లేఖనములు
ఆల్మా 24


24వ అధ్యాయము

లేమనీయులు దేవుని జనులకు వ్యతిరేకముగా వచ్చెదరు—ఆంటై-నీఫై-లీహైయులు క్రీస్తునందు ఆనందించుదురు మరియు దేవదూతల చేత దర్శింపబడుదురు—తమను కాపాడుకొనుట కంటే మరణమును అనుభవించుటను వారు కోరుకొందురు—మరింతమంది లేమనీయులు పరివర్తన చెందుదురు. సుమారు క్రీ. పూ. 90–77 సం.

1 అమ్యులోన్ దేశమందు, హీలాము దేశమందు, యెరూషలేము దేశమందు, క్లుప్తముగా చుట్టూనున్న దేశమంతటా ఉండి పరివర్తన చెందక, తమపై ఆంటై-నీఫై-లీహై నామమును తీసుకొనని అమలేకీయులు, అమ్యులోనీయులు మరియు లేమనీయులు వారి సహోదరులకు వ్యతిరేకముగా అమలేకీయుల చేత, అమ్యులోనీయుల చేత కోపమునందు పురిగొల్పబడిరి.

2 వారు తమ రాజుకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయునంతగా, అతడు తమ రాజుగా ఉండుటకు వారు ఇష్టపడనంతగా వారి ద్వేషము వారికి వ్యతిరేకముగా మిక్కిలి తీవ్రమాయెను; కావున వారు ఆంటై-నీఫై-లీహై జనులకు వ్యతిరేకముగా పోరాడుటకు ఆయుధములను ధరించిరి.

3 ఇప్పుడు రాజు తన కుమారునికి రాజ్యమును అప్పగించి, అతడిని ఆంటై-నీఫై-లీహైయను పేరుతో పిలిచెను.

4 మరియు దేవుని జనులకు వ్యతిరేకముగా లేమనీయులు యుద్ధమునకు ఏర్పాట్లు చేయనారంభించిన సంవత్సరమందే రాజు మరణించెను.

5 అమ్మోన్‌, అతని సహోదరులు మరియు అతనితో వచ్చిన వారందరు, తమ సహోదరులను నాశనము చేయుటకు లేమనీయుల ఏర్పాట్లను చూచినప్పుడు వారు మిద్యాను దేశమునకు వచ్చిరి, అక్కడ అమ్మోన్‌ తన సహోదరులందరినీ కలుసుకొనెను; అక్కడ నుండి వారు, లేమనీయులకు వ్యతిరేకముగా తమను కాపాడుకొనుటకు వారేమి చేయవలెనని నిర్ణయించుటకు లమోనైతో మరియు అతని సహోదరుడైన ఆంటై-నీఫై-లీహైతో కలిసి ఒక సభ ఏర్పాటు చేయునట్లు ఇష్మాయెల్ దేశమునకు వచ్చిరి.

6 ఇప్పుడు ప్రభువుకు పరివర్తన చెందిన జనులందరి మధ్య తమ సహోదరులకు వ్యతిరేకముగా ఆయుధములను తీసుకొను ఆత్మ ఒక్కటి కూడా అక్కడ లేకుండెను; అంతేకాక వారు యుద్ధము కొరకు ఎటువంటి ఏర్పాట్లు చేయకుండిరి; వారి రాజు కూడా వారట్లు చేయరాదని వారిని ఆజ్ఞాపించెను.

7 మరియు ఆ విషయమును గూర్చి అతడు జనులకు చెప్పిన మాటలివి: నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, ప్రియమైన నా జనులారా, మన గొప్ప దేవుడు మంచితనమందు మనకు బోధించుటకు మరియు దుర్మార్గులైన మన పితరుల ఆచారములను గూర్చి మనలను ఒప్పించుటకు మన సహోదరులైన నీఫైయులను మన యొద్దకు పంపియున్నాడు.

8 మనము ఈ సహోదరులైన నీఫైయులతో ఉత్తర ప్రత్యుత్తరములను ప్రారంభించునట్లు మన హృదయములను మృదువుగా చేయుటకు తన ఆత్మ యొక్క ఒక భాగమును ఆయన మనకు ఇచ్చియున్నందున నేను నా గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

9 ఇదిగో, ఈ ఉత్తర ప్రత్యుత్తరములను ప్రారంభించుట ద్వారా మనము మన పాపములను గూర్చి, మనము చేసిన అనేక హత్యలను గూర్చి ఒప్పించబడియున్నందుకు కూడా నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

10 మనము ఈ సంగతులను గూర్చి పశ్చాత్తాపపడునట్లు ఆయన మనకు అనుగ్రహించినందుకు, మనము చేసిన అనేక పాపములు మరియు హత్యల విషయమై ఆయన మనలను క్షమించినందుకు, ఆయన కుమారుని మంచితనము ద్వారా మన హృదయముల నుండి దోషమును తీసివేసినందుకు కూడా నేను నా దేవునికి, అనగా నా గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

