లేఖనములు
ఆల్మా 7


ఆల్మా యొక్క వృత్తాంతమును బట్టి, గిడియన్‌లోనున్న జనులతో అతడు పలికిన మాటలు.

7 వ అధ్యాయము కలిగియున్నది.

7వ అధ్యాయము

మరియకు క్రీస్తు జన్మించును—ఆయన మరణ బంధకములను తొలగించి, తన జనుల పాపములను భరించును—పశ్చాత్తాపపడి బాప్తిస్మము పొంది, ఆజ్ఞలను పాటించు వారు నిత్యజీవము కలిగియుందురు—మలినము, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేదు—వినయము, విశ్వాసము, నిరీక్షణ మరియు దాతృత్వము అవసరమైయున్నవి. సుమారు క్రీ. పూ. 83 సం.

1 నా ప్రియమైన సహోదరులారా, నేను పూర్తిగా న్యాయపీఠమునకు అంకితమైయుండి మీ యొద్దకు రాలేనంత అధికమైన పని కలిగియుంటిని; ఇప్పుడు మీ యొద్దకు వచ్చుటకు నేను అనుమతించబడి యున్నందున, నా నోటి మాటల ద్వారా నేను మీతో మాట్లాడుట ఇదే మొదటిసారి అయినందున, నేను స్వయంగా నా భాషలో మీతో మాట్లాడుటకు ప్రయత్నించుచున్నాను.

2 నా స్థానములో పరిపాలించుటకు న్యాయపీఠము మరియొకనికి ఇవ్వబడని యెడల, ఈ సమయమున కూడా నేను వచ్చియుండకపోవుదును; నేను మీ యొద్దకు రావలెనని అధిక కనికరమందు ప్రభువు అనుగ్రహించెను.

3 దేవుని యెదుట మిమ్ములను మీరు తగ్గించుకొనియున్నారని, ఆయన కృప కొరకు ప్రార్థించుట యందు కొనసాగియున్నారని, మీరు ఆయన ఎదుట నిర్దోషులుగా ఉన్నారని మరియు జరహేమ్ల యొద్ద ఉన్న మన సహోదరుల వలె ఘోరమైన సందిగ్ధమందు లేరని నేను కనుగొనవలెనని గొప్ప నిరీక్షణతో, అధికమైన కోరికతో వచ్చియున్నాను.

4 కానీ దేవుని నామము స్తుతినొందునుగాక, ఏలయనగా నేను తెలుసుకొనుటకు, అనగా ఆయన నీతి యందు వారు తిరిగి స్థిరపడియున్నారని తెలుసుకొని అమితానందపడుటకు ఆయన నాకు అనుగ్రహించియున్నాడు.

5 మరియు నా యందున్న దేవుని ఆత్మను బట్టి, మిమ్ములను గూర్చి కూడా నేను ఆనందము కలిగియుందునని నమ్ముచున్నాను; అయినప్పటికీ మిమ్ములను గూర్చిన నా ఆనందము, జరహేమ్ల యొద్దనున్న సహోదరుల కొరకు నేను అనుభవించినటువంటి అధికమైన శ్రమలు మరియు దుఃఖమును బట్టి రావలెనని నేను కోరను, ఏలయనగా వారిని గూర్చిన నా ఆనందము అధిక శ్రమ మరియు దుఃఖముతో ప్రయాసపడిన తరువాత వచ్చెను.

6 కానీ, మీ సహోదరులున్నంత అధికమైన అవిశ్వాసపు స్థితిలో మీరు లేరని నేను నమ్ముచున్నాను; మీరు మీ హృదయముల గర్వమందు హెచ్చింపబడలేదని నేను నమ్ముచున్నాను; మీరు మీ హృదయములను సంపదలపై, లోకము యొక్క వ్యర్థమైన వస్తువులపై ఉంచలేదని నేను నమ్ముచున్నాను; మీరు విగ్రహములను ఆరాధించరని, నిజమైన మరియు సజీవుడగు దేవుడిని మీరు ఆరాధించుచున్నారని, రాబోవు మీ పాప క్షమాపణ కొరకు శాశ్వతమైన విశ్వాసముతో మీరు ఎదురు చూచుచున్నారని నేను నమ్ముచున్నాను.

7 ఏలయనగా, అనేక సంగతులు జరుగవచ్చును; అయితే వాటన్నిటి కంటే అధిక ప్రాముఖ్యత కలిగిన సంగతి ఒకటున్నది—ఇదిగో, విమోచకుడు తన జనుల మధ్యకు వచ్చి జీవించు సమయము ఎంతో దూరములో లేదని నేను మీతో చెప్పుచున్నాను.

