లేఖనములు
ఆల్మా 31


31వ అధ్యాయము

విశ్వాసభ్రష్టులైన జోరమీయులను సరిదిద్దుటకు ఒక సువార్త సేవకు ఆల్మా నాయకత్వము వహించును—జోరమీయులు క్రీస్తును నిరాకరించుదురు, ఎన్నికను గూర్చి ఒక అసత్యపు భావన యందు విశ్వసించుదురు మరియు ఒకే విధమైన ప్రార్థనలతో ఆరాధింతురు—సువార్తికులు పరిశుద్ధాత్మతో నింపబడుదురు—వారి శ్రమలు క్రీస్తును గూర్చిన సంతోషమందు హరించివేయబడెను. సుమారు క్రీ. పూ. 74 సం.

1 ఇప్పుడు కొరిహోర్‌ అంతరించిన తర్వాత, జోరమీయులు ప్రభువు యొక్క మార్గములను చెరుపుచున్నారని, వారి నాయకుడైన జోరమ్ మూగ విగ్రహములకు వంగి నమస్కరించుటకు జనుల హృదయములను నడిపించి వేయుచున్నాడను వార్తలను ఆల్మా అందుకొనినప్పుడు, అతని హృదయము జనుల దుర్నీతిని బట్టి తిరిగి వ్యధ చెందనారంభించెను.

2 ఏలయనగా తన జనుల మధ్య గల దుర్నీతిని గూర్చి తెలుసుకొనుట ఆల్మా యొక్క గొప్ప దుఃఖమునకు కారణమాయెను. కావున, నీఫైయుల నుండి జోరమీయుల యొక్క విభజనను బట్టి అతని హృదయము మిక్కిలి దుఃఖించెను.

3 ఇప్పుడు జోరమీయులు ఆంటియోనమ్ అని పిలిచిన దేశమందు తమను సమకూడియుండిరి, అది జెర్షోన్‌ దేశమునకు దక్షిణమున ఉన్న సముద్రపు ఒడ్డునకు దాదాపుగా సరిహద్దు పైన ఉన్న జరహేమ్ల దేశమునకు తూర్పున ఉండెను, అది దక్షిణమున ఉన్న అరణ్యమునకు సరిహద్దుగా కూడా ఉండెను, ఆ అరణ్యము లేమనీయులతో నిండియుండెను.

4 జోరమీయులు, లేమనీయులతో ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుదురని మరియు దాని మూలముగా తాము బాగా నష్టపోయెదమని నీఫైయులు అధికముగా భయపడిరి.

5 ఇప్పుడు వాక్యము యొక్క బోధన, న్యాయమైన దానిని చేయుటకు జనులను నడిపించుటలో అత్యంత ప్రభావవంతమైనందున—ఖడ్గము లేదా వారికి సంభవించిన ఇతర వాటన్నిటి కంటే జనుల మనస్సులపై అధిక శక్తివంతమైన ప్రభావము కలిగియున్నందున—దేవుని వాక్యము యొక్క ప్రభావమును వారు ప్రయత్నించుట ప్రయోజనకరమని ఆల్మా తలంచెను.

6 కావున అతడు అమ్మోన్‌, అహరోను మరియు ఓమ్నెర్‌ను తీసుకొని, హింనైని జరహేమ్లయందున్న సంఘమందు విడిచిపెట్టెను; కానీ ముందు చెప్పిన ముగ్గురినీ తనతో తీసుకొని, మీలెక్ వద్దనున్న అమ్యులెక్‌ను, జీజ్రొమ్‌ను మరియు తన కుమారులలో ఇద్దరిని కూడా తీసుకొనివెళ్ళెను.

7 ఇప్పుడు అతని కుమారులలో అందరికన్న పెద్దవానిని అతడు తనతో తీసుకువెళ్ళలేదు, అతని పేరు హీలమన్‌; కానీ అతనితో తీసుకువెళ్ళిన వారి పేర్లు షిబ్లోన్‌ మరియు కోరియాంటన్‌; ఇవి వాక్యమును బోధించుటకు జోరమీయుల మధ్యకు అతనితోపాటు వెళ్ళిన వారి పేర్లు.

