లేఖనములు
ఆల్మా 36


తన కుమారుడైన హీలమన్‌కు ఆల్మా యొక్క ఆజ్ఞలు.

36 మరియు 37 అధ్యాయములు కలిగియున్నది.

36వ అధ్యాయము

ఒక దేవదూతను చూచిన తరువాత, తన పరివర్తనను గూర్చి ఆల్మా హీలమన్‌కు సాక్ష్యమిచ్చును—శిక్షావిధికి లోనైన ఆత్మ యొక్క వేదనలను అతడు అనుభవించును; అతడు యేసు నామమున ప్రార్థన చేసిన తరువాత దేవుని వలన జన్మించెను—మధురమైన సంతోషము అతని ఆత్మను నింపెను—దేవదూతల సమూహములు దేవుడిని స్తుతించుటను అతడు చూచెను—పరివర్తన పొందిన వారనేకులు అతని వలె చూచి అనుభవించిరి. సుమారు క్రీ. పూ. 74 సం.

1 నా కుమారుడా, నా మాటలకు చెవి యొగ్గుము; ఏలయనగా నీవు దేవుని ఆజ్ఞలను పాటించియున్నంత కాలము నీవు దేశమందు వర్ధిల్లెదవని నేను నీతో ప్రమాణపూర్వకముగా చెప్పుచున్నాను.

2 మన పితరుల యొక్క చెరను జ్ఞాపకము చేసుకొనుట యందు నేను చేసినట్లే నీవు చేయవలెనని నేను కోరుచున్నాను; ఏలయనగా వారు దాస్యమందుండిరి; అబ్రాహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు మరియు యాకోబు యొక్క దేవుడు తప్ప, ఎవరూ వారిని విడిపించలేకయుండెను; ఆయన నిశ్చయముగా వారి శ్రమల నుండి వారిని విడిపించెను.

3 ఓ నా కుమారుడా హీలమన్‌, నీవు యౌవనములో ఉన్నావు, అందువలన నీవు నా మాటలను విని, నా నుండి నేర్చుకొనవలెనని నేను నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను; ఏలయనగా దేవునియందు తమ నమ్మికయుంచు వారెవరైనను వారి శోధనలందు, కష్టములందు, శ్రమలందు సహాయము పొందుదురని, అంత్యదినమున లేపబడుదురని నేనెరుగుదును.

4 మరియు నాకై నేను ఎరుగుదునని నీవు తలంచవలెనని నేను కోరను—ఐహికముగా కాదు కానీ ఆత్మీయముగా, శరీర సంబంధమైన మనస్సును బట్టి కాదు కాని దేవునిని బట్టి నేను ఎరుగుదును.

5 ఇప్పుడు నేను నీతో చెప్పుచున్నాను, దేవుని వలన జన్మించియుండని యెడల నేను ఈ సంగతులను ఎరిగియుండను; నా యొక్క యోగ్యతను బట్టి కాదు, కానీ దేవుడు తన పరిశుద్ధ దేవదూత నోటి ద్వారా ఈ సంగతులను నాకు తెలియజేసెను;

6 ఏలయనగా దేవుని సంఘమును నాశనము చేయుటకు కోరుచూ నేను మోషైయ కుమారులతో వెళ్ళితిని; కానీ దారిలో మమ్ములను ఆపుటకు దేవుడు తన పరిశుద్ధ దేవదూతను పంపెను.

7 ఆయన ఒక ఉరుము వంటి స్వరముతో మాతో మాట్లాడెను మరియు మా పాదముల క్రిందనున్న భూమియంతయు కంపించెను; ప్రభువు యొక్క భయము మా మీదికి వచ్చినందున మేమందరము నేలపై పడితిమి.

8 కానీ ఆ స్వరము నాతో—లెమ్ము, అని పలికెను మరియు నేను లేచి నిలబడి ఆ దేవదూతను చూచితిని.

9 అతడు నాతో ఇట్లనెను: నీకు నీవే నాశనము కావలెనని కోరినప్పటికీ, దేవుని సంఘమును నాశనము చేయుటకు ఇక ప్రయత్నించకుము.