11 ఇప్పుడు నా సహోదరులారా (మనము మానవజాతి అంతటిలో మిక్కిలిగా తప్పిపోయిన వారమైనందున), మనము చేయగలిగినదంతయు మన సమస్త పాపములు, మనము చేసిన అనేక హత్యల విషయమై పశ్చాత్తాపపడుట మరియు వాటిని మన హృదయముల నుండి దేవుడు తీసివేయునట్లు చేయుటయే; ఏలయనగా ఆయన మన కళంకమును తీసివేయునట్లు మనము చేయగలిగినదంతయు దేవుని యెదుట తగినంతగా పశ్చాత్తాపపడుటయే—

12 అత్యంత ప్రియులైన నా సహోదరులారా, దేవుడు మన కళంకమును తీసివేసినందున మరియు మన ఖడ్గములు కాంతివంతమైనందున ఇకపై మనము మన ఖడ్గములను మరెన్నడూ మన సహోదరుల రక్తముతో కళంకపరచవద్దు.

13 ఇదిగో, వద్దు అని నేను మీతో చెప్పుచున్నాను, మన సహోదరుల రక్తముతో మన ఖడ్గములు కళంకమవ్వకుండునట్లు ఉంచుకొనెదము; ఒకవేళ మనము మన ఖడ్గములను తిరిగి కళంకపరచుకొనిన యెడల, మన పాపముల ప్రాయశ్చిత్తము కొరకు చిందింపబడు మన గొప్ప దేవుని యొక్క కుమారుని రక్తము ద్వారా అవి మరెన్నడూ కాంతివంతముగా చేయబడలేవు.

14 ఆ గొప్ప దేవుడు మనపై కనికరము కలిగియుండి, మనము నశించకుండునట్లు మనకు ఈ సంగతులను తెలియజేసెను; ఆయన మనకు ఈ సంగతులను ముందుగానే తెలియజేసెను, ఏలయనగా ఆయన మన ఆత్మలను, మన సంతానమును ప్రేమించుచున్నాడు; కావున, మనకు మరియు రాబోవు తరములకు రక్షణ ప్రణాళిక తెలియజేయబడునట్లు తన కనికరమందు ఆయన మనలను తన దేవదూతల ద్వారా దర్శించును.

15 మన దేవుడు ఎంతో కనికరము గలవాడు. ఇదిగో మన కళంకములు మన నుండి తీసి వేయబడునట్లు మరియు మన ఖడ్గములు కాంతివంతముగా చేయబడునట్లు మనము చేయగలిగినదంతయు ఇదియే అయినందున, ఆయన మనకు తన వాక్యమును అందించి, దాని ద్వారా మనలను శుద్ధులను చేసినప్పటి నుండి మనము మన ఖడ్గములను మన సహోదరుల రక్తముతో కళంకపరచలేదని అంత్యదినమున లేదా తీర్పుతీర్చబడుటకు ఆయన యెదుట నిలబడుటకు మనము తేబడు దినమున, మన దేవునికి ఒక సాక్ష్యముగా అవి కాంతివంతముగా ఉంచబడునట్లు మనము వాటిని దాచివేయుదము.

16 ఇప్పుడు నా సహోదరులారా, మన సహోదరులు మనలను నాశనము చేయగోరిన యెడల, ఇదిగో మనము మన ఖడ్గములను దాచివేయుదము, ముఖ్యముగా వాటిని మనము ఎన్నడూ వాడలేదని అంత్యదినమున ఒక సాక్ష్యముగా అవి కాంతివంతముగా ఉంచబడునట్లు మన ఖడ్గములను మనము దాచివేయుదము. మనము వాటిని భూమిలో లోతుగా పాతిపెట్టెదము; మన సహోదరులు మనలను నాశనము చేసిన యెడల, మనము మన దేవుని యొద్దకు వెళ్ళెదము మరియు రక్షింపబడెదము.

17 రాజు ఈ మాటలను ముగించినప్పుడు, జనులందరు సమకూడి తమ ఖడ్గములను మరియు మనుష్యుని రక్తమును చిందించుటకు వాడబడిన ఆయధములన్నిటినీ తీసుకువెళ్ళి భూమిలో లోతుగా పాతిపెట్టిరి.

18 వారు మనుష్యుని రక్తమును చిందించుటకు మరెన్నడూ ఆయుధములను వాడరని వారి దృష్టియందు ఇది దేవునికి, మనుష్యులకు ఒక సాక్ష్యమైయుండుటకు దీనిని వారు చేసిరి; తమ సహోదరుల రక్తము చిందించుట కంటే వారు తమ స్వంత ప్రాణములను ఇచ్చివేయుదురని, ఒక సహోదరుని నుండి తీసివేయుట కంటే వారతనికిచ్చెదరని, తమ దినములను సోమరితనమందు గడుపుట కంటే వారు తమ చేతులతో అధికముగా పనిచేయుదురని దేవునితో వాగ్దానము మరియు నిబంధన చేయుచూ వారు దీనిని చేసిరి.