8 జోరమీయులు, నీఫైయుల నుండి అసమ్మతితో విడిపోయిన వారు; కావున, వారు దేవుని వాక్యము బోధింపబడియుండిరి.

9 కానీ వారు గొప్ప తప్పిదములలో పడియుండిరి, ఏలయనగా వారు మోషే ధర్మశాస్త్రమును బట్టి దేవుని ఆజ్ఞలను, కట్టడలను పాటించరు.

10 లేక శోధనలోనికి ప్రవేశించకుండునట్లు ప్రతిదినము దేవుని ప్రార్థించి వేడుకొనుట యందు కొనసాగుటకు సంఘ ఆచరణలను వారు పాటించరు.

11 క్లుప్తముగా వారు అనేక సందర్భములలో ప్రభువు మార్గములను చెరిపిరి; కావున, ఈ కారణము చేత ఆల్మా మరియు అతని సహోదరులు వారికి వాక్యమును బోధించుటకు దేశములోనికి వెళ్ళిరి.

12 ఇప్పుడు వారు దేశమునకు వచ్చినప్పుడు, జోరమీయులు సమాజ మందిరములను కట్టియుండి, వారములో ఒకసారి ప్రభువు యొక్క దినమని వారు పిలిచిన దినమున వారు కూడుకొనుటను చూచి ఆశ్చర్యపడిరి; వారు ఆల్మా మరియు అతని సహోదరులు ఎన్నడూ చూసియుండని రీతిలో ఆరాధించిరి;

13 ఏలయనగా వారి సమాజ మందిరము మధ్యలో వారు నిలబడుటకు ఎత్తైన స్థలమును నిర్మించిరి, దాని పైభాగము ఒక్క వ్యక్తిని మాత్రమే అనుమతించును.

14 కావున ఆరాధించుటకు కోరిన వారెవరైనను ముందుకు వెళ్ళి, దాని పైభాగము మీద నిలబడి తన చేతులను పరలోకము వైపు చాపి, బిగ్గరగా ఇట్లు చెప్పుచూ కేకవేయవలెను:

15 పరిశుద్ధ, పరిశుద్ధ దేవా, నీవు దేవుడవని మేము నమ్ముచున్నాము మరియు నీవు పరిశుద్ధుడవని, నీవు ఆత్మయైయుంటివని, నీవు ఆత్మయైయున్నావని, నీవు ఎన్నటికీ ఆత్మయైయుందువని మేము నమ్ముచున్నాము.

16 పరిశుద్ధ దేవా, నీవు మమ్ములను మా సహోదరుల నుండి వేరుపరచియున్నావు; బుద్ధిహీనులైన వారి పితరుల ద్వారా వారికి అందించబడిన మా సహోదరుల సంప్రదాయమందు మేము నమ్ముటలేదు; కానీ నీవు మమ్ములను నీ పరిశుద్ధ సంతానముగా ఎన్నుకున్నావని మేము నమ్ముచున్నాము; మరియు ఏ క్రీస్తు ఉండబోడని నీవు మాకు తెలియజేసియున్నావు.

17 నీవు నిన్న, నేడు మరియు ఎన్నటికీ ఏకరీతిగా ఉన్నావు; మా చుట్టూ ఉన్న వారందరు నీ ఉగ్రత ద్వారా నరకమున పడవేయబడుటకు ఎన్నుకొనబడగా, మేము రక్షింపబడవలెనని నీవు మమ్ములను ఎన్నుకొనియున్నావు; ఆ పరిశుద్ధత నిమిత్తము ఓ దేవా, మేము నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాము; మా సహోదరుల యొక్క మూర్ఖపు సంప్రదాయముల వెంట మేము నడిపించి వేయబడకుండునట్లు నీవు మమ్ములను ఎన్నుకున్నందుకు కూడా మేము నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాము, ఆ సంప్రదాయము వారిని క్రీస్తునందు విశ్వాసమునకు బంధించివేయును మరియు మా దేవుడైన నీ నుండి దూరముగా తిరుగులాడుటకు వారి హృదయములను నడిపించివేయును.

