లేఖనములు
ఆల్మా 5


దేవుని పరిశుద్ధ క్రమముననుసరించి ప్రధాన యాజకుడైన ఆల్మా, దేశమంతటా వారి పట్టణములలో పల్లెలలో ఉన్న జనులతో పలికిన మాటలు.

5 వ అధ్యాయముతో ఆరంభమగును.

5వ అధ్యాయము

రక్షణ పొందుటకు మనుష్యులు పశ్చాత్తాపపడి ఆజ్ఞలను పాటించవలెను, క్రొత్తగా జన్మించి క్రీస్తు యొక్క రక్తము ద్వారా తమ వస్త్రములను శుద్ధిచేసుకొనవలెను, వినయము కలిగి, గర్వము మరియు అసూయలను విడిచిపెట్టి నీతి కార్యములను చేయవలెను—మంచి కాపరి తన జనులను పిలుచును—దుష్క్రియలు జరిగించు వారు అపవాది సంతానమగుదురు—ఆల్మా తన సిద్ధాంతము యొక్క సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చును మరియు పశ్చాత్తాపపడమని మనుష్యులను ఆజ్ఞాపించును—నీతిమంతుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడును. సుమారు క్రీ. పూ. 83 సం.

1 ఇప్పుడు ఆల్మా, మొదట జరహేమ్ల దేశమందు, అక్కడ నుండి దేశమంతటనున్న జనులకు దేవుని వాక్యము ప్రకటించసాగెను.

2 అతడు వ్రాసిన గ్రంథము ప్రకారము, జరహేమ్ల పట్టణమందు స్థాపించబడిన సంఘమందున్న జనులతో అతడు పలికిన మాటలివి:

3 ఆల్మా అను నేను దేవుని సంఘముపై ప్రధాన యాజకునిగా ఉండుటకు నా తండ్రి ఆల్మా చేత ప్రతిష్ఠించబడితిని; ఈ క్రియలను చేయుటకు దేవుని నుండి శక్తి మరియు అధికారమును కలిగియున్న ఆయన నీఫై యొక్క సరిహద్దులలో ఉన్న దేశమందు, అనగా మోర్మన్‌ దేశమని పిలువబడిన దేశమందు ఒక సంఘమును స్థాపించుట మొదలుపెట్టి, తన సహోదరులకు మోర్మన్‌ జలములలో బాప్తిస్మమిచ్చెనని నేను మీతో చెప్పుచున్నాను.

4 రాజైన నోవహు జనుల యొక్క చేతులలో నుండి వారు దేవుని కనికరము మరియు శక్తి చేత విడిపించబడిరని నేను మీతో చెప్పుచున్నాను.

5 దాని తర్వాత వారు అరణ్యమందు లేమనీయుల ద్వారా దాస్యములోనికి తేబడిరి. వారు దాస్యములో ఉండిరి మరియు ప్రభువు వారిని తన వాక్యపు శక్తి చేత మరలా దాస్యము నుండి విడిపించెనని నేను మీతో చెప్పుచున్నాను; మనము ఈ దేశములోనికి తేబడితిమి. ఇక్కడ మనము ఈ దేశమంతటా దేవుని సంఘమును స్థాపించుట ప్రారంభించితిమి.

6 ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, నా సహోదరులారా, ఈ సంఘమునకు చెందిన మీరు మీ పితరుల చెరను తగినంతగా జ్ఞాపకముంచుకొనియున్నారా? వారి యెడల ఆయన కనికరమును దీర్ఘశాంతమును మీరు తగినంతగా జ్ఞాపకముంచుకొనియున్నారా? ఇంకను వారి ఆత్మలను నరకము నుండి ఆయన విడిపించియున్నాడని మీరు తగినంతగా జ్ఞాపకముంచుకొనియున్నారా?

