లేఖనములు
ఆల్మా 25


25వ అధ్యాయము

లేమనీయుల దాడులు విస్తరించును—అబినడై ప్రవచించినట్లు నోవహు యాజకుల సంతానము నశించును—అనేకమంది లేమనీయులు పరివర్తన చెంది ఆంటై-నీఫై-లీహై యొక్క జనులతో చేరుదురు—వారు క్రీస్తు నందు విశ్వసించి, మోషే ధర్మశాస్త్రమును పాటించుదురు. సుమారు క్రీ. పూ. 90–77 సం.

1 ఇప్పుడు వారు తమ సహోదరులను సంహరించినందున ఆ లేమనీయులు ఎక్కువ కోపముగానుండిరి; కావున వారు నీఫైయులపై పగ తీర్చుకొనుటకు ఒట్టు పెట్టుకొనిరి; ఆ సమయమున ఆంటై-నీఫై-లీహై జనులను సంహరించుటకు వారిక ప్రయత్నము చేయలేదు.

2 కానీ వారు తమ సైన్యములను తీసుకొని జరహేమ్ల దేశ సరిహద్దులను దాటి లోనికి వెళ్ళి, అమ్మోనైహా దేశములోనున్న జనులపైన పడి, వారిని నాశనము చేసిరి.

3 ఆ తరువాత వారు నీఫైయులతో అనేక యుద్ధములు చేసిరి, వాటిలో వారు తరుమబడి, సంహరించబడిరి.

4 లేమనీయుల మధ్య సంహరింపబడిన వారందరు దాదాపుగా అమ్యులోను మరియు అతని సహోదరుల యొక్క సంతానమే, వారు నోవహు యొక్క యాజకులైయుండి నీఫైయుల చేత సంహరింపబడిరి.

5 మిగిలిన వారు తూర్పు అరణ్యములోనికి పారిపోయి లేమనీయుల మీద శక్తిని, అధికారమును అక్రమముగా తీసుకొనియుండి, వారి విశ్వాసమును బట్టి లేమనీయులలో అనేకులు అగ్ని చేత నశించునట్లు చేసిరి—

6 ఏలయనగా వారిలో అనేకులు అధిక నష్టమును, అనేక శ్రమలను అనుభవించిన తరువాత, వారి దేశములో అహరోను, అతని సహోదరులు వారికి బోధించిన మాటలను జ్ఞాపకము చేసుకొనుటకు పురిగొల్పబడసాగిరి; కావున వారి పితరుల ఆచారములను నమ్మకుండా వారు, ప్రభువునందు విశ్వసించుట మరియు ఆయన నీఫైయులకు గొప్ప శక్తిని ఇచ్చెనని నమ్ముట ప్రారంభించిరి; ఆ విధముగా వారిలో అనేకులు అరణ్యములో పరివర్తన చెందిరి.

7 మరియు అమ్యులోను సంతానము యొక్క శేషమైన ఆ పాలకులు ఈ విషయములయందు విశ్వసించిన వారందరు చంపబడునట్లు చేసిరి.

8 ఇప్పుడు ఈ హతసాక్ష్యము వారి సహోదరులలో అనేకులు కోపమునకు పురిగొల్పబడునట్లు చేసెను మరియు అరణ్యములో వివాదము ప్రారంభమాయెను; లేమనీయులు అమ్యులోను, అతని సహోదరుల సంతానమును వెంటాడుచూ సంహరించుట మొదలుపెట్టిరి మరియు వారు తూర్పు అరణ్యములోనికి పారిపోయిరి.

9 ఇదిగో వారు ఈ దినమున లేమనీయుల చేత వెంటాడబడుచున్నారు. ఆ విధముగా అతడు అగ్నిచేత మరణించునట్లు చేసిన యాజకుల సంతానమును గూర్చి అబినడై చెప్పిన మాటలు నెరవేరెను.

10 ఏలయనగా అతడు వారితో ఇట్లనెను: మీరు నా పట్ల చేయునది రాబోవు వాటికి సూచన అయ్యున్నది.

11 ఇప్పుడు దేవుని యందు అతని విశ్వాసమును బట్టి అగ్ని చేత మరణమును అనుభవించిన మొదటివాడు అబినడై; అతడు అనుభవించినట్లే అనేకులు అగ్ని చేత మరణమును అనుభవించవలెను అనునది అతడు చెప్పిన దాని అర్థమైయుండెను.

12 అతడు చంపబడిన విధముగానే వారి సంతానము అనేకమందిని చంపునని, కాపరి లేని గొఱ్ఱె అడవి జంతువుల చేత తరుమబడి సంహరింపబడినట్లు వారు దూరముగా చెదరగొట్టబడుదురని అతడు నోవహు యాజకులకు చెప్పెను; ఇప్పుడు ఈ మాటలు ఋజువాయెను, ఏలయనగా వారు లేమనీయుల చేత తరుమబడి, వెంటాడబడి, చంపబడిరి.

13 నీఫైయులను జయించలేమని చూచినపుడు, లేమనీయులు వారి స్వదేశమునకు తిరిగివెళ్ళిరి; వారిలో అనేకులు ఇష్మాయెల్ దేశమందు మరియు నీఫై దేశమందు నివసించుటకు వచ్చి, ఆంటై-నీఫై-లీహై యొక్క జనులైన దేవుని జనులతో చేరిరి.

14 వారు కూడా తమ సహోదరులవలే తమ యుద్ధ ఆయుధములను పాతిపెట్టి, నీతిమంతులగుట ప్రారంభించిరి; వారు ప్రభువు యొక్క మార్గములందు నడిచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటించిరి.

15 వారు మోషే ధర్మశాస్త్రమును పాటించిరి; అది పూర్తిగా నెరవేరనందున వారు ఇంకను మోషే ధర్మశాస్త్రమును పాటించుట అవసరమాయెను. కానీ మోషే ధర్మశాస్త్రమున్నప్పటికీ, వారు మోషే ధర్మశాస్త్రమును ఆయన రాకడ యొక్క సూచనగా గ్రహించుచూ ఆయన తననుతాను వారికి ప్రత్యక్షపరచుకొను సమయము వరకు వారు ఆ బహిరంగ ఆచరణలను పాటించవలెనని విశ్వసించుచూ క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురుచూచిరి.

16 ఇప్పుడు మోషే ధర్మశాస్త్రము ద్వారా రక్షణ వచ్చెనని వారు తలంచలేదు, కానీ మోషే ధర్మశాస్త్రము క్రీస్తునందు వారి విశ్వాసమును బలపరిచెను; ఆ విధముగా రాబోవు సంగతులను గూర్చి చెప్పిన ప్రవచనము యొక్క ఆత్మపై ఆధారపడుచూ వారు నిత్యరక్షణ కొరకు విశ్వాసము ద్వారా నిరీక్షణను నిలుపుకొనిరి.

17 ఇప్పుడు ప్రభువు వారి ప్రార్థనల ప్రకారము వారికి అనుగ్రహించెనని మరియు ప్రతి వివరమందు తన వాక్యమును ఆయన వారికి ఋజువు చేసెనని, లేమనీయుల మధ్య వారు పొందిన విజయము నిమిత్తము అమ్మోన్‌, అహరోను, ఓమ్నెర్‌, హింనై మరియు వారి సహోదరులు అధికముగా సంతోషించిరి.