లేఖనములు
ఆల్మా 53


53వ అధ్యాయము

సమృద్ధి పట్టణమును బలపరచుటకు లేమనీయ బందీలు ఉపయోగించబడిరి—నీఫైయుల మధ్య విభేదములు లేమనీయుల విజయములకు దారితీయును—అమ్మోన్ జనుల యొక్క రెండు వేలమంది యువకుమారుల సైన్యాధిపత్యమును హీలమన్‌ తీసుకొనును. సుమారు క్రీ. పూ. 64–63 సం.

1 వారు లేమనీయ బందీలపై భటులను కాపలా ఉంచిరి మరియు వారి మృతులను, సంహరింపబడిన నీఫైయుల యొక్క మృతులను పాతిపెట్టుటకు వారిని బలవంతము చేసిరి; వారు తమ పనులు చేయుచుండగా మొరోనై వారిపై మనుష్యులను కాపలా ఉంచెను.

2 లీహైతోపాటు మొరోనై ములెక్ పట్టణమునకు వెళ్ళి, ఆ పట్టణముపై ఆధిపత్యము సంపాదించి, దానిని లీహైకి ఇచ్చెను. అతని యుద్ధములలో ఎక్కువమట్టుకు మొరోనైకు తోడుగా ఈ లీహై ఉండెను; అతడు మొరోనై వంటి మనుష్యుడు; మరియు వారు ఒకరి క్షేమమందు ఇంకొకరు ఆనందించిరి; వారు ఒకరికొకరు ప్రియులైయుండి, నీఫై యొక్క జనులందరి చేత ప్రేమించబడిరి.

3 ఇప్పుడు లేమనీయులు వారి మృతులను మరియు నీఫైయుల మృతులను కూడా పాతిపెట్టుట ముగించిన తరువాత, వారు సమృద్ధి దేశములోనికి వెనుకకు నడిపించబడిరి; మొరోనై యొక్క ఆజ్ఞానుసారము టియాంకమ్ దేశము చుట్టూ లేదా సమృద్ధి పట్టణము చుట్టూ వారు కందకము త్రవ్వుట ప్రారంభించునట్లు చేసెను.

4 మరియు కందకము యొక్క లోపలి ఒడ్డుపై కొయ్య దుంగలతో వారు గోడ కట్టునట్లు అతడు చేసెను; వారు కొయ్యదుంగల గోడకు ఆసరాగా మట్టిని కందకములో నుండి విసిరిరి; ఆ విధముగా వారు సమృద్ధి పట్టణము చుట్టూ అత్యంత ఎత్తు వరకు కొయ్యదుంగలు మరియు మట్టి యొక్క బలమైన గోడ కట్టు వరకు లేమనీయులు పనిచేయునట్లు చేసిరి.

5 అప్పటి నుండి శాశ్వతముగా ఈ పట్టణము మిక్కిలి బలమైన దుర్గమాయెను; ఈ పట్టణమందు, అనగా వారి స్వహస్తాలతో కట్టునట్లు చేసిన గోడ లోపల లేమనీయ బందీలను వారు కావలి కాచిరి. ఇప్పుడు వారు పని చేయుచుండగా వారిని కావలి కాయుట సులభమైనందున లేమనీయులు పనిచేయునట్లు చేయుటకు మొరోనై బలవంతము చేయబడెను; మరియు లేమనీయులపై అతడు దాడి చేయవలసినప్పుడు, అతని సైన్యములన్నీ అందుబాటులో ఉండవలెనని అతడు కోరెను.

6 మొరోనై ఆ విధముగా లేమనీయుల యొక్క అతి గొప్ప సైన్యములలో ఒక దానిపై విజయము పొందెను మరియు నీఫై దేశమందు లేమనీయుల యొక్క మిక్కిలి బలమైన దుర్గములలో ఒకటైన ములెక్ పట్టణమును స్వాధీనము చేసుకొనెను; ఆ విధముగా అతని బందీలను ఉంచుటకు అతడొక బలమైన దుర్గమును కట్టెను.

7 ఆ సంవత్సరమున లేమనీయులతో యుద్ధము చేయుటకు ఇకపై అతడు ప్రయత్నము చేయలేదు, కానీ యుద్ధమునకు సిద్ధపడుటయందు, లేమనీయుల నుండి కాపాడుకొనుటకు కోటలు కట్టుటయందు, కరువు మరియు శ్రమ నుండి వారి స్త్రీలను, పిల్లలను కాపాడుటయందు, తమ సైన్యములకు ఆహారమును సమకూర్చుటయందు అతడు తన మనుష్యులను వినియోగించెను.

8 ఇప్పుడు వారి మధ్య విభేదములు కలుగజేయుచూ నీఫైయుల మధ్య జరిగిన కుట్ర కారణముగా, మొరోనై లేనప్పుడు లేమనీయుల సైన్యములు పడమటి సముద్రమునకు దక్షిణమున నీఫైయులపై కొంత విజయము సంపాదించిరి, ఎంతగాననగా వారు దేశము యొక్క ఆ భాగమందు వారి పట్టణములలో అధికభాగమును స్వాధీనము చేసుకొనిరి.

9 ఆ విధముగా వారి మధ్యగల దుర్నీతిని బట్టి, అనగా వారి మధ్యగల విభేదములు మరియు కుట్రను బట్టి నీఫైయులు మిక్కిలి అపాయకరమైన పరిస్థితులలో ఉంచబడిరి.