7 ఆయన వారి హృదయములను మార్చియున్నాడు; ఆయన వారిని గాఢమైన నిద్ర నుండి మేల్కొలిపియున్నాడు; మరియు వారు దేవుని కొరకు మేలుకొనియున్నారు. వారు అంధకారము మధ్యనుండిరి; అయినప్పటికీ, వారి ఆత్మలు శాశ్వత వాక్యము యొక్క వెలుగు ద్వారా ప్రకాశింపజేయబడినవి; వారు మరణ బంధకములు, నరకపు సంకెళ్ళ చేత చుట్టబడియున్నారు, ఒక శాశ్వత నాశనము వారి కొరకు వేచియున్నది.

8 ఇప్పుడు నా సహోదరులారా, వారు నాశనము చేయబడిరా? అని నేను మిమ్ములను అడుగుచున్నాను. లేదు, వారు నాశనము చేయబడలేదని నేను మీతో చెప్పుచున్నాను.

9 మరలా నేను అడుగుచున్నాను, మరణ బంధకములు త్రెంచబడెనా? వారి చుట్టూ చుట్టుకొన్న నరకపు సంకెళ్ళు తొలగించబడెనా? అవును, అవి తొలగించబడెను, వారి ఆత్మలు వృద్ధి పొందెను, వారు విమోచించు ప్రేమను గూర్చి పాడిరని, వారు రక్షింపబడిరని నేను మీతో చెప్పుచున్నాను.

10 ఇప్పుడు నేను మిమ్ములనడుగుచున్నాను, వారు ఏ షరతులపై రక్షణ పొందిరి? రక్షణ కొరకు నిరీక్షణ కలిగియుండుటకు వారు ఏ హేతువులు కలిగియుండిరి? మరణ బంధకములు మరియు నరకపు సంకెళ్ళ నుండి వారు తొలగించబడుటకు కారణమేమి?

11 ఇదిగో, నేను మీకు చెప్పగలను—అబినడై నోటి ద్వారా పలుకబడిన మాటల యందు నా తండ్రి ఆల్మా విశ్వసించలేదా? అతడు ఒక పరిశుద్ధ ప్రవక్త కాడా? అతడు దేవుని మాటలను పలుకలేదా, నా తండ్రి ఆల్మా వాటిని విశ్వసించలేదా?

12 అతని విశ్వాసమును బట్టి, అతని హృదయమందు బలమైన మార్పు జరిగెను. ఇది అంతయూ సత్యమని నేను మీతో చెప్పుచున్నాను.

13 అతడు మీ పితరులకు వాక్యమును బోధించగా వారి హృదయముల యందు కూడా బలమైన మార్పు కలిగెను; వారు తమనుతాము తగ్గించుకొని, నిజమైన మరియు సజీవుడైన దేవుని యందు తమ విశ్వాసముంచిరి. అంతము వరకు వారు విశ్వాసముతో నుండిరి; కావున, వారు రక్షింపబడిరి.

14 ఇప్పుడు నా సంఘ సహోదరులారా, నేను మిమ్ములను అడుగుచున్నాను, మీరు దేవునివలన ఆత్మీయముగా జన్మించియున్నారా? మీ రూపముల యందు ఆయన స్వరూపమును పొందియున్నారా? మీ హృదయముల యందు ఈ బలమైన మార్పును అనుభవించియున్నారా?

15 మిమ్ములను సృష్టించిన ఆయన విమోచన యందు మీరు విశ్వసించుచున్నారా? మీరు విశ్వాసము గల దృష్టితో ఎదురు చూచుచున్నారా? మర్త్య శరీరమందు మీరు చేసియున్న క్రియలను బట్టి తీర్పు తీర్చబడుటకు దేవుని యెదుట నిలుచుటకు ఈ మర్త్య శరీరము అమర్త్యమందు లేపబడుటను మరియు క్షయత, అక్షయత యందు లేపబడుటను చూచుచున్నారా?

16 నేను మీతో చెప్పుచున్నాను, ఆ దినమున—ఆశీర్వదింపబడినవారలారా, నా యొద్దకు రండి, మీ క్రియలు భూముఖముపై నీతి క్రియలైయుండెనని మీతో చెప్పుచున్న ప్రభువు యొక్క స్వరమును మీరు వినెదరని మీరూహించగలరా?

