లేఖనములు
ఆల్మా 37


37వ అధ్యాయము

ఆత్మలను రక్షించుటకు కంచు పలకలు మరియు ఇతర లేఖనములు భద్రపరచబడినవి—జెరెడీయులు వారి దుష్టత్వమును బట్టి నాశనము చేయబడిరి—వారి రహస్య ప్రమాణములు మరియు నిబంధనలు జనుల నుండి దూరముగా ఉంచబడవలెను—మీ కార్యములన్నిటిలో ప్రభువుతో ఆలోచన చేయుము—లియహోనా నీఫైయులను నడిపించినట్లు క్రీస్తు యొక్క మాట మనుష్యులను నిత్యజీవమునకు నడిపించును. సుమారు క్రీ. పూ. 74 సం.

1 నా కుమారుడా హీలమన్‌, నాకు అప్పగించబడిన గ్రంథములను నీవు తీసుకొనవలెనని నేను నిన్నాజ్ఞాపించుచున్నాను;

2 నేను చేసినట్లు ఈ జనుల గ్రంథమును నీవు నీఫై పలకలపై వ్రాయవలెనని మరియు నేను భద్రపరచిన ఈ సమస్త వస్తువులను నేను చేసినట్లుగానే పవిత్రముగా భద్రపరచవలెనని నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను; ఏలయనగా ఒక తెలివైన ఉద్దేశ్యము నిమిత్తము అవి భద్రపరచబడినవి.

3 ఈ కంచు పలకలు ఈ చెక్కడములను కలిగియుండి, వాటిపైన పరిశుద్ధ లేఖనముల యొక్క గ్రంథములను కలిగియుండి, ఆది నుండి కూడా మన పితరుల వంశావళిని కలిగియున్నవి—

4 అవి భద్రపరచబడి, ఒక తరము నుండి మరియొక తరమునకు అందించబడవలెనని మరియు వాటియందున్న మర్మములను వారు తెలుసుకొనునట్లు అవి ప్రతి జనము, జాతి, భాష మరియు ప్రజల యొద్దకు వెళ్ళు వరకు ప్రభువు యొక్క హస్తము ద్వారా కాపాడబడి, భద్రపరచబడవలెనని మన పితరుల చేత ప్రవచించబడియున్నది.

5 ఇప్పుడు అవి భద్రపరచబడిన యెడల, అవి వాటి ప్రకాశమును నిలుపుకొనవలెను; అవియు మరియు పరిశుద్ధ వ్రాతలను కలిగియున్న సమస్త పలకలు వాటి ప్రకాశమును నిలుపుకొనును.

6 ఇప్పుడిది నా యందున్న మూర్ఖత్వమని నీవు తలంచవచ్చును; కానీ, చిన్న మరియు సాధారణమైన విషయముల ద్వారా గొప్ప క్రియలు జరిగించబడునని, చిన్న చర్య అనేక సందర్భములలో జ్ఞానుల గర్వమణచునని నేను నీతో చెప్పుచున్నాను.

7 ప్రభువైన దేవుడు, ఆయన యొక్క గొప్ప నిత్య సంకల్పములను జరిగించుటకు చిన్న చర్య ద్వారా పనిచేయును; అతి చిన్న చర్య ద్వారా ప్రభువు జ్ఞానుల గర్వమణచి, అనేక ఆత్మలకు రక్షణను తెచ్చును.

8 ఇప్పుడు ఈ వస్తువులు భద్రపరచబడవలెను అనునది ఇంతవరకు దేవునియందు వివేకమైయున్నది; ఏలయనగా అవి ఈ జనుల యొక్క జ్ఞాపకమును విస్తరించినవి, వారి తప్పుడు మార్గములను గూర్చి అనేకులను ఒప్పించియున్నవి మరియు వారి ఆత్మల రక్షణకై వారికి తమ దేవుని గూర్చి తెలియజేసినవి.

9 ఈ పలకలపైనున్న ఈ గ్రంథములు కలిగియున్న ఈ సంగతుల నిమిత్తము కాని యెడల, వారి పితరుల తప్పుడు సంప్రదాయములను గూర్చి లేమనీయులలో అనేక వేలమందిని అమ్మోన్‌ మరియు అతని సహోదరులు అంతగా ఒప్పించగలిగియుండేవారు కాదు; ఈ గ్రంథములు మరియు వారి మాటలు వారిని పశ్చాత్తాపపడునట్లు చేసెను; అనగా అవి వారికి వారి దేవుడైన ప్రభువును గూర్చి తెలియజేసి, వారి విమోచకుడైన యేసు క్రీస్తునందు సంతోషించునట్లు చేసెను.

