లేఖనములు
ఆల్మా 27


27వ అధ్యాయము

ఆంటై-నీఫై-లీహై జనులను సురక్షిత ప్రాంతానికి తీసుకొనివెళ్ళమని ప్రభువు అమ్మోన్‌ను ఆజ్ఞాపించును—ఆల్మాను కలిసినప్పుడు, అమ్మోన్‌ సంతోషము అతని శక్తిని హరించివేయును—నీఫైయులు ఆంటై-నీఫై-లీహైయులకు జెర్షోన్‌ దేశమును ఇచ్చెదరు—వారు అమ్మోన్‌ యొక్క జనులని పిలువబడిరి. సుమారు క్రీ. పూ. 90–77 సం.

1 ఇప్పుడు నీఫైయులను నాశనము చేయుటకు అనేక ప్రయత్నములు చేసిన తరువాత వారి నాశనమును కోరుట వ్యర్థమని చూచినపుడు, వారికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వెళ్ళిన లేమనీయులు మరలా నీఫై దేశమునకు తిరిగి వెళ్ళిరి.

2 మరియు అమలేకీయులు వారి నష్టమును బట్టి మిక్కిలి కోపముగా నుండిరి. వారు నీఫైయులకు వ్యతిరేకముగా పగ తీర్చుకోలేకపోయిరని చూచినపుడు, వారి సహోదరులైన ఆంటై-నీఫై-లీహై జనులకు వ్యతిరేకముగా వారు జనులను పురిగొల్పుట మొదలుపెట్టిరి; కావున వారు మరలా వారిని నాశనము చేయసాగిరి.

3 ఈ జనులు వారి ఆయుధములను తీసుకొనుటకు మరలా తిరస్కరించి, వారి శత్రువుల కోరికలను బట్టి సంహరింపబడుటకు అనుమతించుకొనిరి.

4 ఇప్పుడు వారు మిక్కిలిగా ప్రేమించిన వారి మధ్య మరియు వారిని మిక్కిలిగా ప్రేమించు వారి మధ్య ఈ నాశన క్రియను అమ్మోన్‌, అతని సహోదరులు చూచినప్పుడు—ఏలయనగా వారిని నిత్య నాశనము నుండి రక్షించుటకు దేవుని నుండి పంపబడిన దేవదూతలుగా వారు చూడబడిరి—కావున అమ్మోన్‌, అతని సహోదరులు ఈ గొప్ప నాశనక్రియను చూచినప్పుడు వారు జాలితో కదిలించబడి, రాజుతో ఇట్లనిరి:

5 ప్రభువు యొక్క ఈ జనులను మనము సమకూర్చి, మన సహోదరులైన నీఫైయుల యొద్దకు జరహేమ్ల దేశమునకు వెళ్ళుదము మరియు మనము నాశనము చేయబడకుండునట్లు మన శత్రువుల చేతులలో నుండి బయటకు పారిపోవుదము.

6 కానీ రాజు వారితో ఇట్లనెను: ఇదిగో, వారికి వ్యతిరేకముగా మేము చేసిన అనేక హత్యలు, పాపములను బట్టి నీఫైయులు మమ్ములను నాశనము చేసెదరు.

7 అప్పుడు అమ్మోన్‌ ఇట్లనెను: నేను వెళ్ళి ప్రభువు వద్ద విచారించెదను; మన సహోదరుల యొద్దకు వెళ్ళమని ఆయన మనతో చెప్పిన యెడల మీరు వచ్చెదరా?

8 అంతట రాజు అతనితో ఇట్లు చెప్పెను: ప్రభువు వెళ్ళమని మాతో చెప్పిన యెడల, మేము మన సహోదరుల యొద్దకు వచ్చెదము; వారికి వ్యతిరేకముగా మేము చేసిన అనేక హత్యలు, పాపములకు పరిహారము చేయు వరకు మేము వారి బానిసలుగా ఉండెదము.

9 కానీ అమ్మోన్‌ అతనితో ఇట్లనెను: వారి మధ్య బానిసలుండుట నా తండ్రి చేత స్థాపించబడిన మన సహోదరుల యొక్క చట్టమునకు వ్యతిరేకము; కావున మనము వెళ్ళి, మన సహోదరుల కనికరములపై ఆధారపడెదము.

10 కానీ రాజు అతనితో—ప్రభువు వద్ద విచారించుము మరియు వెళ్ళమని ఆయన మనకు చెప్పిన యెడల మనము వెళ్ళుదము, లేని యెడల మనము దేశమందే నశించెదము అనెను.