18 మరలా ఓ దేవా, మేము ఎన్నుకొనబడిన వారమని, పరిశుద్ధ జనులైయున్నామని నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాము. ఆమేన్‌.

19 ఇప్పుడు ఆల్మా, అతని సహోదరులు మరియు అతని కుమారులు ఈ ప్రార్థనలను వినిన తరువాత, వారు అపరిమితముగా ఆశ్చర్యపడిరి.

20 ఏలయనగా, ప్రతి మనుష్యుడు ముందుకు వెళ్ళి అవే ప్రార్థనలను అర్పించెను.

21 ఇప్పుడు ఆ స్థలము వారి చేత రమీయంప్టమ్ అని పిలువబడెను, దాని అర్థము పరిశుద్ధ బల్ల.

22 వారు ఆయన చేత ఎన్నుకోబడిరని, ఆయన వారిని వారి సహోదరుల సంప్రదాయము వెంట నడిపించి వేయలేదని, వారికి తెలియని రాబోవు సంగతులయందు విశ్వాసముంచునట్లు వారు మోసగించబడలేదని వారి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచూ ఆ బల్ల పైనుండి వారిలో ప్రతీ ఒక్కరు సరిగ్గా అదే ప్రార్థనను దేవునికి అర్పించిరి.

23 జనులందరు ఈ విధముగా కృతజ్ఞతలు అర్పించిన తరువాత, వారు తమ గృహములకు తిరిగి వెళ్ళి, మరలా వారు ఈ రీతిన కృతజ్ఞతలు అర్పించుటకు పరిశుద్ధ బల్ల వద్ద తిరిగి సమావేశమగు వరకు తమ దేవుని గూర్చి వారు ఎన్నడూ మాట్లాడకయుండిరి.

24 ఇప్పుడు ఆల్మా దీనిని చూచినపుడు అతని హృదయము నొచ్చుకొనెను; ఏలయనగా వారు దుష్టులు, వక్రబుద్ధిగల జనులైయున్నారని; వారి హృదయములు వెండి బంగారములపై, అన్నిరకములైన శ్రేష్ఠమైన వస్తువులపై ఉన్నవని అతడు చూచెను.

25 అదేవిధముగా వారి హృదయములు గర్వమందు బహుగా అతిశయించుచున్నవని అతడు చూచెను.

26 అతడు పరలోకమునకు ఇట్లు బిగ్గరగా మొరపెట్టెను: ఓ ప్రభువా, నరుల సంతానము మధ్య తీవ్రమైన ఈ దుష్టత్వమును చూచుటకు ఇక్కడ నీ సేవకులు శరీరమందు నివసించుటకు నీవు ఎంతకాలము అనుమతించెదవు?

27 ఓ దేవా, వారు నీకు మొరపెట్టుచున్నారు, కానీ వారి హృదయములు గర్వమందు హరించి వేయబడియున్నవి. ఓ దేవా, తమ నోళ్ళతో వారు నీకు మొరపెట్టుచున్నారు, కానీ లోకము యొక్క వ్యర్థమైన సంగతులతో బహుగా వారు తమను హెచ్చించుకొనుచున్నారు.

28 ఓ నా దేవా, వారి ఖరీదైన వస్త్రములు, ఉంగరములు, కడియములు, బంగారు ఆభరణములు మరియు వారు ఆభరణములుగా ధరించుకున్న సమస్త ప్రశస్థ వస్తువులను చూడుము; వారి హృదయములు వాటిపైనున్నవి, ఇంకను వారు నీకు మొరపెట్టి—ఓ దేవా, ఇతరులు నశించుచుండగా మేము నీవు ఎన్నుకొనిన జనులైయున్నందున మేము నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాము అని చెప్పుచున్నారు.

