లేఖనములు
ఆల్మా 62


62వ అధ్యాయము

గిడియన్‌ దేశమందు పహోరన్‌కు సహాయపడుటకు మొరోనై వెళ్ళును—తమ దేశమును కాపాడుటకు తిరస్కరించిన రాజు-మనుష్యులు చంపబడిరి—పహోరన్‌ మరియు మొరోనై, నెఫిహాను తిరిగి స్వాదీనపరచుకొందురు—అనేకమంది లేమనీయులు అమ్మోన్‌ యొక్క జనులతో చేరుదురు—టియాంకమ్, అమ్మోరోన్‌ను సంహరించి, తాను కూడా సంహరింపబడును—లేమనీయులు దేశము నుండి తరిమివేయబడి, సమాధానము స్థాపించబడును—హీలమన్‌ పరిచర్య చేయుటకు తిరిగి వచ్చి, సంఘమును నిర్మించును. సుమారు క్రీ. పూ. 62–57 సం.

1 మరియు మొరోనై ఈ లేఖను అందుకొనినప్పుడు, అతని హృదయము ధైర్యము తెచ్చుకొనెను, అతని దేశ స్వాతంత్ర్యమునకు, ఉద్యమమునకు పహోరన్‌ ద్రోహము చేయకుండా ఉన్నందున అతని విశ్వాస్యతను బట్టి మొరోనై అత్యంత సంతోషముతో నింపబడెను.

2 కానీ పహోరన్‌ను న్యాయపీఠము నుండి తరిమివేసినవారి యొక్క దుర్నీతిని బట్టి, క్లుప్తముగా వారి దేశమునకు, వారి దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిన వారిని బట్టి అతడు అధికముగా దుఃఖించెను.

3 మరియు పహోరన్‌ కోరికను బట్టి మొరోనై కొద్ది సంఖ్యలో మనుష్యులను తీసుకొని, అతని సైన్యము యొక్క శేషముపై ఆధిపత్యమును లీహై మరియు టియాంకమ్‌లకు ఇచ్చి, గిడియన్‌ దేశము వైపు నడిచెను.

4 అతడు ప్రవేశించిన ప్రతి స్థలమందు అతడు స్వేచ్ఛాధ్వజమును పైకెత్తి, గిడియన్‌ దేశమువైపు అతని ప్రయాణమంతటిలో అతనికి సాధ్యమైనంత సైన్యమును సంపాదించెను.

5 వేలమంది అతని ధ్వజము యొద్ద సమకూడి, వారు దాస్యములోనికి రాకుండునట్లు వారి స్వాతంత్ర్యమును కాపాడుకొనుటకు వారి ఖడ్గములను తీసుకొనిరి.

6 ఆ విధముగా అతని ప్రయాణమంతటిలో అతనికి సాధ్యమైనంత మంది మనుష్యులను మొరోనై సమకూర్చిన తరువాత, అతడు గిడియన్‌ దేశమునకు వచ్చెను. అతని సైన్యములను పహోరన్‌ సైన్యములతో కలుపుట చేత వారు మిక్కిలి బలవంతులైరి, ఎంతగాననగా స్వతంత్ర మనుష్యులను జరహేమ్ల దేశము నుండి బయటకు తరిమివేసి, దేశమును స్వాధీనపరచుకొనిన ఆ అసమ్మతీయుల రాజైన పాకస్ యొక్క మనుష్యుల కంటే కూడా అధిక బలవంతులైరి.

7 మొరోనై మరియు పహోరన్‌ తమ సైన్యములతో జరహేమ్ల దేశములోనికి వెళ్ళి, పట్టణముపై దాడి చేసి, వారు యుద్ధము చేయుటకు వచ్చునంతగా పాకస్ మనుష్యులతో పోరాడిరి.

8 పాకస్ సంహరింపబడి, అతని మనుష్యులు బందీలుగా తీసుకొనబడిరి మరియు పహోరన్‌ అతని న్యాయపీఠమునకు పునఃస్థాపించబడెను.

9 పాకస్ మనుష్యులు మరియు బంధించబడి చెరసాలలో వేయబడిన ఆ రాజు-మనుష్యులు చట్ట ప్రకారము న్యాయవిచారణ పొందిరి మరియు వారు చట్ట ప్రకారము చంపబడిరి; ముఖ్యముగా వారి దేశ రక్షణకు ఆయుధములను తీసుకొనకుండా దానికి వ్యతిరేకముగా పొరాడువారందరు, అనగా పాకస్ మనుష్యులు మరియు రాజు-మనుష్యులు చంపబడిరి.

