లేఖనములు
ఆల్మా 34


34వ అధ్యాయము

రక్షణ కొరకు వాక్యము క్రీస్తు నందు ఉన్నదని అమ్యులెక్ సాక్ష్యమిచ్చును—ప్రాయశ్చిత్తము చేయబడని యెడల సమస్త మానవజాతి నశించును—మోషే ధర్మశాస్త్రము అంతయు దేవుని కుమారుని యొక్క బలి వైపు దృష్టి సారించును—విమోచన యొక్క నిత్య ప్రణాళిక, విశ్వాసము మరియు పశ్చాత్తాపముపై ఆధారపడియున్నది—భౌతిక మరియు ఆత్మీయ దీవెనల కొరకు ప్రార్థించుడి—ఈ జీవితము దేవుడిని కలుసుకొనుటకు మనుష్యులు సిద్ధపడు సమయమైయున్నది—దేవుని యెదుట భయముతో మీ రక్షణను సాధించుకొనుడి. సుమారు క్రీ. పూ. 74 సం.

1 ఇప్పుడు ఆల్మా వారితో ఈ మాటలు చెప్పిన తరువాత, అతడు నేలపై కూర్చుండెను మరియు అమ్యులెక్ లేచి ఇట్లు చెప్పుచూ వారికి బోధించుట మొదలుపెట్టెను:

2 నా సహోదరులారా, దేవుని కుమారుడైయున్నాడని మా చేత బోధించబడిన ఆ క్రీస్తు యొక్క రాకడను గూర్చి చెప్పబడిన సంగతులు మీకు తెలియకుండుట అసాధ్యమని నేను తలంచుచున్నాను; మీరు మా నుండి విడిపోవుటకు ముందు ఈ సంగతులు మీకు విస్తారముగా బోధింపబడినవని నేనెరుగుదును.

3 మీ శ్రమలను బట్టి మీరేమి చేయవలెనో అతడు మీకు తెలియజేయవలెనని మీరు నా ప్రియ సహోదరుని కోరగా, మీ మనస్సులను సిద్ధము చేయుటకు అతడు మీకు కొంత చెప్పియున్నాడు; అతడు మిమ్ములను విశ్వాసము, సహనము కలిగియుండమని హెచ్చరించియున్నాడు—

4 అనగా మీ హృదయములలో వాక్యము నాటుటకు, దాని మంచితనమును తెలుసుకొనుటకు మీరు ప్రయత్నించునట్లు తగినంత విశ్వాసమును మీరు కలిగియుండవలెనని చెప్పియున్నాడు.

5 మరియు వాక్యము దేవుని కుమారుని యందు ఉన్నదా లేదా క్రీస్తు రాకుండునా, అన్నది మీ మనస్సులలో ఉన్న గొప్ప ప్రశ్నయైయున్నదని మేము కనుగొంటిమి.

6 రక్షణ కొరకు వాక్యము క్రీస్తు నందున్నదని అనేక ఉదాహరణలతో నా సహోదరుడు మీకు రుజువు చేసియున్నాడని కూడా మీరు చూచితిరి.

7 విమోచన దేవుని కుమారుని ద్వారా వచ్చునని జీనస్ మాటలను మరియు జీనక్ మాటలను నా సహోదరుడు ఉదహరించెను; మరియు ఈ సంగతులు సత్యమని రుజువు చేయుటకు అతడు మోషేను కూడా ఉదహరించెను.

8 ఇప్పుడు ఈ సంగతులు సత్యమని నాకై నేను మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. తన జనుల పాపములను తనపై తీసుకొనుటకు క్రీస్తు నరుల సంతానము మధ్యకు వచ్చునని మరియు లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయునని నేనెరుగుదునని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా ప్రభువైన దేవుడు దానిని పలికియున్నాడు.

9 ఇప్పుడు ప్రాయశ్చిత్తము చేయబడుట ఆవశ్యకమైనది; ఏలయనగా నిత్య దేవుని యొక్క గొప్ప ప్రణాళికను బట్టి ప్రాయశ్చిత్తము చేయబడవలెను, లేనియెడల సమస్త మానవ జాతి తప్పక నశించవలెను; అందరు కఠినులైయున్నారు; అందరు పతనమైయున్నారు మరియు తప్పిపోయియున్నారు, ఆవశ్యకమైన ఆ ప్రాయశ్చిత్తము చేయబడని యెడల అందరు నశించవలసియున్నది.

