లేఖనములు
ఆల్మా 13


13వ అధ్యాయము

మనుష్యులు తమ అధిక విశ్వాసమును సత్‌క్రియలను బట్టి ప్రధాన యాజకులుగా పిలువబడుదురు—వారు ఆజ్ఞలను బోధించవలెను—నీతి ద్వారా వారు పరిశుద్ధపరచబడి ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించెదరు—వీరిలో మెల్కీసెదెకు ఒకడు—దేవదూతలు దేశమంతటా సువర్తమానములను ప్రకటించుచున్నారు—వాస్తవముగా క్రీస్తు యొక్క రాకడను వారు ప్రకటించెదరు. సుమారు క్రీ. పూ. 82 సం.

1 మరలా నా సహోదరులారా, ప్రభువైన దేవుడు తన సంతానమునకు ఈ ఆజ్ఞలు ఇచ్చినప్పటి సమయమును మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుచున్నాను; ఈ విషయములను బోధించుటకు ప్రభువైన దేవుడు, ఆయన కుమారుని యొక్క క్రమమును అనుసరించి తన పరిశుద్ధ క్రమము చొప్పున యాజకులను నియమించెనని మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుచున్నాను.

2 ఆయన కుమారుని యొక్క క్రమమును బట్టి ఆ యాజకులు నియమించబడియున్నారు, అందునుబట్టి విమోచన నిమిత్తము ఏ విధముగా ఆయన కుమారుని కొరకు ఎదురు చూడవలెనో జనులు తెలుసుకొందురు.

3 వారు నియమింపబడిన విధానమిది—వారి అధిక విశ్వాసమును సత్‌క్రియలను బట్టి, దేవుని యొక్క భవిష్యత్‌ జ్ఞానమును బట్టి, లోకము పునాది వేయబడినప్పటి నుండి వారు పిలువబడి, సిద్ధపరచబడియున్నారు; ముందుగా మంచి లేదా చెడును ఎన్నుకొనుటకు విడువబడియున్నారు; కావున వారు మంచిని ఎన్నుకొని, అత్యధిక విశ్వాసమును అభ్యసించి, ఒక పరిశుద్ధ పిలుపుతో, అనగా అట్టివారి కొరకు సిద్ధపరచబడిన విమోచన ప్రకారము సిద్ధము చేయబడిన ఆ పరిశుద్ధ పిలుపుతో పిలువబడియున్నారు.

4 ఆ విధముగా వారి విశ్వాసమును బట్టి వారు ఈ పరిశుద్ధ పిలుపునకు పిలువబడియున్నారు, ఇతరులు వారి హృదయ కాఠిన్యము మరియు వారి మనస్సుల అంధత్వమును బట్టి దేవుని ఆత్మను తిరస్కరించిరి, అట్లు తిరస్కరించని యెడల, వారి సహోదరుల వలే వారు కూడా గొప్ప విశేషాధికారము కలిగియుండేవారు.

5 లేక క్లుప్తముగా, మొదట వారు తమ సహోదరులతో సమానముగానుండిరి; ఆ విధముగా సిద్ధము చేయబడియున్న ఆ అద్వితీయ కుమారుని ప్రాయశ్చిత్తమందు మరియు ద్వారా, తమ హృదయములను కఠినపరచుకొనని వారి కొరకు లోకము పునాది వేయబడినప్పటి నుండి ఈ పరిశుద్ధ పిలుపు సిద్ధము చేయబడినది.

6 నరుల సంతానము ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించునట్లు వారికి ఆయన ఆజ్ఞలను బోధించుటకు ఈ పరిశుద్ధ పిలుపు ద్వారా ఆ విధముగా పిలువబడిరి మరియు దేవుని పరిశుద్ధ క్రమమును బట్టి ప్రధాన యాజకత్వమునకు నియమించబడిరి—

7 ఈ ప్రధాన యాజకత్వము ఆయన కుమారుని యొక్క క్రమమును బట్టియుండెను, ఆ క్రమము లోకము పునాది వేయబడినప్పటి నుండి ఉండెను; లేదా ఇతర మాటలలో, సమస్త విషయములను గూర్చిన ఆయన భవిష్యత్‌ జ్ఞానమును బట్టి నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు సిద్ధపరచబడి, జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేకయుండెను—

8 ఇప్పుడు వారు ఈ విధముగా నియమించబడియున్నారు—ఒక పరిశుద్ధ పిలుపుతో పిలువబడి, ఒక పరిశుద్ధ విధిచే నియమించబడి, పరిశుద్ధ క్రమమును బట్టి ప్రధాన యాజకత్వమును వారిపై తీసుకొనిరి. ఆ పిలుపు, విధి మరియు ప్రధాన యాజకత్వము ఆది మరియు అంతము లేకయుండెను—

9 ఆ విధముగా వారు జీవితకాలమునకు ఆదియైనను జీవమునకు అంతమైనను లేకయుండి, కృపాసత్యసంపూర్ణుడై న్యాయముతో నిండియున్న తండ్రి యొక్క అద్వితీయ కుమారుని క్రమమును బట్టి శాశ్వతముగా ప్రధాన యాజకులైయుండిరి. అది ఆలాగునైయున్నది. ఆమేన్‌.

