లేఖనములు
ఆల్మా 56


56వ అధ్యాయము

లేమనీయులతో యుద్ధము యొక్క పరిస్థితిని వివరించుచూ హీలమన్‌, మొరోనైకి ఒక లేఖ పంపును—ఆంటిపస్ మరియు హీలమన్‌, లేమనీయులపై గొప్ప విజయము పొందెదరు—హీలమన్‌ యొక్క రెండు వేలమంది యువకుమారులు అద్భుతమైన శక్తితో పోరాడుదురు మరియు వారిలో ఒక్కరూ సంహరింపబడలేదు. 1వ వచనము సుమారు క్రీ. పూ. 62 సం; 2–19 వచనములు సుమారు క్రీ. పూ. 66 సం; మరియు 20–57 వచనములు, సుమారు క్రీ. పూ. 65–64 సం.

1 ఇప్పుడు న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పైయవ సంవత్సరపు ప్రారంభమందు, మొదటి నెలలో రెండవ దినమున దేశము యొక్క ఆ భాగమందు జనుల యొక్క వ్యవహారములను వివరించుచూ హీలమన్‌ నుండి మొరోనై ఒక లేఖను అందుకొనెను.

2 మరియు అతడు వ్రాసిన మాటలివి: ప్రభువునందు మరియు మా యుద్ధము యొక్క శ్రమలయందు నాకు మిక్కిలి ప్రియమైన నా సహోదరుడైన మొరోనై, నా ప్రియమైన సహోదరుడా, దేశము యొక్క ఈ భాగమందు మా యుద్ధమును గూర్చి నేను నీకు కొంత చెప్పవలసియున్నది.

3 ఇదిగో నీఫై దేశము నుండి అమ్మోన్ తెచ్చిన ఆ మనుష్యుల యొక్క రెండు వేలమంది కుమారులను చూడుము—వీరు మన పితరుడైన లీహై యొక్క పెద్ద కుమారుడైన లేమన్‌ వంశస్థులని నీవు ఎరిగియున్నావు—

4 వారి సంప్రదాయములు లేదా వారి అవిశ్వాసమును గూర్చి నేను నీకు జ్ఞాపకము చేయవలసిన అవసరము లేదు, ఏలయనగా ఈ సంగతులన్నిటిని గూర్చి నీవు ఎరుగుదువు—

5 కావున యౌవనస్థులైన ఈ రెండు వేలమంది వారి యుద్ధ ఆయుధములను తీసుకొనిరని, నేను వారి నాయకునిగా ఉండవలెనని కోరుచున్నారని; మేము మా దేశమును రక్షించుకొనుటకు వచ్చియున్నామని నీకు చెప్పుట చాలును.

6 మరియు రక్తము చిందించుటకు వారి సహోదరులకు వ్యతిరేకముగా యుద్ధ ఆయుధములను వారు తీసుకొనరని వారి తండ్రులు చేసిన నిబంధనను గూర్చి కూడా నీవు ఎరుగుదువు.

7 కానీ ఇరువది ఆరవ సంవత్సరమందు వారి కొరకు మా బాధలను, మా శ్రమలను చూచినప్పుడు వారు చేసిన నిబంధనను మీరి, మా రక్షణ కొరకు వారి యుద్ధ ఆయుధములను తీసుకొనుటకు వారు సిద్ధపడిరి.

8 కానీ వారు చేసిన ప్రమాణమును నెరవేర్చుటను బట్టి, మేము ఎక్కువ శ్రమ పొందకుండునట్లు దేవుడు మమ్ములను బలపరచునని తలంచుచూ వారు చేసిన నిబంధనను మీరుటకు నేను వారిని అనుమతించకుంటిని.

9 కానీ ఇదిగో మనము గొప్ప ఆనందము పొందగలిగిన విషయము ఒకటున్నది. ఏలయనగా ఇరువది ఆరవ సంవత్సరమందు దేశము యొక్క ఆ భాగపు జనులపై నీవు నాయకునిగా నియమించిన ఆంటిపస్‌కు సహాయము చేయుటకు హీలమన్‌ అను నేను ఈ రెండు వేలమంది యౌవనస్థులకు నాయకత్వము వహించి యూదయ పట్టణమునకు నడిచితిని.

10 నేను నా రెండు వేల మంది కుమారులను (ఏలయనగా వారు కుమారులని పిలువబడుటకు యోగ్యులైయున్నారు) ఆంటిపస్ సైన్యముతో చేర్చగా, ఆ బలమును బట్టి ఆంటిపస్ మిక్కిలి ఆనందించెను; ఏలయనగా లేమనీయుల సైన్యములు మన మనుష్యులలో అనేకమందిని సంహరించియున్నందున అతని సైన్యము తగ్గించి వేయబడెను, అందునుబట్టి మనము విలపించవలసియున్నది.

