లేఖనములు
ఆల్మా 17


దేవుని వాక్యము నిమిత్తము రాజ్యమునకు సంబంధించిన వారి హక్కులను తిరస్కరించి, లేమనీయులకు బోధించుటకు నీఫై దేశమునకు వెళ్ళిన మోషైయ కుమారుల వృత్తాంతము; వారి శ్రమలు మరియు విడుదల—ఆల్మా యొక్క గ్రంథము ప్రకారమైయున్నది.

17 నుండి 27 అధ్యాయములు కలిగియున్నవి.

17వ అధ్యాయము

మోషైయ కుమారులు ప్రవచనము మరియు బయల్పాటు ఆత్మను కలిగియున్నారు—లేమనీయులకు వాక్యమును ప్రకటించుటకు వారు పలుమార్గములలో వెళ్ళుదురు—అమ్మోన్‌, ఇష్మాయెల్ దేశమునకు వెళ్ళి రాజైన లమోనై యొక్క సేవకుడగును—అమ్మోన్‌, రాజు యొక్క మందలను రక్షించి అతని శత్రువులను సీబస్ యొక్క జలముల వద్ద సంహరించును. 1–3 వచనములు సుమారు క్రీ. పూ. 77 సం.; 4 వ వచనము సుమారు క్రీ. పూ. 91–77 సం.; మరియు 5–39 వచనములు సుమారు క్రీ. పూ. 91 సం.

1 ఇప్పుడు ఆల్మా, మాంటై దేశమునకు దూరముగా గిడియన్‌ దేశము నుండి దక్షిణము వైపు ప్రయాణము చేయుచుండగా, జరహేమ్ల దేశము వైపు ప్రయాణము చేయుచున్న మోషైయ కుమారులను కలుసుకొని అతడు ఆశ్యర్యమునకు గురయ్యెను.

2 దేవదూత మొదట అతనికి కనబడిన సమయమున మోషైయ యొక్క ఈ కుమారులు ఆల్మాతో నుండిరి; కావున, తన సహోదరులను చూచినందుకు ఆల్మా అత్యధికముగా సంతోషించెను; వారు ఇంకను ప్రభువు నందు అతని సహోదరులుగా ఉన్నారనునది అతని సంతోషమును రెట్టింపు చేసెను; వారు సత్యమును గూర్చిన జ్ఞానమందు బలముగా ఎదిగిరి; ఏలయనగా వారు బాగా తెలివిగలవారైయుండి, దేవుని వాక్యమును తెలుసుకొనునట్లు లేఖనములను శ్రద్ధగా వెదికిరి.

3 కానీ, అంతయు ఇదియే కాదు; వారు అధికముగా ప్రార్థించి, ఉపవాసముండిరి; కావున వారు ప్రవచనాత్మను, బయల్పాటు ఆత్మను కలిగియుండి, వారు బోధించినప్పుడు దేవుని శక్తి మరియు అధికారముతో బోధించిరి.

4 అనేకులు సత్యమును గూర్చి తెలుసుకొనునట్లు చేయుటలో అధిక విజయము కలిగియుండి, వారు పదునాలుగు సంవత్సరముల పాటు లేమనీయులకు దేవుని వాక్యమును బోధించుచుండిరి; వారి మాటల శక్తి ద్వారా అనేకులు ఆయన నామమున ప్రార్థన చేయుటకు, ఆయన యెదుట తమ పాపములు ఒప్పుకొనుటకు దేవుని బలిపీఠము యెదుటకు తేబడిరి.

5 ఇప్పుడు వారి ప్రయాణములలో వారికి కలిగిన పరిస్థితులు ఇవి, ఏలయనగా వారు అనేక శ్రమలు అనుభవించిరి; ఆకలి, దాహము, అలసట మరియు ఆత్మ యందు అధికశ్రమ వంటి వాటిచేత వారు శరీరమందును మనస్సునందును అధికముగా బాధననుభవించిరి.

