లేఖనములు
2 నీఫై 4


4వ అధ్యాయము

లీహై తన సంతతికి హితబోధ చేసి, ఆశీర్వదించును—అతడు మరణించి, సమాధి చేయబడును—నీఫై దేవుని మంచితనమునందు ఆనందించును—నీఫై ఎల్లప్పుడు ప్రభువునందు నమ్మకముంచును. సుమారు క్రీ. పూ. 588–570 సం.

1 ఇప్పుడు, ఐగుప్తులోనికి కొనిపోబడిన యోసేపును గూర్చి నా తండ్రి పలికియున్న ప్రవచనములను గూర్చి నీఫైయను నేను మాట్లాడుదును.

2 ఏలయనగా, అతడు నిజముగా తన సంతానమంతటిని గూర్చి ప్రవచించెను. అతడు వ్రాసిన ప్రవచనముల కంటే గొప్పవి లేవు. అతడు మమ్ములను, మా భవిష్యత్తరములను గూర్చి ప్రవచించెను; అవి కంచు పలకలపై వ్రాయబడెను.

3 కావున, నా తండ్రి యోసేపు ప్రవచనములను గూర్చి మాట్లాడుట ముగించిన తరువాత, అతడు లేమన్‌ కుమారులను, కుమార్తెలను పిలిచి వారితో ఇట్లనెను: ఇదిగో, నా ప్రథమ సంతానము యొక్క పిల్లలైన నా కుమారులారా మరియు నా కుమార్తెలారా, మీరు నా మాటలకు చెవియొగ్గవలెనని నేను కోరుచున్నాను.

4 ఏలయనగా, ప్రభువైన దేవుడు ఇట్లు చెప్పియున్నాడు: నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము మీరు దేశమందు వర్ధిల్లుదురు; మరియు మీరు నా ఆజ్ఞలను పాటించకుండా ఉన్నంత కాలము మీరు నా సన్నిధి నుండి కొట్టివేయబడుదురు.

5 కానీ, నా కుమారులారా మరియు నా కుమార్తెలారా, నేను మిమ్ములను దీవించకుండా నా సమాధిలోనికి వెళ్ళలేను; ఏలయనగా, మీరు వెళ్ళవలసిన మార్గములో మీరు పెంచబడిన యెడల, మీరు దాని నుండి తొలగరని నేనెరుగుదును.

6 కావున మీరు శపించబడిన యెడల, ఆ శాపము మీ నుండి తీసివేయబడి, మీ తల్లిదండ్రుల తలలపై మోపబడునట్లు నేను మిమ్ములను దీవించుచున్నాను.

7 అందువలన, నా దీవెనను బట్టి ప్రభువైన దేవుడు మిమ్ములను నాశనము కానియ్యడు; ఆయన మీ యెడల, మీ సంతానము యెడల ఎల్లప్పుడు కనికరముగానుండును.

8 నా తండ్రి లేమన్‌ కుమారులు మరియు కుమార్తెలతో మాట్లాడుట ముగించిన తరువాత, అతడు లెముయెల్ కుమారులు మరియు కుమార్తెలు తన ముందుకు తేబడునట్లు చేసెను.

9 అతడు వారితో ఇట్లనుచూ మాట్లాడెను: నా రెండవ కుమారుని పిల్లలైన నా కుమారులారా మరియు నా కుమార్తెలారా, ఇదిగో లేమన్‌ కుమారులు మరియు కుమార్తెలకు నేను ఇచ్చిన దీవెననే మీకును ఇచ్చుచున్నాను; అందువలన, మీరు పూర్తిగా నాశనము చేయబడరు, కానీ అంతమందు మీ సంతానము ఆశీర్వదింపబడును.

10 నా తండ్రి వారితో మాట్లాడుట ముగించిన తరువాత అతడు ఇష్మాయెల్ కుమారులతో, అతని సమస్త పరివారముతో కూడా మాట్లాడెను.