10 ఏలయనగా గొప్పదైన చివరి బలి ఆవశ్యకమైనది; మనుష్యుని యొక్క లేదా జంతువు యొక్క లేదా ఏ విధమైన పక్షి యొక్క బలి కాదు; అది మానవ బలి కాదు; కానీ ఒక అనంతమైన, నిత్యమైన బలి కావలెను.

11 ఇప్పుడు మరియొకని పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసి, తన స్వంత రక్తమును బలివ్వగలిగిన మనుష్యుడెవడును లేడు. ఒక మనుష్యుడు హత్యచేసిన యెడల, న్యాయమైన మన చట్టము అతని సహోదరుని ప్రాణము తీయునా? లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను.

12 కానీ హత్య చేసిన వాని ప్రాణమును చట్టము కోరును; కావున, అనంతమైన ప్రాయశ్చిత్తమునకు తక్కువైనదేదియు లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయలేదు.

13 కావున గొప్పదైన చివరి బలియుండుట అవసరము, అప్పుడు రక్తము చిందించుటకు ఆపుదల ఉండును లేదా ఉండుట అవసరమగును; అప్పుడు మోషే ధర్మశాస్త్రము నెరవేర్చబడును; అనగా ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దానినుండి యొక పొల్లయినను, ఒక సున్నయైనను తప్పిపోదు.

14 ఇది ధర్మశాస్త్రము యొక్క సంపూర్ణ అర్థమైయున్నది, ప్రతీది ఆ గొప్పదైన చివరి బలి వైపు చూపును; ఆ గొప్పదైన చివరి బలి దేవుని కుమారుడైయుండును, అది అనంతమైనది మరియు నిత్యమైనది.

15 ఆ విధముగా ఆయన నామమందు విశ్వసించు వారందరికి ఆయన రక్షణను తెచ్చును; న్యాయమును జయించునట్టి కనికరమును తెచ్చుట మరియు వారు పశ్చాత్తాపము నిమిత్తము విశ్వాసము కలిగియుండునట్లు మనుష్యులకు ఒక మార్గము చూపుట ఈ చివరి బలి యొక్క ఉద్దేశ్యమైయున్నది.

16 ఆ విధముగా కనికరము న్యాయము యొక్క అక్కరలను సంతృప్తిపరచగలదు మరియు భద్రత యొక్క బాహువులందు వారిని చుట్టగలదు, అయితే పశ్చాత్తాపము నిమిత్తము ఎట్టి విశ్వాసమును సాధన చేయని వాడు న్యాయపు అక్కరల యొక్క సంపూర్ణ చట్టమునకు గురి చేయబడును; కావున, పశ్చాత్తాపము నిమిత్తము విశ్వాసము కలిగిన వారికి మాత్రమే విమోచన యొక్క గొప్ప మరియు నిత్య ప్రణాళిక తేబడును.

17 కావున నా సహోదరులారా, పశ్చాత్తాపము నిమిత్తము మీ విశ్వాసమును సాధన చేయుటను మీరు మొదలుపెట్టునట్లు, ఆయన మీపై కనికరము కలిగియుండునట్లు మీరు ఆయన పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుటను మొదలుపెట్టునట్లు దేవుడు మీకు అనుగ్రహించును గాక;

18 కనికరము కొరకు ఆయనకు మొరపెట్టుడి; ఏలయనగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు.

19 మిమ్ములను మీరు తగ్గించుకొని, ఆయనను ప్రార్థించుట యందు కొనసాగుడి.

20 మీరు మీ పొలములలో ఉన్నప్పుడు, మీ సమస్త మందల కొరకు ఆయనకు మొరపెట్టుడి.

21 ఉదయము, మధ్యాహ్నము మరియు సాయంకాలము మీ సమస్త కుటుంబము కొరకు మీ ఇండ్లలో ఆయనకు మొరపెట్టుడి.

