లేఖనములు
2 నీఫై 3


3వ అధ్యాయము

యోసేపు ఐగుప్తులో దర్శనమునందు నీఫైయులను చూచెను—కడవరి దిన దీర్ఘదర్శియైన జోసెఫ్‌ స్మిత్‌ గూర్చి, ఇశ్రాయేలును విడిపించు మోషే గూర్చి, మోర్మన్‌ గ్రంథము యొక్క రాకను గూర్చి అతడు ప్రవచించెను. సుమారు క్రీ. పూ. 588–570 సం.

1 ఇప్పుడు, నా చివరి సంతానమైన జోసెఫ్‌, నేను నీతో మాట్లాడెదను. నీవు అరణ్యములో నా బాధలయందు జన్మించితివి; నా మిక్కిలి దుఃఖ దినములలో నీ తల్లి నిన్ను కనెను.

2 నీవు ఇశ్రాయేలు పరిశుద్ధుని ఆజ్ఞలను పాటించిన యెడల నీ స్వాస్థ్యమునకు, నీ సహోదరులతో పాటు నీ సంతానము యొక్క స్వాస్థ్యమునకు, నీ శాశ్వత భద్రత కొరకు అతి ప్రశస్థమైన ఈ దేశమును ప్రభువు నీకు కూడా ప్రతిష్ఠించును గాక.

3 ఇప్పుడు, నా చివరి సంతానమైన జోసెఫ్‌, అరణ్యములో నా శ్రమలలో నేను నిన్ను కంటిని, ప్రభువు నిన్ను శాశ్వతముగా ఆశీర్వదించును గాక, కావున నీ సంతానము పూర్తిగా నాశనము చేయబడదు.

4 ఇదిగో నీవు నా గర్భఫలమైయున్నావు, నేను ఐగుప్తులోనికి దాసునిగా కొనిపోబడిన యోసేపు సంతతివాడను. ప్రభువు యోసేపుతో చేసిన నిబంధనలు చాలా గొప్పవి.

5 కావున యోసేపు నిజముగా మన దినమును చూచెను. అతని గర్భఫలము నుండి ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు వంశస్థులకు ఒక నీతివంతమైన శేషమును అనగా మెస్సీయ కాదు గాని చీలిపోవు ఒక శేషమును పుట్టించునని, అయినప్పటికీ ప్రభువు యొక్క నిబంధనల యందు వారు జ్ఞాపకము చేసుకొనబడెదరని, కడవరి దినములలో మెస్సీయ వారికి ప్రత్యక్షపరచబడునని, ఆత్మ యొక్క శక్తితో వారిని అంధకారము నుండి, అనగా మరుగైన అంధకారము నుండి వెలుగులోనికి మరియు చెర నుండి స్వేచ్ఛకు రప్పించునని ప్రభువు నుండి అతడు ఒక వాగ్దానమును పొందెను.

6 ఏలయనగా, యోసేపు నిజముగా ఇట్లనుచూ సాక్ష్యమిచ్చెను: ప్రభువైన నా దేవుడు ఒక దీర్ఘదర్శిని పుట్టించును, అతడు నా గర్భఫలమునకు ఒక శ్రేష్ఠమైన దీర్ఘదర్శియైయుండును.

7 యోసేపు నిజముగా ఇట్లనెను: ప్రభువు నాకు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నీ గర్భఫలము నుండి ఒక శ్రేష్ఠమైన దీర్ఘదర్శిని నేను పుట్టించెదను; నీ గర్భఫలము మధ్య అతడు అధికముగా గౌరవించబడును. నీ గర్భఫలమైన అతని సహోదరుల కొరకు అతడు ఒక కార్యమును చేయవలెనని నేనతనిని ఆజ్ఞాపించెదను. ఆ కార్యము వారికి గొప్ప విలువ గలదైయుండును. నీ పితరులతో నేను చేసిన నిబంధనల గురించి వారు తెలుసుకొనునట్లు చేయును.

8 నేను అతనికి ఆజ్ఞాపించు కార్యము తప్ప, మరే ఇతర కార్యమును అతడు చేయరాదని నేనతనికి ఒక ఆజ్ఞనిచ్చెదను. నా దృష్టిలో అతడిని హెచ్చించెదను; ఏలయనగా అతడు నా కార్యమును చేయును.

9 ఓ ఇశ్రాయేలు వంశస్థులారా, నా జనులను విడిపించుటకు మీ కొరకు నేను పుట్టించెదనని చెప్పిన మోషేవలే అతడు కూడా గొప్పగా ఉండును.

10 మరియు నీ జనులను ఐగుప్తు దేశము నుండి విడిపించుటకు నేను మోషేను పుట్టించెదను.

11 కానీ, నీ గర్భఫలము నుండి నేను ఒక దీర్ఘదర్శిని పుట్టించెదను; మరియు నీ గర్భఫలమునకు నా వాక్యమును తెచ్చుటకు అనగా నా వాక్యమును ముందుకు తెచ్చుటయేకాక, ఇదివరకే వారి మధ్య ప్రకటించబడిన నా వాక్యమునకు వారిని ఒప్పించుటకు కూడా అతనికి నేను శక్తినిచ్చెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

12 అందువలన, నీ గర్భఫలము మరియు యూదా గర్భఫలము వ్రాయుదురు. నీ గర్భఫలముచే వ్రాయబడునది మరియు యూదా గర్భఫలముచే వ్రాయబడునది కలిసి అసత్య బోధనలను ఖండించి, వివాదములను అంతము చేసి, నీ గర్భఫలము మధ్య సమాధానమును స్థాపించి, కడవరి దినములలో వారు తమ పితరులను గూర్చి, నా నిబంధనలను గూర్చి తెలుసుకొనునట్లు చేసెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