10 ఇప్పుడు అమ్మోన్ యొక్క జనులను గూర్చి నేను కొంత చెప్పదలిచాను, వారు మొదట లేమనీయులైయుండిరి; కానీ అమ్మోన్ మరియు అతని సహోదరుల ద్వారా లేదా దేవుని శక్తి మరియు వాక్యము ద్వారా వారు ప్రభువుకు పరివర్తన చెంది జరహేమ్ల దేశములోనికి తేబడిరి, అప్పటినుండి నీఫైయుల ద్వారా రక్షింపబడిరి.

11 వారి ప్రమాణమును బట్టి, వారి సహోదరులకు వ్యతిరేకముగా వారు ఆయుధములను పైకెత్తకుండిరి; ఏలయనగా వారిక మీదట ఎన్నడూ రక్తము చిందించరని ప్రమాణము చేసియుండిరి మరియు వారి ప్రమాణమును బట్టి వారు నశించిపోయేవారు; కానీ వారి యెడల అమ్మోన్, అతని సహోదరులు కలిగియున్న జాలి మరియు అధిక ప్రేమ కారణముగా, వారి సహోదరుల చేతులలోనికి పడునట్లు వారు తమను అనుమతించుకొనలేదు.

12 ఈ హేతవు చేత వారు జరహేమ్ల దేశములోనికి తేబడిరి మరియు అప్పటి నుండి వారు నీఫైయుల చేత రక్షింపబడిరి.

13 కానీ వారి కొరకు నీఫైయులు భరించిన అపాయమును, అనేక బాధలు మరియు శ్రమలను చూచినప్పుడు, వారు కనికరముతో కదిలించబడి వారి దేశ రక్షణ కొరకు ఆయుధములను తీసుకొనగోరిరి.

14 కానీ వారు తమ యుద్ధ ఆయుధములను తీసుకొనబోవుచుండగా, హీలమన్‌ మరియు అతని సహోదరులు వారికి నచ్చజెప్పిరి, ఏలయనగా వారు చేసిన ప్రమాణమును వారు అతిక్రమించబోయిరి.

15 ఆ విధముగా చేయుట ద్వారా వారు తమ ఆత్మలను కోల్పోవుదురేమోనని హీలమన్‌ భయపడెను; కావున, ఈ నిబంధనలోనికి ప్రవేశించిన వారందరు ఈ సమయమున వారి అపాయకరమైన పరిస్థితులయందు తమ సహోదరులు బాధలనుభవించుటను చూచుటకు బలవంతము చేయబడిరి.

16 కానీ, తమ శత్రువుల నుండి తమను కాపాడుకొనుటకు యుద్ధ ఆయుధములను తీసుకొనరను నిబంధనలోనికి ప్రవేశించియుండని అనేకమంది కుమారులను వారు కలిగియుండిరి; కావున ఆయుధములను ఉపయోగించుటకు సమర్థులైన వారందరు ఈ సమయమున తమను సమావేశపరచుకొనిరి మరియు వారు తమను నీఫైయులని పిలుచుకొనిరి.

17 నీఫైయుల స్వాతంత్ర్యము కొరకు పోరాడుటకు, ముఖ్యముగా దేశమును రక్షించుటకు వారి ప్రాణములను పణంగా పెట్టునంతగా వారు ఒక నిబంధనలోనికి ప్రవేశించిరి; వారు ఎన్నడూ తమ స్వాతంత్ర్యమును వదలుకోమని, దాస్యము నుండి నీఫైయులను మరియు తమను రక్షించుకొనుటకు అన్ని పరిస్థితులలో పోరాడెదమని కూడా నిబంధన చేసిరి.

18 ఇప్పుడు ఈ నిబంధనలోనికి ప్రవేశించి, తమ దేశమును రక్షించుటకు యుద్ధ ఆయుధములను తీసుకొనిన యౌవనస్థులు రెండు వేలమంది అక్కడ ఉండిరి.

19 ఇంతవరకు వారెన్నడూ నీఫైయులకు ఉపయోగపడనప్పటికీ, వారిప్పుడు ఈ సమయమున ఒక గొప్ప సహాయమయిరి; ఏలయనగా వారు తమ యుద్ధ ఆయుధములను తీసుకొని, హీలమన్‌ వారికి నాయకునిగా ఉండవలెనని కోరిరి.

20 వారందరు యౌవనస్థులు, వారు ధైర్యము, బలము మరియు కార్యశీలతయందు కూడా మిక్కిలి శూరులైయుండిరి; కానీ ఇదియే అంతయు కాదు—వారికి అప్పగించబడిన ఏ విషయమందైనను అన్నిసమయములలో వారు సత్యవంతులైయుండిరి.

21 వారు సత్యవంతులు నిగ్రహము గలవారైయుండిరి, ఏలయనగా దేవుని ఆజ్ఞలను పాటించవలెనని, ఆయన యెదుట యథార్థముగా నడువవలెనని వారు బోధింపబడియుండిరి.

22 ఇప్పుడు పడమటి సముద్రమునకు దక్షిణమున దేశ సరిహద్దుల యందున్న జనులకు సహాయపడుటకై అతని రెండు వేలమంది యువసైనికులకు హీలమన్‌ నాయకత్వము వహించెను.

23 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఇరువది ఎనిమిదవ సంవత్సరము ముగిసెను.