22 మీ శత్రువుల యొక్క శక్తికి వ్యతిరేకముగా ఆయనకు మొరపెట్టుడి.

23 సమస్త నీతికి శత్రువైన అపవాదికి వ్యతిరేకముగా మొరపెట్టుడి.

24 మీరు వాటి యందు వర్ధిల్లునట్లు మీ పొలముల యొక్క పంటల కొరకు ఆయనకు మొరపెట్టుడి.

25 అవి వృద్ధి చెందునట్లు మీ పొలములలోని మందల కొరకు మొరపెట్టుడి.

26 కానీ అంతయు ఇదియే కాదు; మీరు మీ గదులయందు, మీ రహస్య స్థలములందు మరియు మీ అరణ్యములందు తప్పక మీ ఆత్మలను క్రుమ్మరించుడి.

27 మీరు ప్రభువుకు మొరపెట్టనప్పుడు, మీ క్షేమము కొరకు మరియు మీ చుట్టూ ఉన్నవారి క్షేమము కొరకు నిరంతరము ప్రార్థనయందు మీ హృదయములలో ఆయన పట్ల కృతజ్ఞత కలిగియుండుడి.

28 ఇప్పుడు నా ప్రియ సహోదరులారా, ఇదియే అంతయు అని తలంచవద్దని నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా ఈ క్రియలన్నిటిని మీరు చేసిన తరువాత, అక్కరలోనున్న వారిని దిగంబరులను త్రిప్పి పంపివేసిన యెడల, రోగులను బాధితులను దర్శించని యెడల మరియు మీరు కలిగియున్న దానినుండి అక్కరలో ఉన్నవారికి పంచి ఇవ్వని యెడల—ఈ క్రియలలో దేనినైనను మీరు చేయకుండిన యెడల మీ ప్రార్థన వ్యర్థమని, మీకు ఏ ప్రయోజనము ఉండదని మరియు మీరు విశ్వాసమును తిరస్కరించు వేషధారులవలే ఉన్నారని నేను మీతో చెప్పుచున్నాను.

29 కావున మీరు దాతృత్వము కలిగియుండవలెనని జ్ఞాపకము చేసుకొనని యెడల, మీరు (ఏ విలువ లేకయుండి) కంసాలి బయటకు విసిరివేయగా మనుష్యుల పాదముల క్రింద త్రొక్కివేయబడు మడ్డివలే నుందురు.

30 ఇప్పుడు నా సహోదరులారా, మీరు అనేక సాక్ష్యములను పొందిన తరువాత, పరిశుద్ధ లేఖనములు ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవని చూచిన తరువాత, మీరు ముందుకు వచ్చి పశ్చాత్తాపము నిమిత్తము ఫలము ఫలించవలెనని నేను కోరుచున్నాను.

31 మీరు ముందుకు రావలెనని, ఇకపై మీ హృదయములను కఠినపరచుకొనరాదని నేను కోరుచున్నాను; ఏలయనగా ఇదియే మీ రక్షణ యొక్క దినము మరియు సమయుము; కావున మీరు పశ్చాత్తాపపడి మీ హృదయములను కఠినపరచుకొనని యెడల, వెంటనే విమోచన యొక్క గొప్ప ప్రణాళిక మీ కొరకు పని చేయును.

32 ఏలయనగా ఈ జీవితము దేవుడిని కలుసుకొనుటకు మనుష్యులు సిద్ధపడు సమయమైయున్నది; అనగా, ఈ జీవితకాలము మనుష్యులు తమ పనులు చేయు సమయమైయున్నది.

33 ఇప్పుడు నేను ఇంతకుముందు మీతో చెప్పినట్లు, మీరు అనేక సాక్ష్యములు కలిగియున్నందున అంతము వరకు మీ పశ్చాత్తాప దినమును మీరు వాయిదా వేయవద్దని నేను మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను; ఏలయనగా ఈ జీవితములో ఉండగానే మనము మన సమయమును మెరుగుపరచుకొనని యెడల, నిత్యత్వమునకు సిద్ధపడుటకు మనకు ఇవ్వబడిన ఈ జీవితకాలము తరువాత ఎట్టి పని చేయబడలేని అంధకారమైన రాత్రి వచ్చును.