10 ఆ విధముగా వారి దేశ క్షేమము నిమిత్తము ఈ చట్టము ఖచ్చితముగా అమలు చేయబడుట అవసరమాయెను; వారి స్వాతంత్ర్యమును తిరస్కరించు వారెవరైనను చట్ట ప్రకారము వేగముగా చంపబడిరి.

11 మరియు ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పైయవ సంవత్సరము ముగిసెను; స్వాతంత్ర్య ఉద్యమమునకు నిబద్ధులుగా లేని వారందరికి మరణశిక్ష విధించుచూ మొరోనై మరియు పహోరన్‌ వారి స్వంత జనుల మధ్య జరహేమ్ల యొక్క దేశమందు సమాధానమును పునఃస్థాపించిరి.

12 నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పది ఒకటవ సంవత్సరము యొక్క ప్రారంభమందు, దేశము యొక్క ఆ భాగమును కాపాడుట యందు హీలమన్‌కు సహాయపడుటకు వెంటనే ఆహారసామాగ్రులు మరియు ఆరువేల మంది మనుష్యులు అతని యొద్దకు పంపబడునట్లు మొరోనై చేసెను.

13 మరియు ఆరువేలమంది మనుష్యుల సైన్యమొకటి తగినంత పరిమాణములో ఆహారముతోపాటు లీహై మరియు టియాంకమ్ యొక్క సైన్యములకు పంపబడునట్లు అతడు చేసెను. ఇదంతయు దేశమును లేమనీయులకు వ్యతిరేకముగా బలపరచుకొనుటకు చేయబడెను.

14 ఇప్పుడు మొరోనై మరియు పహోరన్‌ జరహేమ్ల దేశమందు పెద్ద సైన్యమును విడిచిపెట్టి, నెఫీహా పట్టణమందున్న లేమనీయులను నాశనము చేయుటకు నిశ్చయించుకొనిన వారై ఒక పెద్ద సైన్యముతో ఆ దేశమువైపు వెళ్ళిరి.

15 మరియు వారు దేశమువైపు నడుచుచుండగా, వారు లేమనీయుల యొక్క ఒక పెద్ద సైన్యమును పట్టుకొని, వారిలో అనేకులను సంహరించి, వారి ఆహారసామాగ్రులను మరియు వారి యుద్ధ ఆయుధములను తీసుకొనిరి.

16 వారు వారిని బంధించిన తరువాత, నీఫైయులకు వ్యతిరేకముగా వారు ఇకపై వారి యుద్ధ ఆయుధములను తీసుకొనరని ఒక నిబంధనలోనికి ప్రవేశించునట్లు వారు చేసిరి.

17 మరియు వారు ఈ నిబంధనలోనికి ప్రవేశించినప్పుడు, వారిని అమ్మోన్‌ యొక్క జనులతో నివసించుటకు వారు పంపివేసిరి, ఇప్పుడు సంహరింపబడని వారు సంఖ్యలో సుమారు నాలుగు వేలమంది ఉండిరి.

18 వారిని పంపివేసిన తరువాత, వారి నడకను నెఫిహా దేశము వైపు వారు కొనసాగించిరి. వారు నెఫిహా పట్టణమునకు వచ్చినప్పుడు, నెఫిహా పట్టణమునకు దగ్గరగానున్న నెఫిహా మైదానములపై వారు తమ గుడారములను వేసుకొనిరి.

19 ఇప్పుడు మైదానములపై వారికి వ్యతిరేకముగా లేమనీయులు యుద్ధమునకు రావలెనని మొరోనై కోరెను; కానీ లేమనీయులు వారి అత్యధిక ధైర్యమును గూర్చి ఎరిగియుండి, వారి సంఖ్యల యొక్క గొప్పతనమును చూచినందున వారికి వ్యతిరేకముగా వచ్చుటకు ధైర్యము చేయలేదు; కావున వారు ఆ దినమున యుద్ధమునకు రాలేదు.

20 మరియు రాత్రి వచ్చినప్పుడు మొరోనై చీకటిలో ముందుకు వెళ్ళి, లేమనీయులు వారి సైన్యముతో పట్టణము యొక్క ఏ భాగమందు దండు దిగియున్నారో వేగుచూచుటకు గోడ పైభాగమునకు వచ్చెను.