10 వారిలో అనేక వేలమందికి, అట్లే పాపము మరియు దుర్ణీతుల యందు తమ హృదయములను ఇప్పుడు కఠినము చేసుకొనుచున్నట్టి మన మెడబిరుసు సహోదరులైన నీఫైయులలో అనేక వేలమందికి కూడా వారి విమోచకుని గూర్చి తెలియజేయుటకు అవి సాధనముగా ఉండునేమో ఎవరికి తెలియును?

11 ఇప్పుడు ఈ మర్మములు ఇంకను నాకు పూర్తిగా తెలియజేయబడలేదు; కావున నేను ఊరకుందును.

12 అవి ఒక తెలివైన ఉద్దేశ్యము నిమిత్తము భద్రపరచబడినవని మాత్రము నేను చెప్పిన యెడల చాలును, ఆ ఉద్దేశ్యము దేవునికే తెలియును; ఏలయనగా ఆయన తన కార్యములన్నిటిలో వివేకముగా ఆలోచన చేయును, ఆయన త్రోవలు తిన్ననివి మరియు ఆయన మార్గము ఒక నిత్య వలయమైయున్నది.

13 ఓ, నా కుమారుడా హీలమన్‌ జ్ఞాపకముంచుకొనుము, దేవుని ఆజ్ఞలు ఎంత ఖచ్చితమైనవో జ్ఞాపకముంచుకొనుము. ఆయన ఇట్లు చెప్పెను: మీరు నా ఆజ్ఞలను పాటించిన యెడల మీరు దేశమందు వర్ధిల్లుదురు—కానీ మీరు ఆయన ఆజ్ఞలను పాటించని యెడల మీరు ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడుదురు.

14 ఇప్పుడు, నా కుమారుడా, ముందు తరములకు ఆయన తన శక్తిని ప్రదర్శించునట్లు, పవిత్రమైన వాటిని ఆయన పవిత్రముగా ఉంచి, ఆయన యందు ఒక తెలివైన ఉద్దేశ్యము నిమిత్తము ఆయన కాపాడి, భద్రపరచిన ఈ వస్తువులను దేవుడు నీకు అప్పగించెనని జ్ఞాపకముంచుకొనుము.

15 నీవు దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన యెడల, పవిత్రమైన ఈ వస్తువులు దేవుని శక్తి ద్వారా నీ నుండి తీసుకొనబడునని మరియు సాతాను నిన్ను గాలియెదుట పొట్టువలే జల్లించుటకు నీవు అతనికి అప్పగించి వేయబడుదువని ప్రవచనాత్మ ద్వారా నేను నీకు చెప్పుచున్నాను.

16 కానీ నీవు దేవుని ఆజ్ఞలను పాటించి, పవిత్రమైన ఈ వస్తువుల పట్ల ప్రభువు నీకు ఆజ్ఞాపించియున్న ప్రకారము చేసిన యెడల, (ఏలయనగా వాటి యెడల నీవు చేయవలసిన సమస్త క్రియల నిమిత్తము నీవు ప్రభువుకు మొరపెట్టవలెను) భూమి లేదా నరకము యొక్క ఏ శక్తి వాటిని నీ నుండి తీసివేయలేదు, ఏలయనగా దేవుడు తన మాటలన్నిటినీ నెరవేర్చుటకు శక్తిమంతుడైయున్నాడు.

17 ఆయన నీతో చేయు తన సమస్త వాగ్దానములను నెరవేర్చును, ఏలయనగా ఆయన మన పితరులకు చేసిన తన వాగ్దానములను నెరవేర్చెను.

18 ముందు తరములకు ఆయన తన శక్తిని ప్రదర్శించునట్లు ఆయనయందు ఒక తెలివైన ఉద్దేశ్యము నిమిత్తము ఈ వస్తువులను కాపాడెదనని ఆయన వారికి వాగ్దానము చేసెను.

19 ఇప్పుడు లేమనీయులలో అనేక వేలమందిని సత్యమును గూర్చి తిరిగి తెలుసుకొనునట్లు చేయు ఉద్దేశ్యమును ఆయన నెరవేర్చెను; ఆయన వాటియందు తన శక్తిని చూపెను మరియు వాటియందు ఆయన తన శక్తిని ముందు తరములకు కూడా ఇంకను ప్రదర్శించును; కావున అవి కాపాడబడును.

