లేఖనములు
ఆల్మా 32


32వ అధ్యాయము

తమ శ్రమల వలన వినయులైన బీదవారికి ఆల్మా బోధించును—విశ్వాసము, చూడబడనప్పటికీ సత్యమైన దానియందు ఒక నిరీక్షణయైయున్నది—దేవదూతలు స్త్రీ పురుషులకు, పిల్లలకు పరిచర్య చేయునని ఆల్మా సాక్ష్యమిచ్చును—వాక్యమును ఆల్మా ఒక విత్తనముతో పోల్చును—అది నాటబడి, పోషించబడవలెను—అప్పుడు అది ఒక వృక్షముగా ఎదిగి, దాని నుండి నిత్యజీవమను ఫలము కోయబడును. సుమారు క్రీ. పూ. 74 సం.

1 ఇప్పుడు వారు బయలు వెళ్ళి, వారి సమాజ మందిరములలోనికి వారి ఇండ్లలోనికి ప్రవేశించుచూ జనులకు దేవుని వాక్యము బోధించుట ప్రారంభించిరి; వారి వీధులలో కూడా వారు వాక్యము బోధించిరి.

2 వారి మధ్య అధిక ప్రయాసము తర్వాత జనుల యొక్క పేద వర్గము మధ్య వారు సఫలము కాసాగిరి; ఏలయనగా వారి వస్త్రముల మొరటుతనమును బట్టి వారు సమాజ మందిరముల నుండి బయటకు త్రోసివేయబడిరి.

3 కావున మలినముగా భావించబడి, దేవుని ఆరాధించుటకు వారి సమాజ మందిరములలోనికి ప్రవేశించుటకు వారు అనుమతించబడలేదు. వారు బీదవారు, కావున వారు తమ సహోదరుల చేత పనికిరానివారిగా భావించబడిరి; కావున లోక సంబంధమైన వస్తువుల విషయములో వారు బీదవారు, అంతేకాక వారు హృదయమందు దీనులైయున్నారు.

4 ఇప్పుడు ఆల్మా ఒనిడా కొండపై జనులకు బోధించుచు మాటలాడుచుండగా, మనము చెప్పుకున్నట్లు లోక సంబంధమైన వస్తువుల విషయమై తమ పేదరికము వలన హృదయమందు దీనులైన వారి గొప్ప సమూహమొకటి ఆయన యొద్దకు వచ్చెను.

5 వారు ఆల్మా యొద్దకు వచ్చిరి; వారి మధ్య అందరికన్నా ముందున్నవాడు అతనితో ఇట్లనెను: ఇదిగో, ఈ నా సహోదరులు ఏమి చేయవలెను? వారి పేదరికమును బట్టి వారు మనుష్యులందరి చేత, ముఖ్యముగా మా యాజకుల చేత తృణీకరింపబడిరి; మా స్వహస్తాలతో మేము అధికముగా శ్రమపడి నిర్మించిన మా సమాజ మందిరముల నుండి వారు మమ్ములను బయటకు గెంటివేసిరి; అధికమైన మా పేదరికమును బట్టి వారు మమ్ములను బయటకు గెంటివేసిరి; మా దేవుని ఆరాధించుటకు మేము ఏ స్థలము లేకయున్నాము మరియు మేమేమి చేయవలెను?

6 ఇప్పుడు ఆల్మా దీనిని వినినప్పుడు, అతడు తన ముఖమును సరిగ్గా అతనికి ఎదురుగా తిప్పి గొప్ప సంతోషముతో చూచెను; ఏలయనగా వారి శ్రమలు వారిని నిజముగా తగ్గించెనని, వారు దేవుని వాక్యము వినుటకు సిద్ధపడియున్నారని అతడు చూచెను.

7 కావున అతడు మిగతా సమూహమునకు ఏమియు చెప్పలేదు; కానీ అతడు తన చేతిని ముందుకు చాపి, నిజముగా పశ్చాత్తాపపడగా అతడు చూచియుండిన వారికి కేకవేసి వారితో ఇట్లు చెప్పెను:

8 మీరు దీనమనస్సు గలవారని నేను చూచుచున్నాను; అట్లయిన యెడల, మీరు ధన్యులు.

9 ఇదిగో, మేమేమి చేయవలెను?—మా దేవుని ఆరాధించలేనట్లు మా సమాజ మందిరముల నుండి మేము బయటకు గెంటివేయబడితిమని మీ సహోదరుడు పలికియున్నాడు.

10 ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను; మీ సమాజ మందిరములలో తప్ప, మరెక్కడా దేవుని ఆరాధించలేరని మీరు తలంచుచున్నారా?

11 ఇంకను నేను అడుగుచున్నాను, మీరు వారములో ఒక్కసారి తప్ప దేవుని ఆరాధించకూడదని తలంచుచున్నారా?

