లేఖనములు
ఆల్మా 8


8వ అధ్యాయము

ఆల్మా, మీలెక్ నందు బోధించుచు, బాప్తిస్మమిచ్చును—అతడు అమ్మోనైహా యందు తిరస్కరించబడును మరియు విడిచివెళ్ళును—తిరిగి వెళ్ళవలెనని, జనులకు పశ్చాత్తాపము ప్రకటించవలెనని ఒక దేవదూత అతడిని ఆజ్ఞాపించును—అతడు అమ్యులెక్ ద్వారా ఆదరించబడును మరియు వారిద్దరు అమ్మోనైహా యందు బోధించెదరు. సుమారు క్రీ. పూ. 82 సం.

1 ఇప్పుడు, వ్రాయబడలేని అనేక విషయములను గిడియన్‌ యొక్క జనులకు బోధించిన తరువాత, ఇంతకుముందు జరహేమ్ల దేశమందు అతడు చేసినట్లుగా సంఘము యొక్క క్రమమును స్థాపించి గిడియన్‌ దేశము నుండి ఆల్మా తిరిగి వచ్చెను; అతడు చేసిన పనుల నుండి విశ్రాంతి పొందుటకు జరహేమ్లలోనున్న తన ఇంటికి తిరిగి వచ్చెను.

2 ఆ విధముగా నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క తొమ్మిదవ సంవత్సరము ముగిసెను.

3 నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క పదవ సంవత్సరము ప్రారంభమందు ఆల్మా అక్కడ నుండి వెడలిపోయి, సీదోను నదికి పశ్చిమమున గల అరణ్యము యొక్క సరిహద్దుల గుండా పశ్చిమమున ఉన్న మీలెక్ దేశములోనికి తన ప్రయాణము సాగించెను.

4 అతడు పిలువబడిన ఆ దేవుని పరిశుద్ధ క్రమమును బట్టి, మీలెక్ దేశమునందున్న జనులకు బోధించుట ప్రారంభించెను; మీలెక్ దేశమంతటనున్న జనులకు అతడు బోధించనారంభించెను.

5 అరణ్యము వైపున ఉన్న దేశము యొక్క సమస్త సరిహద్దుల నుండి జనులు అతని యొద్దకు వచ్చిరి. దేశమందంతటా వారు బాప్తిస్మము పొందిరి;

6 కావున, మీలెక్ నందు తన పనిని ముగించుకొని అతడు అక్కడ నుండి వెడలిపోయి, మీలెక్ దేశమునకు ఉత్తర దిశగా మూడు దినములు ప్రయాణము చేసి అమ్మోనైహా అని పిలువబడిన పట్టణమునకు వచ్చెను.

7 ఇప్పుడు నీఫై జనులకు వారి దేశములను, పట్టణములను, పల్లెలను, అంతేకాక వారి యొక్క చిన్న పల్లెలన్నిటినీ మొదట వాటిని స్వాధీనపరచుకొనిన వాని పేరును బట్టి పిలుచుట ఆనవాయితీగా ఉండెను మరియు అమ్మోనైహా దేశము కూడా ఆ విధముగా పిలువబడెను.

8 ఆల్మా, అమ్మోనైహా పట్టణమునకు వచ్చినప్పుడు అతడు వారికి దేవుని వాక్యమును బోధించనారంభించెను.

9 ఇప్పుడు, అమ్మోనైహా పట్టణము యొక్క జనుల హృదయములపై సాతాను గొప్ప పట్టు కలిగియుండెను; కావున, వారు ఆల్మా మాటలను ఆలకించకుండిరి.

10 అయినప్పటికీ పట్టణమందున్న జనులపై ఆయన తన ఆత్మను క్రుమ్మరించవలెనని, పశ్చాత్తాపము నిమిత్తము అతడు వారికి బాప్తిస్మమిచ్చునట్లు కూడా ఆయన అనుగ్రహించవలెనని బలమైన ప్రార్థన యందు దేవునితో పెనుగులాడుచూ ఆత్మ యందు ఆల్మా అధికముగా శ్రమపడెను.

11 అయినప్పటికీ, అతనితో ఇట్లు చెప్పుచూ వారు తమ హృదయములను కఠినపరచుకొనిరి: ఇదిగో, నీవు ఆల్మాయని మేమెరుగుదుము; మీ ఆచారములను బట్టి, దేశము యొక్క అనేక భాగముల యందు నీవు స్థాపించియున్న సంఘముపై నీవు ప్రధాన యాజకుడవని మేమెరుగుదుము; మేము మీ సంఘమునకు చెందము మరియు అట్టి మూర్ఖమైన ఆచారముల యందు మేము విశ్వసించము.

12 మేము మీ సంఘమునకు చెందినవారము కానందున, నీవు మాపై ఎట్టి అధికారమును కలిగిలేవని మేమెరుగుదుము; నీవు న్యాయపీఠమును నెఫిహాకు అప్పగించినందున నీవు మాపై ప్రధాన న్యాయాధిపతివి కావు.

13 ఇప్పుడు జనులు ఇలా చెప్పి, అతని మాటలన్నిటికి ఎదురునిలిచి, అతడిని ఎగతాళి చేసి, అతనిపై ఉమ్మివేసి, వారి పట్టణము నుండి అతడు బయటకు గెంటి వేయబడునట్లు చేసినప్పుడు, అతడు అక్కడ నుండి వెడలిపోయి అహరోను అని పిలువబడిన పట్టణము వైపు ప్రయాణించెను.

