లేఖనములు
2 నీఫై 33


33వ అధ్యాయము

నీఫై మాటలు యథార్థమైనవి—అవి క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చును—క్రీస్తు నందు విశ్వసించు వారు నీఫై మాటలయందు విశ్వసించుదురు, అతని మాటలు దేవుని న్యాయస్థానము యెదుట సాక్ష్యముగా నిలుచును. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 ఇప్పుడు నీఫైయను నేను, నా జనుల మధ్య బోధింపబడిన వాక్యములన్నిటినీ వ్రాయలేను; మాట్లాడుట యందున్నట్లుగా వ్రాయుట యందు నేను శక్తిమంతుడను కాను; ఏలయనగా ఒక మనుష్యుడు పరిశుద్ధాత్మ శక్తి చేత మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి దానిని నరుల సంతానము యొక్క హృదయములకు కొనిపోవును.

2 కానీ, అనేకమంది వారి యందు దానికి స్థానము లేకుండునట్లు పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొందురు; అందువలన, వ్రాయబడిన అనేక వాక్యములను వారు నిరాకరించి వాటిని పనికిరానివిగా భావించెదరు.

3 కానీ నీఫైయను నేను, నేను వ్రాయవలసిన దానిని వ్రాసితిని, ప్రత్యేకించి నా జనుల కొరకు అది ఎంతో విలువైనదని నేను భావించితిని. ఏలయనగా వారి కొరకు నేను పగటి యందు నిరంతరము ప్రార్థించుదును, రాత్రి యందు వారిని బట్టి నా కన్నులు శోకసముద్రములగును; నేను విశ్వాసముతో దేవునికి మొర పెట్టుదును మరియు ఆయన నా మొర వినునని నేనెరుగుదును.

4 ప్రభువైన దేవుడు నా ప్రార్థనలను నా జనుల ప్రయోజనము నిమిత్తము ప్రతిష్ఠించునని నేనెరుగుదును. నేను బలహీనతలో వ్రాసిన మాటలు వారి కొరకు శక్తివంతముగా చేయబడును. ఏలయనగా, మేలు చేయునట్లు అది వారిని ప్రోత్సహించును; వారి పితరులను గూర్చి వారికి తెలియజేయును. యేసును గూర్చి మాట్లాడును; ఆయన యందు విశ్వాసముంచునట్లు, నిత్యజీవమైన అంతము వరకు స్థిరముగా నుండునట్లు వారిని ప్రోత్సహించును.

5 సత్యము యొక్క సరళత్వమును బట్టి అది పాపమునకు వ్యతిరేకముగా కఠినముగా మాట్లాడును; అందువలన, అతడు అపవాది యొక్క ఆత్మ అయితే తప్ప నేను వ్రాసియున్న మాటలను బట్టి ఏ మనుష్యుడు కోపపడడు.

6 నేను సరళత్వమందు, సత్యము నందు అతిశయించుచున్నాను; నేను నా యేసు నందు అతిశయించుచున్నాను, ఏలయనగా ఆయన నా ఆత్మను నరకము నుండి విమోచించియున్నాడు.

7 నేను నా జనుల కొరకు దాతృత్వము కలిగియున్నాను, ఆయన న్యాయపీఠము వద్ద మచ్చలేని అనేక ఆత్మలను నేను కలుసుకొందునని క్రీస్తు నందు గొప్ప విశ్వాసము కలిగియున్నాను.

8 నేను యూదుని కొరకు దాతృత్వము కలిగియున్నాను—నేను యూదుడు అని చెప్పుచున్నాను, ఏలయనగా నేను ఎక్కడి నుండి వచ్చియున్నానో అక్కడి వారిని గూర్చి చెప్పుచున్నాను.

9 నేను అన్యజనుల కొరకు కూడా దాతృత్వము కలిగియున్నాను. కానీ వారు క్రీస్తుతో సమాధానపడి, ఇరుకైన ద్వారములోనికి ప్రవేశించి, జీవమునకు నడిపించు తిన్నని మార్గమున నడిచి, వారి పరిశీలనాదినము ముగియువరకు ఆ మార్గము నందు సాగితేనే తప్ప వారిలో ఎవరిని గూర్చియు నేను నిరీక్షణ కలిగియుండలేను.

10 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులు, యూదులు మరియు సమస్త భూదిగంతములారా, మీరు ఈ మాటలను ఆలకించి క్రీస్తు నందు విశ్వసించుడి; మీరు ఈ మాటలయందు విశ్వసించకపోయినను క్రీస్తు నందు విశ్వసించుడి; మీరు క్రీస్తు నందు విశ్వసించిన యెడల, మీరు ఈ మాటలయందు విశ్వసించెదరు; ఏలయనగా అవి ఆయన నాకు ఇచ్చియున్న క్రీస్తు యొక్క మాటలు; మరియు మేలు చేయవలెనని అవి మనుష్యులందరికి బోధించుచున్నవి.

11 అవి క్రీస్తు యొక్క మాటలు కాని యెడల, మీరు తీర్పు తీర్చుడి—ఏలయనగా అవి ఆయన మాటలని అంత్యదినమున శక్తితోను, గొప్ప మహిమతోను క్రీస్తు మీకు చూపును; మీరు, నేను ఆయన న్యాయస్థానము యెదుట ముఖాముఖిగా నిలబడెదము; నేను బలహీనుడనైనప్పటికీ ఈ విషయములను వ్రాయవలెనని ఆయన ద్వారా ఆజ్ఞాపించబడితినని మీరెరుగుదురు.

12 ఆ గొప్ప అంత్యదినమందు ఆయన రాజ్యమందు మనలో అందరు కాకపోయినను అనేకులు రక్షింపబడవలెనని నేను తండ్రిని క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను.

13 ఇప్పుడు, ఇశ్రాయేలు వంశస్థులైన నా ప్రియమైన సహోదరులారా మరియు సమస్త భూదిగంతములారా, నేను మీతో ధూళిలో నుండి మొరపెట్టుచున్న ఒకని స్వరము వలే మాట్లాడుచున్నాను: ఆ గొప్ప దినము వచ్చువరకు సెలవు.

14 మరియు మీరు, దేవుని మంచితనమందు పాలుపంచుకొనక యూదుల మాటలను, నా మాటలను, దేవుని గొఱ్ఱెపిల్ల నోటి నుండి వెలువడు మాటలను లక్ష్యపెట్టని వారైన మీ యొద్ద నుండి నేను శాశ్వతముగా సెలవు తీసుకొనుచున్నాను. ఏలయనగా అంత్యదినమున ఈ మాటలను బట్టి మీరు అపరాధులుగా యెంచబడుదురు.

15 నేను భూమిపై ముద్ర వేయుచున్నది న్యాయస్థానము యొద్ద మీకు వ్యతిరేకముగా తేబడును; ప్రభువు ఆ విధముగా నన్ను ఆజ్ఞాపించియున్నాడు మరియు నేను తప్పక లోబడవలెను. ఆమేన్‌.