమైయున్నది. ఆమేన్‌.