లేఖనములు
ఆల్మా 3


3వ అధ్యాయము

ప్రవచన వాక్య ప్రకారము, అమ్లిసైయులు తమపై ముద్రవేసుకొనిరి—లేమనీయులు తమ తిరుగుబాటు నిమిత్తము శపించబడిరి—మనుష్యులు తమ శాపములను తమపైకి తెచ్చుకొందురు—నీఫైయులు, మరియొక లేమనీయ సైన్యమును ఓడించుదురు. సుమారు క్రీ. పూ. 87–86 సం.

1 యుద్ధ ఆయుధముల చేత సంహరింపబడని ఆ నీఫైయులు, సంహరింపబడిన వారిని పాతిపెట్టిన తరువాత—ఇప్పుడు అధిక సంఖ్యాకులు సంహరింపబడినందున, వారు లెక్కింపబడలేదు—వారు తమ మృతులను పాతిపెట్టుట ముగించిన తరువాత, వారందరు తమ దేశములకు, తమ గృహములకు, తమ భార్యాపిల్లల యొద్దకు తిరిగి వెళ్ళిరి.

2 అనేకమంది స్త్రీలు, పిల్లలు, వారి మందలు, గుంపులనేకములు ఖడ్గము చేత సంహరింపబడెను; సైన్యముల చేత త్రొక్కివేయబడినందున వారి పంట పొలములనేకము కూడా నాశనము చేయబడెను.

3 ఇప్పుడు సీదోను నది ఒడ్డున సంహరింపబడిన లేమనీయులు, అమ్లిసైయులనేకులు సీదోను జలములలోనికి పడవేయబడిరి; వారి ఎముకలు సముద్రపు లోతులలో ఉన్నవి మరియు అవి అనేకమైయున్నవి.

4 అమ్లిసైయులు, నీఫైయుల నుండి వేరుగా గుర్తింపును కలిగియున్నారు, ఏలయనగా లేమనీయుల సాంప్రదాయమును బట్టి వారు తమ నొసళ్ళయందు ఎరుపు ముద్ర వేసుకొనియున్నారు; అయినప్పటికీ లేమనీయుల వలే వారు తమ తలలను గొరిగించుకొనలేదు.

5 లేమనీయుల తలలు గొరగబడియుండెను. వారి నడుములకు చుట్టుకున్న చర్మము మరియు చుట్టూ చుట్టుకున్న వారి కవచము, వారి విల్లులు, బాణములు, రాళ్ళు, వడిసెలు మొదలైనవి తప్ప, వారు దిగంబరులుగా ఉండిరి.

6 వారి పితరులపై ఉంచబడిన గుర్తును బట్టి, లేమనీయుల చర్మములు నల్లగా ఉండెను, అది వారి అతిక్రమము వలన మరియు న్యాయవంతులు, పరిశుద్ధులైన వారి సహోదరులు నీఫై, జేకబ్, జోసెఫ్‌, శామ్‌లకు వ్యతిరేకముగా వారి తిరుగుబాటు వలన వారి మీద ఒక శాపముగా ఉండెను.

7 వారి సహోదరులు వారిని నాశనము చేయుటకు కోరినందున వారు శపించబడిరి; ప్రభువైన దేవుడు వారి మీద, అనగా లేమన్‌, లెమ్యుయెల్‌ల మీద, ఇష్మాయెల్ కుమారులు, ఇష్మాయేలీయుల స్త్రీల మీద ఒక గుర్తునుంచెను.

8 వారి సంతానము వారి సహోదరుల సంతానము నుండి ప్రత్యేకపరచబడునట్లు, తద్వారా ప్రభువైన దేవుడు తన జనులను కాపాడగలుగునట్లు మరియు వారు తమను నాశనమునకు నడిపించు లేమనీయుల తప్పుడు ఆచారములందు విశ్వసించి వారితో చేరకుండునట్లు ఇది చేయబడెను.

9 తమ సంతానమును లేమనీయుల సంతానముతో చేర్చువారు అదే శాపమును తమ సంతానము పైకి తెచ్చెదరు.

10 కావున, లేమనీయుల చేత త్రోవ తప్పించబడుటకు తనను అనుమతించుకొనువాడు ఆ పేరుతో పిలువబడెను మరియు అతనిపై ఒక గుర్తు ఉంచబడెను.

11 లేమనీయుల ఆచారమందు విశ్వసించక, యెరూషలేము దేశము నుండి బయటకు తేబడిన ఆ వృత్తాంతములందు మరియు సత్యమైన వారి పితరుల ఆచారములందు విశ్వసించిన వారు, దేవుని ఆజ్ఞల యందు నమ్మికయుంచి, వాటిని గైకొనిన వారు ఆ సమయము నుండి నీఫైయులు లేదా నీఫై జనులని పిలువబడిరి—

12 తమ జనుల యొక్క, లేమనీయుల యొక్క యథార్థ వృత్తాంతములను భద్రపరచిన వారు వీరే.