20 కావున నా కుమారుడా హీలమన్‌, నా మాటలన్నిటినీ నెరవేర్చుటయందు మరియు అవి వ్రాయబడినట్లుగా దేవుని ఆజ్ఞలను పాటించుట యందు నీవు శ్రద్ధగా ఉండవలెనని నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను.

21 ఇప్పుడు ఆ ఇరువది నాలుగు పలకలను గూర్చి నేను నీతో చెప్పుచున్నాను, మర్మములు మరియు అంధకార క్రియలు, వారి రహస్య కార్యములు లేదా నాశనము చేయబడియున్న ఆ జనుల యొక్క రహస్య కార్యములు ఈ జనులకు విశదపరచబడునట్లు, ముఖ్యముగా వారి యొక్క సమస్త హత్యలు, దొంగతనములు, దోపిడీలు, వారి దుష్టత్వము మరియు హేయక్రియలన్నీ ఈ జనులకు విశదపరచబడునట్లు నీవు వాటిని భద్రపరచమని మరియు ఈ అనువాదక సాధనములను కాపాడమని నీతో చెప్పుచున్నాను.

22 ఏలయనగా ఆయన జనులు అంధకారమందు పని చేయుట, అనగా రహస్య హత్యలు మరియు హేయక్రియలు చేయుట మొదలుపెట్టియున్నారని ప్రభువు చూచెను; కావున వారు పశ్చాత్తాపపడని యెడల, వారు భూముఖము పైనుండి నాశనము చేయబడవలెనని ప్రభువు చెప్పెను.

23 మరియు ప్రభువు ఇట్లు చెప్పెను: నాకు సేవచేయు నా జనులకు వారి సహోదరుల క్రియలను నేను తెలియజేయునట్లు, ముఖ్యముగా వారి రహస్య క్రియలను, అంధకార క్రియలను, దుష్టత్వము మరియు హేయక్రియలను తెలియజేయునట్లు అంధకారమందు వెలుగు కొరకు ప్రకాశించు ఒక రాయిని నేను నా సేవకుడు గజిలిము కొరకు సిద్ధపరిచెదను.

24 ఇప్పుడు, నా కుమారుడా, దేవుని వాక్యము నెరవేర్చబడునట్లు ఈ అనువాదక సాధనములు సిద్ధము చేయబడెను, వాటిని గూర్చి ఆయన ఇట్లు చెప్పుచూ పలికెను:

25 వారి అంధకార క్రియలు మరియు హేయక్రియలన్నిటినీ నేను అంధకారములో నుండి వెలుగులోనికి తెచ్చెదను; వారు పశ్చాత్తాపపడని యెడల నేను వారిని భూముఖము పైనుండి నాశనము చేసెదను; ఇక మీదట దేశమును స్వాధీనము చేసుకొను ప్రతి జనమునకు వారి రహస్యములు మరియు హేయక్రియలన్నిటినీ నేను తెలియజేసెదను.

26 నా కుమారుడా, వారు పశ్చాత్తాపపడలేదని మనము చూచుచున్నాము; కావున వారు నాశనము చేయబడియున్నారు మరియు అంతమట్టుకు దేవుని వాక్యము నెరవేరినది; రహస్యమైన వారి హేయక్రియలు చీకటిలో నుండి బయటకు తేబడి, మనకు తెలియజేయబడియున్నవి.

27 నా కుమారుడా, వారి ప్రమాణములు, నిబంధనలు మరియు రహస్యమైన వారి హేయక్రియలందలి ఒప్పందములన్నిటినీ నీవు దాచవలెనని నేను నిన్ను ఆజ్ఞాపించుచున్నాను; వారి చిహ్నములను మరియు వారి వింతలన్నిటినీ ఈ జనులు ఎరుగకుండునట్లు నీవు వారి నుండి వాటిని దాచవలెను, లేని యెడల బహుశా వారు కూడా అంధకారములోపడి నాశనమగుదురు.

28 ఏలయనగా వారి పాపము పండినప్పుడు ఆ అంధకార క్రియలు జరిగించు వారందరిపై దేవుని శక్తిని బట్టి నాశనము వచ్చునని ఈ దేశమంతటిపై ఒక శాపమున్నది; కావున ఈ జనులు నాశనము చేయబడరాదని నేను కోరుచున్నాను.