11 అయినను వారు వారి దేశము కొరకు, వారి దేవుని కొరకు చేసిన ఉద్యమములో మరణించిరని మరియు సంతోషముగా ఉన్నారని మనలను మనము ఓదార్చుకొనవచ్చు.

12 మరియు లేమనీయులు అనేకమంది బందీలను కూడా ఉంచుకొనియున్నారు, వారందరు ప్రధాన అధికారులు, ఏలయనగా ఇతురులెవ్వరినీ వారు జీవించియుండనివ్వలేదు. వారు సంహరింపబడియుండని యెడల, వారు ఈ సమయమున నీఫై దేశమందున్నారని మేము తలంచుచున్నాము.

13 ఇప్పుడు శూరులైన మన మనుష్యులలో ఎక్కువమంది యొక్క రక్తము చిందించుట ద్వారా లేమనీయులు స్వాధీనపరచుకొనిన పట్టణములు ఇవే:

14 మాంటై దేశము లేదా మాంటై పట్టణము; జీజ్రొమ్ పట్టణము, క్యుమెని పట్టణము మరియు అంతిపరా పట్టణము.

15 నేను యూదయ పట్టణమునకు చేరినప్పుడు వారు స్వాధీనము చేసుకొన్న పట్టణములు ఇవే; మరియు ఆంటిపస్, అతని మనుషులు పట్టణమందు కోటలు కట్టుటకు వారి శక్తితో శ్రమపడుటను నేను కనుగొంటిని.

16 వారు శరీరము మరియు ఆత్మయందు నిరుత్సాహపడియుంటిరి, ఏలయనగా వారు పగటియందు ధైర్యముగా పోరాడి, రాత్రియందు వారి పట్టణములను నిలుపుకొనుటకు శ్రమపడిరి; ఆ విధముగా వారు అన్ని విధముల బాధలను అనుభవించియుండిరి.

17 ఇప్పుడు వారు ఈ స్థలమందు జయించుటకు లేదా మరణించుటకు నిశ్చయించుకొనిరి; కావున నేను నాతో తెచ్చిన ఈ చిన్నసైన్యము, అనగా నా యొక్క ఆ కుమారులు వారికి గొప్ప ఆశలను, అధిక సంతోషమును ఇచ్చెనని నీవు తలంచవచ్చు.

18 మరియు ఆంటిపస్ సైన్యమునకు అధిక బలము చేకూరెనని లేమనీయులు చూచినప్పుడు, వారు అమ్మోరోన్‌ ఆజ్ఞల చేత యూదయ పట్టణమునకు వ్యతిరేకముగా లేదా మాకు వ్యతిరేకముగా యుద్ధమునకు రాకుండా బలవంతము చేయబడిరి.

19 ఆ విధముగా మేము ప్రభువు అనుగ్రహము పొందితిమి; ఏలయనగా వారు మా బలహీనతయందు మాపై దాడిచేసిన యెడల, బహుశా మా చిన్న సైన్యమును వారు నాశనము చేసియుండేవారు; కానీ మేము ఆ విధముగా రక్షింపబడితిమి.

20 వారు స్వాధీనపరచుకొనిన ఆ పట్టణములను నిలుపుకొనవలెనని వారు అమ్మోరోన్‌ చేత ఆజ్ఞాపించబడిరి. ఆ విధముగా ఇరువది ఆరవ సంవత్సరము ముగిసెను. ఇరువది ఏడవ సంవత్సరము యొక్క ప్రారంభమందు మేము మమ్ములను, మా పట్టణమును రక్షించుకొనుటకు సిద్ధముగానుంటిమి.

21 ఇప్పుడు లేమనీయులు మాపై దాడిచేయవలెనని మేము కోరియుంటిమి; ఏలయనగా వారి బలమైన దుర్గములందు వారిపై దాడిచేయుటకు మేము కోరియుండలేదు.

22 మరియు ఉత్తరము వైపునున్న మా ఇతర పట్టణములపై దాడిచేయుటకు రాత్రియందు లేదా పగటియందు వారు మమ్ములను దాటి వెళ్ళకుండునట్లు లేమనీయుల కదలికలను కనిపెట్టుటకు మేము చుట్టూ వేగులను ఉంచితిమి.