10 అప్పుడు నేను నేలపై పడితిని; మూడు పగళ్ళు మూడు రాత్రుల పాటు నేను నోరు తెరువలేకపోతిని లేదా నా అవయవములను ఉపయోగించలేకపోతిని.

11 ఆ దేవదూత నాతో ఎన్నో విషయములు పలికెను, వాటిని నా సహోదరులు వినిరి, కానీ నేను వినలేదు; ఏలయనగా—నీకు నీవే నాశనము కావలెనని కోరినప్పటికీ, దేవుని సంఘమును ఇక నాశనము చేయుటకు ప్రయత్నించకుము—అను మాటలను విన్నప్పుడు బహుశా నేను నాశనమగుదునేమోనను గొప్ప భయముతో, ఆశ్చర్యముతో నింపబడి నేను నేలపై పడితిని మరియు నేను ఇక ఏ మాత్రము వినలేదు.

12 కానీ నేను నిత్య వేదనతో బాధింపబడితిని, ఏలయనగా నా ఆత్మ తీవ్రమైన స్థితికి వేధించబడి, నా పాపములన్నిటితో నేను బాధింపబడితిని.

13 నరకపు బాధలతో వేధింపబడి, నా పాపములు మరియు దోషములన్నిటినీ నేను జ్ఞాపకము చేసుకొంటిని; నేను నా దేవునికి వ్యతిరేకముగా తిరుగబడితినని, ఆయన పరిశుద్ధ ఆజ్ఞలను గైకొనలేదని చూచితిని.

14 ఆయన పిల్లలలో అనేకులను నేను హత్యచేసితిని లేదా ఖచ్చితముగా వారిని నాశనమునకు నడిపించితిని; క్లుప్తముగా నా దోషములు ఎంత గొప్పవనగా, నా దేవుని సన్నిధిలోకి రావలెనన్న తలంపే నా ఆత్మను చెప్పలేని భీతితో బాధించెను.

15 అయ్యో! నా క్రియలను బట్టి తీర్పుతీర్చబడుటకు నా దేవుని సన్నిధిలో నిలబడుటకు నేను తేబడకుండునట్లు నేను బహిష్కరింపబడి, ఆత్మ మరియు శరీరము రెండు నశించిపోయి యుండగలిగిన మేలు అని తలంచితిని.

16 ఇప్పుడు మూడు పగళ్ళు మూడు రాత్రుల వరకు శిక్షావిధికి లోనైన ఆత్మ యొక్క బాధలతో నేను బాధింపబడితిని.

17 నేను ఆ విధముగా వేదనతో బాధింపబడుచూ నా అనేక పాపముల యొక్క జ్ఞాపకము చేత వేదనపడుచుండగా, లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయుటకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రాకడను గూర్చి జనులకు నా తండ్రి ప్రవచించుట వినియుంటినని నేను జ్ఞాపకము చేసుకొంటిని.

18 నా మనస్సునందు ఈ ఆలోచన వచ్చినప్పుడు నేను నా హృదయమందు ఇట్లు మొరపెట్టితిని: ఓ యేసూ, దేవుని కుమారుడవైన నీవు, ఘోర దుష్టత్వములో ఉండి మరణము యొక్క నిత్య బంధకములచేత చుట్టబడియున్న నాపై కనికరము చూపుము.

19 ఇప్పుడు నేను దీనిని తలంచినప్పుడు, నా బాధలను ఇకపై జ్ఞాపకము చేసుకొనకయుంటిని; అనగా నా పాపముల యొక్క జ్ఞాపకము చేత నేను ఇకపై బాధింపబడకయుంటిని.

20 ఓహో! నేను ఎంత ఆనందమును అనుభవించితిని, ఎంత ఆశ్చర్యకరమైన వెలుగును చూచితిని! నేను ఎంత బాధ అనుభవించితినో, అంత ఎక్కువ ఆనందముతో నా ఆత్మ నింపబడెను.

21 నా కుమారుడా, నా బాధలున్నంత తీవ్రముగా, కఠినముగా మరేదియు లేదని నేను నీతో చెప్పుచున్నాను. దానికి విరుద్ధముగా నా ఆనందమంత శ్రేష్ఠమైనది, మధురమైనది మరేదియు ఉండదని మరలా నేను నీతో చెప్పుచున్నాను.