29 కావున ఈ జనుల నుండి వారి ప్రమాణములు, నిబంధనల యొక్క ఈ రహస్య ప్రణాళికలను నీవు దాచవలెను మరియు కేవలము వారి దుష్టత్వము, హత్యలు, హేయక్రియలను నీవు వారికి తెలియజేయవలెను; అట్టి దుష్టత్వము, హేయక్రియలు, హత్యలను ద్వేషించమని నీవు వారికి బోధించవలెను; వారి దుష్టత్వము, హేయక్రియలు మరియు వారి హత్యలను బట్టి ఈ జనులు నాశనము చేయబడిరని కూడా నీవు వారికి బోధించవలెను.

30 ఏలయనగా వారి దుర్ణీతులను గూర్చి వారికి ప్రకటించుటకు వారి మధ్యకు వచ్చిన ప్రభువు యొక్క ప్రవక్తలందరినీ వారు హతమార్చిరి మరియు వారు హత్యచేసిన వారి యొక్క రక్తము వారి హంతకులైన వారిపై ప్రతీకారము కొరకు వారి దేవుడైన ప్రభువుకు మొరపెట్టెను; ఆ విధముగా దేవుని తీర్పులు ఈ అంధకారము మరియు రహస్య కూడికలను జరిగించు వారిపై వచ్చెను.

31 వారి పాపము పూర్తిగా పండుటకు ముందు వారు పశ్చాత్తాపపడితే తప్ప, ఆ అంధకారము మరియు రహస్య కూడికలను జరిగించు వారిపై నాశనము వచ్చునట్లు శాశ్వతముగా దేశము శపించబడును.

32 ఇప్పుడు, నా కుమారుడా, నేను నీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుము; ఆ రహస్య ప్రణాళికలను ఈ జనులకు తెలియజేయకుము, కానీ పాపము మరియు దుర్నీతికి వ్యతిరేకముగా నిత్య ద్వేషమును వారికి బోధించుము.

33 వారికి పశ్చాత్తాపమును, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసమును బోధించుము; తమనుతాము తగ్గించుకోమని, సాత్వీకులుగా ఉండమని మరియు దీనమనస్సు కలిగియుండమని వారికి బోధించుము; ప్రభువైన యేసు క్రీస్తుపై వారి విశ్వాసముతో అపవాది యొక్క ప్రతి శోధనను తట్టుకొనుటను వారికి బోధించుము.

34 సత్‌క్రియల విషయములో ఎన్నడూ అలసిపోక, సాత్వీకులుగాను దీనమనస్సుగల వారిగాను ఉండుటను వారికి బోధించుము; ఏలయనగా అట్టి వారు తమ ఆత్మలకు విశ్రాంతిని కనుగొనెదరు.

35 ఓ నా కుమారుడా, జ్ఞాపకముంచుకొనుము, నీ యౌవనమందు జ్ఞానమును నేర్చుకొనుము; దేవుని ఆజ్ఞలను పాటించుటను నీ యౌవనమందే నేర్చుకొనుము.

36 నీ సమస్త సహాయము కొరకు దేవునికి మొరపెట్టుము; నీ కార్యములన్నియు ప్రభువునకై ఉండనిమ్ము; నీవు ఎక్కడకు వెళ్ళినను అది ప్రభువునందై ఉండనిమ్ము; నీ తలంపులన్నీ ప్రభువు వైపు నడిపింపబడనిమ్ము; నీ హృదయ వ్యామోహములు నిత్యము ప్రభువుపై నిలుపుము.

37 నీ కార్యములన్నిటిలో ప్రభువుతో ఆలోచన చేయుము మరియు ఆయన నిన్ను మేలు కొరకు నడిపించును; నీ నిద్రలో ప్రభువు నీపై కావలికాయునట్లు, రాత్రియందు నీవు పరుండుము మరియు ఉదయమందు నీవు లేచునప్పుడు నీ హృదయము దేవునిపట్ల కృతజ్ఞతలతో నిండియుండనిమ్ము; నీవు ఈ క్రియలను చేసిన యెడల, నీవు అంత్యదినమున పైకి లేపబడుదువు.

