లేఖనములు
4 నీఫై 1


నాలుగవ నీఫై

నీఫై గ్రంథము
యేసు క్రీస్తు శిష్యులలో ఒకడైన నీఫై యొక్క కుమారుడు

అతని వృత్తాంతమును బట్టి నీఫై జనుల యొక్క వృత్తాంతము

1వ అధ్యాయము

నీఫైయులు మరియు లేమనీయులు అందరు ప్రభువుకు పరివర్తన చెందెదరు—వారు సమస్త వస్తువులను ఉమ్మడిగా కలిగియుందురు, అద్భుతములను చేసెదరు మరియు దేశములో వర్ధిల్లుదురు—రెండు శతాబ్దముల తర్వాత విభజనలు, చెడుతనములు, అబద్ధ సంఘములు మరియు హింసలు కలుగును—మూడు వందల సంవత్సరముల తర్వాత నీఫైయులు మరియు లేమనీయులు ఇరువురు దుష్టులగుదురు—అమ్మరోన్‌ పవిత్ర వృత్తాంతములను దాచివేయును. సుమారు క్రీ. శ. 35–321 సం.

1 ముప్పది నాలుగవ సంవత్సరము గతించిపోయెను, ముప్పది ఐదు కూడా మరియు యేసు యొక్క శిష్యులు చుట్టూ ఉన్న దేశములన్నిటిలో క్రీస్తు సంఘమును స్థాపించిరి. వారి యొద్దకు వచ్చి, తమ పాపముల నిమిత్తము నిజముగా పశ్చాత్తాపపడిన వారందరు యేసు నామమందు బాప్తిస్మము పొందిరి; వారు పరిశుద్ధాత్మను కూడా పొందిరి.

2 ముప్పది ఆరవ సంవత్సరమందు నీఫైయులు మరియు లేమనీయులు ఇరువురు, దేశమంతటానున్న జనులందరు ప్రభువుకు పరివర్తన చెందిరి; వారి మధ్య ఏ వివాదములు, తగవులు లేకుండెను మరియు ప్రతి మనుష్యుడు ఒకనితోనొకడు న్యాయముగా వ్యవహరించెను.

3 వారు అన్ని వస్తువులను వారి మధ్య ఉమ్మడిగా కలిగియుండిరి; కావున అక్కడ ధనవంతులని, పేదవారని, దాసులని, స్వతంత్రులని ఎవ్వరూ లేకయుండిరి, కానీ వారందరు స్వతంత్రులుగా మరియు పరలోకపు బహుమానమందు పాలిభాగస్థులుగా చేయబడిరి.

4 ముప్పది ఏడవ సంవత్సరము కూడా గతించిపోయెను మరియు దేశమందు ఇంకను సమాధానముండుట కొనసాగెను.

5 యేసు యొక్క శిష్యుల ద్వారా గొప్ప అద్భుతకార్యములు చేయబడెను, ఎంతగాననగా వారు రోగులను స్వస్థపరచిరి, మృతులను లేపిరి, కుంటివారు నడచునట్లును గృడ్డివారు చూపును పొందునట్లును చెవిటివారు వినునట్లును చేసిరి; మరియు అన్ని రకములైన అద్భుతములను నరుల సంతానము మధ్య వారు చేసిరి; వారు యేసు నామమందు తప్ప, మరి దేనియందును అద్భుతములను చేయలేదు.

6 ఆ విధముగా ముప్పది ఎనిమిదవ సంవత్సరము గతించిపోయెను, ముప్పది తొమ్మిది మరియు నలుబది ఒకటి, నలుబది రెండు, నలుబది తొమ్మిది సంవత్సరములు గతించిపోవు వరకు మరియు ఏబది ఒకటి, ఏబది రెండు, ఏబది తొమ్మిది సంవత్సరములు గతించిపోవు వరకు కూడా అట్లుండెను.

7 మరియు ప్రభువు వారిని దేశమందు మిక్కిలి వర్థిల్లజేసెను; ఎంతగాననగా, పట్టణములు కాల్చివేయబడినచోట వారు తిరిగి ఆ పట్టణములను నిర్మించిరి.

8 ఆ గొప్ప పట్టణమైన జరహేమ్ల కూడా తిరిగి నిర్మించబడునట్లు వారు చేసిరి.

9 కానీ ముంచి వేయబడిన పట్టణములు అనేకముండెను, వాటి స్థానములో జలములు పైకి వచ్చియుండెను; కావున, ఆ పట్టణములు తిరిగి నిర్మించబడలేకపోయెను.

10 ఇప్పుడు నీఫై యొక్క జనులు బలముగా ఎదిగి, మిక్కిలి వేగముగా వృద్ధి చెందిరి మరియు మిక్కిలి సుందరమైన, ఆహ్లాదకరమైన జనులైరి.