10 ఇప్పుడు పరిశుద్ధ క్రమము లేదా ప్రధాన యాజకత్వమును గూర్చి నేను చెప్పినట్లు నియమించబడి, దేవుని యొక్క ప్రధాన యాజకులైన వారు అనేకులుండిరి; అది వారి యొక్క అధిక విశ్వాసము, పశ్చాత్తాపము మరియు దేవుని యెదుట వారి నీతిని బట్టి, నశించిపోవుట కంటె పశ్చాత్తాపపడి నీతిని జరిగించుటకు వారు కోరుకొనుటను బట్టి ఉండెను;

11 కావున, వారు ఈ పరిశుద్ధ క్రమమును బట్టి పిలువబడి పరిశుద్ధపరచబడిరి, వారి వస్త్రములు గొఱ్ఱెపిల్ల యొక్క రక్తము ద్వారా తెల్లగా శుద్ధిచేయబడినవి.

12 ఇప్పుడు వారు, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి, వారి వస్త్రములు తెల్లగా చేయబడి, దేవుని యెదుట శుద్ధముగా మచ్చలేకయుండిన తరువాత పాపము వైపు అసహ్యముతో తప్ప చూడలేరు; శుద్ధిచేయబడి వారి దేవుడైన ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించిన వారు అక్కడ అనేకులు, అత్యధిక సంఖ్యాకులుండిరి.

13 ఇప్పుడు నా సహోదరులారా, మీరు కూడా ఆ విశ్రాంతిలో ప్రవేశించునట్లు దేవుని యెదుట మిమ్ములను మీరు తగ్గించుకొనవలెనని, పశ్చాత్తాపమునకు తగిన ఫలమును ఫలింపవలెనని నేను కోరుచున్నాను.

14 నేను చెప్పిన ఇదే క్రమమును బట్టి ఒక ప్రధాన యాజకుడైయుండి, శాశ్వతముగా తనపై ప్రధాన యాజకత్వమును తీసుకొన్న మెల్కీసెదెకు దినములందున్న జనులవలె కూడా మిమ్ములను మీరు తగ్గించుకొనుడి.

15 అబ్రాహాము దశమ భాగములు చెల్లించినది ఈ మెల్కీసెదెకునకే; ముఖ్యముగా, మన పితరుడైన అబ్రాహాము కూడా తాను కలిగియున్న దానంతటిలో పదియవ భాగమును దశమ భాగముగా చెల్లించెను.

16 ఇప్పుడిది ఆయన క్రమమునకు ఒక గుర్తు అయ్యుండగా లేదా ఆయన క్రమమైయుండగా, దీని ద్వారా జనులు దేవుని కుమారుని కొరకు ఎదురు చూచునట్లు ఈ విధులు ఈవిధముగా ఇవ్వబడెను మరియు ఇది వారి పాపక్షమాపణ నిమిత్తము వారు ఆయన కొరకు ఎదురుచూచుటకు, అందునుబట్టి వారు ప్రభువు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుటకైయుండెను.

17 ఈ మెల్కీసెదెకు, షాలేము దేశపు రాజైయుండెను; అతని జనులు దుర్నీతియందు, హేయక్రియలయందు బలముగా వృద్ధిచెందిరి; వారందరు త్రోవ తప్పిపోయిరి; వారు సకలవిధమైన దుష్టత్వముతో నిండియుండిరి.

18 కానీ బలమైన విశ్వాసమును అభ్యసించి, దేవుని పరిశుద్ధ క్రమమును బట్టి ప్రధాన యాజకత్వపు స్థానమును పొందిన మెల్కీసెదెకు, తన జనులకు పశ్చాత్తాపమును బోధించెను. వారు పశ్చాత్తాపపడిరి మరియు మెల్కీసెదెకు తన దినములలో దేశమందు సమాధానమును స్థాపించెను; కావున అతడు సమాధానకర్త అని పిలువబడెను, అతడు షాలేము యొక్క రాజైయుండి తన తండ్రి క్రింద పరిపాలించెను.

19 అతని ముందు మరియు తరువాత కూడా అనేకులు ఉండిరి, కానీ ఎవరును అతని కంటే గొప్పవారు కారు; కావున అతడిని గూర్చి వారు ప్రత్యేకముగా ఉదహరించిరి.

20 ఇప్పుడు నేను విషయమును వివరముగా చెప్పనవసరములేదు, నేను చెప్పినది చాలును. ఇదిగో లేఖనములు మీ ముందున్నవి; మీరు వాటిని వక్రీకరించిన యెడల, అది మీ నాశనమునకై యుండును.