19 ఆ విధముగా ఈ లేమనీయులు సత్యమును తెలుసుకొని విశ్వసించినప్పుడు వారు స్థిరముగానుండిరని, పాపము చేయుట కంటే మరణము వరకు శ్రమపడుదురని మనము చూచుచున్నాము ఆ విధముగా వారు తమ శాంతి ఆయుధములను పాతిపెట్టిరని లేదా శాంతి కొరకు వారు యుద్ధ ఆయుధములను పాతిపెట్టిరని మనము చూచుచున్నాము.

20 వారి సహోదరులైన లేమనీయులు యుద్ధమునకు ఏర్పాట్లు చేసి, రాజును నాశనము చేసి అతని స్థానములో మరియొకనిని ఉంచు ఉద్దేశ్యము నిమిత్తము దేశములోనున్న ఆంటై-నీఫై-లీహై యొక్క జనులను నాశనము చేయుటకు నీఫై దేశమునకు వచ్చిరి.

21 ఇప్పుడు వారు తమకు వ్యతిరేకముగా వచ్చుచున్నారని జనులు చూచినప్పుడు, వారిని కలుసుకొనుటకు బయటకు వెళ్ళి, వారి యెదుట నేలపై సాష్టాంగపడి, ప్రభువు నామమున ప్రార్థన చేయనారంభించిరి; ఆ విధముగా లేమనీయులు వారిపై పడి, వారిని ఖడ్గముతో సంహరించుట మొదలుపెట్టినప్పుడు వారు ఈ విధముగా ఉండిరి.

22 ఆ విధముగా ఏ విరోధమును ఎదుర్కొనకుండా, వారిలో ఒక వేయి ఐదుగురిని వారు సంహరించిరి; అయితే వారు ఆశీర్వదింపబడిరని మనమెరుగుదుము, ఏలయనగా వారు తమ దేవునితో నివసించుటకు వెళ్ళిరి.

23 ఇప్పుడు వారి సహోదరులు ఖడ్గము నుండి పారిపోరని, కుడికే గాని ఎడమకే గాని తిరుగక క్రిందపడి నశించిపోవుదురని మరియు ఖడ్గము చేత నశింపబడుచున్నప్పుడు కూడా దేవుని స్తుతింతురని

24 లేమనీయులు చూచినప్పుడు, వారిని సంహరించుట మానిరి; మరియు తమ సహోదరులలో ఖడ్గము చేత కూలిన వారి కొరకు హృదయములుప్పొంగిన వారు అనేకులు అక్కడ ఉండిరి, ఏలయనగా వారు చేసిన క్రియల విషయమై వారు పశ్చాత్తాపపడిరి.

25 వారు తమ యుద్ధ ఆయుధములను క్రింద పడవేసిరి మరియు వాటిని తిరిగి తీసుకొనకుండిరి, ఏలయనగా వారు చేసిన హత్యల విషయమై వారు బాధపడిరి; మరియు వారి సహోదరులవలే వారు కూడా, వారిని సంహరించుటకు ఆయుధములను ఎత్తిన వారి కనికరములపై ఆధారపడుచూ సాష్టంగపడిరి.

26 ఆ దినమున సంహరింపబడిన వారి కంటే అధిక సంఖ్యాకులు దేవుని జనులలో చేర్చబడిరి; సంహరింపబడిన వారు నీతిమంతులైనందున వారు రక్షింపబడిరా అని మనము సందేహించనవసరము లేదు.

27 సంహరింపబడిన వారిలో దుష్టుడు ఒక్కడైనను లేడు; కానీ సత్యమును గూర్చి తెలియజేయబడిన వారు వెయ్యిమంది కంటే అధికులు అక్కడ ఉండిరి; ఆ విధముగా ప్రభువు తన జనుల రక్షణ కొరకు అనేక విధాలుగా పనిచేయునని మనము చూచుచున్నాము.

28 ఇప్పుడు వారి సహోదరులలో అనేకులను సంహరించిన లేమనీయులలో అత్యధికులు అమలేకీయులు మరియు అమ్యులోనీయులైయుండిరి. వారిలో అధికులు నీహోర్‌ల క్రమమునకు చెందిన వారు.

29 ప్రభువు యొక్క జనులను చేరిన వారి మధ్య అమలేకీయులు, అమ్యులోనీయులు లేదా నీహోర్‌ క్రమమునకు చెందిన వారు ఎవరూ లేరు, కానీ వాస్తవమునకు వారు లేమన్‌, లెముయెల్ యొక్క వంశస్థులైయుండిరి.

30 ఆ విధముగా జనులు దేవుని ఆత్మ ద్వారా ఒకసారి ప్రకాశింపబడి, నీతికి సంబంధించిన విషయముల యొక్క గొప్ప జ్ఞానము కలిగియుండిన తరువాత, పాపము మరియు అతిక్రమములోనికి పడిపోయిన యెడల వారు ఎక్కువ కఠినులగుదురని, వారి స్థితి ఈ విషయములను ఎన్నడూ ఎరుగకుండిన వారి కంటే ఘోరముగా ఉండునని మనము స్పష్టముగా వివేచింపగలము.