లేఖనములు
ఆల్మా 58


58వ అధ్యాయము

హీలమన్‌, గిడ్‌ మరియు టియోమ్నెర్‌ యుక్తి చేత మాంటై పట్టణమును తీసుకొందురు—లేమనీయులు వెనుకకు వెళ్ళెదరు—వారి స్వాతంత్ర్యమును, విశ్వాసమును కాపాడుకొనుట యందు దృఢముగా నిలిచియున్నందున అమ్మోన్‌ జనుల యొక్క కుమారులు రక్షింపబడుదురు. సుమారు క్రీ. పూ. 63–62 సం.

1 మా తరువాతి లక్ష్యము మాంటై పట్టణమును చేజిక్కించుకొనుటయైయుండెను; కానీ, మా చిన్న పటాలముల చేత మేము వారిని పట్టణము బయటకు నడిపించుటకు మార్గమేదియు లేకుండెను. ఏలయనగా మేము ఇంతవరకు చేసినవాటిని వారు జ్ఞాపకముంచుకొనిరి; కావున మేము, వారి బలమైన దుర్గముల నుండి దూరముగా వారిని వంచనతో ఆకర్షించలేకపోతిమి.

2 మా సైన్యముకంటే వారు అత్యధిక సంఖ్యాకులైయున్నందున, మేము ముందుకు వెళ్ళి వారి బలమైన దుర్గములయందు వారిపై దాడి చేయుటకు ధైర్యము చేయలేదు.

3 మరియు మేము తిరిగి సంపాదించిన దేశము యొక్క ఆ భాగములను నిలుపుకొనుటకు మేము మా మనుష్యులను వినియోగించుట అవసరమాయెను; కావున జరహేమ్ల దేశము నుండి అధిక బలము మరియు ఆహారసామాగ్రుల యొక్క క్రొత్త సరఫరాను అందుకొను వరకు మేము వేచియుండుట అవసరమాయెను.

4 మా జనుల వ్యవహారములను గూర్చి మా దేశము యొక్క పరిపాలకునికి తెలియజేయుటకు నేను ఆ విధముగా అతనికి ఒక రాయబారమును పంపితిని. జరహేమ్ల దేశము నుండి ఆహారసామాగ్రులను, బలమును అందుకొనుటకు మేము వేచియుంటిమి.

5 కానీ ఇది మాకు కొంతవరకే లాభించెను; ఏలయనగా లేమనీయులు కూడా అనుదినము గొప్ప బలమును, అనేక ఆహారసామాగ్రులను అందుకొనుచుండిరి; మరియు ఈ సమయమున మా పరిస్థితులు ఆ విధముగానుండెను.

6 యుక్తి చేత మమ్ములను నాశనము చేయుటకు నిర్ణయించుకొని లేమనీయులు ఎప్పటికప్పుడు మాకు వ్యతిరేకముగా అకస్మాత్తుగా మాపై దాడిచేయుచుండిరి; అయినప్పటికీ వారి ఆశ్రయస్థలములు మరియు వారి బలమైన దుర్గముల కారణముగా వారితో యుద్ధము చేయుటకు మేము రాలేకపోతిమి.

7 ఆహార లేమి వలన మేము నశించిపోబోవు వరకు కూడా అనేక నెలల పాటు ఈ కఠినమైన పరిస్థితులయందు మేము వేచియుంటిమి.

8 కానీ మేము ఆహారమును అందుకొంటిమి, అది మా సహాయమునకు వచ్చుచున్న రెండువేలమంది మనుష్యుల యొక్క సైన్యము ద్వారా మాకు కావలియందు తేబడెను. మా శత్రువుల చేతులలో పడకుండా మమ్ములను, మా దేశమును కాపాడుకొనుటకు అసంఖ్యాక సైన్యముగల శత్రువుతో పోరాడుటకు మేము అందుకున్న సహాయమంతయు ఇదియే.

9 ఇప్పుడు మా సంకటములకు లేదా వారు మాకెందుకు అధిక సహాయము పంపలేదనుటకు కారణమును మేమెరుగము; కావున మమ్ములను పడద్రోయుటకు మరియు పూర్తిగా నాశనము చేయుటకు మా దేశముపై దేవుని న్యాయతీర్పులు ఏ కారణము చేతనైనను వచ్చునేమోనని మేము దుఃఖించితిమి మరియు భయముతో నింపబడితిమి.

