లేఖనములు
ఆల్మా 29


29వ అధ్యాయము

దేవదూత వంటి ఉత్సాహముతో ఆల్మా పశ్చాత్తాపమును ప్రకటించుటకు కోరును—ప్రభువు సమస్త జనములకు బోధకులను అనుగ్రహించును—ప్రభువు యొక్క కార్యమందు, అమ్మోన్‌ మరియు అతని సహోదరుల విజయమందు ఆల్మా ఆనందించును. సుమారు క్రీ. పూ. 76 సం.

1 ఓ, నేను ఒక దేవదూతనైయుండి ముందుకు వెళ్ళి, భూమిని కంపింపజేయు స్వరముతో ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపమును ప్రకటించుచూ దేవుని బూరతో మాట్లాడవలెనను నా హృదయ నివేదనను నెరవేర్చుకొనగలిగిన ఎంత మేలు!

2 భూముఖమంతటిపై ఇక దుఃఖము ఉండకుండునట్లు వారు పశ్చాత్తాపపడి, మన దేవుని యొద్దకు రావలెనని ఉరుము వంటి స్వరముతో ప్రతి ఆత్మకు నేను పశ్చాత్తాపమును, విమోచన ప్రణాళికను ప్రకటించెదను.

3 కానీ, నేనొక మనుష్యుడను మరియు నా కోరికయందు పాపము చేయుచున్నాను; ఏలయనగా ప్రభువు నాకు అప్పగించిన వాటితో నేను తృప్తిపడవలయును.

4 నేను నా కోరికలయందు న్యాయవంతుడైన దేవుని యొక్క స్థిరమైన విధిని మార్చుటకు ప్రయత్నించరాదు, ఏలయనగా మరణమునకు లేదా జీవమునకు వారి కోరికను బట్టి ఆయన మనుష్యులకు అనుగ్రహించునని నేనెరుగుదును; ఆయన మనుష్యులకు వారి భాగమునిచ్చునని, రక్షణ కొరకే గాని, నాశనము కొరకే గాని వారి చిత్తములను బట్టి మార్చబడని విధులను వారికి విధించునని నేనెరుగుదును.

5 మనుష్యులందరి యెదుట మంచి, చెడులున్నవని నేనెరుగుదును; చెడు నుండి మంచిని ఎరుగని వాడు నిర్దోషి; కానీ మంచి చెడులను ఎరిగినవానికి అతడు కోరుకొను కోరికలను బట్టి, మంచి లేదా చెడు, జీవము లేదా మరణము, సంతోషము లేదా మనస్సాక్షి యొక్క పశ్చాత్తాపము ఇవ్వబడును.

6 ఇప్పుడు నేను ఈ సంగతులను ఎరిగియున్నానని చూచి, నేను పిలువబడిన ఆ పనిని నెరవేర్చుటకంటే అధికముగా నేనెందుకు కోరవలెను?

7 భూమి యొక్క సమస్త అంచుల వరకు మాట్లాడునట్లు నేనొక దేవదూతను కావలెనని నేనెందుకు కోరుకొనవలెను?

8 ఏలయనగా వారి స్వంత జనమునుండి, భాషనుండి ఆయన వాక్యమును మరియు వారు కలిగియుండుటకు సరియైనదని ఆయన వివేకమందు చూచు సమస్తమును బోధించుటకు ప్రభువు సమస్త జనములకు అనుగ్రహించును; కావున న్యాయమైన, సత్యమైన దానిని బట్టి ప్రభువు వివేకమందు ఆలోచన చేయునని మనము చూచుచున్నాము.

9 ప్రభువు నాకిచ్చిన ఆజ్ఞను నేనెరుగుదును మరియు దానియందు నేను అతిశయించెదను. నన్ను గూర్చి నేను అతిశయించనుగాని ప్రభువు నాకిచ్చిన ఆజ్ఞయందు నేను అతిశయించెదను. కొన్ని ఆత్మలనైనా పశ్చాత్తాపపడునట్లు చేయుటకు దేవుని హస్తములలో బహుశా నేను ఒక సాధనముగా ఉందునేమోననునది నా అతిశయమైయున్నది, మరియు ఇది నా సంతోషమైయున్నది.

10 ఇదిగో నా సహోదరులలో అనేకులు నిజముగా పశ్చాత్తాపపడి, వారి దేవుడైన ప్రభువు వద్దకు వచ్చుటను నేను చూచినప్పుడు, నా ఆత్మ సంతోషముతో నిండును; అప్పుడు ప్రభువు నా పట్ల చేసిన దానిని, ముఖ్యముగా ఆయన నా ప్రార్థనను వినెనని నేను జ్ఞాపకము చేసుకొనెదను; ఆయన నా వైపు చాపిన కనికరబాహువును నేను జ్ఞాపకము చేసుకొనెదను.

11 నేను, నా పితరుల యొక్క చెరను కూడా జ్ఞాపకము చేసుకొనెదను; ఏలయనగా ప్రభువు వారిని దాస్యమునుండి విడిపించెనని, దీని ద్వారా ఆయన సంఘమును స్థాపించెనని నిశ్చయముగా నేనెరుగుదును; ప్రభువైన దేవుడు, అబ్రాహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు మరియు యాకోబు యొక్క దేవుడు వారిని దాస్యము నుండి విడిపించెను.

12 నేను ఎల్లప్పుడు నా పితరుల యొక్క చెరను జ్ఞాపకము చేసుకొంటిని; ఐగుప్తీయుల చేతులలో నుండి వారిని విడిపించిన ఆ దేవుడే దాస్యము నుండి వారిని విడిపించెను.

13 ఆ దేవుడే వారి మధ్య తన సంఘమును స్థాపించెను; ఆ దేవుడే ఈ జనులకు వాక్యమును బోధించుటకు నన్ను ఒక పరిశుద్ధ పిలుపుతో పిలిచి నాకు అధిక విజయమునిచ్చెను, దాని యందు నా సంతోషము సంపూర్ణమైనది.

14 నేను నా విజయమందు మాత్రమే సంతోషించను, కానీ నీఫై దేశమునకు వెళ్ళిన నా సహోదరుల విజయమును బట్టి నా సంతోషము మరింత సంపూర్ణమైనది.

15 వారు అధికముగా శ్రమపడి అధిక ఫలమును ఫలించిరి; వారి బహుమానము ఎంత గొప్పగానుండును!

16 ఇప్పుడు, ఈ నా సహోదరుల విజయమును గూర్చి నేను తలంచినప్పుడు శరీరము నుండి నా ఆత్మ వేరు చేయబడుచున్నట్లు కొనిపోబడుచున్నది, నా సంతోషము అంత అధికముగానున్నది.

17 ఇప్పుడు వారు దేవుని రాజ్యమందు కూర్చొనునట్లు దేవుడు ఈ నా సహోదరులకు; వారికమీదట బయటకు పోకుండునట్లు, ఆయనను నిత్యము స్తుతించునట్లు వారి శ్రమల ఫలమైన వారందరికి అనుగ్రహించుగాక. మరియు నా మాటల ప్రకారము నేను పలికిన విధముగా జరుగునట్లు దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్‌.