లేఖనములు
ఆల్మా 41


41వ అధ్యాయము

పునరుత్థానమందు మనుష్యులు అంతము లేని సంతోషము లేదా అంతము లేని దౌర్భాగ్యము యొక్క స్థితికి లేచి వచ్చెదరు—దుష్టత్వము ఎన్నడూ సంతోషము కాదు—శరీర సంబంధులైన మనుష్యులు లోకమందు దేవుడు లేకయున్నారు—మర్త్యత్వమందు సంపాదించుకొన్న స్వభావములు మరియు గుణములను ప్రతి మనుష్యుడు పునరుత్థానమందు తిరిగి పొందును. సుమారు క్రీ. పూ. 74 సం.

1 నా కుమారుడా, చెప్పబడిన దాని యొక్క పునఃస్థాపనను గూర్చి నేను కొంత చెప్పవలసియున్నది; ఏలయనగా కొందరు లేఖనములను వక్రీకరించియున్నారు మరియు ఈ విషయమును బట్టి దూరముగా దారి తప్పిపోయియున్నారు. ఈ విషయమును గూర్చి నీ మనస్సు కూడా కలత చెందియున్నదని నేను చూచుచున్నాను, కానీ నేను దానిని నీకు వివరించెదను.

2 నా కుమారుడా, దేవుని యొక్క న్యాయమును బట్టి పునఃస్థాపన ప్రణాళిక ఆవశ్యకమైయున్నదని నేను నీతో చెప్పుచున్నాను; ఏలయనగా సమస్తము వాటి సరియైన క్రమమునకు పునఃస్థాపించబడుట ఆవశ్యకమైయున్నది. క్రీస్తు యొక్క శక్తి, పునరుత్థానములను బట్టి మనుష్యుని ఆత్మ దాని శరీరమునకు పునఃస్థాపించబడుట, శరీరము యొక్క ప్రతి భాగము దానికే పునఃస్థాపించబడుట ఆవశ్యకము మరియు న్యాయమైయున్నది.

3 మనుష్యులు వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడుట దేవుని యొక్క న్యాయమును బట్టి ఆవశ్యకమైయున్నది; ఈ జీవితమందు వారి క్రియలు మంచివైయుండి, వారి హృదయవాంఛలు మంచివైన యెడల, వారు అంత్యదినమున మంచిదైన దానికి పునఃస్థాపించబడవలెను.

4 వారి క్రియలు చెడ్డవైన యెడల వారు చెడ్డదానికి పునఃస్థాపించబడవలెను. కావున సమస్తము దాని సరియైన క్రమమునకు పునఃస్థాపించబడవలెను, ప్రతిది దాని ప్రకృతి సిద్ధమైన ఆకారమునకు—మర్త్యత్వము అమర్త్యత్వమునకు, క్షయత అక్షయతకు లేపబడును—ఒకవైపున ఒకడు అంతము లేని సంతోషమునకు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుటకు లేపబడగా, ఇంకొకడు రెండవ వైపున అంతము లేని దౌర్భాగ్యమునకు అపవాది రాజ్యమును స్వతంత్రించుకొనుటకు లేపబడును—

5 ఒకడు సంతోషము కొరకు అతని కోరికలను బట్టి సంతోషమునకు, లేదా మేలు కొరకు అతని కోరికలను బట్టి మేలునకు లేపబడును; మరియొకడు అతని చెడు కోరికలను బట్టి కీడునకు లేపబడును; ఏలయనగా అతడు దినమంతయు చెడు చేయుటకు కోరియున్నందున, రాత్రి వచ్చినప్పుడు అతడు చెడును ప్రతిఫలముగా పొందును.

6 ఆలాగునే మరొక వైపున అతడు తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి, జీవితాంతము వరకు నీతిని కోరిన యెడల అతడు నీతిని ప్రతిఫలముగా పొందును.