11 అప్పుడు అమ్మోన్‌ వెళ్ళి ప్రభువు వద్ద విచారించెను మరియు ప్రభువు అతనితో ఇట్లు చెప్పెను:

12 వారు నాశనము కాకుండునట్లు ఈ జనులను ఈ దేశము నుండి బయటకు తీసుకొనిపొమ్ము. ఏలయనగా తమ సహోదరులను సంహరించుటకు వారికి వ్యతిరేకముగా లేమనీయులను కోపమునకు పురిగొల్పే అమలేకీయుల హృదయములపై సాతాను గొప్ప పట్టు కలిగియున్నాడు; కావున ఈ దేశము నుండి నీవు బయటకు పొమ్ము; ఈ తరములోని ఈ జనులు ఆశీర్వదింపబడియున్నారు, ఏలయనగా నేను వారిని కాపాడుదును.

13 ఇప్పుడు అమ్మోన్‌ వెళ్ళి, ప్రభువు అతనితో చెప్పిన మాటలన్నిటినీ రాజుకు చెప్పెను.

14 వారు తమ సమస్త జనులను, ముఖ్యముగా ప్రభువు యొక్క జనులందరిని సమకూర్చిరి మరియు వారి మందలు, గుంపులన్నిటితో సమకూడి దేశము నుండి బయటకు వెడలిపోయి జరహేమ్ల దేశము నుండి నీఫై దేశమును విడదీయు అరణ్యములోనికి దేశ సరిహద్దుల వద్దకు వచ్చిరి.

15 ఇప్పుడు అమ్మోన్‌ వారితో ఇట్లనెను—ఇదిగో నేను, నా సహోదరులు జరహేమ్ల దేశములోనికి వెళ్ళెదము మరియు మేము తిరిగి వచ్చు వరకు మీరిక్కడ నిలిచియుండవలెను; మీరు వారి దేశములోనికి వచ్చుటకు వారు ఒప్పుకొందురో లేదోయని మన సహోదరుల అభిప్రాయమును మేము కనుగొనెదము.

16 మరియు అమ్మోన్‌ దేశములోనికి పోవుచుండగా అతడు, అతని సహోదరులు చెప్పబడిన స్థలమందు ఆల్మాను కలుసుకొనిరి; ఇది ఒక సంతోషకరమైన కలయిక అయ్యుండెను.

17 ఇప్పుడు అమ్మోన్‌ మనస్సు గొప్ప ఆనందముతో నింపబడెను; అతని శక్తి హరింపబడునంతగా అతడు దేవుని యొక్క సంతోషమందు కొనిపోబడెను; మరియు అతడు తిరిగి నేలపై పడెను.

18 ఇది అధికమైన సంతోషము కాదా? ఇదిగో నిజముగా పశ్చాత్తాపపడి, సంతోషమును వినయముగా వెదకువాడు తప్ప ఎవడును పొందని సంతోషమిది.

19 ఇప్పుడు అతని సహోదరులను కలుసుకొనినందుకు ఆల్మా మిక్కిలి సంతోషించెను; అహరోను, ఓమ్నెర్‌ మరియు హింనై కూడా అధికముగా సంతోషించిరి, కానీ వారి సంతోషము వారి శక్తిని మించలేదు.

20 మరియు ఆల్మా అతని సహోదరులను జరహేమ్ల దేశములో తన గృహమునకు తీసుకువెళ్ళెను; వారు వెళ్ళి, వారి సహోదరులైన లేమనీయుల మధ్య నీఫై దేశమందు వారికి జరిగిన క్రియలన్నిటినీ ప్రధాన న్యాయాధిపతికి చెప్పిరి.

21 అప్పుడు ఆంటై-నీఫై-లీహై జనులైన తమ సహోదరులను అనుమతించుటను గూర్చి జనుల అభిప్రాయమును కోరుచూ ప్రధాన న్యాయాధిపతి దేశమంతటా ఒక ప్రకటన పంపెను.

22 మరియు జనుల యొక్క స్వరము ఇట్లు చెప్పుచు వచ్చెను: ఇదిగో సముద్రము ప్రక్కగా తూర్పున సమృద్ధిదేశము సరిహద్దునున్న జెర్షోన్‌ దేశమును మేము వారికి ఇచ్చివేయుదుము; అది సమృద్ధిదేశమునకు దక్షిణమున ఉన్నది మరియు ఈ జెర్షోన్‌ దేశమే మనము మన సహోదరులకు స్వాస్థ్యముగా ఇచ్చు దేశము.

