లేఖనములు
ఆల్మా 18


18వ అధ్యాయము

అమ్మోన్‌ గొప్ప ఆత్మయని రాజైన లమోనై తలంచును—సృష్టి, మనుష్యులతో దేవుని యొక్క వ్యవహారములు మరియు క్రీస్తు ద్వారా వచ్చు విమోచనను గూర్చి అమ్మోన్‌ రాజుకు బోధించును—లమోనై విశ్వసించును మరియు మరణించిన వానివలె నేలపై పడును. సుమారు క్రీ. పూ. 90 సం.

1 రాజైన లమోనై, తన సేవకులు ముందుకువచ్చి వారు చూచిన విషయములన్నిటి గూర్చి అందరిముందు సాక్ష్యమిచ్చునట్లు చేసెను.

2 వారు చూచిన విషయములన్నిటి గూర్చి వారందరు సాక్ష్యమిచ్చినప్పుడు, తన మందలను భద్రపరచుట యందు అమ్మోన్‌ యొక్క విశ్వాస్యతను, అతడిని సంహరించవలెనని కోరిన వారికి వ్యతిరేకముగా పోరాడుట యందు అతని గొప్ప శక్తిని గూర్చి తెలుసుకొని అతడు అధికముగా ఆశ్చర్యపడి, ఇట్లనెను: నిశ్చయముగా ఇతడు ఒక మనుష్యుని కంటే గొప్పవాడు. వారి హత్యలను బట్టి ఈ జనులపై అట్టి గొప్ప శిక్షలను పంపు గొప్ప ఆత్మ ఇతడే కాడా?

3 అప్పుడు వారు రాజుకు సమాధానమిచ్చి ఇట్లనిరి: అతడు గొప్ప ఆత్మయో లేదా ఒక మనుష్యుడో మేమెరుగము; కానీ, అతడు రాజు యొక్క శత్రువుల చేత సంహరింపబడలేడని మట్టుకు మేమెరుగుదుము; లేదా అతడు మాతో ఉన్నప్పుడు, అతని నేర్పరితనమును గొప్పశక్తిని బట్టి రాజు యొక్క మందలను వారు చెదరగొట్టలేరు; కావున అతడు రాజుకు స్నేహితుడైయున్నాడని మేమెరుగుదుము. ఇప్పుడు ఓ రాజా, ఒక మనుష్యుడు అట్టి గొప్ప శక్తి కలిగియున్నాడని మేము విశ్వసించము, ఏలయనగా అతడు సంహరింపబడలేడని మేమెరుగుదుము.

4 రాజు ఈ మాటలను వినినప్పుడు అతడు వారితో ఇట్లనెను: అతడు గొప్ప ఆత్మ అయ్యున్నాడని ఇప్పుడు నేనెరుగుదును; మీ సహోదరుల వలె మిమ్ములను నేను సంహరించకుండునట్లు మీ ప్రాణములను కాపాడుటకు ఈ సమయమున అతడు వచ్చియున్నాడు. మన పితరులు చెప్పిన ఆ గొప్ప ఆత్మ ఇదియే.

5 ఇప్పుడు ఒక గొప్ప ఆత్మ కలదు అనునది లమోనై తన తండ్రి నుండి పొందిన సంప్రదాయము. ఆ గొప్ప ఆత్మ యందు వారు విశ్వసించినప్పటికీ, వారు ఏమి చేసినను సరియని వారు తలంచిరి; అయినను తన సేవకులను సంహరించుటలో తాను తప్పు చేసియున్నానేమోయని లమోనై అధికముగా భయపడసాగెను;

6 ఏలయనగా వారి మందలను నీటి యొద్ద చెదరగొట్టిన వారి సహోదరుల కారణముగా వారిలో అనేకులను అతడు సంహరించియుండెను; ఆ విధముగా వారి మందలు చెదరగొట్టబడుటను బట్టి, వారు సంహరించబడిరి.

7 ఇప్పుడు, చెదరగొట్టబడిన మందలను తమ దేశమునకు తరిమివేయునట్లు జనుల మందలను చెదరగొట్టుటకు సీబస్ జలముల వద్ద కాచుకొనియుండుట ఈ లేమనీయులకు ఒక అలవాటుగా ఉండెను, దోచుకొనుటకు ఇది వారి పథకమైయుండెను.