8 తన మర్త్య గుడారమందు నివసించు సమయమున ఆయన మన మధ్యకు వచ్చునని నేను చెప్పుట లేదు; ఏలయనగా, అట్లు జరుగునని ఆత్మ నాతో చెప్పియుండలేదు. ఇప్పుడు ఈ సంగతిని గూర్చి నేనెరుగను; కానీ, ఆయన వాక్యము ప్రకారమైన అన్ని క్రియలను చేయుటకు ప్రభువైన దేవుడు శక్తిని కలిగియున్నాడని మాత్రము నేనెరుగుదును.

9 కానీ ఆత్మ నాతో, ఈ జనులకు ప్రకటించుము అని చెప్పుచూ ఇంత మట్టుకు చెప్పెను—మీరు పశ్చాత్తాపపడుడి, ప్రభువు యొక్క మార్గమును సిద్ధపరచుడి, తిన్నని ఆయన త్రోవలలో నడువుడి; ఏలయనగా, పరలోకరాజ్యము సమీపించియున్నది మరియు దేవుని కుమారుడు భూముఖము పైకి వచ్చును.

10 ఆయన మన పితరుల దేశమైన యెరూషలేమునందు మరియకు జన్మించును, ఆమె ఒక కన్యకయై, అమూల్యమైన ఎన్నుకొనబడిన పాత్రయై, పరిశుద్ధాత్మ శక్తి చేత కమ్ముకొనబడి, గర్భము ధరించి ఒక కుమారుడిని, అనగా దేవుని కుమారుడిని కనును.

11 ఆయన ప్రతి విధమైన బాధలు, శ్రమలు మరియు శోధనలు అనుభవించుచూ ముందుకు సాగును; తన జనుల బాధలను, రోగములను ఆయన తనపై తీసుకొనునని చెప్పిన వాక్యము నెరవేరుటకు ఇది జరుగును.

12 తన జనులను బంధించు మరణ బంధకములను తొలగించునట్లు ఆయన మరణమును తనపై తీసుకొనును; మరియు శరీరమును బట్టి ఆయన ప్రేగులు కనికరముతో నిండునట్లు, వారి బలహీనతలను బట్టి తన జనులను ఎట్లు ఆదరించవలెనో శరీరమును బట్టి ఆయన ఎరుగునట్లు, ఆయన వారి బలహీనతలను తనపై తీసుకొనును.

13 ఇప్పుడు ఆత్మ అన్ని విషయములను ఎరుగును; అయినప్పటికీ, తన జనుల పాపములను ఆయన తనపై తీసుకొనునట్లు, ఆయన విడుదల యొక్క శక్తిని బట్టి వారి అతిక్రమములను ఆయన తొలగించునట్లు దేవుని కుమారుడు శరీరమును బట్టి శ్రమపడును; మరియు నాయందున్న సాక్ష్యము ఇదియే.

14 మీరు పశ్చాత్తాపపడి, క్రొత్తగా జన్మించవలెనని ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను; ఏలయనగా మీరు క్రొత్తగా జన్మించనియెడల, పరలోకరాజ్యమును వారసత్వముగా పొందలేరని ఆత్మ చెప్పుచున్నాడు; కావున మీ పాపముల నుండి శుద్ధిచేయబడునట్లు లోక పాపములను తీసివేయువాడు, సమస్త దుర్నీతి నుండి రక్షించి శుద్ధి చేయుటకు బలవంతుడునగు ఆ దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల యందు మీరు విశ్వాసము కలిగియుండునట్లు రండి మరియు పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మము పొందుడి.

15 నేను మీతో చెప్పునదేమనగా, రండి భయపడకుడి, మిమ్ములను సులువుగా చిక్కులు పెట్టి నాశనమునకు నడిపించు ప్రతి పాపమును విడిచిపెట్టుడి; వచ్చి, ముందుకు వెళ్ళి, మీ పాపముల విషయమై పశ్చాత్తాపపడి ఆయన ఆజ్ఞలను గైకొనెదమని ఆయనతో ఒక నిబంధనలోనికి ప్రవేశించుటకు మీరు ఇష్టపడుచున్నారని మీ దేవునికి చూపుచూ బాప్తిస్మపు జలములలోనికి వెళ్ళుట ద్వారా ఈ దినమున ఆయనకు సాక్ష్యమివ్వుడి.

16 దీనిని చేసి, ఆ సమయము నుండి దేవుని ఆజ్ఞలను గైకొను వ్యక్తి నిత్యజీవము కలిగియుండునని నాలోనున్న పరిశుద్ధాత్మ సాక్ష్యమును బట్టి, నేను అతనితో చెప్పియున్నానని అతడు జ్ఞాపకముంచుకొనును.

