లేఖనములు
2 నీఫై 9


9వ అధ్యాయము

యూదులు వారి వాగ్దానదేశములన్నిటిలో సమకూర్చబడుదురని జేకబ్ వివరించును—ప్రాయశ్చిత్తము, పతనము నుండి మనుష్యుని విమోచించును—సమాధి నుండి మరణించిన వారి శరీరములు మరియు నరకము నుండి, పరదైసు నుండి వారి ఆత్మలు బయటకు వచ్చును—వారు తీర్పు తీర్చబడుదురు—మరణము, నరకము, అపవాది మరియు అంతము లేని బాధ నుండి ప్రాయశ్చిత్తము రక్షించును—నీతిమంతులు దేవుని రాజ్యములో రక్షింపబడుదురు—పాపముల కొరకు దండనములు చెప్పబడినవి—ఇశ్రాయేలు పరిశుద్ధుడే ద్వారకాపరి. సుమారు క్రీ. పూ. 559–545 సం.

1 నా ప్రియమైన సహోదరులారా, ప్రభువు ఇశ్రాయేలు వంశస్థులందరితో చేసియున్న నిబంధనలను గూర్చి మీరు తెలుసుకొనునట్లు నేను ఈ వాక్యములను చదివియున్నాను—

2 ఆది నుండి ఇప్పటి వరకు, తరతరములకు వారు దేవుని యొక్క నిజమైన సంఘమునకు, సమూహమునకు పునఃస్థాపించబడు సమయము వచ్చు వరకు, వారు వారి స్వాస్థ్యమైన దేశములలో సమకూర్చబడి, వారి వాగ్దానదేశములన్నిటిలో స్థాపించబడు వరకు యూదులకు తన పరిశుద్ధ ప్రవక్తల నోటి ద్వారా ఆయన పలికెను.

3 నా ప్రియమైన సహోదరులారా, ప్రభువైన దేవుడు మీ పిల్లలపై దయచేయు ఆశీర్వాదములను బట్టి మీరు ఆనందించి, నిరంతరము మీ తలలను పైకెత్తుకొనెదరని నేను ఈ వాక్యములను మీతో చెప్పుచున్నాను.

4 ఏలయనగా, మీలో అనేకులు రాబోవు సంఘటనలను గూర్చి తెలుసుకొనవలెనని బాగా వెదికియున్నారని నేనెరుగుదును. అందువలన, మన శరీరము నశించిపోయి మరణించవలెనని, అయినను మన శరీరముల యందు మనము దేవుడిని చూచెదమని మీరెరుగుదురని నేనెరుగుదును.

5 మనము విడిచి వచ్చిన ఆ యెరూషలేములోనున్న వారికి శరీరమందు ఆయన తననుతాను ప్రత్యక్షపరచుకొనునని మీరెరుగుదురని నేనెరుగుదును; ఏలయనగా, అది వారి మధ్యనగుట అవసరమని విశదపరచబడెను; మనుష్యులందరు ఆయనకు లోబడునట్లు శరీరమందు ఆయన మనుష్యుని ఆధీనమగుటకు తననుతాను అనుమతించి మనుష్యులందరి కొరకు చనిపోవుట ఆ గొప్ప సృష్టికర్తకు తగును.

6 ఆ గొప్ప సృష్టికర్త యొక్క కనికరము గల ప్రణాళికను నెరవేర్చుటకు మనుష్యులందరికి మరణము సంభవించెను, గనుక పునరుత్థానము యొక్క శక్తి అవసరమాయెను మరియు పునరుత్థానము మనుష్యునికి పతనము మూలముగా రావలెను; పతనము అతిక్రమము మూలముగా వచ్చెను; నరులు పతనమయిరి గనుక వారు ప్రభువు సన్నిధి నుండి కొట్టివేయబడిరి.

7 అందువలన, ఒక అనంతమైన ప్రాయశ్చిత్తము అవసరమైయుండెను—అది ఒక అనంతమైన ప్రాయశ్చిత్తమైతే తప్ప ఈ క్షయత, అక్షయతను ధరించుకొనలేదు; కావున, మనుష్యునిపై వచ్చిన మొదటి తీర్పు అనంతకాలము పాటు నిలిచియుండేది; ఆలాగైన, ఈ శరీరము కుళ్ళి, కృశించి తిరిగి లేవకుండునట్లు భూమిలో ఉంచబడియుండును.

