లేఖనములు
ఆల్మా 33


33వ అధ్యాయము

మనుష్యులు అన్ని స్థలములలో ప్రార్థన చేయవలెనని, ఆరాధించవలెనని మరియు కుమారుని కారణముగా తీర్పులు త్రిప్పివేయబడినవని జీనస్ బోధించెను—కుమారుని కారణముగా కనికరము అనుగ్రహించబడినదని జీనక్ బోధించెను—అరణ్యమందు దేవుని కుమారుని గూర్చిన ఒక సూచనను మోషే ఎత్తియుండెను. సుమారు క్రీ. పూ. 74 సం.

1 ఇప్పుడు ఆల్మా ఈ మాటలను పలికిన తరువాత, అతడు చెప్పిన ఈ ఫలమును పొందగలుగునట్లు వారు ఒకే దేవునియందు విశ్వాసముంచవలెనా, లేదా వారి హృదయములలో నాటబడవలెనని అతడు చెప్పిన విత్తనము లేదా వాక్యమును వారెట్లు నాటవలెనో, లేదా ఏ విధముగా వారు విశ్వాసమును సాధన చేయవలెనో తెలుసుకొనగోరుచూ వారతని యొద్దకు కబురు పంపిరి.

2 మరియు ఆల్మా వారితో ఇట్లు చెప్పెను: మీరు మీ సమాజ మందిరముల నుండి బయటకు గెంటి వేయబడినందున మీ దేవుడిని ఆరాధించలేకపోయిరని చెప్పియున్నారు. కానీ నేను మీతో చెప్పుచున్నాను, మీరు దేవుడిని ఆరాధించలేరని తలంచిన యెడల మీరు తీవ్రముగా పొరపాటు చేయుచున్నారు మరియు మీరు మీ లేఖనములను పరిశీలించవలసియున్నది; అవి మీకు దీనిని బోధించినవని మీరు తలంచిన యెడల, మీరు వాటిని గ్రహించలేదు.

3 ప్రార్థన లేదా ఆరాధనను గూర్చి ప్రాచీన కాలపు ప్రవక్త జీనస్ ఏమి చెప్పియున్నాడో చదివియున్నట్లు మీకు జ్ఞాపకమున్నదా?

4 ఏలయనగా అతడిట్లు చెప్పెను: ఓ దేవా, నీవు కనికరము గలవాడవు, ఏలయనగా నేను అరణ్యములో ఉన్నప్పుడు కూడా నీవు నా ప్రార్థన వినియున్నావు; నా శత్రువులను గూర్చి నేను ప్రార్థించినప్పుడు నీవు కనికరము కలిగియుండి, వారిని నా వైపు త్రిప్పియున్నావు.

5 ఓ దేవా, నా పొలములో నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నా యెడల కనికరము కలిగియున్నావు; నా ప్రార్థనయందు నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నన్ను వింటివి.

6 మరలా ఓ దేవా, నేను నా ఇంటికి వెళ్ళుచున్నప్పుడు నీవు నా మొర ఆలకించితివి.

7 ఓ ప్రభువా, నేను నా గదిలోనుండి నీకు ప్రార్థన చేసినపుడు నీవు నన్ను ఆలకించితివి.

8 మనుష్యుల చేత కాక నీ చేత వినబడవలెనని వారు నీకు మొరపెట్టినప్పుడు, నీవు నీ సంతానము యెడల కనికరము కలిగియుండి వారిని వినెదవు.

9 ఓ దేవా, నీవు నా యెడల కనికరము కలిగియుండి, నీ ఆరాధికుల మధ్య నా మొరను వింటివి.

10 నేను బయటకు గెంటి వేయబడినప్పుడు మరియు నా శత్రువుల చేత తృణీకరించబడినప్పుడు కూడా నీవు నన్ను వింటివి; నీవు నా మొరలను విని, నా శత్రువులతో కోపముగానుంటివి మరియు నీ కోపములో నీవు వారిని వేగముగా నాశనముతో దర్శించితివి.

11 నా శ్రమలు మరియు నా యథార్థతను బట్టి, నీవు నన్ను వినియుంటివి; నీ కుమారుని బట్టి నీవు నా యెడల కనికరము కలిగియుంటివి, కావున నా శ్రమలన్నిటిలో నేను నీకు మొరపెట్టెదను, ఏలయనగా నా సంతోషము నీ యందు గలదు; నీవు నీ కుమారుని బట్టి నీ తీర్పులను నా నుండి త్రిప్పివేసియున్నావు.

