లేఖనములు
ఆల్మా 38


తన కుమారుడైన షిబ్లోన్‌కు ఆల్మా యొక్క ఆజ్ఞలు.

38వ అధ్యాయము కలిగియున్నది.

38వ అధ్యాయము

నీతి నిమిత్తము షిబ్లోన్‌ హింసింపబడును—రక్షణ క్రీస్తు యందున్నది, ఆయనే లోకమునకు జీవము మరియు వెలుగైయున్నాడు—మీ కామోద్రేకములన్నిటికి కళ్ళెము వేయుడి. సుమారు క్రీ. పూ. 74 సం.

1 నా కుమారుడా, నా మాటలకు చెవి యొగ్గుము. ఏలయనగా నీవు దేవుని ఆజ్ఞలను పాటించియున్నంత వరకు నీవు దేశమందు వర్ధిల్లుదువు మరియు నీవు దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉన్నంత వరకు నీవు ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడుదువని హీలమన్‌కు చెప్పినట్లుగానే నేను నీతో కూడా చెప్పుచున్నాను.

2 ఇప్పుడు, నా కుమారుడా, దేవుని యెడల నీ నిలకడను మరియు నీ విశ్వాస్యతను బట్టి నీయందు గొప్ప సంతోషము కలిగియుండెదనని నేను నమ్ముచున్నాను; ఏలయనగా నీ యౌవనమందు నీ దేవుడైన ప్రభువు వైపు చూచుటను నీవు ఎట్లు మొదలుపెట్టియున్నావో అట్లే ఆయన ఆజ్ఞలను పాటించుట యందు కూడా నీవు కొనసాగుదువని నేను ఆశించుచున్నాను; ఏలయనగా అంతము వరకు సహించువాడు ధన్యుడు.

3 నా కుమారుడా, జోరమీయుల యొక్క జనుల మధ్య నీ విశ్వాస్యత, శ్రద్ధ, సహనము మరియు నీ దీర్ఘశాంతమును బట్టి నేను నీ యందు ఇప్పటికే గొప్ప సంతోషము కలిగియుంటినని నీతో చెప్పుచున్నాను.

4 నీవు బంధకములలో యుంటివని నేనెరుగుదును; వాక్యము నిమిత్తము నీవు రాళ్ళతో కొట్టబడితివని కూడా నేనెరుగుదును; ప్రభువు నీతో ఉన్నందున ఈ కష్టములన్నిటినీ నీవు ఓపికతో సహించియున్నావు; మరియు ప్రభువు నిన్ను విడిపించెనని ఇప్పడు నీవు ఎరుగుదువు.

5 నా కుమారుడా షిబ్లోన్‌, నీవు ఎంత ఎక్కువగా దేవునియందు నమ్మికయుంచెదవో అంత ఎక్కువగా నీ శోధనలు, కష్టములు, శ్రమల నుండి నీవు విడిపించబడెదవని మరియు అంత్యదినమున పైకెత్తబడెదవని నీవు జ్ఞాపకముంచుకొనవలెనని నేను కోరుచున్నాను.

6 నా కుమారుడా, నాకై నేను ఈ విషయములను ఎరుగుదునని నీవు తలంచవలెనని నేను కోరను, కానీ నాకు ఈ విషయములను తెలియజేయునది నాయందున్న దేవుని యొక్క ఆత్మయే; ఏలయనగా నేను దేవునివలన జన్మించియుండని యెడల నేను ఈ విషయములను ఎరిగియుండను.

7 కానీ ఆయన జనుల మధ్య నాశనకార్యమును నేను ఆపవలెనని నాకు తెలియజేయుటకు ప్రభువు తన గొప్ప కనికరమందు తన దేవదూతను పంపెను; నేను ఒక దేవదూతను ముఖాముఖిగా చూచియున్నాను మరియు అతడు నాతో మాట్లాడెను, అతని స్వరము ఉరుమువలే ఉండి భూమియంతటిని కంపింపజేసెను.

8 నేను మూడు పగళ్ళు మూడు రాత్రులు ఆత్మ యొక్క అత్యంత తీవ్రమైన బాధ మరియు వేదన యందుంటిని; కనికరము కొరకు ప్రభువైన యేసు క్రీస్తుకు నేను మొరపెట్టువరకు, నేను ఎన్నడూ నా పాపముల కొరకు క్షమాపణ పొందలేదు. కానీ, నేను ఆయనకు మొరపెట్టితిని మరియు నా ఆత్మకు శాంతిని కనుగొంటిని.

9 నా కుమారుడా, నీవు జ్ఞానమును నేర్చుకొనునట్లు దీనిని నీకు చెప్పియున్నాను, మనుష్యుడు రక్షింపబడగల మరే ఇతర మార్గము లేదా సాధనము లేదని, కేవలము క్రీస్తు నందు మరియు ద్వారానే రక్షణ వచ్చును అని నీవు నా నుండి నేర్చుకొనవలెను. ఆయనే లోకమునకు జీవము మరియు వెలుగైయున్నాడు. ఆయనే సత్యము మరియు నీతి వాక్యమైయున్నాడు.

10 ఇప్పుడు నీవు వాక్యము బోధించుటను ప్రారంభించినట్లు, దానిని కొనసాగించవలెనని నేను కోరుచున్నాను; నీవు అన్ని విషయములలో శ్రద్ధగాను, మితముగాను ఉండవలెనని నేను కోరుచున్నాను.

11 నీవు గర్వమందు పైకెత్తబడకుండా చూచుకొనుము; నీ స్వంత జ్ఞానమందు లేదా నీ అధిక బలమును బట్టి నీవు డంబములు పలుకకుండా చూచుకొనుము.

12 ధైర్యమునుపయోగించుము, కానీ ఆధిపత్యము చూపకుము; ప్రేమతో నింపబడునట్లు నీ కామోద్రేకములన్నిటికి కళ్ళెము వేయుము; సోమరితనమునకు దూరముగా ఉండుము.

13 జోరమీయులు చేయునట్లు ప్రార్థన చేయకుము, ఏలయనగా మనుష్యులచేత వినబడవలెనని మరియు వారి తెలివి నిమిత్తము పొగడబడవలెనని వారు ప్రార్థించెదరని నీవు చూచియున్నావు.

14 ఓ దేవా, మేము మా సహోదరులకంటే మెరుగైనవారమని నేను నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను అని చెప్పకుము; కానీ ఓ ప్రభువా, నా అయోగ్యతను మన్నించి నా సహోదరులను కనికరమందు జ్ఞాపకముంచుకొనమని చెప్పుము—అనగా అన్ని సమయములందు దేవుని యెదుట మీ అయోగ్యతను ఒప్పుకొనుము.

15 ప్రభువు నీ ఆత్మను ఆశీర్వదించి, సమాధానమందు కూర్చొనుటకు అంత్యదినమున ఆయన రాజ్యములోనికి నిన్ను చేర్చుకొనును గాక. ఇప్పుడు, నా కుమారుడా, వెళ్ళి ఈ జనులకు వాక్యమును బోధించుము. నిశ్చలముగా నుండుము. నా కుమారుడా, వీడ్కోలు.