8 ఆహా! దేవుని జ్ఞానము, ఆయన కనికరము మరియు కృప ఎంత గొప్పవి! ఏలయనగా శరీరము ఇక తిరిగి లేవని యెడల, నిత్యదేవుని సన్నిధి నుండి ఇకపై లేవకుండునట్లు పడిపోయి అపవాదియైన ఆ దేవదూతకు మన ఆత్మలు ఆధీనము కావలెను.

9 మన ఆత్మలు అతని వలే అయ్యుండును మరియు అబద్ధముల యొక్క తండ్రితోపాటు అతని వలే దుఃఖించుటకు మన దేవుని సన్నిధి నుండి గెంటివేయబడి మనము అపవాదులమగుదుము; మన మొదటి తల్లిదండ్రులను మోసపుచ్చి, తానే వెలుగుదూత వేషము ధరించుకొని హత్యలు, సకల విధములైన అంధకార రహస్యక్రియలను జరిగించునట్లు నరుల సంతానమును రహస్య కూడికలకు పురిగొల్పు అపవాదికి దూతలమగుదుము.

10 ఆహా! మన దేవుని మంచితనము ఎంత గొప్పది! ఈ భయంకరమైన రాక్షసుడు, అనగా శరీరము యొక్క మరణము మరియు ఆత్మ యొక్క మరణము అని కూడా నేను పిలుచు మరణము మరియు నరకమైన ఆ రాక్షసుడి ఆధీనము నుండి మనము తప్పించుకొనుటకు ఆయన మార్గము సిద్ధపరచును.

11 ఇశ్రాయేలు పరిశుద్ధుడైన మన దేవుని యొక్క విడుదల మార్గమును బట్టి, నేను చెప్పిన ఐహిక మరణము తన మృతులను అప్పగించివేయును. ఆ మరణమే సమాధి.

12 మరియు నేను చెప్పిన ఆత్మీయ మరణము తన మృతులను అప్పగించివేయును; ఆ ఆత్మీయ మరణమే నరకము; అందువలన, మరణము మరియు నరకము తమ మృతులను అప్పగించివేయవలెను. నరకము తన చెరలోనున్న ఆత్మలను అప్పగించవలెను మరియు సమాధి తన చెరలోనున్న శరీరములను అప్పగించవలెను. ఇశ్రాయేలు పరిశుద్ధుని యొక్క పునరుత్థాన శక్తి చేత మనుష్యుల శరీరములు మరియు ఆత్మలు ఒకదానికొకటి పునఃస్థాపించబడును.

13 ఆహా! మన దేవుని ప్రణాళిక ఎంత గొప్పది! ఏలయనగా, మరొక ప్రక్క దేవుని యొక్క పరదైసు నీతిమంతుల ఆత్మలను అప్పగించవలెను మరియు సమాధి నీతిమంతుల శరీరములను అప్పగించవలెను; ఆత్మ మరియు శరీరము తిరిగి ఒకదానితో ఒకటి పునఃస్థాపించబడును, మనుష్యులందరు అక్షయులు, అమర్త్యులు అగుదురు; వారు శరీరమందున్న మన వలే పరిపూర్ణ జ్ఞానము కలిగియున్న జీవాత్మలు. మనము అమర్త్యులమైనప్పుడు మన జ్ఞానము పరిపూర్ణమగును.

14 అందువలన, మనము మన సమస్త అపరాధము, అపవిత్రత, దిగంబరత్వము యొక్క పరిపూర్ణ జ్ఞానము కలిగియుండెదము; నీతిమంతులు పవిత్రతను, నీతి యొక్క అంగీని ధరించుకొన్నవారైయుండి వారి ఆనందము, వారి నీతి యొక్క పరిపూర్ణ జ్ఞానము కలిగియుండెదరు.

15 మనుష్యులందరు అమర్త్యులగునట్లు ఈ మొదటి మరణము నుండి జీవములోనికి వెళ్ళినప్పుడు, వారు ఇశ్రాయేలు పరిశుద్ధుని యొక్క తీర్పు సింహాసనము యెదుట అగుపించవలెను; అప్పుడు తీర్పు వచ్చును మరియు దేవుని పరిశుద్ధ తీర్పును బట్టి వారు తీర్పు తీర్చబడుదురు.