6 ఇప్పుడు వారి యొక్క ప్రయాణములివి: న్యాయాధిపతుల యొక్క మొదటి సంవత్సరములో తమ తండ్రియైన మోషైయ వద్ద సెలవు తీసుకొని, జనుల కోరిక ప్రకారము వారి తండ్రి వారికి అనుగ్రహించుటకు కోరిన రాజ్యమును వారు తిరస్కరించిరి;

7 అయినప్పటికీ వారు తమ ఖడ్గములు, బల్లెములు, విల్లులు, బాణములు మరియు వడిసెలను తీసుకొని జరహేమ్ల దేశము నుండి బయటకు వెడలిపోయిరి; అరణ్యములో ఉన్నప్పుడు తమ కొరకు ఆహారము సంపాదించుకొనునట్లు వారు దీనిని చేసిరి.

8 ఆ విధముగా లేమనీయులకు దేవుని వాక్యమును బోధించుటకు నీఫై దేశమునకు వెళ్ళుటకు తాము ఎన్నుకొనిన వారితోపాటు వారు అరణ్యములోనికి వెడలిపోయిరి.

9 అరణ్యమందు అనేక దినములు వారు ప్రయాణము చేసిరి, అధికముగా ఉపవాసముండిరి మరియు సాధ్యమైన యెడల వారి సహోదరులైన లేమనీయులకు సత్యమును గూర్చి, నీచమైన వారి పితరుల ఆచారములను గూర్చి తెలియజేయుటకు దేవుని హస్తములలో వారు ఒక సాధనముగా ఉండునట్లు, వారితో వెళ్ళుటకు మరియు వారితో నిలిచియుండుటకు ఆయన ఆత్మ యొక్క ఒక భాగమును ప్రభువు వారికి అనుగ్రహించవలెనని అధికముగా ప్రార్థించిరి.

10 అప్పుడు ప్రభువు వారిని తన ఆత్మతో దర్శించి, ఓదార్పు పొందుమనగా వారు ఓదార్పు పొందిరి.

11 మరలా ప్రభువు వారితో ఇట్లనెను: మీ సహోదరులైన లేమనీయుల మధ్యకు వెళ్ళి నా వాక్యమును స్థాపించుడి; అయినను నా యందు మంచి మాదిరిని వారికి చూపునట్లు మీరు దీర్ఘశాంతమందు, శ్రమల యందు సహనము కలిగియుండవలెను మరియు నేను అనేక ఆత్మల యొక్క రక్షణ కొరకు మిమ్ములను నా చేతులలో ఒక సాధనముగా చేయుదును.

12 అంతట దేవుని వాక్యమును ప్రకటించుటకు లేమనీయుల యొద్దకు వెళ్ళుటకు మోషైయ కుమారులు మరియు వారితోనున్న వారి హృదయములు ధైర్యము తెచ్చుకొనెను.

13 లేమనీయుల దేశము యొక్క సరిహద్దులలోనికి వారు వచ్చి చేరినప్పుడు, వారు తమను విభజించుకొని, కోతకోసిన తరువాత తిరిగి కలుసుకొనవలెనని, ప్రభువు నందు విశ్వసించుచు ఒకని నుండి మరియొకడు విడిపోయిరి; ఏలయనగా వారు చేయనారంభించిన పని గొప్పదని తలంచిరి.

14 నిశ్చయముగా అది గొప్పదైయుండెను, ఏలయనగా ఆటవికులు, కఠినాత్ములు, క్రూరులైన జనులకు దేవుని వాక్యమును బోధించుటకు వారు పూనుకొనిరి; వారు నీఫైయులను హత్యచేయుట యందు, వారిని దోచుకొని కొల్లగొట్టుట యందు ఆనందించు జనులైయుండిరి; వారి హృదయములు సంపదలపై లేదా వెండి బంగారములు, ప్రశస్థమైన రాళ్ళపై ఉంచబడినవి; అయినను వాటి కొరకు తమ చేతులతో పని చేయనవసరము లేకుండా హత్య చేయుట, కొల్లగొట్టుట ద్వారా ఈ వస్తువులను సంపాదించవలెనని వారు కోరిరి.