21 ఆల్మా వారికి ఈ మాటలను చెప్పినప్పుడు, అతడు తన చేతిని వారివైపు చాపి బలమైన స్వరముతో ఎలుగెత్తి ఇట్లు చెప్పెను: పశ్చాత్తాపపడుటకు సమయమిదే. ఏలయనగా రక్షణ దినము సమీపించుచున్నది;

22 మరియు ప్రభువు యొక్క స్వరము దేవదూతల నోటి ద్వారా సమస్త జనములకు దానిని తెలియజేసెను; అనగా, మహా సంతోషకరమైన సువర్తమానములను వారు కలిగియుండునట్లు దానిని తెలియజేసెను; ఈ సువర్తమానములను ఆయన తన జనులందరికి, అనగా భూముఖముపై నలువైపులా చెదిరియున్న వారికి ప్రకటించెను; అందువలన అవి మన యొద్దకు వచ్చినవి.

23 మనము గ్రహించునట్లు, పొరపడకుండునట్లు అవి మనకు స్పష్టమైన మాటలలో తెలియజేయబడినవి; ఇది, పరదేశములో మనము దేశదిమ్మరులమైయుండుటను బట్టియైయుండెను; కావున మనము ఆవిధముగా అధిక అనుగ్రహము పొందియున్నాము, ఏలయనగా మన ద్రాక్షతోట యొక్క అన్ని భాగములలో ఈ సువర్తమానములు మనకు తెలియజేయబడినవి.

24 ఇదిగో, ఈ సమయమున మన దేశమందు అనేకులకు దేవదూతలు దానిని తెలియజేయుచున్నారు; ఇది, ఆయన తన మహిమలో వచ్చు సమయమున ఆయన వాక్యమును అంగీకరించుటకు నరుల సంతానము యొక్క హృదయములను సిద్ధపరచు ఉద్దేశ్యము నిమిత్తమైయున్నది.

25 ఇప్పుడు ఆయన రాకడను గూర్చి దేవదూతల నోటి ద్వారా మనకు తెలియజేయబడిన సంతోషకరమైన వార్తలను వినుటకు మాత్రమే మనము వేచియున్నాము; ఏలయనగా సమయము ఎంత త్వరగా వచ్చునో మనమెరుగము. అది నా దినమున రావలెనని దేవుడిని కోరుచున్నాను; కానీ అది త్వరగానైనా లేదా ఆలస్యముగానైనా రానిమ్ము, దానియందు నేను ఆనందించెదను.

26 మన పితరులలో ఉన్న ప్రవచనాత్మను బట్టి, వారు ఆయనను గూర్చి చెప్పిన దానిని బట్టి వారి మాటలు నెరవేరునట్లు ఆయన రాకడ సమయమున దేవదూతల నోటి ద్వారా అది నీతిమంతులకు పరిశుద్ధులకు తెలియజేయబడును.

27 ఇప్పుడు నా సహోదరులారా, మీరు నా మాటలను ఆలకించవలెనని, మీ పాపములను విడిచి పెట్టవలెనని, మీ పశ్చాత్తాప దినమును వాయిదా వేయరాదని వేదనాభరితమైన ఆతురతతో నా హృదయపు లోతులలో నుండి నేను కోరుచున్నాను.

28 మీరు సహించగలిగిన దానికంటే అధికముగా మీరు శోధింపబడకుండునట్లు దేవుని ఎదుట మిమ్ములను మీరు తగ్గించుకొని ఆయన పరిశుద్ధ నామమున ప్రార్థనచేసి, మెలకువగా ఉండి నిరంతరము ప్రార్థించుదురని మరియు ఆ విధముగా వినయముగలిగి సాత్వీకులుగా, లోబడువారిగా, సహనము గలవారిగా, ప్రేమతో నిండి సమస్త దీర్ఘశాంతము గలవారగునట్లు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడవలెనని;

29 మీరు అంత్యదినమున పైకి లేపబడి ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించునట్లు ప్రభువు నందు విశ్వాసము కలిగియుండి, మీరు నిత్యజీవము పొందుదురను నిరీక్షణ కలిగియుండి మీ హృదయముల యందు ఎల్లప్పుడు దేవుని ప్రేమను కలిగియుండవలెనని కోరుచున్నాను.

30 ఆయన ఉగ్రతను మీపై తెచ్చుకొనకుండునట్లు, మీరు నరకపు సంకెళ్ళ చేత బంధించబడకుండనట్లు, రెండవ మరణమును అనుభవించకుండునట్లు ప్రభువు మీకు పశ్చాత్తాపమును అనుగ్రహించుగాక.

31 ఇంకను ఆల్మా ఈ గ్రంథమందు వ్రాయబడని అనేక మాటలను జనులతో పలికెను.