లేఖనములు
2 నీఫై 32


32వ అధ్యాయము

దేవదూతలు పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడుదురు—మనుష్యులు ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ నుండి తమ కొరకు జ్ఞానము సంపాదించుకొనవలెను. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, మార్గమునందు ప్రవేశించిన తరువాత మీరు చేయవలసిన దానిని గూర్చి మీ హృదయములందు మీరు కొద్దిగా ధ్యానించుచున్నారని నేననుకొనుచున్నాను. కానీ, మీరు ఈ సంగతులను గూర్చి మీ హృదయములలో ఎందుకు ధ్యానించుచున్నారు?

2 మీరు పరిశుద్ధాత్మను పొందిన తరువాత దేవదూతల వలె మాట్లాడగలరని నేను మీతో చెప్పియున్నానని మీకు జ్ఞాపకము లేదా? అయితే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మరేవిధముగా మీరు దేవదూతల వలె మాట్లాడగలిగితిరి?

3 దేవదూతలు పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడుదురు; అందువలన వారు క్రీస్తు యొక్క మాటలను మాట్లాడుదురు. కావున, క్రీస్తు యొక్క మాటలను విందారగించమని నేను మీతో చెప్పితిని; ఏలయనగా క్రీస్తు యొక్క మాటలు మీరు చేయవలసిన కార్యములన్నిటినీ మీకు తెలుపును.

4 అందువలన నేను ఈ మాటలను పలికిన తరువాత మీరు వాటిని గ్రహించలేని యెడల, అది మీరు అడుగనందువలననే; లేదా మీరు తట్టనందువలననే; కావున, మీరు వెలుగులోనికి తేబడకుండా అంధకారములోనే నశించవలెను.

5 ఇదిగో నేను మీతో మరలా చెప్పుచున్నాను, మీరు మార్గము ద్వారా ప్రవేశించి పరిశుద్ధాత్మను పొందిన యెడల, మీరు చేయవలసిన కార్యములన్నిటినీ ఆయన మీకు చూపును.

6 ఇదియే క్రీస్తు యొక్క సిద్ధాంతము మరియు శరీరము నందు ఆయన తననుతాను మీకు ప్రత్యక్షపరచుకొను వరకు మరి ఎక్కువ సిద్ధాంతము ఇవ్వబడదు; ఆయన శరీరమందు తననుతాను మీకు ప్రత్యక్షపరచుకొనునప్పుడు, ఆయన మీతో చెప్పు వాటిని చేయుటకు మీరు శ్రద్ధ వహించుడి.

7 ఇప్పుడు నీఫైయను నేను మరి ఎక్కువ చెప్పలేను; ఆత్మ నేను మాట్లాడకుండా ఆపుచున్నది, నేను మనుష్యుల అవిశ్వాసము, దుష్టత్వము, అజ్ఞానము, మెడబిరుసుతనమును బట్టి దుఃఖించుటకు విడువబడియున్నాను; ఏలయనగా వారు జ్ఞానమును వెదకరు, వాక్యము ఎంత సరళముగా ఉండవచ్చునో అంత సరళముగా వారికి ఇవ్వబడినప్పటికీ గొప్ప జ్ఞానమును గ్రహించరు.

8 నా ప్రియమైన సహోదరులారా, మీరు మీ హృదయములలో ఇంకనూ ధ్యానించుచున్నారని నేను చెప్పగలను; ఈ విషయమును గూర్చి నేను మాట్లాడవలసివచ్చుట నాకు బాధ కలిగించుచున్నది. ఏలయనగా ప్రార్థన చేయమని మనుష్యునికి బోధించు ఆత్మను మీరు ఆలకించిన యెడల, తప్పక ప్రార్థన చేయవలెనని మీరు తెలుసుకొందురు. దురాత్మ ప్రార్థన చేయమని మనుష్యునికి బోధించదు, కానీ అతడు ప్రార్థన చేయరాదని బోధించును.

9 కానీ మీరు ఎల్లప్పుడు ప్రార్థన చేయవలెనని మరియు విసుగు చెందరాదని, మీరు చేయునది మీ ఆత్మ యొక్క శ్రేయస్సు కొరకై యుండునట్లు, మీరు చేయుదానిని మీ కొరకు ఆయన ప్రతిష్ఠించునట్లు మీరు మొదట తండ్రికి క్రీస్తు నామమున ప్రార్థన చేయనిదే ప్రభువు పేరిట ఏ కార్యమును చేయరాదని నేను మీతో చెప్పుచున్నాను.