8 అప్పుడు రాజైన లమోనై—అట్టి గొప్ప శక్తి కలిగియున్న ఈ మనుష్యుడు ఎక్కడున్నాడు? అని తన సేవకులను ప్రశ్నించెను.

9 వారతనితో ఇట్లు చెప్పిరి: ఇదిగో, అతడు నీ గుఱ్ఱములకు మేత వేయుచున్నాడు. వారి మందలకు నీరు పెట్టు సమయమునకు ముందు వారు అతని గుఱ్ఱములను, రథములను సిద్ధము చేయవలెనని, అతడిని నీఫై దేశమునకు తీసుకువెళ్ళవలెనని రాజు తన సేవకులను ఆజ్ఞాపించియుండెను; ఏలయనగా దేశమంతటిపై రాజైన లమోనై యొక్క తండ్రి చేత నీఫై దేశమందు గొప్ప విందు ఏర్పాటు చేయబడెను.

10 ఇప్పుడు అమ్మోన్‌ తన గుఱ్ఱములను, రథములను సిద్ధపరచుచున్నాడని రాజైన లమోనై వినినప్పుడు, అమ్మోన్‌ యొక్క విశ్వాస్యతను బట్టి అతడు మిక్కిలి ఆశ్చర్యపడి ఇట్లనెను: నిశ్చయముగా ఈ మనుష్యుని వలె, నా సేవకులందరి మధ్య ఇంత విశ్వాసము గల సేవకుడు లేడు; ఏలయనగా నా ఆజ్ఞలన్నిటినీ నేరవేర్చుటను అతడు జ్ఞాపకముంచుకొనుచున్నాడు.

11 నిశ్చయముగా ఇతడే ఆ గొప్ప ఆత్మయని ఇప్పుడు నేనెరుగుదును; అతడు నా యొద్దకు రావలెనని నేను కోరుచున్నాను, కానీ నేను ధైర్యము చేయలేను.

12 ఇప్పుడు అమ్మోన్‌, రాజు మరియు అతని సేవకుల కొరకు గుఱ్ఱములను రథములను సిద్ధము చేసిన తర్వాత రాజు యొద్దకు వెళ్ళెను; రాజు ముఖములో మార్పును గమనించి, అతడు రాజు సన్నిధి నుండి తిరిగి వెళ్ళనైయుండెను.

13 అంతట రాజు యొక్క సేవకులలో ఒకడు అతడిని రబ్బానా అనెను, అనగా వారి రాజులు శక్తిమంతులని తలంచుటను బట్టి శక్తి గల లేదా గొప్పరాజా అని దాని అర్థము; ఆ విధముగా అతడు—రబ్బానా, రాజు నిన్ను ఆగమని కోరుచున్నాడని అతనితో చెప్పెను.

14 కావున అమ్మోన్‌ రాజు వైపు తిరిగి అతనితో—ఓ రాజా, నీ కొరకు నేను ఏమి చేయవలెనని కోరుచున్నావు? అనెను. వారి సమయమును బట్టి ఒక గంట సేపు రాజు అతనికి సమాధానమియ్యలేదు, ఏలయనగా అతనికి ఏమి చెప్పవలెనో అతడు ఎరుగకయుండెను.

15 అమ్మోన్‌ మరలా అతనితో—నా నుండి నీవేమి కోరుచున్నావు? అనెను. కానీ రాజు అతనికి సమాధానమియ్యలేదు.

16 అమ్మోన్‌ దేవుని ఆత్మతో నింపబడినందున అతడు రాజు యొక్క తలంపులను గ్రహించగలిగెను; మరియు అతడు, అతనితో—నీ సేవకులను, నీ మందలను కాపాడుటకు వారి సహోదరులలో ఏడుగురిని వడిసెలతోను ఖడ్గముతోను సంహరించి, ఇతరుల చేతులను నరికివేసి నీ సేవకులను, నీ మందలను కాపాడియున్నానని నీవు వినియుంటివి; అదే నీ ఆశ్చర్యమునకు కారణమా? అనెను.