15 ఆ విధముగా వారు చాలా సోమరులైయుండిరి, వారిలో అనేకులు విగ్రహములను ఆరాధించిరి, వారి తండ్రుల ఆచారములను బట్టి దేవుని శాపము వారి మీదికి వచ్చెను; అయినప్పటికీ పశ్చాత్తాపము యొక్క షరతులపై ప్రభువు యొక్క వాగ్దానములు వారికి ఇవ్వబడెను.

16 కావున, బహుశా వారు వారిని పశ్చాత్తాపపడునట్లు, విమోచన ప్రణాళికను ఎరుగునట్లు చేయగలరేమో అనునది మోషైయ కుమారులు ఆ పనికి పూనుకొనుటకు కారణమైయున్నది.

17 అందువలన వారు ఒకరి నుండి ఒకరు వేరుపడి, అతనికి ఇవ్వబడిన దేవుని వాక్యము మరియు శక్తిని బట్టి ప్రతి ఒక్కరు ఒంటరిగా వారి మధ్యకు వెళ్ళిరి.

18 ఇప్పుడు అమ్మోన్‌ వారి మధ్య ముఖ్యుడైయుండెను లేదా వారికి పరిచర్య చేసెను, వారి యొక్క వేర్వేరు స్థానములను బట్టి వారిని ఆశీర్వదించి, వారికి దేవుని వాక్యమును బోధించిన తరువాత లేదా అతడు వెడలిపోవుటకు ముందు వారికి పరిచర్యచేసిన తరువాత అతడు వారి యొద్ద నుండి వెడలిపోయెను; ఆ విధముగా వారు దేశమందంతటా పలు ప్రయాణములు చేసిరి.

19 అమ్మోన్‌, ఇష్మాయెల్ దేశమునకు వెళ్ళెను, ఆ దేశము ఇష్మాయెల్ కుమారుల పేరుతో పిలువబడెను, వారు కూడా లేమనీయులైయుండిరి.

20 అమ్మోన్‌, ఇష్మాయెల్ దేశమందు ప్రవేశించగా, వారి చేజిక్కిన నీఫైయులందరినీ బంధించి, వారిని రాజు వద్దకు తీసుకొనిపోవుట వారి ఆచారమైనందున లేమనీయులు అతడిని పట్టుకొని బంధించిరి; ఆ విధముగా అతని చిత్తము మరియు సంతోషమును బట్టి వారిని సంహరించుటకు, ఖైదీగా ఉంచుటకు, చెరసాలలో వేయుటకు లేదా వారిని అతని దేశము నుండి బయటకు గెంటి వేయుటకు రాజు ఇష్టానికి అది వదిలివేయబడెను.

21 ఆ విధముగా అమ్మోన్‌, ఇష్మాయెల్ దేశపు రాజు యెదుటకు తీసుకొనిపోబడెను; అతని పేరు లమోనై; అతడు, ఇష్మాయెల్ వంశస్థుడైయుండెను.

22 లేమనీయుల మధ్య లేదా అతని జనుల మధ్య దేశమందు నివసించుట అతని కోరికైయున్నదా అని రాజు అమ్మోన్‌ను ప్రశ్నించెను.

23 అమ్మోన్‌ అతనితో—అవును, నేను కొంతకాలము పాటు ఈ జనుల మధ్య నివసించుటకు కోరుచున్నాను, బహశా నేను మరణించు దినమువరకు అనెను.

24 అప్పుడు అమ్మోన్‌ యెడల రాజైన లమోనై అధికముగా సంతోషించి, అతని బంధకములు విడిపించబడునట్లు చేసెను; మరియు అమ్మోన్‌ అతని కుమార్తెలలో ఒకరిని భార్యగా చేసుకొనవలెనని అతడు కోరెను.