12 మిమ్ములను మీరు తగ్గించుకొనునట్లు మరియు జ్ఞానమును నేర్చుకొనునట్లు మీరు మీ సమాజ మందిరముల నుండి బయటకు గెంటివేయబడుట మేలని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా మీరు జ్ఞానము నేర్చుకొనుట అవసరము; మీరు బయటకు గెంటివేయబడి, అధికమైన మీ పేదరికమును బట్టి మీ సహోదరుల చేత తృణీకరింపబడి, హృదయము యొక్క దీనత్వమునకు తేబడియున్నారు; మీరు అవసరమును బట్టి తగ్గింపునకు తేబడియున్నారు.

13 ఇప్పుడు తగ్గించబడుటకు మీరు బలవంతము చేయబడినందున మీరు ధన్యులు; ఏలయనగా కొన్ని సమయాల్లో ఒక మనుష్యుడు తగ్గించబడుటకు బలవంతము చేయబడిన యెడల, అతడు పశ్చాత్తాపమును కోరును; పశ్చాత్తాపపడిన వాడు నిశ్చయముగా కనికరము కనుగొనును; కనికరమును కనుగొని అంతము వరకు సహించువాడు రక్షింపబడును.

14 తగ్గించబడుటకు మీరు బలవంతము చేయబడినందున మీరు ధన్యులని నేను మీతో చెప్పినట్లు, వాక్యమును బట్టి నిజముగా తమనుతాము తగ్గించుకొనువారు అధిక ధన్యులని మీరు తలంచుట లేదా?

15 తననుతాను నిజముగా తగ్గించుకొని, తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి, అంతము వరకు సహించువాడు ధన్యుడు—ముఖ్యముగా అధికమైన తమ పేదరికమును బట్టి తగ్గించబడుటకు బలవంతము చేయబడిన వారి కంటే అధిక ధన్యుడు.

16 కావున తగ్గించబడుటకు బలవంతము చేయబడకుండా తమనుతాము తగ్గించుకొను వారు ధన్యులు; లేదా ఇతర మాటలలో, వారు విశ్వసించుటకు ముందు వాక్యము తెలుసుకొనునట్లు లేదా తెలుసుకొనుటకు బలవంతము చేయబడకుండా, హృదయ కాఠిన్యము లేకుండా దేవుని వాక్యమందు విశ్వసించి బాప్తిస్మము పొందువాడు ధన్యుడు.

17 నీవు పరలోకము నుండి మాకు ఒక సూచన చూపిన యెడల, అప్పుడు మేము ఖచ్చితముగా తెలుసుకొందుము, అప్పుడు మేము విశ్వసించెదము అని చెప్పువారు అనేకులున్నారు.

18 ఇది విశ్వాసమా? అని నేను అడుగుచున్నాను. కాదు, అని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా ఒక మనుష్యుడు ఒక సంగతిని ఎరిగిన యెడల విశ్వసించుటకు అతడు ఏ హేతువును కలిగిలేడు, ఏలయనగా అతడు దానిని ఎరిగియున్నాడు.

19 మరి ఇప్పుడు కేవలము విశ్వసించి లేదా విశ్వసించుటకు హేతువు మాత్రమే కలిగియుండి అతిక్రమములో పడువాని కంటే దేవుని చిత్తమును ఎరిగి, దానిని చేయని వాడు ఎంత ఎక్కువ శాపగ్రస్థుడు?

20 ఈ సంగతిని మీరు తీర్పు తీర్చవలెను. ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, ఒక హస్తమెంతో రెండవది కూడా అంతే; మరియు ప్రతి మనుష్యునికి అతని క్రియను బట్టి జరుగును.

21 ఇప్పుడు విశ్వాసమును గూర్చి నేను చెప్పినట్లుగా—విశ్వాసము విషయముల యొక్క పరిపూర్ణ జ్ఞానము కలిగియుండుట కాదు; కావున మీరు విశ్వాసము కలిగియున్న యెడల, చూడబడనప్పటికీ సత్యమైన సంగతుల కొరకు మీరు నిరీక్షించెదరు.

22 ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, ఆయన నామమందు విశ్వసించు వారందరిపట్ల దేవుడు కనికరము కలిగియుండునని మీరు జ్ఞాపకము చేసుకొనవలెనని నేను కోరుచున్నాను; కావున ముందుగా మీరు ఆయన వాక్యముపై విశ్వసించవలెనని ఆయన కోరుచున్నారు.