17 ఇందులో అంతగా ఆశ్చర్యపడుటకు ఏమున్నది? అని నేనడుగుచున్నాను. ఇదిగో, నేను ఒక మనుష్యుడను మరియు నీ సేవకుడను; కావున సరియైనదేదైనను నీవు కోరిన యెడల, నేను దానిని చేయుదును.

18 ఇప్పుడు రాజు ఈ మాటలను వినినప్పుడు అతడు మరలా ఆశ్చర్యపడెను, ఏలయనగా అమ్మోన్‌ అతని తలంపులను వివేచించగలడని అతడు చూచెను; అయినప్పటికీ, రాజైన లమోనై నోరు తెరచి అతనితో—నీవెవరవు? సమస్త విషయములను ఎరిగిన ఆ గొప్ప ఆత్మవు నీవేనా? అనెను.

19 నేను కాదు, అని అమ్మోన్‌ అతనికి సమాధానమిచ్చెను.

20 మరియు రాజు ఇట్లనెను: నా హృదయ తలంపులను నీవెట్లు ఎరుగుదువు? నీవు ధైర్యముగా మాట్లాడవచ్చును, ఈ విషయములను గూర్చి నాకు చెప్పుము; నా మందలను చెదరగొట్టిన నా సహోదరులను ఏ శక్తి ద్వారా నీవు సంహరించి, వారి చేతులను నరికివేసియున్నావో కూడా నాకు చెప్పుము.

21 ఇప్పుడు ఈ విషయములను గూర్చి నీవు నాకు చెప్పిన యెడల, నీవేమి కోరినను నేను నీకు ఇచ్చెదను; అవసరమైన యెడల నా సైన్యములతో నేను నిన్ను కావలి కాచెదను; కానీ వారందరి కంటే నీవు అధిక శక్తిమంతుడవని నేనెరుగుదును; అయినప్పటికీ, నా నుండి నీవేమి కోరినను దానిని నీకు ఇచ్చెదను.

22 ఇప్పుడు అమ్మోన్‌ తెలివైన వాడైనప్పటికీ, నిష్కపటుడైయుండి లమోనైతో ఇట్లనెను: నేను ఏ శక్తి ద్వారా ఈ క్రియలను చేయుచున్నానో నీకు చెప్పిన యెడల, నీవు నా మాటలను ఆలకించెదవా? నీ నుండి నేను కోరుచున్నది ఇదియే.

23 అంతట రాజు అతనికి సమాధానమిస్తూ—నీ మాటలన్నిటినీ నేను విశ్వసించెదననెను. ఆ విధముగా అతడు యుక్తి చేత పట్టుకొనబడెను.

24 అప్పుడు అమ్మోన్‌ అతనితో ధైర్యముగా మాట్లాడనారంభించి ఇట్లనెను: దేవుడున్నాడని నీవు నమ్ముచున్నావా?

25 దాని అర్థమేమిటో నేనెరుగను, అని అతడు సమాధానమిచ్చెను.

26 అప్పుడు అమ్మోన్‌—ఒక గొప్ప ఆత్మ ఉన్నదని నీవు నమ్ముచున్నావా? అనెను.

27 అవును, అని అతడు చెప్పెను.

28 మరియు అమ్మోన్‌—ఇదియే దేవుడని చెప్పెను. అమ్మోన్‌ మరలా అతనితో—దేవుడైయున్న ఈ గొప్ప ఆత్మ పరలోకమందు భూమియందు ఉన్న సమస్త వస్తువులను సృష్టించెనని నీవు నమ్ముచున్నావా? అనెను.

29 అవును, భూమియందు ఉన్న వాటన్నిటినీ అతడు సృష్టించెనని నేను నమ్ముచున్నాను; కానీ పరలోకములను నేను ఎరుగను అని అతడు చెప్పెను.

30 దేవుడు, ఆయన పరిశుద్ధ దేవదూతలు నివసించు స్థలమే పరలోకమని అమ్మోన్‌ అతనితో చెప్పెను.

31 అది భూమికి పైన ఉన్నదా? అని రాజైన లమోనై అడిగెను.

32 అవును, ఆయన పైనుండి నరుల సంతానమంతటిని చూచును; వారి హృదయ తలంపులను, ఉద్దేశ్యములన్నిటినీ ఆయన ఎరుగును; ఏలయనగా ఆదినుండి వారందరు ఆయన చేత సృష్టించబడిరని అమ్మోన్‌ చెప్పెను.