17 లేక ఆ దినమున—ప్రభువా, మా క్రియలు భూముఖముపై నీతి క్రియలైయుండెనని ప్రభువుతో చెప్పుచూ మీరు అబద్ధమాడగలరని, అప్పుడాయన మిమ్ములను రక్షించునని మీరూహించుచున్నారా?

18 లేని యెడల మీ ఆత్మలు, దోషముతో దుఃఖముతో నిండి, మీ సమస్త దోషము యొక్క జ్ఞాపకము కలిగియుండి, మీ సమస్త దుష్టత్వము యొక్క పరిపూర్ణ జ్ఞాపకము కలిగియుండి, మీరు దేవుని ఆజ్ఞలను ఎదిరించియున్నారను జ్ఞాపకము కలిగియుండి, దేవుని న్యాయస్థానము యెదుటకు తేబడుటను మీరూహించగలరా?

19 నేను మీతో చెప్పుచున్నాను, ఆ దినమున శుద్ధమైన హృదయముతో నిర్దోషమైన చేతులతో దేవుని వైపు మీరు చూడగలరా? మీ రూపములపై దేవుని స్వరూపము చెక్కబడియుండి, మీరు పైకి చూడగలరా?

20 నేను మీతో చెప్పుచున్నాను, అపవాదికి దాసులగుటకు మిమ్ములను మీరు అప్పగించుకొనియున్నప్పుడు, రక్షింపబడుటను గూర్చి మీరు ఆలోచించగలరా?

21 మీరు రక్షింపబడలేరని ఆ దినమున మీరు తెలుసుకొందురు; ఏలయనగా అతని వస్త్రములు తెల్లగా శుద్ధిచేయబడని యెడల ఏ మనుష్యుడును రక్షింపబడలేడు; అనగా, తన జనులను వారి పాపముల నుండి విమోచించుటకు వచ్చునని మన పితరుల ద్వారా చెప్పబడిన ఆయన రక్తము ద్వారా సమస్త దోషము నుండి శుభ్రముచేయబడు వరకు అతని వస్త్రములు శుద్ధిచేయబడవలెనని నేను మీతో చెప్పుచున్నాను.

22 నా సహోదరులారా, ఇప్పుడు నేను మిమ్ములను అడుగుచున్నాను, మీ వస్త్రములు రక్తముతో సమస్త విధమైన మురికితో మలినమైయుండగా, దేవుని న్యాయస్థానము యెదుట మీరు నిలిచిన యెడల మీలో ఎవరైనను ఎట్లు భావించెదరు? ఇవన్నియు మీకు వ్యతిరేకముగా ఏమని సాక్ష్యమిచ్చును?

23 మీరు నరహంతకులని, సమస్త విధములైన దుష్టత్వములో మీరు దోషులైయున్నారని అవి సాక్ష్యమియ్యవా?

24 నా సహోదరులారా, అట్టివాడు, వారి వస్త్రములు శుద్ధిచేయబడి మచ్చలేక శుద్ధముగా తెల్లగా ఉన్న ఆ అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో మరియు పరిశుద్ధ ప్రవక్తలందరితో కలిసి దేవుని రాజ్యమందు కూర్చొనుటకు స్థానము కలిగియుండగలడని మీరు అనుకొనుచున్నారా?

25 లేదు, అని నేను మీతో చెప్పుచున్నాను; ఆది నుండి మన సృష్టికర్తను మీరు అబద్ధికునిగా చేసి, లేదా ఆది నుండి ఆయన అబద్ధికుడైయుండెనని తలంచితే తప్ప, అట్టి వారు పరలోక రాజ్యమందు స్థానము కలిగియుండగలరని మీరనుకొనలేరు; కానీ వారు బయటకు త్రోసివేయబడుదురు, ఏలయనగా వారు అపవాది రాజ్యము యొక్క సంతానమైయున్నారు.