23 ఇదిగో మనము జెర్షోన్‌ దేశములో మన సహోదరులను కాపాడగలుగునట్లు మన సైన్యములను జెర్షోన్‌ దేశము మరియు నీఫై దేశము మధ్య ఉంచుదము; వారు పాపము చేయునట్లు వారి సహోదరులకు వ్యతిరేకముగా ఆయుధములను తీసుకొందురేమోనను వారి భయము కారణముగా మన సహోదరుల కొరకు మనమిది చేయుదము; వారి అనేక హత్యలు మరియు భయంకరమైన దుష్టత్వమును బట్టి వారు పొందిన కఠినమైన పశ్చాత్తాపము వలన వారికి ఈ గొప్ప భయము వచ్చెను.

24 ఇప్పుడు ఇదిగో, వారు జెర్షోన్‌ దేశమును స్వాస్థ్యపరచుకొనునట్లు దీనిని మనము మన సహోదరుల కొరకు చేయుదము; మనము మన సైన్యములను పోషించగలుగునట్లు వారు కలిగియున్న దానినుండి ఒక భాగమును వారు మనకు ఇచ్చెదరను షరతుపైన, మన సైన్యములనుపయోగించి వారి శత్రువుల నుండి వారిని మనము రక్షించెదము.

25 అమ్మోన్‌ దీనిని వినినప్పుడు, అతడు మరియు అతనితోపాటు ఆల్మా కూడా ఆంటై-నీఫై-లీహై జనుల యొద్దకు, వారు తమ గుడారములను వేసుకొనిన అరణ్యములోనికి తిరిగి వెళ్ళి, ఈ సంగతులన్నిటినీ వారికి తెలియజేసిరి. ఆల్మా కూడా అమ్మోన్‌, అహరోను మరియు అతని సహోదరులతోపాటు తన పరివర్తనను గూర్చి వారికి వివరించెను.

26 అది వారి మధ్య గొప్ప సంతోషమును కలుగజేసెను. వారు జెర్షోన్‌ దేశములోనికి వెళ్ళి, జెర్షోన్‌ దేశమును స్వాధీనపరచుకొనిరి; వారు నీఫైయుల చేత అమ్మోన్‌ యొక్క జనులని పిలువబడిరి; కావున అప్పటినుండి వారు ఆ పేరు చేత ప్రత్యేకపరచబడిరి.

27 వారు నీఫై జనుల మధ్య ఉండి, దేవుని సంఘమునకు చెందిన జనుల మధ్య లెక్కింపబడిరి. దేవుని యెడల, మనుష్యుల యెడల వారి ఆసక్తి నిమిత్తము కూడా వారు ప్రత్యేకపరచబడిరి. ఏలయనగా వారు అన్ని విషయములలో పరిపూర్ణముగా నమ్మకముగాను నిజాయితీగాను ఉండిరి మరియు చివరి వరకు వారు క్రీస్తు యొక్క విశ్వాసమందు స్థిరముగానుండిరి.

28 వారి సహోదరుల రక్తమును చిందించుటను వారు మిక్కిలి అసహ్యముతో చూచిరి; వారి సహోదరులకు వ్యతిరేకముగా ఆయుధములను పైకెత్తుటకు వారెన్నడూ ఒప్పించబడలేదు; వారి నిరీక్షణ మరియు క్రీస్తు యొక్కయు పునరుత్థానము యొక్కయు ఉద్దేశ్యముల నిమిత్తము, వారు ఎన్నడూ మరణమునకు భయపడలేదు; కావున, దానిపై క్రీస్తు యొక్క విజయము ద్వారా మరణము వారికొరకు మ్రింగి వేయబడెను.

29 కావున వారి సహోదరులను చంపుటకు వారు ఖడ్గమును లేదా వంపుకత్తిని దూయుటకంటే, వారి సహోదరుల చేత మిక్కిలి తీవ్రమైన దుఃఖకరమైన విధముగా మరణమును అనుభవించుటకు వారు కోరుదురు.

30 ఆ విధముగా వారు ఆసక్తి కలిగిన ప్రియులైన జనులుగా, ప్రభువుచేత అధిక అనుగ్రహము పొందిన జనులుగానుండిరి.