16 నిశ్చయముగా ప్రభువు జీవముతోడు, నీతిమంతులైన వారు ఇంకనూ నీతిమంతులుగా మరియు అపవిత్రులు ఇంకనూ అపవిత్రులుగా ఉందురు అనునది ఆయన నిత్య వాక్యము, అది గతించిపోదు; ఏలయనగా, ప్రభువైన దేవుడు దానిని పలికెను; అందువలన అపవిత్రులుగా ఉన్నవారు అపవాది, అతని దూతలైయున్నారు; వారి కొరకు సిద్ధము చేయబడిన నిత్యాగ్నిలోనికి వారు వెళ్ళిపోవుదురు; వారి బాధ అగ్ని గంధకములుగల గుండము వలెనుండును; దాని జ్వాల అంతము లేకుండా నిరంతరము ఆరోహణమగును.

17 ఆహా! మన దేవుని గొప్పతనము మరియు న్యాయము ఎంత గొప్పవి! ఏలయనగా, ఆయన తన మాటలన్నిటిని నెరవేర్చును, అవి ఆయన నోటి నుండి బయలువెళ్ళెను మరియు ఆయన ధర్మశాస్త్రము తప్పక నేరవేర్చబడవలెను.

18 అయితే నీతిమంతులు, ఇశ్రాయేలు పరిశుద్ధుని యొక్క పరిశుద్ధులూ, ఇశ్రాయేలు పరిశుద్ధుని యందు విశ్వాసముంచిన వారు, లోకము యొక్క సిలువలను భరించిన వారు మరియు దాని అవమానమును లెక్కచేయని వారు వారి కొరకు లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధము చేయబడిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురు మరియు వారి సంతోషము నిత్యము సంపూర్ణముగా ఉండును.

19 ఆహా! మన దేవుడైన ఇశ్రాయేలు పరిశుద్ధుని కనికరము ఎంత గొప్పది! ఏలయనగా, ఆయన తన పరిశుద్ధులను ఆ భయంకర రాక్షసుడైన అపవాది నుండి, మరణము మరియు నరకము నుండి, అంతము లేని బాధ అయిన అగ్ని గంధకములు గల గుండము నుండి విడిపించును.

20 ఆహా! మన దేవుని పరిశుద్ధత ఎంత గొప్పది! ఏలయనగా, ఆయన సమస్త విషయములను ఎరుగును మరియు ఆయన ఎరుగనిదేదియూ లేదు.

21 వారు ఆయన స్వరమును ఆలకించిన యెడల, మనుష్యులందరినీ రక్షించునట్లు ఆయన లోకములోనికి వచ్చును; ఏలయనగా ఆయన మనుష్యులందరి బాధలను, అనగా ఆదాము కుటుంబమునకు చెందిన పురుషులు, స్త్రీలు, పిల్లలు మరియు జీవించు ప్రతి ప్రాణి యొక్క బాధలను అనుభవించును.

22 పునరుత్థానము మనుష్యులందరికి వచ్చునట్లు, ఆ గొప్ప తీర్పు దినమున అందరూ ఆయన యెదుట నిలువబడునట్లు ఆయన దీనిని అనుభవించును.

23 మరియు ఇశ్రాయేలు పరిశుద్ధుని యందు వారు పరిపూర్ణ విశ్వాసము కలిగియుండి, పశ్చాత్తాపపడి ఆయన నామమందు బాప్తిస్మము పొందవలెనని మనుష్యులందరిని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు, లేని యెడల వారు దేవుని రాజ్యములో రక్షింపబడలేరు.

24 వారు పశ్చాత్తాపపడక, ఆయన నామమందు విశ్వసించక, ఆయన నామమందు బాప్తిస్మము పొందక, అంతము వరకు స్థిరముగా ఉండని యెడల, వారు నాశనము చేయబడుదురు; ఏలయనగా, ప్రభువైన దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధుడు దీనిని పలికెను.