26 ఇప్పుడు నా సహోదరులారా, నేను మీతో చెప్పుచున్నాను, మీరు హృదయము యొక్క మార్పును అనుభవించిన యెడల మరియు విమోచించు ప్రేమ గీతమును పాడవలెనని మీకనిపించిన యెడల, ఇప్పుడు మీరు ఆలాగున భావించగలరా? అని నేను అడుగుచున్నాను.

27 దేవుని యెదుట మీరు నిరపరాధులుగా నడుచుకున్నారా? ఈ సమయమున మరణించుటకు మీరు పిలువబడిన యెడల, మీరు తగినంత వినయముగా ఉన్నారనియు తన జనులను వారి పాపముల నుండి విమోచించుటకు రాబోవు ఆ క్రీస్తు యొక్క రక్తము ద్వారా మీ వస్త్రములు శుభ్రము చేయబడి తెల్లగా చేయబడినవనియు మీకు మీరు చెప్పుకోగలరా?

28 మీరు గర్వమును విడిచిపెట్టియున్నారా? మీరు విడిచిపెట్టని యెడల, దేవుడిని కలుసుకొనుటకు మీరు సిద్ధముగా లేరని నేను మీతో చెప్పుచున్నాను. మీరు త్వరగా సిద్ధపడవలెను; ఏలయనగా పరలోకరాజ్యము సమీపించియున్నది మరియు అట్టి వాడు నిత్యజీవము కలిగియుండడు.

29 ఇదిగో, మీ మధ్య అసూయను విడిచిపెట్టని వాడెవడైనా ఉన్నాడా? అట్టివాడు సిద్ధపడి లేడని నేను మీతో చెప్పుచున్నాను; అతడు త్వరగా సిద్ధపడవలెనని నేను కోరుచున్నాను, ఏలయనగా సమయము ఆసన్నమైనది మరియు సమయము ఎప్పుడు వచ్చునో అతడు ఎరుగడు; అట్టివాడు నిర్దోషిగా కనుగొనబడడు.

30 మరలా నేను మీతో చెప్పుచున్నాను, తన సహోదరుడిని ఎగతాళి చేయువాడు లేదా అతనిపై హింసలు క్రుమ్మరించువాడు మీ మధ్య ఎవడైనా ఉన్నాడా?

31 అట్టి వానికి ఆపద, ఏలయనగా అతడు సిద్ధముగా లేడు, మరియు అతడు పశ్చాత్తాపపడు సమయము సమీపించియున్నది, లేని యెడల అతడు రక్షింపబడలేడు.

32 దుర్నీతిని జరిగించు మీ అందరికి కూడా ఆపద; పశ్చాత్తాపపడుడి, పశ్చాత్తాపపడుడి, ఏలయనగా ప్రభువైన దేవుడు దీనిని పలికెను.

33 ఇదిగో, మనుష్యులందరిని ఆయన ఆహ్వానించుచున్నాడు, ఏలయనగా కరుణా బాహువులు వారి వైపు చాపబడియున్నవి మరియు పశ్చాత్తాపపడుడి, నేను మిమ్ములను చేర్చుకొందునని ఆయన చెప్పుచున్నాడు.

34 ఆయన ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నా యొద్దకు రండి, మీరు జీవవృక్షము యొక్క ఫలములో పాలుపొందెదరు; మీరు జీవాహారమును, జీవజలములను ఉచితముగా తిని త్రాగెదరు.

35 నా యొద్దకు రండి మరియు నీతి కార్యములను ఫలించుడి, మీరు నరికి వేయబడి అగ్నిలోనికి పడవేయబడరు.

36 ఏలయనగా, మంచి ఫలమును ఫలించని వాడు లేదా నీతి కార్యములు చేయని వాడు రోదించి దుఃఖించుటకు హేతువు కలిగియుండు సమయము సమీపించియున్నది.

