లేఖనములు
ఆల్మా 28


28వ అధ్యాయము

లేమనీయులు ఒక భయంకరమైన యుద్ధమందు ఓడించబడుదురు—పదుల వేలమంది సంహరించబడుదురు—దుష్టులు అంతము లేని వేదన యొక్క స్థితికి అప్పగించబడుదురు; నీతిమంతులు ఎన్నడూ అంతము కాని సంతోషమును సంపాదించెదరు. సుమారు క్రీ. పూ. 77–76 సం.

1 ఇప్పుడు అమ్మోన్‌ యొక్క జనులు జెర్షోన్‌ దేశమందు స్థిరపడి, జెర్షోన్‌ దేశమందు ఒక సంఘము స్థాపించబడి, నీఫైయుల సైన్యములు జెర్షోన్‌ దేశము చుట్టూ జరహేమ్ల దేశము చుట్టూ ఉన్న సరిహద్దులన్నిటియందు నిలిచిన తరువాత, లేమనీయుల సైన్యములు అరణ్యములోనికి వారి సహోదరులను వెంబడించెను.

2 ఆ విధముగా అక్కడ ఒక భయంకరమైన యుద్ధముండెను; ముఖ్యముగా లీహై యెరూషలేమును వదిలివచ్చిన సమయము నుండి దేశమందున్న జనులందరి మధ్య ఎన్నడూ జరుగనటువంటిది; అందులో పదుల వేలమంది లేమనీయులు సంహరించబడి, దూరముగా చెదరగొట్టబడిరి.

3 నీఫై జనుల మధ్య కూడా భయంకరమైన సంహారముండెను; అయినప్పటికీ లేమనీయులు తరుమబడి, చెదరగొట్టబడిరి మరియు నీఫై జనులు వారి దేశమునకు తిరిగి వచ్చిరి.

4 ఇప్పుడు దేశమంతటా నీఫై జనులందరి మధ్య అధిక దుఃఖము, విలాపము ఉన్న సమయమిది—

5 తమ భర్తల కొరకు విధవరాండ్రు, తమ కుమారుల కొరకు తండ్రులు, సహోదరుని కొరకు కుమార్తె, తండ్రి కొరకు సహోదరుడు రోదించుచుండెను. ఆ విధముగా సంహరించబడిన తమ బంధువుల కొరకు రోదించుచున్న వారందరి మధ్య దుఃఖవిలాపములు వినబడెను.

6 నిశ్చయముగా ఇది దుఃఖపూరితమైన దినము; ముఖ్యముగా గంభీరమైన సమయము, అధిక ఉపవాస ప్రార్థనాసమయమైయుండెను.

7 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదిహేనవ సంవత్సరము ముగిసెను;

8 ఇది అమ్మోన్‌ మరియు అతని సహోదరులు, నీఫై దేశమందు వారి ప్రయాణములు, దేశమందు వారి బాధలు, దుఃఖము, శ్రమలు, గ్రహింపశక్యముకాని వారి సంతోషము, జెర్షోన్‌ దేశమందున్న సహోదరుల ఆదరణ మరియు క్షేమము యొక్క వృతాంతము. ఇప్పుడు మనుష్యులందరి విమోచకుడైన ప్రభువు, నిత్యము వారి ఆత్మలను ఆశీర్వదించు గాక.

9 ఇది నీఫైయుల మధ్య యుద్ధములు వివాదముల యొక్కయు, నీఫైయులు లేమనీయుల మధ్య యుద్ధముల యొక్కయు వృత్తాంతము; మరియు న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదిహేనవ సంవత్సరము ముగిసెను.

10 మొదటి సంవత్సరము నుండి పదిహేనవ దాని వరకు అనేక వేల ప్రాణ నష్టము జరిగెను; అది భయంకరమైన రక్తపాతమును తలపించెను.

11 అనేక వేల శరీరములు భూముఖముపై రాశులుగా కుళ్ళుచుండగా, అనేక వేల శరీరములు భూమిలో పాతిపెట్టబడినవి; అనేక వేలమంది వారి బంధువులను కోల్పోయినందున దుఃఖించుచున్నారు; ఏలయనగా ప్రభువు యొక్క వాగ్దానముల ప్రకారము వారు అంతములేని వేదన యొక్క స్థితికి అప్పగించబడియున్నారని భయపడుటకు వారు కారణము కలిగియున్నారు.

12 ఇతరులలో అనేక వేలమంది తమ బంధువులను కోల్పోవుట వలన నిజముగా దుఃఖించుచున్నప్పటికీ, వారు సంతోషించి నీరీక్షణ యందు ఆనందించుదురు మరియు ప్రభువు యొక్క వాగ్దానముల ప్రకారము వారు దేవుని కుడి పార్శ్వమున ఎన్నడూ అంతము కాని సంతోషము యొక్క స్థితిలో నివసించుటకు లేపబడుదురని కూడా ఎరుగుదురు.

13 ఆ విధముగా పాపము, అతిక్రమము మూలముగా మరియు మనుష్యుల హృదయములను వలలో చిక్కించుకొనుటకు అతడు పన్నిన మోసకరపు ప్రణాళికల ద్వారా వచ్చు అపవాది యొక్క శక్తిని బట్టి మనుష్యుని అసమానత్వము ఎంత గొప్పదో మనము చూచుచున్నాము.

14 ఆ విధముగా ప్రభువు యొక్క ద్రాక్షాతోటలందు శ్రద్ధగా పనిచేయుటకు మనుష్యుల యొక్క గొప్ప పిలుపును మనము చూచుచున్నాము; ఆ విధముగా మనము దుఃఖము, సంతోషము యొక్క గొప్ప హేతువును—మనుష్యుల మధ్య మరణము మరియు నాశనమును బట్టి దుఃఖమును, జీవమునకు క్రీస్తు యొక్క వెలుగును బట్టి సంతోషమును చూచుచున్నాము.