10 కావున ఆయన మమ్ములను బలపరచి, మా శత్రువుల చేతులలో నుండి విడిపించవలెనని మరియు మా జనుల సహాయము కొరకు మా పట్టణములు, మా దేశములు, మా ఆస్థులను మేము నిలుపుకొనునట్లు మాకు శక్తిని కూడా ఇవ్వవలెనని దేవునికి ప్రార్థనయందు మేము మా ఆత్మలను క్రుమ్మరించితిమి.

11 మరియు మమ్ములను విడిపించెదనని ప్రభువైన దేవుడు మాకు అభయమిచ్చెను; ఎంత అధికముగాననగా, ఆయన మా ఆత్మలకు శాంతినిచ్చి, మాకు గొప్ప విశ్వాసమును అనుగ్రహించెను మరియు ఆయన యందు మా విడుదల కొరకు మేము నిరీక్షించునట్లు చేసెను.

12 మేము అందుకొనిన మా చిన్న సైన్యముతో మేము ధైర్యము తెచ్చుకొని, మా శత్రువులను జయించుటకు మరియు మా భూములు, ఆస్థులు, భార్యాపిల్లలను, మా స్వాతంత్ర్యము యొక్క ఉద్దేశ్యమును కాపాడుకొనుటకు బలముగా నిర్ణయించుకొంటిమి.

13 ఆ విధముగా మాంటై పట్టణమందున్న లేమనీయులకు వ్యతిరేకముగా మా సమస్త బలముతో మేము ముందుకు వెళ్ళితిమి మరియు పట్టణమునకు దగ్గరగానున్న అరణ్యము ప్రక్కన మా గుడారములు వేసుకొంటిమి.

14 పట్టణము దగ్గరగానున్న అరణ్యము ప్రక్క సరిహద్దులయందు మేముంటిమని ఉదయమున లేమనీయులు చూచినప్పుడు, మా సైన్యము యొక్క సంఖ్యను, బలమును కనుగొనునట్లు వారు మా చుట్టూ వేగులను పంపిరి.

15 మరియు మా సంఖ్యలను బట్టి మేము బలముగా లేమని వారు చూచినప్పుడు, వారు మాతో యుద్ధము చేయుటకు బయటకు వచ్చి మమ్ములను చంపని యెడల మేము వారి సహాయమును అడ్డగించెదమేమోనని భయపడుచూ వారి బహుసంఖ్యాకమైన సైన్యములతో వారు మమ్ములను సులభముగా నాశనము చేయగలరని తలంచినందున, వారు మాతో యుద్ధము చేయుటకు ఏర్పాట్లు చేయసాగిరి.

16 మాకు వ్యతిరేకముగా వచ్చుటకు వారు ఏర్పాట్లు చేయుచున్నారని మేము చూచినప్పుడు, ఇదిగో కొద్దిమంది మనుష్యులతో గిడ్‌ అరణ్యమందు దాగుకొనునట్లు, మరి కొద్దిమంది మనుష్యులతో టియోమ్నెర్‌ కూడా అరణ్యములో దాగుకొనునట్లు నేను చేసితిని.

17 ఇప్పుడు గిడ్‌ మరియు అతని మనుష్యులు కుడి ప్రక్కన, ఇతరులు ఎడమ ప్రక్కన ఉండి ఆ విధముగా దాగుకొనినప్పుడు, నేను నా సైన్యమందు మిగిలిన వారితో మా గుడారములను మొదట వేసుకొనిన అదే స్థలమందు యుద్ధము చేయుటకు లేమనీయులు వచ్చు సమయము కొరకు నిలిచియుంటిని.

18 మరియు లేమనీయులు వారి అసంఖ్యాక సైన్యముతో మాకు వ్యతిరేకముగా వచ్చిరి. వారు వచ్చి ఖడ్గముతో మాపై దాడి చేయబోయినప్పుడు నాతోనున్న ఆ మనుష్యులు అరణ్యములోనికి పారిపోవునట్లు నేను చేసితిని.