25 అందువలన, ఆయన ఒక ధర్మశాస్త్రమునిచ్చెను; ధర్మశాస్త్రము లేనిచోట శిక్ష ఉండదు; శిక్ష లేనిచోట దోషారోపణ ఉండదు; మరియు దోషారోపణ లేనిచోట ఇశ్రాయేలు పరిశుద్ధుని ప్రాయశ్చిత్తమును బట్టి ఆయన కనికరములు వారిపై హక్కు కలిగియుండును; ఏలయనగా, ఆయన శక్తి ద్వారా వారు విడుదల పొందియున్నారు.

26 ధర్మశాస్త్రము ఇవ్వబడని వారందరి కొరకు ప్రాయశ్చిత్తము ఆయన న్యాయపు అక్కరలను సంతృప్తిపరుచును, దానినిబట్టి వారు ఆ భయంకర రాక్షసుడైన అపవాది నుండి, మరణము మరియు నరకము నుండి, అంతము లేని బాధ అయిన అగ్ని గంధకములు గల గుండము నుండి విడిపించబడుదురు; వారికి జీవమునిచ్చిన ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవునికి పునఃస్థాపించబడుదురు.

27 కానీ, ధర్మశాస్త్రము ఇయ్యబడిన వానికి ఆపద, ముఖ్యముగా మన వలే దేవుని ఆజ్ఞలన్నీ కలిగియుండి, వాటిని అతిక్రమించి, తన పరిశీలనా దినములను వృధాచేయు వానికి ఆపద. ఏలయనగా, అతని స్థితి ఘోరముగా ఉండును.

28 ఆ దుష్టుని ప్రణాళిక ఎంత యుక్తిగలది! అయ్యో మనుష్యుల అహంకారము, దౌర్భల్యములు మరియు బుద్ధిహీనత! వారు జ్ఞానము కలిగియున్న యెడల, తాము వివేకవంతులమని తలచి దేవుని ఉపదేశమును ఆలకించక, అన్నీ తమకే తెలుసునని ఊహించుకొని వారు దానిని తిరస్కరించుదురు; అందువలన, వారి జ్ఞానము బుద్ధిహీనమైనదై వారికి ప్రయోజనము కలిగించక వారు నశించెదరు.

29 కానీ, వారు దేవుని ఉపదేశములను ఆలకించిన యెడల, జ్ఞానము కలిగియుండుట మంచిది.

30 కానీ, ఈ లోకపు విషయములను బట్టి ఐశ్వర్యవంతులైన ధనవంతులకు ఆపద. ఏలయనగా, వారు ఐశ్వర్యవంతులైన కారణము చేత వారు పేదలను తృణీకరించెదరు, సాత్వీకులను హింసించెదరు మరియు వారి హృదయములు వారి నిధులపైనున్నవి. అందువలన, వారి ఐశ్వర్యమే వారి దేవుడు మరియు ఇదిగో, వారి ఐశ్వర్యము వారితోపాటు నశించిపోవును.

31 వినని చెవిటి వారికి ఆపద; ఏలయనగా, వారు నశించెదరు.

32 చూడని గృడ్డి వారికి ఆపద; ఏలయనగా, వారు కూడా నశించెదరు.

33 హృదయ సున్నతి లేని వారికి ఆపద, ఏలయనగా అంత్యదినమున వారి దోషముల జ్ఞానము వారిని మొత్తును.

34 అబద్ధికునికి ఆపద, ఏలయనగా అతడు నరకములోనికి త్రోయబడును.

35 ఉద్దేశ్యపూర్వకముగా హత్యచేయువానికి ఆపద, ఏలయనగా అతడు మరణించును.

36 వ్యభిచారము చేయు వారికి ఆపద, ఏలయనగా వారు నరకములోనికి త్రోయబడుదురు.

37 విగ్రహములను ఆరాధించు వారికి ఆపద, ఏలయనగా అపవాదులందరికి అపవాదియైన వాడు వారి యందు ఆనందించును.

38 క్లుప్తముగా, వారి పాపముల యందు చనిపోవు వారందరికి ఆపద; ఏలయనగా, వారు దేవుని యొద్దకు తిరిగి వచ్చి, ఆయన ముఖమును చూచి, వారి పాపములలోనే నిలిచియుందురు.