23 ఏలయనగా ఆ పట్టణములయందున్న వారు, వారిని ఎదుర్కొనుటకు తగినంత బలముగా లేరని మేము ఎరిగితిమి; కావున వారు మమ్ములను దాటిన యెడల, వెనుక నుండి వారిపై దాడిచేయుటకు మరియు ఆ విధముగా వారు ముందువైపు దాడి చేసిన సమయమున వెనుక నుండి ఆపుటకు మేము కోరియుంటిమి. మేము వారిని జయించగలమని తలంచితిమి; కానీ మా ఈ కోరికయందు మేము భంగపడితిమి.

24 ఏలయనగా వారు తగినంత బలముగా లేరని మరియు ఓడిపోవుదురని భయపడి వారి సంపూర్ణ సైన్యముతో లేదా ఒక భాగముతో మమ్ములను దాటుటకు వారు ధైర్యము చేయలేదు.

25 వారు జరహేమ్ల పట్టణమునకు వెళ్ళుటకు ధైర్యము చేయలేదు; లేదా వారు నెఫిహా పట్టణమునకు వెళ్ళునట్లు సీదోను నది మూలము వద్ద దాటుటకు ధైర్యము చేయలేదు.

26 ఆ విధముగా వారి సైన్యములతో వారు స్వాధీనపరచుకొనిన ఆ పట్టణములను నిలుపుకొనుటకు వారు నిర్ణయించుకొనిరి.

27 మరియు ఈ సంవత్సరము యొక్క రెండవ నెలలో నా రెండువేలమంది కుమారుల యొక్క తండ్రుల నుండి ఆహారసామాగ్రులు అనేకము మా యొద్దకు తేబడెను.

28 జరహేమ్ల దేశము నుండి మా యొద్దకు రెండువేలమంది మనుష్యులు కూడా పంపబడిరి. ఆ విధముగా పదివేలమంది మనుష్యులతో మరియు వారి కొరకు, వారి భార్యాపిల్లల కొరకు ఆహారసామాగ్రులతో మేము సిద్ధపడియుంటిమి.

29 ఆ విధముగా మా సైన్యములు అనుదినము అధికమగుటను, మా ఆధారము కొరకు ఆహారసామాగ్రులు వచ్చి చేరుటను చూచి లేమనీయులు భయపడుట మొదలుపెట్టిరి; మరియు సాధ్యమైన యెడల, మేము ఆహారసామాగ్రులను, బలమును అందుకొనకుండునట్లు చేయుటకై ముందుకు రాసాగిరి.

30 ఇప్పుడు లేమనీయులు ఈ విధముగా కలవరపడుట మొదలుపెట్టిరని మేము చూచినప్పుడు, వారిపై ఒక పన్నాగము పన్నుటకు మేము కోరియుంటిమి; కావున మేము పొరుగునున్న పట్టణమునకు ఆహార సామగ్రిని మోసుకొని పోవుచున్నట్లుగా, నేను నా యౌవనకుమారులతో పొరుగునున్న పట్టణమునకు నడువవలెనని ఆంటిపస్ ఆజ్ఞాపించెను.

31 సముద్రపు ఒడ్డు సరిహద్దులకు అవతల ప్రక్కనున్న పట్టణమునకు మేము వెళ్ళుచున్నట్లు మేము అంతిపరా పట్టణము దగ్గరకు నడువవలసియుండెను.

32 మరియు మా ఆహర సామాగ్రులతో ఆ పట్టణమునకు పోవుచున్నట్లుగా మేము ముందుకు నడిచితిమి.

33 ఇప్పుడు పట్టణమును నిలుపుకొనుటకు కొంత సైన్యమును వదిలి, ఆంటిపస్ తన సైన్యములో ఒక భాగముతో ముందుకు నడిచెను. కానీ నా చిన్న సైన్యముతో నేను ముందుకు వెళ్ళి, అంతిపరా పట్టణము దగ్గరకు వచ్చువరకు అతడు ముందుకు సాగలేదు.

34 మరియు అంతిపరా పట్టణమందు లేమనీయుల యొక్క అత్యంత బలమైన సైన్యము, అనగా అత్యధిక సంఖ్యాకులు నిలిచియుండిరి.

35 వారి వేగుల చేత వారికిది తెలియజేయబడినప్పుడు, వారి సైన్యముతో వారు ముందుకు వచ్చి మాకు వ్యతిరేకముగా నడిచివచ్చిరి.