23 ఆయన తన వాక్యమును పురుషులకు, అనగా పురుషులకు మాత్రమే కాదు, కానీ స్త్రీలకు కూడా దేవదూతల ద్వారా తెలియజేయును. అంతయు ఇదియే కాదు; జ్ఞానులు, ప్రవీణుల గర్వమణచు మాటలు అనేక సమయములందు చిన్నపిల్లలకు కూడా ఇవ్వబడినవి.

24 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, మీరు బాధింపబడి బయటకు గెంటివేయబడియున్నందున మీరేమి చేయవలెనని నా నుండి తెలుసుకొనుటకు మీరు కోరినందున—సత్యమైన దానిని బట్టి మాత్రమే నేను మిమ్ములను తీర్పు తీర్చనుద్దేశించుచున్నానని మీరు తలంచవలెనని నేను కోరుట లేదు—

25 ఏలయనగా మీరందరు తగ్గించబడుటకు బలవంతము చేయబడిరని నేను చెప్పుట లేదు; వారే పరిస్థితులలో ఉన్ననూ తమనుతాము తగ్గించుకొనువారు మీలో ఉన్నారని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను.

26 ఇప్పుడు విశ్వాసమును గూర్చి—అది ఒక పరిపూర్ణ జ్ఞానము కాదని నేను చెప్పినట్లుగా—నా మాటల విషయము కూడా అంతే. విశ్వాసము ఒక పరిపూర్ణమైన జ్ఞానము ఎలా కాదో, అలానే నా మాటల యొక్క నిశ్చయతను పరిపూర్ణముగా మొదట మీరు తెలుసుకొనలేరు.

27 కానీ ఇదిగో నా మాటలపై ప్రయోగము చేయుటకు మీ సామర్థ్యములను మేల్కొలిపి, ప్రోత్సహించి, ఒక రేణువంత విశ్వాసమును సాధన చేసిన యెడల, నమ్మవలెనను కోరిక కలిగియుండుట తప్ప మరేమియు మీరు చేయలేనియెడల, నా మాటలలో కొంత భాగమునకు స్థానమిచ్చేవిధముగా మీరు నమ్మే వరకు ఈ కోరికను మీలో పనిచేయనిమ్ము.

28 ఇప్పుడు మనము వాక్యమును ఒక విత్తనముతో పోల్చెదము. మీ హృదయమందు ఒక విత్తనము నాటబడునట్లు మీరు స్థలమిచ్చిన యెడల, అది నిజమైన విత్తనము లేదా మంచి విత్తనమైన యెడల, మీరు ప్రభువు యొక్క ఆత్మను నిరోధించునట్లు మీ అవిశ్వాసము ద్వారా దానిని బయట పడవేయని యెడల, అది మీ రొమ్ములలో వ్యాకోచించుట మొదలుపెట్టును; వ్యాకోచించున్నఈ కదలికలను మీరు అనుభవించినప్పుడు మీలోమీరు ఇట్లనుట మొదలుపెట్టుదురు—ఇది తప్పక మంచి విత్తనమైయుండవచ్చు లేదా వాక్యము మంచిదైయుండవచ్చు, ఏలయనగా ఇది నా ఆత్మను వృద్ధి చేయనారంభించెను; ఇది నా గ్రహింపును స్పష్టముచేసి, నాకు సంతోషకరముగా ఉండనారంభించెను.

29 ఇప్పుడిది మీ విశ్వాసమును అధికము చేయదా? చేయును, అని నేను మీతో చెప్పుచున్నాను; అయినప్పటికీ, ఇది పరిపూర్ణ జ్ఞానమునకు ఎదగలేదు.

30 కానీ విత్తనము వ్యాకోచించి, మొలకెత్తి, పెరుగుట ప్రారంభించినప్పుడు విత్తనము మంచిదని మీరు చెప్పవలసియున్నది; ఏలయనగా అది వ్యాకోచించి, మొలకెత్తి, పెరుగుట ప్రారంభించును. ఇప్పుడిది మీ విశ్వాసమును బలపరచదా? అవును, ఇది మీ విశ్వాసమును బలపరచును; ఇది మంచి విత్తనమని నేనెరుగుదునని మీరు చెప్పెదరు; ఏలయనగా ఇది మొలకెత్తి, పెరుగుట ప్రారంభించును.

31 ఇప్పుడిది మంచి విత్తనమని మీరు ఖచ్చితముగా అనుకుంటున్నారా? అవును, అని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా ప్రతి విత్తనము దాని పోలికచొప్పున ఫలమునిచ్చును.

32 కావున ఒక విత్తనము పెరిగిన యెడల అది మంచిది, కానీ అది పెరగని యెడల అది మంచిది కాదు, అందుచేత అది పారవేయబడును.

33 ఇప్పుడు మీరు ఈ ప్రయోగమును ప్రయత్నించి, విత్తనము నాటియున్నారు; అది వ్యాకోచించి, మొలకెత్తి, పెరుగుట ప్రారంభించినందున విత్తనము మంచిదని మీరు తెలుసుకొనవలసియున్నది.