13 ఇప్పుడు మనము అమ్లిసైయుల యొద్దకు తిరిగి వెళ్ళుదము, ఏలయనగా వారిపై కూడా ఒక గుర్తు ఉంచబడెను; వారు తమపై ఒక గుర్తును, అనగా తమ నొసళ్ళ మీద ఒక ఎఱ్ఱటి గుర్తును ఉంచుకొనియున్నారు.

14 ఆ విధముగా దేవుని వాక్యము నెరవేరెను, ఏలయనగా ఆయన నీఫైకి చెప్పిన మాటలు ఇవే: ఇదిగో, లేమనీయులను నేను శపించియున్నాను, నేను వారి మీద కనికరము కలిగియుండునట్లు వారు తమ దుష్టత్వమును గూర్చి పశ్చాత్తాపపడి నా వైపు తిరుగని యెడల, ఈ సమయము నుండి మొదలుకొని వారు, వారి సంతానము మీ నుండి, మీ సంతానము నుండి శాశ్వతముగా వేరుచేయబడునట్లు నేను వారిపై ఒక గుర్తునుంచెదను.

15 మరలా, నీ సహోదరులతో తన సంతానమును చేర్చువాడు కూడా శపించబడునట్లు వానిపై నేను ఒక గుర్తును ఉంచెదను.

16 నీకు, నీ సంతానమునకు వ్యతిరేకముగా యుద్ధము చేయు వానిపై నేను ఒక గుర్తును ఉంచెదను.

17 నీ నుండి విడిపోవువాడు ఇక నీ సంతానమని పిలువబడడని నేను చెప్పుచున్నాను; ఇప్పటి నుండి మరియు నిరంతరము నిన్ను, నీ సంతానమని పిలువబడిన వారిని నేను ఆశీర్వదించెదను; మరియు నీఫైకి, అతని సంతానమునకు ప్రభువు చేసిన వాగ్దానములివి.

18 ఇప్పుడు వారు తమ నొసళ్ళ యందు గుర్తును ఉంచుకొనుట ప్రారంభించినప్పుడు, తాము దేవుని వాక్యములను నెరవేర్చుచున్నామని అమ్లిసైయులు ఎరుగరు; అయినప్పటికీ వారు దేవునికి వ్యతిరేకముగా బహిరంగ తిరుగుబాటు చేసిరి; కావున వారిపై శాపము వచ్చుట అవసరమాయెను.

19 ఇప్పుడు వారు తమపై శాపము తెచ్చుకొన్నారని మీరు చూడవలెనని నేను కోరుచున్నాను; ఆ విధముగానే శపించబడిన ప్రతి మనుష్యుడు తనపైతాను శిక్షావిధిని తెచ్చుకొనును.

20 ఇప్పుడు జరహేమ్ల దేశమందు లేమనీయులు, అమ్లిసైయులతో యుద్ధము జరిగి ఎంతోకాలము కాకమునుపే మొదటి సైన్యము అమ్లిసైయులను కలుసుకొనిన అదే స్థలమందు లేమనీయుల మరియొక సైన్యము నీఫై జనులపైన వచ్చిపడెను.

21 వారిని తమ దేశము నుండి బయటకు తరిమివేయుటకు ఒక సైన్యము పంపబడెను.

22 ఇప్పుడు, గాయము చేత బాధింపబడుచున్నందున ఆల్మా ఈ సమయమున లేమనీయులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వెళ్ళలేదు;

23 కానీ అతడు, వారికి వ్యతిరేకముగా అసంఖ్యాక సైన్యమును పంపెను; వారు వెళ్ళి లేమనీయులలో అనేకులను సంహరించి, వారి శేషమును తమ దేశ సరిహద్దులలో నుండి బయటకు పారద్రోలిరి.

24 అప్పుడు వారు తిరిగి వచ్చి దేశమందు సమాధానమును స్థాపించుట ప్రారంభించిరి, కొంతకాలము పాటు తమ శత్రువుల చేత ఇక బాధింపబడకుండిరి.

25 ఇప్పుడు ఈ విషయములన్నియు, అనగా ఈ యుద్ధములు, వివాదములన్నియు న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఐదవ సంవత్సరమందే ప్రారంభమై, అంతమాయెను.

26 మరియు అవి మంచివేగాని చెడ్డవేగాని, వారి క్రియలను బట్టి వారు తమ ప్రతిఫలమును పొందునట్లు, అది మంచి ఆత్మయేగాని చెడ్డదేగాని, వారు లోబడుటకు ఎన్నుకొనిన ఆ ఆత్మను బట్టి నిత్య సంతోషము లేదా నిత్య దౌర్భాగ్యము పొందుటకు ఒకే సంవత్సరమందు వేలు, పదుల వేల ఆత్మలు నిత్య లోకమునకు పంపబడెను.

27 ఏలయనగా ప్రతి మనుష్యుడు తాను లోబడుటకు ఎన్నుకొను వాని నుండి జీతము తీసుకొనును, ఇది ప్రవచనాత్మ యొక్క వాక్యముల ప్రకారము జరుగును; కావున, సత్యమును బట్టి దానినట్లు ఉండనిమ్ము. ఆ విధముగా న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఐదవ సంవత్సరము ముగిసెను.