21 వారు తూర్పున ప్రవేశ ద్వారము ప్రక్కన ఉండిరి; వారందరు నిద్రపోయిరి. ఇప్పుడు మొరోనై తన సైన్యము యొద్దకు తిరిగి వచ్చి, వారు గోడపై భాగము నుండి గోడ లోపలి వైపు క్రిందికి దించబడుటకు బలమైన త్రాళ్ళు మరియు నిచ్చెనలు త్వరగా సిద్ధము చేయబడునట్లు చేసెను.

22 మరియు అతని మనుష్యులు ముందుకు నడిచి గోడ పైకివచ్చి, లేమనీయులు వారి సైన్యములతో బస చేయని పట్టణము యొక్క ఆ భాగములోనికి, అనగా పశ్చిమము వైపు క్రిందికి దిగునట్లు మొరోనై చేసెను.

23 వారందరు రాత్రియందు బలమైన త్రాళ్ళు మరియు నిచ్చెనల సహాయముతో పట్టణములోనికి దింపబడిరి; ఆ విధముగా ఉదయమైనప్పుడు వారందరు పట్టణ ప్రాకారముల లోపల ఉండిరి.

24 ఇప్పుడు లేమనీయులు మేల్కొని ప్రాకారముల లోపల మొరోనై యొక్క సైన్యములను చూచినప్పుడు, వారు మిక్కిలిగా భయపడిరి, ఎంతగాననగా వారు ద్వారము గుండా బయటకు పారిపోయిరి.

25 ఇప్పుడు వారు అతని యెదుట నుండి పారిపోవుచున్నారని మొరోనై చూచినప్పుడు, తన మనుష్యులు వారికి వ్యతిరేకముగా వెళ్ళి అనేకులను సంహరించి, ఇతరులనేకులను చుట్టుముట్టి, వారిని బందీలుగా తీసుకొనునట్లు అతడు చేసెను; మరియు వారిలో మిగిలిన వారు సముద్రపు ఒడ్డున సరిహద్దుల యందున్న మొరోనై దేశములోనికి పారిపోయిరి.

26 ఆ విధముగా మొరోనై మరియు పహోరన్‌, ఒక్క ఆత్మ కూడా నష్టపోకుండా నెఫిహా పట్టణమును స్వాధీనపరచుకొనిరి మరియు లేమనీయులలో అనేకులు సంహరింపబడిరి.

27 ఇప్పుడు బందీలుగా ఉన్న లేమనీయులలో అనేకులు అమ్మోన్‌ యొక్క జనులతో చేరుటకు, స్వతంత్ర జనులగుటకు కోరియుండిరి.

28 మరియు కోరినంతమందికి వారి కోరికల ప్రకారము అనుగ్రహించబడెను.

29 కావున లేమనీయ బందీలందరు అమ్మోన్‌ యొక్క జనులతో చేరిరి మరియు భూమిని సేద్యపరచుచూ అన్నివిధములైన ధాన్యమును, ప్రతివిధమైన మందలను, గుంపులను పెంచుచూ అధికముగా పని చేయనారంభించిరి; ఆ విధముగా నీఫైయులు గొప్ప భారము నుండి విడిపించబడిరి; ఎంతగాననగా వారు లేమనీయ బందీలందరిని కాపలాకాయుట నుండి విడిపించబడిరి.

30 ఇప్పుడు మొరోనై, నెఫిహా పట్టణమును స్వాధీనపరచుకొనిన తరువాత లేమనీయుల సైన్యములను తగ్గించునట్లు అనేకమంది బందీలను తీసుకొనియుండి, బందీలుగా తీసుకొనబడిన అనేకమంది నీఫైయులను తిరిగి సంపాదించియుండెను, అది మొరోనై యొక్క సైన్యములను అధికముగా బలపరిచెను; కావున మొరోనై, నెఫిహా దేశము నుండి లీహై దేశమునకు వెళ్ళెను.

31 మరియు మొరోనై వారికి వ్యతిరేకముగా వచ్చుచున్నాడని లేమనీయులు చూచినప్పుడు, వారు మరలా భయపడి మొరోనై సైన్యము యెదుట పారిపోయిరి.