19 లేమనీయులు మమ్ములను గొప్ప వేగముతో వెంబడించిరి, ఏలయనగా మమ్ములను అందుకొని, సంహరించవలెనని వారు మిక్కిలిగా కోరిరి; కావున అరణ్యములోనికి వారు మమ్ములను వెంబడించిరి; మేము గిడ్‌ మరియు టియోమ్నెర్‌ మధ్య నుండి వెళ్ళితిమి, ఎంతగాననగా వారు లేమనీయుల చేత కనుగొనబడలేదు.

20 లేమనీయులు ప్రక్కగా వెళ్ళినప్పుడు లేదా సైన్యము ప్రక్కగా వెళ్ళినప్పుడు, గిడ్‌ మరియు టియోమ్నెర్‌ వారి రహస్యస్థలముల నుండి పైకిలేచి, లేమనీయుల వేగులు పట్టణమునకు తిరిగి వెళ్ళకుండునట్లు వారిని హతమార్చిరి.

21 వారిని హతమార్చిన తరువాత, వారు పట్టణమునకు పరుగెత్తి పట్టణమును కావలికాయుటకు విడువబడిన భటులపై దాడిచేసిరి, ఎంతగాననగా వారు వారిని నాశనము చేసి, పట్టణమును స్వాధీనపరచుకొనిరి.

22 ఇప్పుడు కొద్దిమంది భటులు తప్ప, వారి సైన్యము మొత్తము అరణ్యములోనికి దూరముగా నడిపించబడునట్లు లేమనీయులు అనుమతించుకొనినందున ఇది జరిగెను.

23 గిడ్‌ మరియు టియోమ్నెర్‌ ఈ విధముగా వారి బలమైన దుర్గముల యొక్క స్వాధీనమును సంపాదించిరి. మేము అరణ్యమందు అధిక దూరము ప్రయాణము చేసిన తరువాత, జరహేమ్ల దేశము వైపు సాగిపోతిమి.

24 మరియు తాము జరహేమ్ల దేశమువైపు నడచుచున్నామని లేమనీయులు చూచినప్పుడు, వారిని నాశనము చేయుటకు అక్కడ ప్రణాళిక వేయబడినదేమోనని వారు మిక్కిలిగా భయపడిరి; కావున వారు వచ్చిన అదే మార్గము గుండా వారు తిరిగి అరణ్యములోనికి పారిపోసాగిరి.

25 అది రాత్రియైయున్నందున వారు తమ గుడారములను వేసుకొనిరి, ఏలయనగా నీఫైయులు వారి నడకను బట్టి అలసియుండిరని లేమనీయుల ప్రధాన అధికారులు తలంచిరి మరియు వారి సంపూర్ణ సైన్యమును తరిమివేసితిమని తలచినందున వారు మాంటై పట్టణమును గూర్చి ఏ ఆలోచన చేయలేదు.

26 ఇప్పుడు రాత్రి సమయములో నా మనుష్యులు నిద్రపోకుండా మరియొక మార్గమున మాంటై దేశము వైపు నడిచిపోవునట్లు నేను చేసితిని.

27 రాత్రి సమయములో మా ఈ నడకను బట్టి ఉదయమున మేము లేమనీయులకు ముందు ఉంటిమి, ఎంతగాననగా వారికంటే ముందు మేము మాంటై పట్టణమునకు వచ్చి చేరితిమి.

28 ఆ విధముగా ఈ యుక్తి చేత మేము రక్తము చిందించకయే మాంటై పట్టణమును స్వాధీనపరచుకొంటిమి.

29 లేమనీయుల యొక్క సైన్యములు పట్టణము దగ్గరకు వచ్చి చేరినప్పుడు, వారిని ఎదుర్కొనుటకు మేము సిద్ధముగానున్నామని చూచి వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి మరియు అధికముగా భయభ్రాంతులైరి, ఎంతగాననగా వారు అరణ్యములోనికి పారిపోయిరి.

30 ముఖ్యముగా, లేమనీయుల సైన్యములు దేశము యొక్క ఈ భాగమంతటి నుండి బయటకు పారిపోయినవి. కానీ వారు దేశము నుండి అనేకమంది స్త్రీలను, పిల్లలను వారితోపాటు తీసుకొనిపోయిరి.