11 అతడు వారితో మాట్లాడుట ముగించిన తరువాత, శామ్‌తో ఇట్లనుచూ మాట్లాడెను: నీవు, నీ సంతానము ఆశీర్వదింపబడియున్నారు. ఏలయనగా, నీవు నీ సహోదరుడైన నీఫై వలే దేశమును స్వాస్థ్యముగా పొందుదువు. నీ సంతానము అతని సంతానముతో లెక్కించబడును; నీవు నీ సహోదరుని వలే ఉందువు, నీ సంతానము అతని సంతానమువలే ఉండును; నీవు నీ దినములన్నిటిలో ఆశీర్వదింపబడుదువు.

12 నా తండ్రి లీహై తన మనోభావాలను బట్టి, అతనియందున్న ప్రభువు యొక్క ఆత్మను బట్టి తన ఇంటి వారందరితో మాట్లాడిన తరువాత అతడు వృద్ధుడైయున్నందున మరణించి, సమాధి చేయబడెను.

13 అతడు మరణించి అనేక దినములు కాకమునుపే లేమన్‌, లెముయెల్ మరియు ఇష్మాయెల్ కుమారులు ప్రభువు యొక్క మందలింపులను బట్టి నాతో కోపముగానుండిరి.

14 ఏలయనగా నీఫైయను నేను, ఆయన మాట ప్రకారము వారితో మాట్లాడుటకు బలవంతము చేయబడితిని; వారితో నేను అనేక విషయములు చెప్పితిని మరియు నా తండ్రి కూడా తన మరణమునకు ముందు చెప్పియుండెను; ఆ మాటలలో అనేకమైనవి నా ఇతర పలకలపై వ్రాయబడినవి; ఏలయనగా, చరిత్ర యొక్క అధికభాగము నా ఇతర పలకలపై వ్రాయబడినది.

15 వీటిపై నేను నా ఆత్మ యొక్క విషయములను మరియు కంచు పలకలపై చెక్కబడియున్న అనేక లేఖనములను వ్రాయుదును. ఏలయనగా, నా ఆత్మ లేఖనములయందు ఆనందించును, నా హృదయము వాటిని ధ్యానించును, నా సంతానము యొక్క అభ్యాసము మరియు ప్రయోజనము కొరకు నేను వాటిని వ్రాయుదును.

16 నా ఆత్మ ప్రభువు యొక్క కార్యములందు ఆనందించును; నా హృదయము నేను చూచిన మరియు వినియున్న దర్శనములపై నిరంతరము ధ్యానించును.

17 అయినను తన గొప్ప, అద్భుతకార్యములను నాకు చూపుటలో ప్రభువు యొక్క మహోపకారమును బట్టి నా హృదయము ఘోషించుచున్నది: అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? నా శరీరమును బట్టి నా హృదయము దుఃఖించుచున్నది; నా పాపములను బట్టి నా ఆత్మ వేదనపడుచున్నది.

18 నన్ను అతి సులువుగా వేధించు శోధనలు, పాపములతో నేను ఆవరించబడియున్నాను.

19 నేను ఆనందించగోరినప్పుడు, నా హృదయము నా పాపములను బట్టి మూలుగుచున్నది; అయినప్పటికీ, నేను ఎవరియందు నమ్మికయుంచియున్నానో నేనెరుగుదును.

20 నా దేవుడు నాకు ఆధారమైయుండెను; అరణ్యములో నా బాధలలో నన్ను నడిపించి, సముద్ర జలములపై ఆయన నన్ను కాపాడెను.

21 నా శరీరమును హరించునంతగా ఆయన తన ప్రేమతో నన్ను నింపెను.

22 నా యెదుట వారు వణుకునట్లుగా ఆయన నా శత్రువుల గర్వమణిచెను.

23 ఇదిగో, పగటియందు ఆయన నా మొరను ఆలకించి, రాత్రి సమయమున దర్శనముల ద్వారా నాకు జ్ఞానమునిచ్చెను.

24 పగటియందు నేను ఆయన యెదుట బలమైన ప్రార్థనలో ధైర్యము పొందితిని; నా స్వరమును ఎలుగెత్తగా దేవదూతలు క్రిందికి వచ్చి నాకు పరిచర్య చేసిరి.

25 ఆయన ఆత్మ యొక్క రెక్కలపై నా శరీరము మిక్కిలి ఎత్తైన పర్వతముల మీదికి కొనిపోబడెను. మనుష్యునికి అతి గొప్పవైన, ఘనమైన దృశ్యములను నా కన్నులు చూచెను. అందువలన, వాటిని వ్రాయకూడదని నేను ఆజ్ఞాపించబడితిని.

