లేఖనములు
ఆల్మా 23


23వ అధ్యాయము

మత స్వాతంత్ర్యము ప్రకటించబడెను—ఏడు దేశములు మరియు పట్టణములందు గల లేమనీయులు పరివర్తన చెందుదురు—వారు తమను ఆంటై-నీఫై-లీహైయులని పిలుచుకొందురు మరియు శాపము నుండి విముక్తులగుదురు—అమలేకీయులు మరియు అమ్యులోనీయులు సత్యమును తిరస్కరించుదురు. సుమారు క్రీ. పూ. 90–77 సం.

1 ఇప్పుడు అమ్మోన్‌, అహరోను, ఓమ్నెర్‌, హింనై లేదా వారి సహోదరులలో ఎవరైనను దేశము యొక్క ఏ భాగములోనైనను వారున్నట్టి ఏ స్థలమందైనను దేవుని వాక్యమును ప్రకటించుచూ ముందుకు వెళ్ళునప్పుడు వారిని ఆటంకపరచరాదని లేమనీయుల రాజు తన జనులందరి మధ్య ఒక ప్రకటన పంపెను.

2 వారిని బంధించుటకు లేదా చెరసాలలో వేయుటకు వారు పట్టుకొనరాదని, వారిపై ఉమ్మి వేయరాదని, వారిని కొట్టరాదని, తమ సమాజ మందిరములలో నుండి వెలివేయరాదని, కొరడాలతో కొట్టరాదని లేదా వారిపై రాళ్ళు విసరరాదని, వారికి తమ ఇండ్లయందు, ఆలయములందు, పరిశుద్ధాలయముల యందు స్వేచ్ఛా ప్రవేశములుండవలెనని అతడు వారి మధ్య ఒక ఆజ్ఞాపత్రము పంపెను.

3 ఆ విధముగా వారు తమ కోరికలను బట్టి ముందుకువెళ్ళి వాక్యమును బోధించగలిగిరి, ఏలయనగా రాజు మరియు అతని ఇంటి వారందరు ప్రభువుకు పరివర్తన చెందిరి; కావున దేవుని వాక్యము ఏ ఆటంకము లేకుండా దేశమంతటా ముందుకు వెళ్ళునట్లు, అతని జనులు తమ పితరుల దుష్ట సంప్రదాయములను గూర్చి ఒప్పించబడునట్లు, వారందరు సహోదరులని, వారు నరహత్య చేయరాదని, దోచుకొనరాదని, దొంగతనము చేయరాదని, వ్యభిచారము చేయరాదని లేదా ఏ విధమైన దుష్టత్వము చేయరాదని ఒప్పించబడునట్లు అతడు దేశమంతటా తన జనులకు తన ప్రకటనను పంపెను.

4 ఇప్పుడు రాజు ఈ ప్రకటన పంపినప్పుడు, వారికి దేవుని వాక్యమును బోధించుటకు మరియు ఉపదేశించుటకు లేమనీయుల మధ్య దేశమంతటా సంఘములను స్థాపించుచూ యాజకులను బోధకులను ప్రతిష్ఠించుచూ అహరోను, అతని సహోదరులు పట్టణము నుండి పట్టణమునకు, ఒక ఆరాధన గృహము నుండి మరియొక దానికి వెళ్ళిరి; ఆ విధముగా వారు గొప్ప విజయము పొందనారంభించిరి.

5 వేలమంది జనులకు ప్రభువును గూర్చి తెలియజేసిరి, అంతేకాక వేలమంది జనులు నీఫైయుల సంప్రదాయములందు విశ్వసించునట్లు వారు చేసిరి; ప్రస్తుత కాలము వరకు అందించబడిన గ్రంథములు, ప్రవచనములను వారికి బోధించిరి.

6 ప్రభువు జీవించినంత నిశ్చయముగా బయల్పాటు మరియు ప్రవచనము యొక్క ఆత్మను బట్టి, వారి మధ్య అద్భుతములను జరిగించు దేవుని శక్తిని బట్టి అమ్మోన్‌ మరియు అతని సహోదరుల బోధన ద్వారా విశ్వసించిన వారందరు లేదా సత్యమును గూర్చి తెలియజేయబడిన వారందరు, అనగా ప్రభువు జీవించియున్నట్లుగా, వారి బోధనయందు విశ్వసించి, ప్రభువుకు పరివర్తన చెందిన లేమనీయులందరు ఎన్నడూ తొలగిపోలేదని నేను మీతో చెప్పుచున్నాను.

7 ఏలయనగా వారు నీతిమంతులైన జనులైరి; వారు తమ తిరుగుబాటు ఆయుధములను విడిచిపెట్టి, దేవునికి వ్యతిరేకముగా లేదా వారి సహోదరులలో ఎవరికీ వ్యతిరేకముగా ఇక పోరాడలేదు.

8 ఇప్పుడు ప్రభువుకు పరివర్తన చెందిన వారు వీరే:

9 ఇష్మాయెల్ దేశమందున్న లేమనీయుల యొక్క జనులు;

10 మిద్దోనై దేశమందున్న లేమనీయుల యొక్క జనులు;

11 నీఫై పట్టణమందున్న లేమనీయుల యొక్క జనులు;

12 షైలోమ్ దేశమందు, షెమ్లోన్‌ దేశమందు, లెముయెల్ పట్టణమందు మరియు షిమ్నిలోమ్ పట్టణమందున్న లేమనీయుల యొక్క జనులు కూడా.

13 ఇవే ప్రభువుకు పరివర్తన చెందిన లేమనీయుల పట్టణముల పేర్లు; వీరే తమ తిరుగుబాటు ఆయుధములను, అనగా తమ యుద్ధ ఆయుధములన్నిటినీ విడిచిపెట్టినవారు; వీరందరు లేమనీయులు.

14 అమలేకీయులలో ఒక్కరు తప్ప ఎవరూ పరివర్తన చెందలేదు; అమ్యులోనీయులలో కూడా ఎవరూ పరివర్తన చెందలేదు; కానీ వారు తమ హృదయములను కఠినపరచుకొనిరి మరియు వారు నివసించిన దేశము యొక్క ఆ భాగములు, ముఖ్యముగా వారి పల్లెలు, పట్టణములన్నిటిలోనున్న లేమనీయుల హృదయములను కూడా కఠినపరచిరి.

15 కావున పశ్చాత్తాపపడి, సత్యమును గూర్చి తెలుసుకొని పరివర్తన చెందిన లేమనీయుల పట్టణములన్నిటినీ మేము పేర్కొంటిమి.

16 ఇప్పుడు వారి సహోదరుల నుండి ప్రత్యేకపరచబడునట్లు రాజు మరియు పరివర్తన చెందిన వారు ఒక పేరును కలిగియుండవలెనని కోరిరి; కావున వారు ప్రత్యేకపరచబడునట్లు తమపై తీసుకొనవలసిన పేరును గూర్చి రాజు అహరోనును, తమ యాజకులలో అనేకులను సంప్రదించెను.

17 వారు తమ పేర్లను ఆంటై-నీఫై-లీహైయులని పిలిచిరి; వారు ఈ పేరుతో పిలువబడిరి మరియు ఇక లేమనీయులని పిలువబడలేదు.

18 వారు అధికముగా పరిశ్రమించు జనులవసాగిరి; వారు నీఫైయులతో స్నేహముగానుండిరి; కావున వారితో ఉత్తర ప్రత్యుత్తరములు ప్రారంభించిరి; మరియు దేవుని శాపము మరెన్నడూ వారిని వెంబడించలేదు.