11 వారు వివాహమాడిరి, వివాహమునకివ్వబడిరి మరియు ప్రభువు వారితో చేసిన అనేక వాగ్దానములను బట్టి ఆశీర్వదింపబడిరి.

12 వారికమీదట మోషే ధర్మశాస్త్రము యొక్క నిర్వహణలు మరియు విధులను అనుసరించి నడుచుకొనలేదు; కానీ ఉపవాసములో, ప్రార్థనలో మరియు ప్రార్థన చేయుటకు, ప్రభువు యొక్క వాక్యము వినుటకు తరచుగా సమకూడుటలో కొనసాగుచూ వారి ప్రభువు మరియు వారి దేవుని నుండి పొందిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిరి.

13 ఇప్పుడు దేశమంతటా జనులందరి మధ్య ఏ వివాదము లేకుండెను; కానీ, యేసు యొక్క శిష్యుల మధ్య గొప్ప అద్భుతములు చేయబడెను.

14 డెబ్బది ఒకటవ సంవత్సరము గతించిపోయెను మరియు డెబ్బది రెండవ సంవత్సరము కూడా, క్లుప్తముగా డెబ్బది తొమ్మిదవ సంవత్సరము గతించిపోవు వరకు అట్లుండెను; నూరు సంవత్సరములు గతించిపోయెను మరియు యేసు ఎన్నుకొనిన తన శిష్యులలో నిలిచియుండవలసిన ముగ్గురు తప్ప, అందరు దేవుని యొక్క పరదైసునకు వెళ్ళిపోయిరి; వారి స్థానములో ఇతర శిష్యులు నియమింపబడిరి; మరియు ఆ తరములో అనేకులు గతించిపోయిరి.

15 ఇప్పుడు జనుల హృదయములలో గల దేవుని ప్రేమను బట్టి, దేశమందు ఎట్టి వివాదము లేకుండెను.

16 ఎట్టి అసూయలు, జగడములు, అల్లర్లు, జారత్వములు, అబద్ధములు, హత్యలు లేదా ఏ విధమైన కాముకత్వము లేకుండెను; నిశ్చయముగా, దేవుని హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు.

17 అక్కడ దొంగలు లేదా హంతకులు లేరు, లేమనీయులు లేరు లేదా ఏ విధమైన -ఈయులు లేరు; కానీ వారు ఒక్కటిగా, క్రీస్తు యొక్క సంతానముగా మరియు దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండిరి.

18 వారెంత ధన్యులు! వారి పనులన్నిటిలో ప్రభువు వారిని ఆశీర్వదించెను; నూటపది సంవత్సములు గతించిపోవు వరకు వారు ఆశీర్వదింపబడి, వర్థిల్లిరి; క్రీస్తు దర్శించిన తరువాత గల మొదటి తరము గతించిపోయెను మరియు దేశమంతటా ఏ వివాదము లేకుండెను.

19 ఈ చివరి వృత్తాంతమును భద్రపరచిన నీఫై (అతడు దానిని నీఫై పలకలపై భద్రపరిచెను) మరణించెను మరియు అతని కుమారుడు ఆమోస్ అతని స్థానములో దానిని భద్రపరిచెను; అతడు కూడా దానిని నీఫై పలకలపై భద్రపరిచెను.

20 అతడు దానిని ఎనుబది నాలుగు సంవత్సరములు భద్రపరిచెను మరియు సంఘముపై తిరుగుబాటు చేసి తమపై లేమనీయులు అను పేరును తీసుకొనిన జనుల యొక్క చిన్న భాగము తప్ప, దేశమందు ఇంకను సమాధానముండెను; కావున, దేశమందు మరలా లేమనీయులుండుట ప్రారంభమాయెను.

21 ఆమోస్ కూడా మరణించెను (క్రీస్తు వచ్చినప్పటి నుండి నూట తొంబది నాలుగు సంవత్సరములైయుండెను) మరియు అతని స్థానములో అతని కుమారుడైన ఆమోస్ వృత్తాంతమును భద్రపరిచెను; అతడు కూడా దానిని నీఫై పలకలపై భద్రపరిచెను; అది కూడా ఈ గ్రంథమైన నీఫై గ్రంథములో వ్రాయబడెను.

22 ఇప్పుడు రెండు వందల సంవత్సరములు గతించిపోయెను మరియు కొద్దిమంది తప్ప, రెండవ తరమంతా గతించిపోయెను.

23 జనులు వృద్ధి పొందిరని, వారు దేశమంతటా వ్యాపించిరని మరియు క్రీస్తునందు వారు వర్ధిల్లుటను బట్టి వారు మిక్కిలి ధనవంతులైరని మీరు తెలుసుకొనవలెనని మోర్మన్‌ అను నేను కోరుచున్నాను.