17 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ విషయములను నమ్ముచున్నారా? ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, మీరు వాటిని నమ్ముచున్నారని నేనెరుగుదును; మీరు వాటిని నమ్ముచున్నారని నా యందున్న ఆత్మ యొక్క ప్రత్యక్షత ద్వారా నేనెరుగుదును. ఇప్పుడు దానిని గూర్చి, అనగా నేను పలికియున్న విషయములను గూర్చి మీ విశ్వాసము బలమైనదైనందున, నా ఆనందము గొప్పదాయెను.

18 ఏలయనగా మీరు మీ సహోదరుల వలే సందిగ్ధ స్థితిలో ఉండరాదని నేను అధిక వాంఛ కలిగియుంటినని, నేను మీతో మొదటి నుండి చెప్పియున్నట్లుగానే నా వాంఛలు తృప్తిపరచబడినవని కూడా నేను కనుగొనియున్నాను.

19 మీరు నీతి మార్గములలో ఉన్నారని, దేవుని రాజ్యమునకు నడిపించు త్రోవలో ఉన్నారని, మీరు ఆయన త్రోవలను సరాళము చేయుచున్నారని నేను చూచుచున్నాను.

20 ఆయన వంకర త్రోవలలో నడువజాలడని, ఆయన చెప్పిన దాని నుండి తొలగడని, ఆయన కుడి నుండి ఎడమకు, లేదా సరియైన దాని నుండి తప్పైనదానికి కొంచెమైనను మరలడని ఆయన వాక్యము యొక్క సాక్ష్యము ద్వారా మీకు తెలియజేయబడియున్నదని నేను చూచుచున్నాను; కాబట్టి, ఆయన మార్గము ఒక నిత్య వలయమైయున్నది.

21 ఆయన అపవిత్రమైన ఆలయములలో నివసించడు; మలినమైనది లేదా అపవిత్రమైనది ఏదైనను దేవుని రాజ్యమందు స్వీకరించబడదు; కావున, మలినముగా ఉన్నవాడు అతని మలినతలో నిలిచియుండు సమయము వచ్చునని, అది అంత్యదినమున జరుగునని నేను మీతో చెప్పుచున్నాను.

22 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, దేవుని యెడల మీ కర్తవ్యము పట్ల సున్నితముగా ఉండుటకు నేను మిమ్ములను మేల్కొలుపునట్లు, మీరు ఆయన యెదుట నిర్దోషులుగా నడుచునట్లు, మీరు స్వీకరించబడిన విధానము ప్రకారము దేవుని యొక్క పరిశుద్ధ క్రమమును బట్టి మీరు నడుచునట్లు నేను మీకు ఈ విషయములను చెప్పితిని.

23 ఇప్పుడు మీరు వినయ విధేయతలు కలిగి, మృదువుగానుండి, సులువుగా లోబడునట్లుండవలెనని, సహనము మరియు దీర్ఘశాంతముతో నిండి సమస్త విషయములలో మితముగానుండి, అన్ని సమయములలో దేవుని ఆజ్ఞలు గైకొనుట యందు శ్రద్ధగా ఉండవలెనని, ఆత్మీయముగా భౌతికముగా మీకవసరమైన వాటికొరకు అడుగుచూ మీరు పొందువాటన్నిటి కొరకు దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతలు చెల్లించవలెనని నేను కోరుచున్నాను.

24 మీరు విశ్వాసము, నిరీక్షణ మరియు దాతృత్వము కలిగియుండునట్లు చూచుకొనుడి; అప్పుడు, మీరు ఎల్లప్పుడు సత్‌క్రియల యందు వర్ధిల్లుదురు.

25 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు మరియు లోకారంభము నుండి ఉన్న పరిశుద్ధ ప్రవక్తల వస్త్రములు మచ్చలేక ఉన్నట్లే మీ వస్త్రములు మచ్చలేకయుండి, ఇకమీదట ఎన్నటికీ వెలుపలికి పోకుండా పరలోక రాజ్యమందు వారితో కూర్చొనుటకు మీరు తేబడునట్లు ప్రభువు మిమ్ములను ఆశీర్వదించును గాక మరియు మీ వస్త్రములను మచ్చలేకయుంచును గాక.

26 ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, నాలో సాక్ష్యమిచ్చు ఆత్మను బట్టి నేను మీతో ఈ మాటలను పలికియున్నాను; నా మాట పట్ల మీరు చూపిన అత్యంత శ్రద్ధ మరియు లక్ష్యమును బట్టి నా ఆత్మ అధికముగా ఆనందించుచున్నది.

27 ఇప్పుడు ఈ సమయము నుండి మొదలుకొని నిరంతరము మీ విశ్వాసము మరియు సత్‌క్రియలను బట్టి మీపై, మీ గృహములు, దేశములపై, మీ గుంపులు, మందలు, మీరు కలిగియున్న వాటన్నిటిపై, మీ స్త్రీలు, పిల్లలపై దేవుని సమాధానము నిలుచునుగాక. మరియు నేను ఆ విధముగా పలికితిని. ఆమేన్‌.