26 ఆహా, నేనంత గొప్ప దృశ్యములను చూచియున్న యెడల, ప్రభువు నరుల సంతానము పట్ల తన నమ్రతయందు మనుష్యులను అంత గొప్ప కనికరముతో దర్శించిన యెడల, నా బాధలను బట్టి నా హృదయము ఎందుకు రోదించవలెను, నా ఆత్మ దుఃఖపు లోయలో ఎందుకు జాగుచేయవలెను, నా శరీరము కృశించి, నా బలము ఎందుకు క్షీణించవలెను?

27 నా శరీరమును బట్టి నేనెందుకు పాపమునకు లోబడవలెను? నా శాంతిని నాశనము చేసి, నా ఆత్మను బాధపెట్టుటకు నా హృదయములో అపవాది చోటు కలిగియుండునట్లు, నేనెందుకు శోధనలకు లోబడవలెను? నా శత్రువును బట్టి నేనెందుకు కోపముగానుంటిని?

28 నా ప్రాణమా మేలుకొనుము! ఎంతమాత్రము పాపములో కృంగకుము. నా హృదయమా ఆనందించుము, నా ఆత్మ యొక్క శత్రువునకు మరెన్నడూ స్థానమునియ్యకుము.

29 నా శత్రువులను బట్టి మరలా కోపముతో ఉండకుము. నా బాధలను బట్టి నా శక్తిని క్షీణింపజేయకుము.

30 నా హృదయమా ఆనందించుము, ప్రభువుకు మొరపెట్టి చెప్పుము: ఓ ప్రభువా, నేను నిన్ను నిత్యము స్తుతించెదను; నా దేవా, నా రక్షణ దుర్గమా, నా ఆత్మ నీ యందు ఆనందించును.

31 ఓ ప్రభువా, నీవు నా ఆత్మను విమోచించవా? నా శత్రువుల హస్తములలో నుండి నన్ను విడిపించవా? పాపము అగుపించినంతనే నేను వణుకునట్లు చేయవా?

32 నా హృదయము విరిగి, నా ఆత్మ నలిగినది గనుక పాతాళలోక ద్వారములు నా యెదుట నిరంతరము మూసియుండును గాక! ఓ ప్రభువా, నేను సమమైన దారి యందు ఖచ్చితముగా ఉండునట్లు, పల్లమైన లోయ మార్గమందు నేను నడచునట్లు, నీ నీతి ద్వారములను నా యెదుట మూయకుము.

33 ఓ ప్రభువా, నీ నీతి అను అంగీని నాకు ధరింపజేయవా! ఓ ప్రభువా, నా శత్రువుల యెదుట నేను తప్పించుకొనుటకు మార్గమును కలుగజేయవా! నా మార్గమును నా యెదుట నీవు తిన్నగా చేయవా! నా మార్గమందు అవరోధముంచక నా యెదుట నా మార్గమును సరాళము చేయవా, నా మార్గమును కాక నా శత్రువుల మార్గములను అడ్డగించవా!

34 ఓ ప్రభువా! నేను నీ యందు నమ్మికయుంచియున్నాను మరియు నేను శాశ్వతముగా నీ యందు నమ్మికయుంచెదను; శరీరబాహువందు నేను నమ్మికయుంచను. ఏలయనగా, శరీరబాహువందు నమ్మికయుంచు వాడు శాపగ్రస్థుడని నేనెరుగుదును. నరునియందు నమ్మికయుంచువాడు లేదా శరీరమును తన బాహువుగా చేసుకొనువాడు శాపగ్రస్థుడు.

35 అడుగువానికి దేవుడు ధారాళముగా ఇచ్చునని నేనెరుగుదును. సరియైన దానిని నేను అడిగిన యెడల నా దేవుడు నాకు ఇచ్చును. కావున, నేను నా స్వరమును నీకై ఎలుగెత్తెదను. నా దేవా, నా నీతి శైలమా, నేను నీకు మొరపెట్టెదను. నా దుర్గమా, శాశ్వతుడవైన నా దేవా, నా స్వరము నీ యొద్దకు నిత్యము ఆరోహణమగును. ఆమేన్‌.