32 వారు లీహై మరియు టియాంకమ్ చేత కలుసుకొనబడు వరకు మొరోనై, అతని సైన్యము వారిని పట్టణము నుండి పట్టణమునకు వెంబడించిరి; లీహై మరియు టియాంకమ్ నుండి వారు మొరోనై దేశమునకు వచ్చువరకు సముద్రపు ఒడ్డున సరిహద్దులపై లేమనీయులు పారిపోయిరి.

33 మరియు లేమనీయుల సైన్యములన్నియు సమకూర్చబడి, వారందరు మొరోనై దేశమందు ఒక్క సమూహమందుండిరి. ఇప్పుడు లేమనీయుల రాజైన అమ్మోరోన్‌ కూడా వారితోనుండెను.

34 మొరోనై, లీహై మరియు టియాంకమ్ తమ సైన్యములతో మొరోనై దేశము యొక్క సరిహద్దులందు చుట్టూ దండు దిగియుండిరి, ఎంతగాననగా లేమనీయులు దక్షిణమునున్న అరణ్యము దగ్గర సరిహద్దులయందు మరియు తూర్పున ఉన్న అరణ్యము దగ్గర సరిహద్దులయందు చుట్టూ చుట్టబడియుండిరి.

35 ఆ విధముగా వారు రాత్రి కొరకు దండు దిగియుండిరి. ఏలయనగా, నీఫైయులు మరియు లేమనీయులు కూడా వారి నడక మూలముగా అలసియుండిరి; కావున టియాంకమ్ తప్ప, మరెవరూ రాత్రి సమయమందు ఎట్టి పన్నాగములు పన్నియుండలేదు; ఏలయనగా అతడు అమ్మోరోన్‌తో మిక్కిలి కోపముగానుండెను, ఎంతగాననగా అధిక యుద్ధము, రక్తపాతము మరియు అధిక కరువునకు కారణమై, తమకు మరియు లేమనీయులకు మధ్య జరుగుచున్న ఈ గొప్ప సుదీర్ఘ యుద్ధమునకు అమ్మోరోన్‌ మరియు అతని సహోదరుడు అమలిక్యా కారణమని అతడు తలంచెను.

36 అతని కోపమందు టియాంకమ్ లేమనీయుల శిబిరములోనికి వెళ్ళి, పట్టణ ప్రాకారములపైనుండి క్రిందికి దిగెను. అతడు ఒక త్రాడు సహాయముతో ఒక చోటు నుండి మరొక చోటుకు ముందుకు వెళ్ళుచూ రాజును కనుగొనెను మరియు అతనిపై ఒక ఈటెను విసరగా, అది అతని హృదయమందు గృచ్చుకొనెను. కానీ అతడు చనిపోవుటకు ముందు రాజు, అతని సేవకులను మేల్కొల్పగా వారు టియాంకమ్‌ను వెంబడించి, అతడిని సంహరించిరి.

37 ఇప్పుడు టియాంకమ్ మరణించెనని లీహై మరియు మొరోనై తెలుసుకొన్నప్పుడు వారు మిక్కిలిగా దుఃఖించిరి; ఏలయనగా అతడు తన దేశము కొరకు ధైర్యముగా పోరాడిన స్వాతంత్ర్యము యొక్క నిజమైన స్నేహితుడైయుండెను మరియు అతడు అనేక తీవ్రమైన బాధలను అనుభవించియుండెను. కానీ ఇప్పుడతడు మరణించి, భూముఖము పైనుండి వెళ్ళిపోయెను.

38 మరుసటి ఉదయమున మొరోనై ముందుకు నడిచి లేమనీయులపై దాడిచేసెను, ఎంతగాననగా అధిక సంహారముతో వారు వారిని సంహరించిరి; వారిని దేశము నుండి బయటకు తరిమివేసిరి; మరియు నీఫైయులకు వ్యతిరేకముగా ఆ సమయమున తిరిగి రాకుండునంతగా వారు పారిపోయిరి.

39 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పది ఒకటవ సంవత్సరము ముగిసెను; ఆ విధముగా అనేక సంవత్సరముల పాటు వారు యుద్ధములు, రక్తపాతములు, కరువు మరియు శ్రమలను కలిగియుండిరి.

40 అక్కడ నీఫై జనుల మధ్య హత్యలు, వివాదములు, అభిప్రాయభేధములు మరియు సమస్త విధమైన దుర్నీతి ఉండెను; అయినప్పటికీ నీతిమంతుల నిమిత్తము, ముఖ్యముగా నీతిమంతుల ప్రార్థనల నిమిత్తము వారు కాపాడబడిరి.