13 ఓ ఇశ్రాయేలు వంశస్థులారా, మిమ్ములను పునఃస్థాపించుటకు నా జనులందరి మధ్య నా కార్యము ప్రారంభమగు ఆ దినమున బలహీనతలో నుండి అతడు బలపరచబడునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

14 మరియు యోసేపు ఈ విధముగా చెప్పుచూ ప్రవచించెను: ఆ దీర్ఘదర్శిని ప్రభువు ఆశీర్వదించును; అతడిని నాశనము చేయుటకు ప్రయత్నించు వారు కలవరపెట్టబడుదురు; ఏలయనగా, నా గర్భఫలము కొరకు ప్రభువు నుండి నేను పొందిన ఈ వాగ్దానము నెరవేరును. ఈ వాగ్దానము యొక్క నెరవేర్పును గూర్చి నేను నమ్మకముగా ఉన్నాను;

15 అతని పేరు నా పేరుననుసరించి పిలువబడును. అది అతని తండ్రి పేరుననుసరించి ఉండును. మరియు అతడు నా వలే ఉండును; ప్రభువు యొక్క శక్తి ద్వారా, ప్రభువు అతని హస్తము ద్వారా తెచ్చు కార్యము నా జనులకు రక్షణను తెచ్చును.

16 ఈ విధముగా యోసేపు ప్రవచించియున్నాడు: మోషేను గూర్చిన వాగ్దానమును గూర్చి నేనెంత నమ్మకముగా ఉన్నానో అంతగా నేను ఈ విషయమును గూర్చి నమ్మకముగా ఉన్నాను. ఏలయనగా, నేను నీ సంతానమును శాశ్వతముగా కాపాడెదనని ప్రభువు నాతో చెప్పియున్నాడు.

17 మరియు ప్రభువు ఇట్లు చెప్పియుండెను: నేను ఒక మోషేను పుట్టించెదను, అతనికొక దండములో నేను శక్తినిచ్చెదను; నేనతనికి వ్రాయుటలో శక్తినిచ్చెదను. అయినను అతడు అధికముగా మాట్లాడునట్లు నేను అతని నాలుకను వదులు చేయను. ఏలయనగా, మాట్లాడుటలో నేనతనిని శక్తిమంతుడను చేయను. కానీ, నా స్వంత చేతి వ్రేలి ద్వారా నేను అతనికి నా ధర్మశాస్త్రమును వ్రాయుదును; మరియు అతనికి బదులుగా మాట్లాడుటకు వేరొకనిని నేను నియమించెదను.

18 ప్రభువు నాతో కూడా ఇట్లు చెప్పెను: నేను నీ గర్భఫలము కొరకు పుట్టించెదను; అతనికి బదులుగా మాట్లాడుటకు వేరొకనిని అతని కొరకు నేను నియమించెదను. మరియు ఇదిగో నీ గర్భఫలము యొక్క వ్రాతను, నీ గర్భఫలము కొరకు అతడు వ్రాయునట్లు నేనతనికిచ్చెదను; అతనికి బదులుగా మాట్లాడువాడు దానిని ప్రకటించును.

19 అతడు వ్రాయు వాక్యములు నా జ్ఞానమందు ప్రయోజనకరమైనవై నీ గర్భఫలము యొద్దకు వెళ్ళవలెను; ఆ వాక్యములు నీ గర్భఫలము ధూళిలో నుండి వారితో బిగ్గరగా మాట్లాడినట్లుండును; ఏలయనగా నేను వారి విశ్వాసమును ఎరుగుదును.

20 వారు ధూళి నుండి మొరపెట్టెదరు; ముఖ్యముగా వారి నుండి అనేక తరములు గతించిపోయిన తరువాత కూడా వారి సహోదరులకు పశ్చాత్తాపమును ప్రకటించెదరు; మరియు వారి వాక్యముల సరళతను బట్టి కూడా వారి వాక్కు నీ గర్భఫలమునకు వెళ్ళును.

21 వారి విశ్వాసమును బట్టి నా నోటి నుండి వారి వాక్యములు నీ గర్భఫలమైన వారి సహోదరుల యొద్దకు వెళ్ళును; నీ పితరులతో నేను చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొనునట్లు వారి వాక్యముల బలహీనతను వారి విశ్వాసమందు నేను బలపరిచెదను.

22 ఇప్పుడు, నా కుమారుడవైన జోసెఫ్‌, ఈ విధముగా నా పూర్వీకుడు ప్రవచించెను.

23 అందువలన, ఈ నిబంధనను బట్టి నీవు ఆశీర్వదింపబడియున్నావు. నీ సంతానము నాశనము చేయబడదు; ఏలయనగా, వారు ఆ గ్రంథము యొక్క వాక్యములను ఆలకించెదరు.

24 వారి మధ్య బలముగల వాడొకడు పుట్టును, అతడు బహుమేలు చేయును, వాక్యమందును మరియు క్రియయందును దేవుని హస్తములలో సాధనమై, అధిక విశ్వాసముతో గొప్ప ఆశ్చర్యకార్యములు చేయును, దేవుని దృష్టి యందు గొప్పదైన కార్యమును చేయును, ఇశ్రాయేలు వంశస్థులకు మరియు నీ సహోదరుల సంతానమునకు అధిక పునఃస్థాపన జరిగించును.

25 ఇప్పుడు జోసెఫ్‌, నీవు ఆశీర్వదింపబడియున్నావు. ఇదిగో నీవు చిన్నవాడవు; అందువలన, నీ సహోదరుడైన నీఫై మాటలను ఆలకించుము మరియు నేను చెప్పిన మాటల ప్రకారము నీకు జరుగును. మరణించుచున్న నీ తండ్రి మాటలను జ్ఞాపకముంచుకొనుము. ఆమేన్‌.