37 దుర్నీతిని జరిగించువారలారా, లోకము యొక్క వ్యర్థమైన వస్తువుల యందు గర్వించు మీరు, నీతి మార్గములను ఎరిగియున్నామని చెప్పుకొన్న మీరు, కాపరి లేని గొఱ్ఱెల వలే దారి తప్పిపోయి ఉన్నారు; కాపరి మిమ్ములను పిలిచియున్నాడు, ఇంకను పిలుచుచున్నాడు, కానీ మీరు ఆయన స్వరమును ఆలకించకున్నారు.

38 ఇదిగో, మంచి కాపరి మిమ్ములను పిలుచుచున్నాడని నేను మీతో చెప్పుచున్నాను; తన స్వనామమైన క్రీస్తు నామమందు ఆయన మిమ్ములను పిలుచుచున్నాడు; మంచి కాపరి యొక్క స్వరమును, పిలువబడియున్న ఆ నామమును మీరు ఆలకించని యెడల, మీరు మంచి కాపరి యొక్క గొఱ్ఱెలు కారు.

39 ఇప్పుడు మీరు మంచి కాపరి యొక్క గొఱ్ఱెలు కాని యెడల, మీరు ఏ మందకు చెందిన వారు? ఇదిగో, అపవాది మీ కాపరియని, మీరు అతని మందయని నేను మీతో చెప్పుచున్నాను; ఇప్పుడు, ఎవడు దీనిని కాదనగలడు? ఎవడు దీనిని కాదనునో అతడు అబద్ధికుడు మరియు అపవాది యొక్క సంతానమై యున్నాడని నేను మీతో చెప్పుచున్నాను.

40 ఏలయనగా మంచిదేదైనను దేవుని నుండి మరియు చెడ్డదేదైనను అపవాది నుండి వచ్చునని నేను మీతో చెప్పుచున్నాను.

41 కావున, ఒక మనుష్యుడు మంచి కార్యములు చేసిన యెడల అతడు మంచి కాపరి యొక్క స్వరమును ఆలకించి, ఆయనను వెంబడించును; కానీ చెడు కార్యములను చేయువాడు అపవాది యొక్క సంతానమగును, ఏలయనగా అతడు వాని స్వరమును ఆలకించి వానిని వెంబడించును.

42 మరియు దీనిని చేసిన వాడెవడైనను అతని నుండి తన జీతమును పొందవలెను; కావున సమస్త సత్‌క్రియలకు సంబంధించి మరణించిన వాడై, నీతికి సంబంధించిన విషయములలో తన జీతముగా అతడు మరణమును పొందును.

43 ఇప్పుడు నా సహోదరులారా, మీరు నన్ను వినవలెనని నేను కోరుచున్నాను, నా ఆత్మ యొక్క శక్తితో నేను మాట్లాడుచున్నాను; ఏలయనగా, మీరు పొరపాటు చేయకుండునట్లు నేను మీతో స్పష్టముగా పలికియున్నాను లేదా దేవుని ఆజ్ఞలను బట్టి పలికియున్నాను.

44 ఏలయనగా క్రీస్తు యేసు నందున్న దేవుని పరిశుద్ధ క్రమమును బట్టి, ఈ విధముగా పలుకుటకు నేను పిలువబడియున్నాను; రాబోవు విషయములకు సంబంధించి మన పితరుల ద్వారా పలుకబడిన వాటిని గూర్చి ఈ జనుల యెదుట నిలబడి సాక్ష్యమిచ్చుటకు నేను ఆజ్ఞాపించబడియున్నాను.

45 అంతయు ఇదియే కాదు. నాకై నేను ఈ విషయములను ఎరుగుదునని మీరు అనుకొనుట లేదా? ఇదిగో, నేను పలికిన ఈ విషయములు సత్యమని నేను ఎరుగుదునని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. మరియు వాటి యథార్థతను నేనెట్లు ఎరుగుదునని మీరనుకొనుచున్నారు?

46 ఇదిగో, అవి నాకు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడెనని నేను మీకు చెప్పుచున్నాను. నాయంతట నేను ఈ విషయములను తెలుసుకొనవలెనని అనేక దినములు ఉపవాసముండి, ప్రార్థన చేసితిని. అవి సత్యమని ఇప్పుడు నాకై నేను ఎరుగుదును. ఏలయనగా ప్రభువైన దేవుడు వాటిని నాకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షపరచెను; ఇది నాలో ఉన్న బయల్పాటు ఆత్మ.