31 మరియు లేమనీయుల చేత స్వాధీనపరచుకొనబడిన ఆ పట్టణములన్నియు ఈ సమయమున మా స్వాధీనమందున్నవి; బందీలుగా తీసుకొనబడి లేమనీయుల చేత కొనిపోబడిన వారు తప్ప, మా తండ్రులు, మా స్త్రీలు, మా పిల్లలందరు తమ గృహములకు తిరిగి వెళ్ళుచుండిరి.

32 కానీ, అంత అధిక సంఖ్యలో పట్టణములను మరియు భూభాగములను నిలుపుకొనుటకు మా సైన్యములు చిన్నవాయెను.

33 కానీ ఆ దేశములపై మాకు విజయమునిచ్చిన మా దేవుని యందు మేము నమ్మికయుంచితిమి, ఎంతగాననగా మా స్వంతమైన ఆ పట్టణములను మరియు ఆ దేశములను మేము సంపాదించితిమి.

34 ఇప్పుడు ప్రభుత్వము మాకు అధిక బలమును అనుగ్రహించకుండుటకు గల కారణమును మేమెరుగము లేదా మేము మరి ఎక్కువ బలమును ఎందుకు అందుకొనలేదో మా యొద్దకు వచ్చిన ఆ మనుష్యులు ఎరుగరు.

35 ఇదిగో మీరు విఫలురై, దేశము యొక్క ఆ భాగములోనికి సైన్యములను తీసుకొనిపోయిరేమో మేము ఎరుగము; అటులైన యెడల, మేము ఫిర్యాదు చేయుటకు కోరము.

36 అట్లు కాని యెడల, మా సహాయమునకై ఎక్కువమంది మనుష్యులను పంపని వర్గము ప్రభుత్వమందున్నదని మేము భయపడుచున్నాము; ఏలయనగా వారు పంపినవారి కంటే వారు అధికసంఖ్యలో ఉన్నారని మేమెరుగుదుము.

37 కానీ అది ముఖ్యము కాదు—మా సైన్యము బలహీనముగా ఉన్నను దేవుడు మమ్ములను విడిపించునని, మా శత్రువుల చేతులలోనుండి మమ్ములను విడిపించునని మేము నమ్ముచున్నాము.

38 ఇది ఇరువది తొమ్మిదవ సంవత్సరము యొక్క అంతము మరియు మేము మా దేశముల యొక్క స్వాధీనమందున్నాము; లేమనీయులు నీఫై దేశమునకు పారిపోయిరి.

39 నేను అంత హెచ్చుగా చెప్పిన అమ్మోన్ జనుల యొక్క ఆ కుమారులు నాతోపాటు మాంటై పట్టణమందున్నారు; ప్రభువు వారికి సహాయపడెను మరియు ఖడ్గము చేత కూలుట నుండి వారిని కాపాడెను, ఎంతగాననగా ఒక్క ఆత్మ కూడా సంహరింపబడలేదు.

40 కానీ వారు అనేక గాయములు పొందిరి; అయినప్పటికీ దేవుడు వారిని స్వతంత్రులను చేసిన ఆ స్వేచ్ఛ యందు వారు నిలకడగానుండిరి; అనుదినము ప్రభువైన వారి దేవుడిని జ్ఞాపకము చేసుకొనుటకు వారు ఖచ్చితముగా ఉండిరి; నిరంతరము ఆయన చట్టములను, ఆయన తీర్పులను, ఆయన ఆజ్ఞలను వారు పాటించిరి మరియు రాబోవు దాని గురించిన ప్రవచనములయందు వారి విశ్వాసము బలమైనది.

41 ఇప్పుడు నా ప్రియమైన సహోదరుడా మొరోనై, మనలను విమోచించి స్వతంత్రులను చేసిన ప్రభువైన మన దేవుడు నిన్ను ఎల్లప్పుడు ఆయన సన్నిధిలో ఉంచును గాక; మన ఆధారము కొరకైయుండి, లేమనీయులు మన నుండి తీసుకొనిన సమస్తమును స్వాధీనపరచుకొనుటలో మీరు విజయము పొందునట్లు కూడా ఈ జనులను ఆయన అనుగ్రహించును గాక. ఇంతటితో నేను నా లేఖను ముగించుచున్నాను. నేను ఆల్మా యొక్క కుమారుడనైన హీలమన్‌ను.