12 ఇప్పుడు ఆల్మా వారితో ఇట్లనెను: ప్రాచీన కాలము వారి చేత వ్రాయబడిన ఆ లేఖనములను మీరు నమ్ముచున్నారా?

13 మీరు నమ్మిన యెడల, జీనస్ చెప్పిన దానిని నమ్మవలెను; ఏలయనగా, నీవు నీ కుమారుని బట్టి నీ తీర్పులను త్రిప్పివేసియున్నావు అని అతడు చెప్పెను.

14 ఇప్పుడు నా సహోదరులారా, మీరు లేఖనములను చదివియున్నారా? అని నేను అడుగుచున్నాను. మీరు చదివిన యెడల, దేవుని కుమారుని పట్ల మీరు అవిశ్వాసముతో ఎట్లు ఉండగలరు?

15 ఏలయనగా జీనస్ ఒక్కడే ఈ సంగతులను గూర్చి చెప్పియున్నాడని వ్రాయబడలేదు, కానీ జీనక్ కూడా ఈ సంగతులను గూర్చి చెప్పెను—

16 ఏలయనగా అతడిట్లు చెప్పెను: ఓ ప్రభువా, నీవు నీ కుమారుని బట్టి వారిపై అనుగ్రహించిన నీ కనికరములను వారు గ్రహించనందున నీవు ఈ జనులపై కోపముగానున్నావు.

17 ఇప్పుడు నా సహోదరులారా, ప్రాచీన కాలపు మరొక ప్రవక్త దేవుని కుమారుని గూర్చి సాక్ష్యమిచ్చియున్నాడని మీరు చూచుచున్నారు మరియు జనులు అతని మాటలను గ్రహించలేకపోయినందున వారతనిని రాళ్ళతో కొట్టి చంపిరి.

18 కానీ అంతయు ఇదియే కాదు; దేవుని కుమారుని గూర్చి చెప్పిన వారు వీరు మాత్రమే కాదు.

19 ఆయన గూర్చి మోషే ద్వారా చెప్పబడెను; ముఖ్యముగా, దాని వైపు చూచువారెవరైనా జీవించునట్లు అరణ్యమందు ఒక సూచన పైకెత్తబడెను. అనేకమంది చూచి, జీవించిరి.

20 కానీ కొందరే ఆ సంగతుల యొక్క అర్థమును గ్రహించిరి మరియు ఇది వారి హృదయ కాఠిన్యమును బట్టియే. కానీ వారు చూడకుండునట్లు కఠినపరచబడిన వారనేకులు అక్కడ ఉండిరి, కావున వారు నశించిరి. ఇప్పుడు వారు చూడకుండుటకు కారణము, అది వారిని స్వస్థపరచునని వారు నమ్మకుండుటయే.

21 ఓ నా సహోదరులారా, మీరు స్వస్థపరచబడునట్లు మీ కన్నులెత్తినంత మాత్రము చేత మీరు స్వస్థపరచబడిన యెడల మీరు త్వరితముగా చూచెదరా లేదా మీరు నశించునట్లు మీ హృదయములను అవిశ్వాసమందు కఠినపరచుకొని మీ కన్నులెత్తక సోమరులుగా ఉందురా?

22 అట్లయిన యెడల మీ పైకి ఆపద వచ్చును; కానీ అట్లు కాని యెడల, అప్పుడు మీ కన్నులెత్తి దేవుని కుమారుడు తన జనులను విమోచించుటకు వచ్చునని, ఆయన వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు శ్రమపడి మరణించునని, ఆయన మృతులలో నుండి లేచునని, వారి క్రియలను బట్టి అంత్య మరియు తీర్పు దినమున తీర్పు తీర్చబడుటకు మనుష్యులందరు ఆయన యెదుట నిలబడునట్లు అది పునరుత్థానమును తెచ్చునని ఆయన యందు నమ్ముట మొదలుపెట్టుడి.

23 ఇప్పుడు నా సహోదరులారా, మీరు ఈ వాక్యమును మీ హృదయములలో నాటవలెనని మరియు అది వ్యాకోచించుట మొదలుపెట్టగానే మీ విశ్వాసము ద్వారా దానిని పోషించవలెనని నేను కోరుచున్నాను. అది మీలో నిత్యజీవమునకు మొలకెత్తుచూ ఒక వృక్షమగును. అప్పుడు ఆయన కుమారుని యందలి సంతోషము ద్వారా మీ భారములు తేలికగునట్లు దేవుడు మీకు అనుగ్రహించునుగాక, మీరు కోరిన యెడల ఇదంతయు మీరు చేయగలరు. ఆమేన్‌.