24 ఇప్పుడు, ఈ రెండు వందల ఒకటవ సంవత్సరమందు ఖరీదైన వస్త్రములు, అన్ని రకముల శ్రేష్ఠమైన ముత్యములు మరియు లోకములోనున్న ప్రశస్తమైన వాటిని ధరించుచు గర్వమందు పైకెత్తబడిన వారు వారి మధ్య ఉండిరి.

25 ఆ సమయము నుండి వారికమీదట వారి వస్తువులను, వారి సామగ్రిని ఉమ్మడిగా కలిగియుండలేదు.

26 మరియు వారు వర్గములుగా విభజింపబడసాగిరి; లాభము సంపాదించుటకు వారు తమ కొరకు సంఘములను నిర్మించుట మొదలుపెట్టి, క్రీస్తు యొక్క నిజమైన సంఘమును తిరస్కరించసాగిరి.

27 రెండు వందల పది సంవత్సరములు గతించి పోయినప్పుడు, దేశమందు అనేక సంఘములుండెను; అనగా, క్రీస్తును ఎరిగియున్నామని చెప్పుకొన్న అనేక సంఘములుండెను; అయినప్పటికీ, అవి ఆయన సువార్త యొక్క అధిక భాగములను తిరస్కరించెను, ఎంతగాననగా అవి అన్ని రకములైన దుష్టత్వమును అనుమతించెను మరియు అయోగ్యత మూలముగా పరిశుద్ధమైనది నిషేధింపబడిన వానికి దానిని ఇచ్చెను.

28 దుర్నీతిని బట్టి మరియు వారి హృదయములపై పట్టు సంపాదించిన సాతాను యొక్క శక్తిని బట్టి, ఈ సంఘము మిక్కిలి వృద్ధి చెందెను.

29 మరలా, క్రీస్తును తిరస్కరించిన మరియొక సంఘము అక్కడుండెను; వారి వినయము మరియు క్రీస్తు నందు వారి విశ్వాసమును బట్టి, క్రీస్తు యొక్క నిజమైన సంఘమును వారు హింసించిరి; వారి మధ్య చేయబడిన అనేక అద్భుతములను బట్టి వారిని ద్వేషించిరి.

30 కావున, వారు తమతో ఉన్న యేసు యొక్క శిష్యులపై శక్తిని, అధికారమును ఉపయోగించి, వారిని చెరసాలలో వేసిరి; కానీ, వారియందున్న దేవుని వాక్యము యొక్క శక్తి చేత చెరసాలలు రెండుగా విడిపోయెను మరియు వారి మధ్య గొప్ప అద్భుతములను చేయుచూ వారు ముందుకు సాగిరి.

31 అయినను ఈ అద్భుతములన్నీ చేయబడినప్పటికీ, జనులు తమ హృదయములను కఠినపరచుకొని, యెరూషలేమందున్న యూదులు ఆయన వాక్యము ప్రకారము యేసును చంపుటకు ప్రయత్నించినట్లే వారిని చంపుటకు ప్రయత్నించిరి.

32 వారిని అగ్ని గుండములలోనికి పడవేసిరి, అయినను వారెట్టి హానిని పొందక బయటకు వచ్చిరి.

33 వారిని క్రూర మృగముల గుహలలో వేసిరి మరియు వారు ఒక చిన్న పిల్లవాడు గొఱ్ఱెపిల్లతో ఆడునట్లు క్రూరమృగములతో ఆడుకొని, వాటి మధ్య నుండి ఎట్టి హానిని పొందక బయటకు వచ్చిరి.

34 అయినప్పటికీ జనులు తమ హృదయములను కఠినపరచుకొనిరి, ఏలయనగా అనేక సంఘములను నిర్మించుటకు, సమస్త విధములైన దుర్నీతిని చేయుటకు అనేకమంది యాజకులు, అబద్ధ ప్రవక్తల చేత వారు నడిపించబడిరి. వారు యేసు యొక్క జనులను కొట్టిరి; కానీ, యేసు యొక్క జనులు తిరిగి కొట్టలేదు. ఆ విధముగా సంవత్సరము నుండి సంవత్సరమునకు, రెండు వందల ముప్పది సంవత్సరములు గతించిపోవు వరకు వారు దుష్టత్వముతో విశ్వాసమందు క్షీణించిరి.

35 ఇప్పుడు ఈ సంవత్సరమందు, అనగా రెండు వందల ముప్పది ఒకటవ సంవత్సరమందు జనుల మధ్య గొప్ప విభజన జరిగెను.