7 ప్రభువు వలన విమోచింపబడిన వారు వీరే; కాపాడబడి, అంధకారము యొక్క అంతము లేని రాత్రి నుండి విడిపించబడిన వారు వీరే; ఆవిధముగా వారు నిలబడుదురు లేదా పడిపోవుదురు; ఏలయనగా మేలు చేయుటకు లేదా కీడు చేయుటకు వారు తమ స్వంత న్యాయాధిపతులైయున్నారు.

8 ఇప్పుడు, దేవుని తీర్పులు మార్చబడలేవు; కావున, ఇష్టపడువాడు దానియందు నడిచి రక్షింపబడునట్లు మార్గము సిద్ధపరచబడినది.

9 నా కుమారుడా, పాపము చేయుటకు నీవు ఇంతవరకు తెగించినట్లు సిద్ధాంతము యొక్క ఆ అంశములపై నీ దేవునికి వ్యతిరేకముగా మరియొక నేరము చేయుటకు తెగించవద్దు.

10 పునరుత్థానమును గూర్చి చెప్పబడి యున్నందున, నీవు పాపము నుండి సంతోషమునకు పునఃస్థాపించబడుదువని తలంచవద్దు. ఇదిగో దుష్టత్వము ఎన్నడూ సంతోషము కాదని నేను నీతో చెప్పుచున్నాను.

11 నా కుమారుడా, ప్రకృతి సంబంధమైన స్థితి లేదా నేను చెప్పుచున్న శరీర సంబంధమైన స్థితిలోనున్న మనుష్యులందరు ఘోర దుష్టత్వమందు మరియు దుర్నీతి బంధకములందు ఉన్నారు; వారు లోకమందు దేవుడు లేకయున్నారు మరియు వారు దేవుని స్వభావమునకు వ్యతిరేకముగా వెళ్ళియున్నారు; కావున వారు సంతోషము యొక్క స్వభావమునకు వ్యతిరేకమైన స్థితిలో ఉన్నారు.

12 ఇప్పుడు పునరుత్థానమను మాటకు అర్థము, ప్రకృతి సంబంధమైన స్థితిలోనున్న ఒకదానిని తీసుకొని దానికి వ్యతిరేకమైన స్థితి యందు ఉంచుటయా లేదా దాని స్వభావమునకు వ్యతిరేకమైన స్థితి యందు ఉంచుటయా?

13 ఓ నా కుమారుడా, విషయమిది కాదు; కానీ పునరుత్థానము యొక్క అర్థము, చెడుకు చెడు లేదా శరీర సంబంధమైన దానికి శరీర సంబంధమైన దానిని లేదా అపవాది సంబంధమైన దానికి అపవాది సంబంధమైన దానిని—మంచిదైన దానికి మంచి దానిని, నీతియైన దానికి నీతియైన దానిని, న్యాయమైన దానికి న్యాయమైన దానిని, కనికరముగల దానికి కనికరముగల దానిని యథాస్థితికి తెచ్చుటయైయున్నది.

14 కావున నా కుమారుడా, నీవు నీ సహోదరులపట్ల కనికరము కలిగియుండునట్లు చూచుకొనుము; న్యాయముగా వ్యవహరించుము, నీతిగా తీర్పు తీర్చుము మరియు నిరంతరము మేలు చేయుము; నీవు ఈ క్రియలన్నిటినీ చేసిన యెడల, అప్పుడు నీవు నీ ప్రతిఫలమును పొందెదవు; కనికరము నీకు తిరిగి పునఃస్థాపించబడును; న్యాయము నీకు తిరిగి పునఃస్థాపించబడును; న్యాయమైన తీర్పు నీకు తిరిగి పునఃస్థాపించబడును; మరలా నీవు మంచిని ప్రతిఫలముగా కలిగియుందువు.

15 ఏలయనగా నీవు ఏమి చేయుదువో అదియే నీకు తిరిగి వచ్చును మరియు పునఃస్థాపించబడును; కావున పునఃస్థాపన అనుమాట మరింత సంపూర్ణముగా పాపిని ఖండించి, అతడిని ఎంతమాత్రము నిర్దోషిగా యెంచదు.