25 కానీ అమ్మోన్‌ అతనితో—లేదు, నేను నీ సేవకునిగా ఉండెదననెను. కావున, అమ్మోన్‌ రాజైన లమోనైకి సేవకుడయ్యెను. మరియు లేమనీయుల ఆచారమును బట్టి లమోనై యొక్క మందలను కాయుటకు అతడు ఇతర సేవకుల మధ్య నియమించబడెను.

26 మూడు దినములు రాజు సేవలో ఉన్న తరువాత, అతడు లేమనీయ సేవకులతోపాటు వారి మందలను సీబస్ యొక్క జలమని పిలువబడిన జలముల యొద్దకు తీసుకొని వెళ్ళుచుండెను; తమ మందలు నీటిని త్రాగునట్లు లేమనీయులందరు వాటిని అక్కడికి తీసుకొని పోవుదురు—

27 కావున, అమ్మోన్‌ మరియు రాజు యొక్క సేవకులు తమ మందలను ఆ నీటి యొద్దకు తోలుకొనిపోవుచుండగా, నీటి కొరకు తమ మందలతో వచ్చిన లేమనీయుల సమూహమొకటి అక్కడ నిలబడి అమ్మోన్‌ మరియు రాజు సేవకుల యొక్క మందలను చెదరగొట్టిరి, అవి పలుదారులలో పారిపోవునంతగా వాటిని చెదరగొట్టిరి.

28 ఇప్పుడు రాజు యొక్క సేవకులు ఇట్లనుచూ సణుగుట మొదలుపెట్టిరి: ఈ మనుష్యుల దుష్టత్వమును బట్టి, మన సహోదరుల మందలు చెదరగొట్టబడినందున వారికి చేసియున్నట్లుగానే ఇప్పుడు మనలను కూడా రాజు సంహరించును. ఇదిగో, మన మందలు ఇప్పటికే చెదరగొట్టబడినవని చెప్పుచూ వారు అధికముగా దుఃఖించసాగిరి.

29 సంహరింపబడుదుమన్న భయమును బట్టి వారు దుఃఖించిరి. ఇప్పుడు అమ్మోన్‌ దీనిని చూచినప్పుడు, అతని హృదయము సంతోషముతో ఉప్పొంగెను; ఏలయనగా అతడు ఇట్లనుకొనెను: నా మాటల యందు విశ్వసించుటకు వారిని నడిపించునట్లు, నా తోటి సేవకుల హృదయములను నేను గెలుచునట్లు రాజుకు ఈ మందలను తిరిగి ఇచ్చుటలో నా శక్తిని లేదా నా యందున్న శక్తిని నా తోటి సేవకులకు నేను చూపెదను.

30 ఇప్పుడు తన సహోదరులని అతడు తలంచిన వారి శ్రమలను చూచినప్పుడు అమ్మోన్‌ యొక్క తలంపులివి.

31 మరియు అతడు వారితో తీయగా మాట్లాడుతూ ఇట్లు చెప్పెను: నా సహోదరులారా, ధైర్యముగానుండుడి, మనము మందలను వెదకుటకు వెళ్ళి, వాటిని సమకూర్చి, నీటి యొద్దకు తిరిగి తెచ్చెదము; ఆ విధముగా మనము రాజు కొరకు మందలను భద్రపరచెదము, అప్పుడతడు మనలను సంహరించడు.

32 అంతట వారు మందలను వెదకుచూ అమ్మోన్‌ వెనుక వెళ్ళిరి, వారు అతి వేగముతో ముందుకు వెళ్ళి, రాజు యొక్క మందల ముందుకు చేరి, నీటి యొద్దకు వాటిని తిరిగి సమకూర్చిరి.