41 కానీ నీఫైయులు మరియు లేమనీయుల మధ్య సుదీర్ఘ కాలమున్న యుద్ధమును బట్టి, వారిలో అనేకులు కఠినపరచబడిరి; అనేకులు వారి బాధలను బట్టి మృదువుగా చేయబడిరి, ఎంతగాననగా మిక్కిలి వినయముతో వారు దేవుని యెదుట తమనుతాము తగ్గించుకొనిరి.

42 మరియు ఎక్కువగా లేమనీయుల ఆధీనములోనున్న దేశము యొక్క ఆ భాగములు తగినంతగా బలపడువరకు మొరోనై వాటిని బలపరచిన తరువాత, అతడు జరహేమ్ల దేశమునకు తిరిగి వచ్చెను. హీలమన్‌ కూడా అతని స్వాస్థ్యమైన స్థలమునకు తిరిగివచ్చెను మరియు నీఫై జనుల మధ్య మరియొకసారి సమాధానము స్థాపించబడెను.

43 ఇప్పుడు మొరోనై అతని సైన్యముల ఆధిపత్యమును అతని కుమారుని చేతులకు అప్పగించెను, అతని పేరు మొరోనైహా; మరియు అతని శేష దినములను సమాధానమందు గడపగలుగునట్లు అతడు తన ఇంటికి చేరుకొనెను.

44 పహోరన్‌ అతని న్యాయపీఠమునకు తిరిగి వచ్చెను; హీలమన్‌ మరలా జనులకు దేవుని వాక్యమును బోధించసాగెను; ఏలయనగా, అధిక యుద్ధములు మరియు వివాదముల కారణముగా సంఘము మరలా క్రమపరచబడుట అవసరమాయెను.

45 కావున హీలమన్‌ మరియు అతని సహోదరులు వెళ్ళి, అనేకమంది జనులను వారి దుష్టత్వమును గూర్చి ఒప్పించునట్లు అధిక శక్తితో దేవుని వాక్యము ప్రకటించిరి, అది తమ పాపముల విషయమై వారు పశ్చాత్తాపపడి, ప్రభువైన వారి దేవుని యెదుట బాప్తిస్మము పొందునట్లు చేసెను.

46 మరలా వారు దేశమంతటా దేవుని సంఘమును స్థాపించిరి.

47 మరియు చట్టమును గూర్చి నియమములు చేయబడెను. వారి న్యాయాధిపతులు మరియు ప్రధాన న్యాయాధిపతులు ఎన్నుకోబడిరి.

48 నీఫై జనులు దేశమందు తిరిగి వర్ధిల్లుట మొదలుపెట్టిరి, దేశమందు తిరిగి వృద్ధిపొంది మిక్కిలి బలవంతులవసాగిరి మరియు వారు మిక్కిలి ధనవంతులు కాసాగిరి.

49 కానీ ధనము, బలము లేదా ఐశ్వర్యము ఉన్నప్పటికీ, వారు తమ నేత్రముల యొక్క గర్వమందు హెచ్చించుకొనలేదు, లేదా ప్రభువైన వారి దేవుడిని జ్ఞాపకము చేసుకొనుటలో వారు ఆలస్యము చేయలేదు; కానీ వారు ఆయన యెదుట తమనుతాము బాగా తగ్గించుకొనిరి.

50 దేవుడు వారి కొరకు ఎన్నో గొప్ప సంగతులు చేసియున్నాడని, ఆయన వారిని మరణము నుండి, బంధకముల నుండి, చెరసాలల నుండి, సమస్త విధములైన బాధల నుండి విడిపించియున్నాడని మరియు ఆయన వారిని వారి శత్రువుల చేతులలో నుండి విడిపించియున్నాడని వారు జ్ఞాపకము చేసుకొనిరి.

51 వారు ప్రభువైన వారి దేవుడిని నిరంతరము ప్రార్థించిరి, ఎంతగాననగా వారు దేశమందు బలముగా ఎదిగి వర్ధిల్లునట్లు, ఆయన వాక్యము ప్రకారము ప్రభువు వారిని ఆశీర్వదించెను.

52 ఇప్పుడు ఈ సంగతులన్నియు జరిగెను మరియు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క ముప్పది ఐదవ సంవత్సరమందు హీలమన్‌ మరణించెను.