38 నా కుమారుడా, మన పితరులు ఒక గోళము లేదా మార్గదర్శి అని పిలిచినది లేదా మన పితరులు లియహోనా అని పిలిచిన దాని అర్థము ఒక దిక్సూచి—దానిని గూర్చి నేను కొంత చెప్పవలసియున్నది; దానిని ప్రభువు సిద్ధపరిచెను.

39 వింతైన పనితనము యొక్క ఆ తీరున ఏ మనుష్యుడూ పని చేయలేడు. అరణ్యమందు వారు ప్రయాణము చేయవలసిన మార్గమును మన పితరులకు చూపుటకు అది తయారు చేయబడెను.

40 దేవునియందు వారి విశ్వాసమును బట్టి, అది వారి కొరకు పనిచేసెను; కావున వారు వెళ్ళవలసిన మార్గమును ఆ కదురులు చూపునట్లు దేవుడు చేయగలడని నమ్ముటకు వారు విశ్వాసము కలిగియున్న యెడల, అది జరిగెను; కావున ఈ అద్భుతమును మరియు దినదినము దేవుని శక్తి ద్వారా చేయబడిన అనేక ఇతర అద్భుతములను కూడా వారు కలిగియుండిరి.

41 ఆ అద్భుతములు చిన్న సాధనముల ద్వారా జరిగించబడినప్పటికీ, అది వారికి అద్భుతకార్యములను చూపెను. వారు సోమరులై, వారి విశ్వాసమును శ్రద్ధను సాధన చేయుట మరచిపోయిరి; అప్పుడు ఆ అద్భుతకార్యములు ఆగిపోయెను మరియు వారి ప్రయాణములో వారు ముందుకు సాగలేదు;

42 కావున వారు అరణ్యములో నిలిచిరి లేదా తిన్నని మార్గమున ప్రయాణము చేయలేదు మరియు వారి అతిక్రమములను బట్టి ఆకలిదప్పులతో బాధింపబడిరి.

43 నా కుమారుడా, ఈ విషయములు ఒక సాదృశ్యము కలిగియున్నవని నీవు గ్రహించవలెనని నేను కోరుచున్నాను; ఏలయనగా మన పితరులు ఈ దిక్సూచికి (ఇప్పుడు ఈ విషయములు ఐహికమైనవి) శ్రద్ధనిచ్చుటలో సోమరులైనందువల్ల వారు వర్ధిల్లలేదు; ఆత్మీయమైన వస్తువుల విషయములో కూడా అంతే.

44 ఏలయనగా వాగ్దానదేశమునకు తిన్నని మార్గమును వారికి చూపు ఈ దిక్సూచి పట్ల శ్రద్ధ చూపుట మన పితరులకు ఎంత సులభముగా ఉండెనో, అట్లే నిత్య సంతోషమునకు తిన్నని మార్గమును మీకు చూపు క్రీస్తు యొక్క మాట పట్ల శ్రద్ధ చూపుట అంతే సులభమైయున్నది.

45 ఇప్పుడు నేను చెప్పుచున్నాను, ఈ సంగతియందు ఒక సూచన లేదా? ఏలయనగా దాని మార్గమును వెంబడించుట ద్వారా ఈ మార్గదర్శి మన పితరులను వాగ్దానదేశమునకు నిశ్చయముగా తెచ్చినట్లు, మనము వాటి మార్గమును వెంబడించిన యెడల క్రీస్తు మాటలు మనలను ఈ దుఃఖపులోయ ఆవలనున్న మిక్కిలి శ్రేష్ఠమైన వాగ్దానదేశమునకు తీసుకొనిపోవును.

46 ఓ నా కుమారుడా, మార్గము సులభమైనందున మనము సోమరులుగా ఉండరాదు; మన పితరులకు అట్లేయుండెను; ఏలయనగా వారు చూచిన యెడల వారు జీవించునట్లు అది వారి కొరకు సిద్ధము చేయబడెను; మనకు కూడా అంతే. మార్గము సిద్ధపరచబడినది మరియు మనము చూచిన యెడల మనము నిరంతరము జీవించెదము.

47 నా కుమారుడా, నీవు ఈ పవిత్రమైన వస్తువుల విషయమై జాగ్రత్త కలిగియుండుము, దేవుని వైపు చూచి జీవించుము. ఈ జనుల వద్దకు వెళ్ళి వాక్యమును ప్రకటించుము మరియు నిశ్చలముగానుండుము. నా కుమారుడా, వీడ్కోలు.