36 ఈ సంవత్సరమందు నీఫైయులని పిలువబడిన జనులు ఉనికిలోనికి వచ్చిరి, వారు క్రీస్తునందు నిజమైన విశ్వాసము కలిగియుండిరి; లేమనీయులచేత జేకబీయులు, జోసెఫీయులు, జోరమీయులు అని పిలువబడిన వారు వారి మధ్య ఉండిరి;

37 కావున, క్రీస్తునందు నిజమైన విశ్వాసము గలవారు మరియు క్రీస్తు యొక్క నిజమైన ఆరాధికులు (నిలిచియుండవలసిన యేసు యొక్క ముగ్గురు శిష్యులు వారి మధ్యనుండిరి) నీఫైయులు, జేకబీయులు, జోసెఫీయులు మరియు జోరమీయులని పిలువబడిరి.

38 సువార్తను తిరస్కరించిన వారు లేమనీయులు, లెమూయేలీయులు, ఇష్మాయేలీయులని పిలువబడిరి; ఆది నుండి వారి పితరులు తమ విశ్వాసమందు క్షీణించినట్లుగా వారు తమ విశ్వాసమందు క్షీణించలేదు, కానీ వారు ఇష్టపుర్వకముగా క్రీస్తు యొక్క సువార్తకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిరి మరియు విశ్వసించరాదని వారు తమ పిల్లలకు బోధించిరి.

39 ఆదిలో ఉన్నట్లుగానే అది వారి పితరుల యొక్క దుష్టత్వము, హేయక్రియలను బట్టియైయుండెను. ఆదినుండి నీఫై సంతానమును ద్వేషించవలెనని లేమనీయులు బోధింపబడినట్లుగానే, దేవుని సంతానమును ద్వేషించవలెనని వారు బోధింపబడిరి.

40 ఇప్పుడు రెండు వందల నలుబది నాలుగు సంవత్సరములు గతించిపోయెను మరియు జనుల యొక్క వ్యవహారములు ఆ విధముగా ఉండెను. జనులలో అధిక దుష్టులైన వారు బలముగా ఎదిగి, దేవుని జనుల కంటే మిక్కిలి అధిక సంఖ్యాకులైరి.

41 వారు ఇంకను తమ కొరకు సంఘములు నిర్మించి, వాటిని అన్నిరకముల ప్రశస్థమైన వస్తువులతో అలంకరించుట కొనసాగించిరి. ఆ విధముగా, రెండు వందల ఏబది సంవత్సరములు మరియు రెండు వందల అరువది సంవత్సరములు కూడా గతించిపోయెను.

42 జనులలో దుష్టులైనవారు మరలా గాడియాంటన్‌ యొక్క రహస్య ప్రమాణములు, కూడికలను స్థాపించుట మొదలుపెట్టిరి.

43 నీఫై యొక్క జనులని పిలువబడిన జనులు కూడా వారి అధికమైన సంపదలను బట్టి వారి హృదయములలో గర్విష్ఠులగుట మొదలుపెట్టిరి మరియు వారి సహోదరులైన లేమనీయులవలే అహంకారులైరి.

44 ఈ సమయము నుండి శిష్యులు లోకము యొక్క పాపముల నిమిత్తము దుఃఖపడసాగిరి.

45 మూడువందల సంవత్సరములు గతించిపోయినప్పుడు, నీఫై యొక్క జనులు మరియు లేమనీయులు ఇరువురు ఒకరివలె మరొకరు అత్యధిక దుష్టులైరి.

46 ఇప్పుడు గాడియాంటన్‌ దొంగలు దేశమంతటా వ్యాపించిరి; యేసు యొక్క శిష్యులు తప్ప, నీతిమంతులు ఎవరూ లేకుండిరి; జనులు వెండి బంగారములను సమృద్ధిగా దాచిరి మరియు అన్ని రకములైన వర్తకములు చేసిరి.

47 మూడు వందల అయిదు సంవత్సరములు గతించిపోయిన తరువాత (జనులు ఇంకను దుష్టత్వమందు నిలిచియుండిరి) ఆమోస్ మరణించెను మరియు అతని సహోదరుడు అమ్మరోన్‌, అతని స్థానములో వృత్తాంతమును భద్రపరిచెను.

48 మూడు వందల ఇరువది సంవత్సరములు గతించినప్పుడు, అమ్మరోన్‌ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినవాడై పవిత్రమైన వృత్తాంతములను—అనగా క్రీస్తు వచ్చినప్పటి నుండి మూడు వందల ఇరవైయవ సంవత్సరము వరకు తరము నుండి తరమునకు అందించబడిన సమస్త పవిత్ర వృత్తాంతములను దాచివేసెను.

49 ప్రభువు యొక్క ప్రవచనములు మరియు వాగ్దానముల ప్రకారము, యాకోబు వంశము యొక్క శేషమునకు అవి తిరిగి వచ్చునట్లు అతడు వాటిని ప్రభువు కొరకు దాచివేసెను. ఆవిధముగా అమ్మరోన్‌ యొక్క వృత్తాంతము ముగిసెను.