33 నీవు పలికిన ఈ విషయములన్నిటినీ నేను నమ్ముచున్నాను. నీవు దేవుని చేత పంపబడితివా? అని రాజైన లమోనై అడిగెను.

34 అప్పుడు అమ్మోన్‌ అతనితో ఇట్లనెను: నేను ఒక మనుష్యుడను; ఆదియందు మనుష్యుడు దేవుని స్వరూపమందు సృజించబడెను, న్యాయమైన మరియు సత్యమైన దానిని గూర్చి వారు తెలుసుకొనునట్లు, ఈ జనులకు ఈ విషయములను బోధించుటకు పరిశుద్ధాత్మ ద్వారా నేను పిలువబడియున్నాను.

35 ఆ ఆత్మ యొక్క ఒక భాగము నాలో నివసించుచున్నది, దేవుని యందున్న నా విశ్వాసమును కోరికలను బట్టి, అది నాకు జ్ఞానమును శక్తిని ఇచ్చుచున్నది.

36 ఇప్పుడు అమ్మోన్‌ ఈ మాటలను చెప్పినప్పుడు అతడు లోకము యొక్క సృష్టి మరియు ఆదాము యొక్క సృష్టి వద్ద మొదలుపెట్టి, మనుష్యుని పతనమును గూర్చి సమస్త విషయములను అతనికి వివరించి, వారి తండ్రియైన లీహై యెరూషలేమును వదిలివచ్చిన సమయము వరకు ప్రవక్తల ద్వారా పలుకబడిన జనుల యొక్క గ్రంథములను, పరిశుద్ధ లేఖనములను అతని యెదుట ఉంచెను.

37 మరియు అరణ్యమందు వారి పితరుల ప్రయాణములు, ఆకలి దప్పులతో వారి బాధలు, వేదనలు మొదలైనవాటన్నిటినీ అతడు వారికి (అనగా రాజు మరియు అతని సేవకులకు) వివరించెను.

38 లేమన్‌, లెముయెల్ మరియు ఇష్మాయెల్ కుమారుల యొక్క తిరుగుబాటులను గూర్చి అతడు వారికి వివరించెను, ముఖ్యముగా వారి తిరుగుబాటులన్నిటి గూర్చి అతడు వారికి చెప్పెను; లీహై యెరూషలేమును వదిలివచ్చిన సమయము నుండి ప్రస్తుతము వరకు గల గ్రంథములు, లేఖనములన్నిటినీ అతడు వారికి వివరించెను.

39 కానీ అంతయు ఇదియే కాదు; ఏలయనగా లోకము పునాది వేయబడినప్పటి నుండి సిద్ధపరచబడిన విమోచన ప్రణాళికను అతడు వారికి వివరించెను; క్రీస్తు యొక్క రాకడను, ప్రభువు యొక్క క్రియలన్నిటిని గూర్చి అతడు వారికి తెలియజేసెను.

40 అతడు ఈ విషయములన్నిటినీ చెప్పి వాటిని రాజుకు వివరించిన తరువాత, రాజు అతని మాటలన్నిటినీ విశ్వసించెను.

41 అతడు ప్రభువుకు మొరపెట్టనారంభించి ఇట్లనెను: ఓ ప్రభువా, నీఫై జనులపై నీవు కలిగియున్న విస్తారమైన కనికరమును బట్టి నాపై, నా జనులపై కనికరము చూపుము.

42 అతడు దీనిని చెప్పినప్పుడు, మరణించిన వాని వలే నేలపై పడెను.

43 అప్పుడు అతని సేవకులు అతడిని అతని భార్య వద్దకు తీసుకొనిపోయి మంచముపై పరుండబెట్టిరి; రెండు పగళ్ళు మరియు రెండు రాత్రులు అతడు మరణించిన వాని వలే పడియుండెను; అతడిని కోల్పోయినందుకు గొప్పగా విలపించుచూ లేమనీయుల ఆచారమును బట్టి అతని భార్య, కుమారులు మరియు కుమార్తెలు అతడిని గూర్చి సంతాపపడిరి.