36 మేము వారి యెదుట ఉత్తర దిక్కుగా పారిపోతిమి. ఆ విధముగా లేమనీయుల యొక్క అత్యంత శక్తివంతమైన సైన్యమును మేము దూరముగా నడిపించివేసితిమి;

37 ముఖ్యముగా, చెప్పుకోదగినంత దూరమునకు నడిపించివేసితిమి, ఎంతగాననగా ఆంటిపస్ సైన్యము తమ బలముతో వారిని తరుముచుండుటను చూచినపుడు వారు కుడికిగాని ఎడమకుగాని తిరుగకుండా మా వెనుక ఒక తిన్నని దారిలో వారి నడకను కొనసాగించిరి; మేము తలంచినట్లు వారు మా జనుల చేత చుట్టుముట్టబడకుండునట్లు ఆంటిపస్ వారిని అందుకొనుటకు ముందు మమ్ములను సంహరించుట వారి ఉద్దేశ్యమైయుండెను;

38 ఇప్పుడు ఆంటిపస్ మాకు కలుగబోవు అపాయమును చూచిన వాడై అతని సైన్యము యొక్క నడకను వేగవంతము చేసెను. కానీ అది రాత్రి సమయమైనందున వారు మమ్ములను అందుకొనలేదు; లేదా ఆంటిపస్ వారిని అందుకొనలేదు; కావున మేము ఆ రాత్రికి బస చేసితిమి.

39 ఉదయమున సూర్యోదయమునకు ముందు లేమనీయులు మమ్ములను తరుముచుండిరి. ఇప్పుడు వారితో పోరాడుటకు మేము తగినంత బలముగా లేము; నా యౌవనకుమారులు వారి చేతులలో పడుటను నేను అనుమతించలేకయుంటిని; కావున మేము మా నడకను కొనసాగించి అరణ్యములోనికి నడిచితిమి.

40 ఇప్పుడు వారు చుట్టుముట్టబడుదురేమోనని కుడికిగాని ఎడమకుగాని తిరుగుటకు వారు ధైర్యము చేయలేదు; వారు నన్ను అందుకొనెదరేమోనని నేను కుడికిగాని ఎడమకుగాని తిరుగలేదు, ఏలయనగా మేము వారికి వ్యతిరేకముగా నిలువలేక సంహరింపబడుదుము మరియు వారు తప్పించుకొందురు; కావున చీకటిపడు వరకు ఆ విధముగా మేము దినమంతయు అరణ్యములో పారిపోసాగితిమి.

41 మరలా ఉదయపు వెలుగు వచ్చినపుడు లేమనీయులు మాపైకి వచ్చుటను చూచి, మేము వారి యెదుట పారిపోతిమి.

42 కానీ వారు ఆగుటకు ముందు అధిక దూరము మమ్ములను తరుమలేదు మరియు అది ఏడవనెల యొక్క మూడవ దినపు ఉదయమందైయుండెను.

43 ఇప్పుడు వారు ఆంటిపస్ చేత అందుకొనబడిరేమో మేము ఎరుగము, కానీ నా మనుష్యులతో నేను ఇట్లంటిని: ఇదిగో, మనము వారికి వ్యతిరేకముగా వెళ్ళినప్పుడు వారు వలపన్ని మనలను పట్టుకొనగలుగునట్లు వారు ఆగియుండవచ్చు;

44 కావున నా కుమారులారా మీరేమందురు? వారితో యుద్ధము చేయుటకు మీరు వెళ్ళెదరా?

45 ఇప్పుడు నేను నీతో చెప్పుచున్నాను, నా ప్రియమైన సహోదరుడా మొరోనై, అంతటి ధైర్యమును నేను చూడలేదు, నీఫైయులందరి మధ్య ఎన్నడూ చూడలేదు.

46 ఏలయనగా నేనెల్లప్పుడూ వారిని నా కుమారులని ఎట్లు పిలిచితినో (ఏలయనగా వారందరు మిక్కిలి యౌవనులు) అట్లే వారు నాతో చెప్పిరి: తండ్రీ, మన దేవుడు మనతో ఉన్నాడు, మన ఓటమిని ఆయన అనుమతించడు; కావున మనము ముందుకు వెళ్ళెదము; వారు మనలను విడిచిపెట్టిన యెడల, మనము మన సహోదరులను సంహరించము; కావున మనము వెళ్ళెదము, లేని యెడల వారు ఆంటిపస్ యొక్క సైన్యమును ఓడించెదరు.

47 ఇప్పుడు, వారెన్నడూ యుద్ధము చేయలేదు, అయినను వారు మరణమునకు భయపడలేదు; వారి ప్రాణముల కంటే అధికముగా వారు తమ తండ్రుల స్వాతంత్ర్యమును గూర్చి ఆలోచించిరి; వారు సందేహించని యెడల దేవుడు వారిని విడిపించునని వారి తల్లుల చేత వారు బోధింపబడిరి.