34 అయితే, మీ జ్ఞానము పరిపూర్ణమైనదా? అవును, దానియందు మీ జ్ఞానము పరిపూర్ణమైనది మరియు మీ విశ్వాసము నిద్రాణమైనది; ఇది మీరు ఎరిగియున్నారు, ఏలయనగా వాక్యము మీ ఆత్మలలో వ్యాకోచించినదని మీరెరుగుదురు; అది పైకి మొలకెత్తినదని, మీ గ్రహింపు స్పష్టము చేయబడి, మీ మనోవికాసము మొదలాయెనని కూడా మీరెరుగుదురు.

35 అప్పుడు, ఇది వాస్తవము కాదా? అవును, అని నేను మీతో చెప్పుచున్నాను, ఏలయనగా అది వెలుగైయున్నది; మరియు వెలుగైనది ఏదైనను అది మంచిది, ఏలయనగా అది వివేచింపబడగలదు, కావున అది మంచిదని మీరు తెలుసుకొనవలెను; ఇప్పుడు మీరు ఈ వెలుగును అనుభవించిన తరువాత, మీ జ్ఞానము పరిపూర్ణమైనదా?

36 లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను; మీరు మీ విశ్వాసమును విడిచిపెట్టరాదు, ఏలయనగా విత్తనము మంచిదో కాదో తెలుసుకొనుటకు మీరు ప్రయోగము చేయునట్లు విత్తనము నాటుటకు మాత్రమే మీరు మీ విశ్వాసమును సాధన చేసియున్నారు.

37 చెట్టు పెరుగుట మొదలుపెట్టునప్పుడు మీరిట్లు చెప్పెదరు: అది వేరు పారునట్లు, పైకి పెరుగునట్లు మరియు ఫలము ఫలించునట్లు మనము దానిని అధిక శ్రద్ధతో పోషించెదము. ఇప్పుడు మీరు దానిని అధిక శ్రద్ధతో పోషించిన యెడల అది వేరు పారి, పైకి పెరిగి, ఫలమును ఫలించును.

38 కానీ మీరు చెట్టును నిర్లక్ష్యము చేసి, దాని పోషణ కొరకు ఎట్టి ఆలోచన చేయని యెడల అది వేరు పారదు. సూర్యుని వేడిమి దానిని మాడ్చివేసినప్పుడు, దానికి వేరు లేనందున అది వాడిపోవును మరియు మీరు దానిని పెరికివేసి బయట పారవేయుదురు.

39 ఇప్పుడిది విత్తనము మంచిది కాకపోవుటను బట్టి లేదా దాని ఫలము కోరదగనిదైయుండుటను బట్టి జరుగలేదు; కానీ మీది నిస్సారమైన నేల అయినందున మరియు మీరు చెట్టును పోషించనందున జరిగెను, కావున మీరు దాని ఫలమును పొందలేరు.

40 ఆ విధముగా దాని ఫలము కొరకు విశ్వాసముతో ఎదురుచూచుచు, మీరు వాక్యమును పోషించని యెడల మీరెన్నడూ జీవవృక్షము యొక్క ఫలమును కోయలేరు.

41 కానీ మీరు వాక్యమును పోషించిన యెడల, చెట్టు పెరుగుచుండగా దాని ఫలము కొరకు ఎదురుచూచుచు అధిక శ్రద్ధతో సహనముతో మీ విశ్వాసము ద్వారా దానిని పోషించిన యెడల అది వేరు పారి, నిత్య జీవమునకై అంకురించు వృక్షము వలేనుండును.

42 అది మీలో వేరు పారవలెనని దానిని పోషించుటలో వాక్యము యెడల మీ శ్రద్ధ, విశ్వాసము మరియు సహనమును బట్టి, చివరికి మీరు దాని ఫలమును కోయుదురు; అది మిక్కిలి శ్రేష్ఠమైనది, సమస్త తీపిని మించి తియ్యనైనది, సమస్త తెలుపును మించి తెల్లనైనది, శుద్ధమైన వాటన్నిటికంటే శుద్ధమైనది; మరియు ఆకలిగొనకుండునట్లు లేదా దప్పికగొనకుండునట్లు మీరు నింపబడు వరకు ఈ ఫలముపై మీరు విందు చేసుకొనెదరు.

43 అప్పుడు నా సహోదరులారా, చెట్టు మీకు ఫలము ఫలించు వరకు కనిపెట్టుచూ మీ విశ్వాసము, మీ శ్రద్ధ, సహనము మరియు దీర్ఘశాంతము యొక్క బహుమానములను మీరు పొందెదరు.