33 మరలా వారి మందలను చెదరగొట్టుటకు ఆ మనుష్యులు అక్కడుండిరి; కానీ అమ్మోన్‌ తన సహోదరులతో ఇట్లు చెప్పెను: మందలు పారిపోకుండునట్లు వాటి చుట్టూ నిలబడుడి; నేను వెళ్ళి మన మందలను చెదరగొట్టుచున్న ఈ మనుష్యులతో పోరాడెదను.

34 కావున వారు అమ్మోన్‌ ఆజ్ఞాపించినట్లు చేసిరి, అప్పుడతడు వెళ్ళి, సీబస్ జలముల వద్ద నిలిచియున్న వారితో పోరాడుటకు నిలిచెను; వారు బహుసంఖ్యాకులై యుండిరి.

35 కావున వారు అమ్మోన్‌కు భయపడలేదు, వారి ఇష్టానుసారము తమలో ఒకడు అతడిని సంహరించగలడని వారు తలంచిరి, ఏలయనగా ఆయన కుమారులను వారి శత్రవుల చేతులలో నుండి విడిపించెదనని ప్రభువు మోషైయకు వాగ్దానము చేసియున్నాడని వారెరుగరు, లేదా ప్రభువును గూర్చి వారేమియు ఎరుగరు; కావున వారు, తమ సహోదరుల నాశనమందు ఆనందించిరి; ఈ కారణముచేతనే వారు రాజు యొక్క మందలను చెదరగొట్టుటకు నిలిచిరి.

36 కానీ అమ్మోన్‌ వెళ్ళి, తన వడిసెలతో వారి పైకి రాళ్ళు విసురుట ప్రారంభించెను; గొప్ప బలముతో అతడు వారిపై వడిసెలతో రాళ్ళు విసిరెను; ఆ విధముగా అతడు వారిలో కొంతమందిని సంహరించగా అతని శక్తిని చూచి వారు ఆశ్చర్యపడసాగిరి; అయినను సంహరింపబడిన వారి సహోదరుల నిమిత్తము వారు కోపముగానుండి, అతడిని పడద్రోయవలెనని నిశ్చయించుకొనిరి; కావున అతడిని తమ రాళ్ళతో కొట్టలేకపోయిరని చూచి, వారు గధలతో అతడిని సంహరించుటకు వచ్చిరి.

37 కానీ, అమ్మోన్‌ను కొట్టుటకు తన గధను ఎత్తిన ప్రతి మనుష్యుని చేతిని అతడు తన ఖడ్గముతో నరికివేసెను; ఏలయనగా అతడు వారి చేతులను తన ఖడ్గపు అంచుతో కొట్టుచు వారి దెబ్బలను తట్టుకొనుచుండెను, అంతట వారు ఆశ్చర్యపడి అతని యెదుట పారిపోసాగిరి; మరియు వారు అధిక సంఖ్యాకులైనప్పటికీ అతడు తన బాహుబలము చేత వారు పారిపోవునట్లు చేసెను.

38 ఇప్పుడు వారిలో ఆరుగురు వడిసెల ద్వారా కూలిరి, కానీ అతడు తన ఖడ్గముతో వారి నాయకుడిని తప్ప మరి ఎవరిని సంహరించలేదు; అతనికి వ్యతిరేకముగా ఎత్తబడిన వారందరి చేతులను అతడు నరికివేసెను మరియు వారనేకులైయుండిరి.

39 అతడు వారిని దూరముగా తరిమివేసి తిరిగి వచ్చినప్పుడు వారు తమ మందలకు నీరు పెట్టి, వాటిని రాజు యొక్క పచ్చిక బయళ్ళకు తీసుకొనిపోయిరి; తరువాత అమ్మోన్‌ను సంహరింపజూచి అతని ఖడ్గము చేత నరికివేయబడిన వారి చేతులను మోయుచూ వారు రాజు యొద్దకు వెళ్ళిరి; వారు చేసిన క్రియలకు సాక్ష్యముగా అవి రాజు యొద్దకు తీసుకుపోబడెను.