48 మరియు మా తల్లులు దానినెరుగుదురని మేము సందేహించమనుచూ వారి తల్లుల మాటలను వారు నాకు చెప్పిరి.

49 ఇప్పుడు మమ్ములను తరిమిన ఆ లేమనీయులకు వ్యతిరేకముగా నా రెండు వేలమందితో నేను తిరిగి వచ్చితిని. ఇదిగో, ఆంటిపస్ యొక్క సైన్యములు వారిని అందుకొనెను మరియు భయంకరమైన యుద్ధము మొదలాయెను.

50 అంత తక్కువ సమయమందు వారి సుదీర్ఘమైన నడక వలన ఆంటిపస్ యొక్క సైన్యము అలసియుండి లేమనీయుల చేతులలోనికి పడబోవుచుండెను; నేను నా రెండు వేలమందితో తిరిగివచ్చియుండని యెడల వారి ఉద్దేశ్యమును వారు నెరవేర్చుకొనియుండేవారు.

51 ఏలయనగా వేగముగా నడుచుట చేత కలిగిన అలసట కారణముగా ఆంటిపస్ మరియు అతని నాయకులలో అనేకులు ఖడ్గము చేత కూలిరి—కావున ఆంటిపస్ యొక్క మనుష్యులు వారి నాయకులు కూలుటను బట్టి కలవరము చెంది లేమనీయుల యెదుట ఓడిపోసాగిరి.

52 అంతట లేమనీయులు ధైర్యము తెచ్చుకొని వారిని తరుముట ప్రారంభించిరి; ఆ విధముగా లేమనీయులు వారిని గొప్ప శక్తితో తరుముచుండగా, హీలమన్‌ వెనుకనుండి అతని రెండు వేలమందితో వారి పైకి వచ్చి వారిని అధికముగా సంహరించుట మొదలుపెట్టెను, ఎంతగాననగా లేమనీయుల సైన్యము మొత్తము ఆగి హీలమన్‌ వైపు తిరిగెను.

53 ఇప్పుడు లేమనీయులు వెనుకకు తిరిగిరని ఆంటిపస్ యొక్క జనులు చూచినప్పుడు, వారి మనుష్యులను వారు సమకూర్చుకొని మరలా వెనుకనుండి లేమనీయులపైకి వచ్చిరి.

54 నీఫై జనులమైన మేము, అనగా ఆంటిపస్ యొక్క జనులు మరియు నా రెండు వేలమందితో నేను లేమనీయులను చుట్టిముట్టి సంహరించితిమి; ఎంతగాననగా వారు తమ యుద్ధ ఆయుధములను అప్పగించి, తమను కూడా యుద్ధ బందీలుగా అప్పగించుకొనుటకు బలవంతము చేయబడిరి.

55 ఇప్పుడు వారు తమను మాకు అప్పగించుకొనిన తరువాత, ఆ యౌవనస్థులలో అనేకులు సంహరింపబడిరేమోనని భయపడుచూ నాతోపాటు యుద్ధము చేసిన వారిని నేను లెక్కించితిని.

56 కానీ, వారిలో ఒక్క ఆత్మయు నేలకూలనందున నేను అమితముగా ఆనందించితిని; వారు దేవుని యొక్క శక్తితో అన్నట్లుగా యుద్ధము చేసిరి; అట్టి అద్భుతమైన శక్తితో యుద్ధము చేయుటను ఎన్నడూ మనుష్యులు ఎరిగియుండలేదు; అట్టి బలమైన శక్తితో వారు లేమనీయులపైన పడి వారిని భయపెట్టిరి; ఈ హేతవు చేతనే లేమనీయులు తమను యుద్ధబందీలుగా అప్పగించుకొనిరి.

57 మరియు లేమనీయుల సైన్యముల నుండి వారిని దూరముగా ఉంచుటకు, మేము వారిని కావలి కాయుటకు మా బందీల కొరకు మేము ఎట్టి స్థలమును కలిగిలేము, కావున మేము వారిని మరియు సంహరింపబడని ఆంటిపస్ మనుష్యులలో ఒక భాగమును జరహేమ్ల దేశమునకు పంపితిమి; మిగిలిన వారిని తీసుకొని నేను నా యౌవన అమ్మోనీయులతో చేర్చి, యూదయ పట్టణమువైపు మా నడకను సాగించితిమి.