39 ఓ నా ప్రియమైన సహోదరులారా, ఆ పరిశుద్ధ దేవునికి వ్యతిరేకముగా అతిక్రమము చేయుట ఎంత భయంకరమో మరియు ఆ మోసగాని ఆకర్షణలకు లోబడుట ఎంత భయంకరమో కూడా జ్ఞాపకము చేసుకొనుడి. శరీరానుసారమైన మనస్సు మరణమైయున్నదని, ఆత్మానుసారమైన మనస్సు నిత్యజీవమైయున్నదని జ్ఞాపకముంచుకొనుడి.

40 ఓ నా ప్రియమైన సహోదరులారా, నా మాటలకు చెవి యొగ్గుడి. ఇశ్రాయేలు పరిశుద్ధుని గొప్పతనమును జ్ఞాపకము చేసుకొనుడి; నేను మీకు వ్యతిరేకముగా కఠినమైన మాటలు పలికియున్నానని చెప్పవద్దు; ఏలయనగా మీరు అట్లు చేసిన యెడల, మీరు సత్యమునకు వ్యతిరేకముగా దూషణ చేయుదురు; ఏలయనగా నేను మీ సృష్టికర్త యొక్క మాటలు పలికియుంటిని; సత్యవాక్యములు సమస్త అపవిత్రతకు వ్యతిరేకముగా కఠినమైయున్నవని నేనెరుగుదును; అయితే, నీతిమంతులు వాటికి భయపడరు, ఏలయనగా, వారు సత్యమును ప్రేమించుదురు మరియు కదిలింపబడరు.

41 అప్పుడు, ఓ నా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధుడైన ప్రభువు యొద్దకు రండి; ఆయన మార్గములు నీతివంతమైనవని జ్ఞాపకము చేసుకొనుడి. ఇదిగో, మనుష్యుని కొరకు మార్గము ఇరుకైయున్నది; అయితే అది అతని యెదుట తిన్నని మార్గమైయున్నది మరియు ఇశ్రాయేలు పరిశుద్ధుడే ద్వారకాపరియైయుండి అక్కడ ఎట్టి సేవకుడిని పనిలో పెట్టడు; ఆ ద్వారము తప్ప మరే ఇతర మార్గమూ లేదు; ఏలయనగా ఆయన మోసగింపబడడు; ప్రభువైన దేవుడని ఆయనకు పేరు.

42 తట్టు వానికి ఆయన తెరుచును; జ్ఞానులు, ప్రవీణులు, ఐశ్వర్యవంతులు, వారి ప్రావీణ్యత, వారి జ్ఞానము మరియు వారి ఐశ్వర్యమును బట్టి గర్వించు వారినే ఆయన తృణీకరించును; వారు వీటన్నింటిని విసర్జించి, దేవుని యెదుట తమను బుద్ధిహీనులుగా యెంచుకొని మిక్కిలి వినయము కలిగియుండని యెడల, ఆయన వారికి తెరువడు.

43 కానీ, జ్ఞానులు, వివేకవంతుల సంగతులు వారి నుండి నిత్యము మరుగుపరచబడును—ముఖ్యముగా పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడిన ఆ సంతోషము వారి నుండి మరుగుపరచబడును.

44 ఓ నా ప్రియమైన సహోదరులారా, నా మాటలను జ్ఞాపకముంచుకొనుడి; ఇదిగో నేను నా పైవస్త్రమును తీసి మీ యెదుట దులుపుచున్నాను; సమస్తమును శోధించు ఆయన నేత్రముతో నన్ను పరిశీలించమని నన్ను రక్షించు దేవుడిని ప్రార్థించెదను; కావున మనుష్యులందరు తమ క్రియలను బట్టి తీర్పుతీర్చబడునప్పుడు, నేను నా ఆత్మ నుండి మీ పాపములను దులిపివేసితినని, ఆయన యెదుట నేను ప్రకాశముతో నిలువబడితినని, మీ రక్తము నుండి విడుదల పొందియున్నానని, ఇశ్రాయేలు యొక్క దేవుడు చూచియున్నాడని అంత్యదినమున మీరెరుగుదురు.

45 ఓ నా ప్రియమైన సహోదరులారా, మీ పాపముల నుండి తొలగుడి; మిమ్ములను గట్టిగా బంధించు వాని సంకెళ్ళను విదిల్చివేయుడి; మీ రక్షణ దుర్గమైన ఆ దేవుని యొద్దకు రండి.