47 ఇంకను మన పితరుల ద్వారా పలుకబడిన ఆ మాటలు సత్యమైనవని నా యందున్న ప్రవచనాత్మను బట్టి, దేవుని ఆత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా కూడా నాకు ఆ విధముగా బయల్పరచబడియున్నదని నేను మీతో చెప్పుచున్నాను.

48 రాబోవుచున్న దాని విషయమై నేను మీకు చెప్పబోవుచున్నదేదైనను సత్యమైయున్నదని నాకై నేను ఎరుగుదునని; తండ్రి యొక్క అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు కృపాకనికరములతో సత్యముతో నిండి వచ్చునని నేనెరుగుదునని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, లోక పాపములను, అనగా ఆయన నామముపై స్థిరముగా విశ్వసించు ప్రతి మనుష్యుని పాపములను తీసివేయుటకు వచ్చునది ఆయనే.

49 ఇప్పుడు నేను పిలువబడిన క్రమము ఇదేనని నేను మీతో చెప్పుచున్నాను, నా ప్రియమైన సహోదరులకు, దేశమందు నివసించుచున్న ప్రతి వానికి, వృద్ధులు యౌవనులు, దాసులు స్వతంత్రులు అందరికీ బోధించుటకు, ముసలివారు, మధ్య వయస్కులు, యువతరమునకు కూడా బోధించుటకు, వారు తప్పక పశ్చాత్తాపపడి మరలా జన్మించునట్లు వారికి మొరపెట్టుటకు నేను పిలువబడితినని మీతో చెప్పుచున్నాను.

50 ఇప్పుడు ఆత్మ ఈలాగు సెలవిచ్చుచున్నాడు: భూదిగంతములలోనున్న మీరందరూ పశ్చాత్తాపపడుడి, ఏలయనగా పరలోకరాజ్యము సమీపించియున్నది; దేవుని కూమారుడు తన మహిమలో తన బలము, ప్రభావము, శక్తి మరియు ఆధిపత్యమందు వచ్చును. నా ప్రియమైన సహోదరులారా, భూలోక రాజు మహిమను చూడమనియు పరలోక రాజు నరుల సంతానమంతటి మధ్య అతి త్వరలో ప్రకాశించుననియు ఆత్మ చెప్పుచున్నాడని నేను మీతో చెప్పుచున్నాను.

51 ఆత్మ ఇంకా ఒక బలమైన స్వరముతో కేకవేసి నాతో ఇట్లు చెప్పెను: నీవు వెళ్ళి, ఈ జనులతో—పశ్చాత్తాపపడుడి, ఏలయనగా మీరు పశ్చాత్తాపపడని యెడల, మీరు ఏ విధముగాను పరలోక రాజ్యమందు ప్రవేశించలేరని చెప్పుము.

52 మరలా ఆత్మ ఇట్లు చెప్పుచున్నాడని నేను మీతో చెప్పుచున్నాను: ఇదిగో, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడియున్నది; కావున మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలోనికి, అనగా మండుచున్న అగ్నిలోనికి, ఆరని అగ్నిలోనికి పడవేయబడును. చూడుడి, పరిశుద్ధుడు దానిని పలికి యున్నాడని జ్ఞాపకముంచుకొనుడి.

53 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, నేను మీతో చెప్పుచున్నాను, ఈ మాటలను మీరు భరించగలరా? మీరు ఈ విషయములను ప్రక్కన పెట్టి, పరిశుద్ధుని మీ పాదముల క్రింద త్రొక్కివేయగలరా? మీ హృదయముల గర్వమందు మీరు ఎత్తబడగలరా? విలువైన వస్త్రములు ధరించుట యందు, లోకము యొక్క వ్యర్థమైన వస్తువులపై, మీ సంపదలపై మీ హృదయములుంచుట యందు మీరు ఇంకను కొనసాగుదురా?