29 మరియు ఏ క్రీస్తు ఉండబోడని నీవు వారికి తెలియజేసితివని వారు చెప్పుచున్నారు.

30 ప్రభువైన ఓ దేవా, ఈ జనుల మధ్య అట్టి దుష్టత్వమును, విశ్వాసరాహిత్యమును ఎంతకాలము నీవు అనుమతించెదవు? ఓ ప్రభువా, నేను నా బలహీనతలను భరించగలుగునట్లు నీవు నాకు శక్తినియ్యవా? ఏలయనగా నేను బలహీనుడను మరియు ఈ జనుల మధ్య అట్టి దుష్టత్వము నా ఆత్మను బాధపెట్టును.

31 ఓ ప్రభువా, నా హృదయము మిక్కిలి దుఃఖముతోనున్నది; నీవు క్రీస్తు నందు నా ఆత్మను ఓదార్చవా? ఓ ప్రభువా, నేను శక్తి కలిగియుండునట్లు, ఈ జనుల దుర్నీతిని బట్టి నాపై రాబోవు ఈ శ్రమలను నేను సహనముతో భరించగలుగునట్లు నీవు నన్ను అనుగ్రహించవా?

32 ఓ ప్రభువా, నీవు నా ఆత్మను ఓదార్చి, నాకు విజయమునియ్యవా? నాతోనున్న నా తోటి పనివారికి—అనగా అమ్మోన్‌, అహరోను, ఓమ్నెర్, అమ్యులెక్, జీజ్రొమ్ మరియు నా ఇద్దరు కుమారులకు కూడా ఇయ్యవా?—ఓ ప్రభువా వీరందరినీ నీవు ఓదార్చవా? వారి ఆత్మలను నీవు క్రీస్తునందు ఓదార్చవా?

33 ఈ జనుల దుర్ణీతులను బట్టి వారిపై రాబోవు బాధలను వారు సహించగలుగునట్లు, వారు శక్తి కలిగియుండునట్లు నీవు వారికి అనుగ్రహించవా?

34 ఓ ప్రభువా, క్రీస్తు నందు వారిని నీ యొద్దకు తిరిగి తీసుకొని వచ్చుటలో మేము విజయము పొందునట్లు నీవు మాకు అనుగ్రహించవా?

35 ఓ ప్రభువా, వారి ఆత్మలు శ్రేష్ఠమైనవి మరియు వారిలో అనేకులు మా సహోదరులు; కావున ఓ ప్రభువా, మా సహోదరులైన వీరిని మేము తిరిగి నీ యొద్దకు తీసుకొని రాగలుగునట్లు మాకు శక్తిని, తెలివిని ఇమ్ము.

36 ఇప్పుడు ఆల్మా ఈ మాటలను చెప్పినప్పుడు, తనతోనున్న వారందరిపై అతడు చేతులుంచెను మరియు అతడు వారిపై తన చేతులుంచగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి.

37 ఆ తరువాత వారేమి తిందురో, వారేమి త్రాగుదురో లేదా వారేమి ధరించుకొందురోయను ఆలోచన చేయక వారు ఒకరి నుండి ఒకరు తమను వేరుపరచుకొనిరి.

38 వారు ఆకలిగొనరాదని లేదా దప్పికగొనరాదని ప్రభువు వారికి సమకూర్చెను; మరియు క్రీస్తు యొక్క సంతోషమందు హరించివేయబడినవి తప్ప, ఏ విధమైన శ్రమలను వారు అనుభవించరాదని ఆయన వారికి శక్తినిచ్చెను. ఇప్పుడిది ఆల్మా యొక్క ప్రార్థనను బట్టి మరియు అతడు విశ్వాసముతో ప్రార్థించినందున జరిగెను.