46 మీరు తీవ్రమైన భయముతో కృంగిపోకుండునట్లు, మీ ఘోరమైన దోషమును సంపూర్ణముగా జ్ఞాపకము చేసుకొనకుండునట్లు నీతిమంతులకు న్యాయము చేయబడు ఆ మహిమకరమైన దినము కొరకు, ఆ తీర్పు దినము కొరకు మీ ఆత్మలను సిద్ధపరచుకొనుడి మరియు సర్వశక్తిమంతుడవగు ప్రభువైన దేవా, నీ తీర్పులు పరిశుద్ధమైనవి, పరిశుద్ధమైనవి—కానీ నేను నా దోషము నెరుగుదును; నీ ధర్మశాస్త్రమును నేను అతిక్రమించితిని, నా అతిక్రమములు నావే; మరియు నేను అతని భయంకరమైన దౌర్భాగ్యమునకు ఎరగా ఉండునట్లు అపవాది నన్ను పొందెనని బిగ్గరగా చెప్పుటకు బలవంతము చేయబడకుండునట్లు సిద్ధపరచుకొనుడి.

47 కానీ నా సహోదరులారా, ఈ విషయముల యొక్క భయంకరమైన వాస్తవమునకు నేను మిమ్ములను మేలుకొలుపుట అవసరమా? మీ మనస్సులు శుద్ధమైన యెడల, నేను మీ ఆత్మలను బాధపెట్టుదునా? మీరు పాపము నుండి విముక్తులైన యెడల, సత్యము యొక్క సరళతను బట్టి నేను మీతో సరళముగా ఉండనా?

48 ఇదిగో మీరు పరిశుద్ధులైయున్న యెడల, నేను మీతో పరిశుద్ధతను గూర్చి మాట్లాడుదును; కానీ మీరు పరిశుద్ధులు కానందున, మీరు నన్ను ఉపదేశకునిగా చూచుచున్నందున, పాపము యొక్క పర్యవసానములను గూర్చి నేను మీకు బోధించుట అవసరమైయున్నది.

49 ఇదిగో, నా ఆత్మ పాపమును ద్వేషించును, నా హృదయము నీతియందు ఆనందించును మరియు నేను నా దేవుని పరిశుద్ధ నామమును స్తుతించెదను.

50 రండి, నా సహోదరులారా, దప్పిగొనినవారలారా, నీళ్ళయొద్దకు రండి; రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి; రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి.

51 కావున, విలువ లేని దాని కొరకు ధనమును లేదా తృప్తిపరచని దాని కొరకు మీ శ్రమను వెచ్చించకుడి; నా మాట జాగ్రత్తగా ఆలకించుడి, నేను పలికన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి; ఇశ్రాయేలు పరిశుద్ధుని యొద్దకు రండి, నశించని లేదా పాడుకాని దానితో విందు చేసుకొనుడి, మరియు మీ ప్రాణము సారమైనదానియందు సుఖింపనియ్యుడి.

52 ఇదిగో నా ప్రియమైన సహోదరులారా, మీ దేవుని మాటలను జ్ఞాపకము చేసుకొనుడి; పగటి యందు నిరంతరము ఆయనకు ప్రార్థించుడి మరియు రాత్రి యందు ఆయన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మీ హృదయములను ఆనందించనియ్యుడి.

53 ఇదిగో, ప్రభువు నిబంధనలు ఎంత గొప్పవి మరియు నరుల సంతానము యెడల ఆయన నమ్రత ఎంత గొప్పది; మన సంతానము శరీరమును బట్టి పూర్తిగా నాశనము చేయబడరని, ఆయన వారిని కాపాడునని; భవిష్యత్తులో వారు ఇశ్రాయేలు వంశస్థులకు ఒక నీతివంతమైన కొమ్మయగుదురని ఆయన గొప్పతనము, కృపాకనికరములను బట్టి ఆయన మనకు వాగ్దానము చేసియున్నాడు.

54 ఇప్పుడు, నా సహోదరులారా, నేనింకనూ మీతో మాట్లాడెదను. కానీ మిగిలిన నా మాటలను నేను మరునాడు మీకు ప్రకటించెదను. ఆమేన్‌.