54 మీరు ఒకని కంటే మరియొకడు మేలని అనుకొనుట యందు కొనసాగుదురా? తమనుతాము తగ్గించుకొని పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారై, పశ్చాత్తాపమునకు తగిన క్రియలు జరిగించుచు దేవుని యొక్క పరిశుద్ధ క్రమమును బట్టి నడుచుచు ఈ సంఘములోనికి తేబడిన మీ సహోదరులను హింసించుటలో మీరింకను కొనసాగుదురా?

55 పేదవారికి అవసరతలోనున్న వారికి సహాయము చేయకుండా, మీకు కలిగిన దానిని వారి నుండి ఉపసంహరించుట యందు మీరు కొనసాగుదురా?

56 చివరిగా, దుష్టత్వమందు కొనసాగు మీరందరూ త్వరగా పశ్చాత్తాపపడని యెడల, నరికివేయబడి అగ్నిలోనికి పడవేయబడుదురని నేను మీతో చెప్పుచున్నాను.

57 ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను, మంచి కాపరి యొక్క స్వరమును వెంబడించగోరిన మీరందరూ దుష్టులలో నుండి బయటకు వచ్చి, వేరుగా ఉండి, వారి యొక్క అపవిత్రమైన వస్తువులను ముట్టకుడి; ఇదిగో, దుష్టుల పేర్లు నీతిమంతుల పేర్ల మధ్య లెక్కింపబడకుండునట్లు—దుష్టుల పేర్లు నా జనుల పేర్లతో కలుపబడవని,

58 నీతిమంతుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడునని, వారికి నా కుడి పార్శ్వమున ఒక స్వాస్థ్యమును నేను అనుగ్రహించెదనని చెప్పుచున్న దేవుని వాక్యము నెరవేరునట్లు వారి పేర్లు తొలగించబడును. ఇప్పుడు నా సహోదరులారా, దీనికి విరుద్ధముగా మీరేమి చెప్పుదురు? మీరు దానికి విరుద్ధముగా మాట్లాడిన యెడల ఏమియూ కాదు, ఏలయనగా దేవుని వాక్యము తప్పక నేరవేరవలెనని నేను మీతో చెప్పుచున్నాను.

59 మీలో అనేక గొఱ్ఱెలు కలిగిన ఏ కాపరియైనను తోడేళ్ళు ప్రవేశించి అతని మందను తినివేయకుండునట్లు వాటిపై కావలికాయకుండునా? ఒక తోడేలు అతని మందలో ప్రవేశించిన యెడల అతడు దానిని బయటకు త్రోలివేయడా? చివరిగా, అతనికి సాధ్యమైన యెడల అతడు దానిని నాశనము చేయును.

60 ఇప్పుడు మంచి కాపరి మిమ్ములను పిలుచుచున్నాడని నేను మీతో చెప్పుచున్నాను; మీరు ఆయన స్వరమును వినిన యెడల ఆయన మిమ్ములను తన మందలోనికి తెచ్చును మరియు మీరు ఆయన గొఱ్ఱెలైయుందురు; మీరు నాశనము కాకుండునట్లు క్రూరమైన తోడేలును మీ మధ్య ప్రవేశించనీయవలదని ఆయన మిమ్ములను ఆజ్ఞాపించును.

61 ఇప్పుడు ఆల్మా అను నేను, నేను మీతో పలికిన మాటలను మీరు పాటించవలెనని నన్ను ఆజ్ఞాపించిన ఆయన యొక్క భాషలో మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను.

62 సంఘమునకు చెందిన మీతో నేను ఆజ్ఞాపూర్వకముగా మాట్లాడెదను మరియు సంఘమునకు చెందని వారితో నేను ఆహ్వానపూర్వకముగా ఇట్లు పలుకుచున్నాను: మీరు కూడా జీవ వృక్ష ఫలమందు పాలుపొందువారగునట్లు రండి మరియు పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మము పొందుడి.