22 మన తండ్రియైన లీహై చూచినట్లుగా దేవుడు తన సింహాసనము పైన కూర్చుండి, లెక్కలేనన్ని దేవదూతల సమూహములు తమ దేవుని స్తుతించుచూ కీర్తించు రీతిలో చుట్టబడియుండుటను నేను చూచితినని నాకనిపించెను; మరియు నా ఆత్మ అక్కడ ఉండుటకు కోరుకొనెను.

23 కానీ నా అవయవములు తిరిగి వాటి శక్తిని పొందెను మరియు నేను నా కాళ్ళపై నిలబడి, నేను దేవుని వలన జన్మించితినని జనులకు తెలియజేసితిని.

24 ఆ సమయము నుండి ఇప్పటి వరకు, నేను ఆత్మలను పశ్చాత్తాపపడునట్లు చేయుటకు, నేను అనుభవించిన అధిక సంతోషమును వారు కూడా అనుభవించగలుగునట్లు మరియు దేవుని వలన జన్మించి పరిశుద్ధాత్మతో వారు నింపబడునట్లు చేయుటకు ఎడతెగక శ్రమపడియుంటిని.

25 ఇప్పుడు ఓ నా కుమారుడా, నా శ్రమల యొక్క ఫలమందు ప్రభువు నాకు మహదానందమును ఇచ్చియుండెను;

26 ఏలయనగా ఆయన నాకనుగ్రహించిన వాక్యమును బట్టి, అనేకులు దేవుని వలన జన్మించియున్నారు, నేను అనుభవించినట్లు అనుభవించియున్నారు, నేను చూచియున్నట్లు కన్నులారా చూచియున్నారు; కావున నేను చెప్పిన ఈ సంగతులను గూర్చి నేను ఎరిగినట్లే వారు ఎరిగియున్నారు మరియు నేను కలిగియున్న జ్ఞానము దేవునిది.

27 ప్రతివిధమైన శోధనలలో, కష్టములలో, అన్నివిధములైన శ్రమలలో నాకు సహకారమివ్వబడినది; దేవుడు నన్ను చెరసాల నుండి, బంధకముల నుండి, మరణము నుండి విడిపించెను; నేను ఆయనయందు నమ్మకముంచెదను మరియు ఆయన ఇంకను నన్ను విడిపించును.

28 మహిమయందు ఆయనతో నివసించుటకు అంత్యదినమున ఆయన నన్ను పైకి లేపునని నేనెరుగుదును; నిరంతరము నేను ఆయనను స్తుతించెదను, ఏలయనగా ఆయన మన పితరులను ఐగుప్తు నుండి బయటకు తీసుకొనివచ్చి, ఎఱ్ఱసముద్రమందు ఐగుప్తీయులను ముంచివేసెను; ఆయన తన శక్తి చేత వారిని వాగ్దానదేశములోనికి నడిపించెను మరియు ఎప్పటికప్పుడు ఆయన వారిని దాస్యమునుండి, చెర నుండి విడిపించెను.

29 ఆయన మన పితరులను యెరూషలేము దేశము నుండి కూడా బయటకు తెచ్చెను; ఎప్పటికప్పుడు, ప్రస్తుత దినము వరకు కూడా ఆయన తన నిత్యశక్తి చేత దాస్యము మరియు చెర నుండి వారిని విడిపించెను; నేను ఎల్లప్పుడు వారి చెరను జ్ఞాపకమందు నిలుపుకొనియున్నాను; నేను చేసినట్లుగా నీవు కూడా వారి చెరను జ్ఞాపకమందు నిలుపుకొనవలెను.

30 కానీ నా కుమారుడా, అంతయు ఇదియే కాదు; ఏలయనగా నీవు దేవుని ఆజ్ఞలను పాటించియున్నంత కాలము నీవు దేశమందు వర్ధిల్లెదవని నేను ఎరిగినట్లు నీవు కూడా ఎరిగియుండవలెను; మరియు నీవు దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉన్నంత కాలము నీవు ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడుదువని కూడా నీవు ఎరుగవలెను. ఇప్పుడిది ఆయన వాక్యమును బట్టియైయున్నది.