34 మీరు ఆ భయంకరమైన క్లిష్ట పరిస్థితికి తేబడినప్పుడు, నేను పశ్చాత్తాపపడుదునని, నేను నా దేవుని యొద్దకు తిరిగి వెళ్ళుదునని మీరు చెప్పలేరు. లేదు, మీరట్లు చెప్పలేరు; ఏలయనగా ఈ జీవితము నుండి మీరు వెళ్ళిపోవు సమయమున మీ శరీరములను ఏ ఆత్మ స్వాధీనపరచుకొనియున్నదో అదే ఆత్మ నిత్యలోకములో మీ శరీరమును స్వాధీనపరచుకొనుటకు శక్తి కలిగియుండును.

35 ఏలయనగా మీరు, మీ పశ్చాత్తాప దినమును మరణము వరకు వాయిదా వేసిన యెడల, మీరు అపవాది యొక్క ఆత్మకు లోబడియున్నారు మరియు అతడు మిమ్ములను తన వారిగా ముద్రవేయును; కావున ప్రభువు యొక్క ఆత్మ మీ నుండి తొలగిపోయి, మీయందు ఎట్టి స్థానము కలిగియుండదు, కానీ అపవాది మీపై సమస్త అధికారము కలిగియుండును; మరియు దుష్టుల యొక్క చివరి స్థితి ఇదియే.

36 నేను దీనిని ఎరుగుదును, ఏలయనగా అపరిశుద్ధమైన ఆలయములలో నేను నివసించను, కానీ నీతిమంతుల హృదయములందు నేను నివసించెదనని ప్రభువు చెప్పెను; నీతిమంతులు ఇక బయటకు వెళ్ళక ఆయన రాజ్యమందు కూర్చుందురని, వారి వస్త్రములు గొఱ్ఱెపిల్ల యొక్క రక్తము ద్వారా తెల్లగా చేయబడునని కూడా ఆయన చెప్పెను.

37 ఇప్పుడు నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులను జ్ఞాపకముంచుకొనవలెనని, దేవుని యెదుట భయముతో మీ రక్షణను సాధించుకొనవలెనని, క్రీసు యొక్క రాకడను మీరిక తిరస్కరించరాదని;

38 పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మీరిక పోరాడరాదని, బదులుగా మీరు దానిని పొంది మీపై క్రీస్తు యొక్క నామమును ధరించవలెనని, మీరు ధూళి వలే మిమ్ములను తగ్గించుకొనవలెనని, మీరే స్థలములో ఉన్నను ఆత్మయందు మరియు సత్యమందు దేవుడిని ఆరాధించవలెనని, ఆయన మీపై అనుగ్రహించు అనేక కనికరములు, దీవెనల కొరకు మీరు ప్రతిదినము కృతజ్ఞత చెల్లించుటయందు జీవించవలెనని నేను కోరుచున్నాను.

39 మరియు నా సహోదరులారా, మీరు అపవాది యొక్క శోధనల చేత నడిపించి వేయబడకుండునట్లు, అతడు మిమ్ములను జయించకుండునట్లు, అంత్యదినమున మీరు అతని పౌరులు కాకుండునట్లు మీరు నిరంతరము ప్రార్థన యందు కనిపెట్టియుండుడని కూడా నేను మీకు ఉద్భోధించుచున్నాను; ఏలయనగా అతడు మీకు ఏ మంచి వస్తువులను బహుమానమియ్యడు.

40 ఇప్పుడు నా ప్రియ సహోదరులారా, సహనము కలిగియుండమని, అన్ని రకములైన శ్రమలను మీరు సహించవలెనని, మీరు వారివలే పాపులవ్వకుండునట్లు మీ అధికమైన బీదరికమును బట్టి మిమ్ములను బయటకు గెంటివేయు వారికి వ్యతిరేకముగా మీరు దూషించవద్దని;

41 సహనము కలిగియుండి, మీ శ్రమలన్నిటి నుండి ఒక దినమున మీరు విశ్రాంతి పొందుదురను గట్టి నమ్మకముతో ఆ శ్రమలన్నిటినీ సహించమని నేను మీకు ఉద్భోధించుచున్నాను.