14 అమ్మోనైహా పట్టణమందున్న జనుల దుష్టత్వమును బట్టి బాధతో కృంగిన వాడై అధిక శ్రమ, మనోవేదనల వలన ప్రయాసపడుచూ అతడు ప్రయాణము చేయుచున్నప్పుడు, ఆల్మా బాధతో ఆ విధముగా కృంగిపోవుచుండగా, ప్రభువు యొక్క దేవదూత అతనికి కనిపించి ఇట్లనెను:

15 ఆల్మా నీవు ధన్యుడవు; కావున నీ తల పైకెత్తి ఆనందించుము, ఏలయనగా ఆనందించుటకు నీవు గొప్ప హేతువు కలిగియున్నావు; ఏలయనగా దేవుని నుండి నీ మొదటి సందేశము పొందినప్పటి నుండి ఆయన ఆజ్ఞలను పాటించుటలో నీవు విశ్వాసముగా ఉన్నావు. ఇదిగో, దానిని నీకు ప్రకటించిన వాడను నేనే.

16 నీవు అమ్మోనైహా పట్టణమునకు తిరిగి వెళ్ళవలెనని, ఆ పట్టణపు జనులకు తిరిగి బోధించవలెనని నిన్ను ఆజ్ఞాపించుటకు నేను పంపబడితిని; కావున వారికి బోధించుము. వారు పశ్చాత్తాపపడని యెడల ప్రభువైన దేవుడు వారిని నాశనము చేయునని వారితో చెప్పుము.

17 ఏలయనగా ఈ సమయమున వారు నీ జనుల స్వాతంత్ర్యమును నాశనము చేయుటకు యోచన చేయుచున్నారు (ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు), అది ఆయన తన జనులకు ఇచ్చిన నియమములు, తీర్పులు మరియు ఆజ్ఞలకు వ్యతిరేకమైయున్నది.

18 ఇప్పుడు, ప్రభువు యొక్క దేవదూత నుండి ఆల్మా తన సందేశమును పొందిన తరువాత, అతడు వేగముగా అమ్మోనైహా దేశమునకు తిరిగి వెళ్ళెను. అతడు ఆ పట్టణమునకు గల మరొక మార్గము, అనగా అమ్మోనైహా పట్టణమునకు దక్షణమున ఉన్న మార్గము ద్వారా ప్రవేశించెను.

19 పట్టణములో ప్రవేశించినప్పుడు అతడు ఆకలిగొని, ఒక మనుష్యునితో ఇట్లనెను: దేవుని యొక్క దీన సేవకునికి తినుటకు నీవేదైనా ఇచ్చెదవా?

20 అప్పుడు ఆ మనుష్యుడు అతనితో ఇట్లనెను: నేను ఒక నీఫైయుడను, నీవు దేవుని యొక్క పరిశుద్ధ ప్రవక్తవని నేనెరుగుదును, ఏలయనగా నీవు ఆదరించవలెనని దర్శనమందు దేవదూత ఎవరిని గూర్చి నాకు చెప్పెనో ఆ మనుష్యుడవు నీవే. కావున, నాతో పాటు నా ఇంటికి రమ్ము, నా ఆహారములో నుండి నేను నీకు పాలుపంచెదను; నీవు నాకు మరియు నా ఇంటికి ఒక ఆశీర్వాదముగా ఉండెదవని నేనెరుగుదును.

21 మరియు ఆ మనుష్యుడు అతడిని తన ఇంటిలో చేర్చుకొనెను; ఆ మనుష్యుడు అమ్యులెక్ అని పిలువబడెను; అతడు, రొట్టె మరియు మాంసము తెచ్చి ఆల్మా ముందు పెట్టెను.

22 ఆల్మా రొట్టెను తిని తృప్తి పొంది, అమ్యులెక్‌ను, అతని ఇంటివారిని ఆశీర్వదించి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను.

23 అతడు తిని, తృప్తి పొందిన తరువాత అమ్యులెక్‌తో ఇట్లనెను: నేను ఆల్మాను, దేశమందంతటా ఉన్న దేవుని యొక్క సంఘముపై ప్రధాన యాజకుడను.

24 బయల్పాటును, ప్రవచనాత్మను బట్టి, ఈ జనులందరి మధ్య దేవుని వాక్యమును బోధించుటకు నేను పిలువబడియున్నాను; నేను ఈ దేశమందు ఉండగా వారు నన్ను చేర్చుకొనలేదు, వారు నన్ను బయటకు త్రోసివేసిరి మరియు నేను ఎన్నడూ ఈ దేశము వైపు రారాదని వెళ్ళిపోబోవుచుంటిని.

25 కానీ, నేను తిరిగి రావలెనని, ఈ జనులకు ప్రవచించవలెనని, వారి దోషముల నిమిత్తము వారికి వ్యతిరేకముగా సాక్ష్యమియ్యవలెనని ఆజ్ఞాపించబడితిని.

26 ఇప్పుడు అమ్యులెక్, నీవు నాకు ఆహారమిచ్చి నన్ను చేర్చుకొంటివి; కావున, నీవు ధన్యుడవు; ఏలయనగా, నేను అనేక దినములు ఉపవాసముంటిని గనుక నేను ఆకలిగొనియుంటిని.

27 మరియు జనులకు బోధించుట ప్రారంభించుటకు ముందు ఆల్మా అనేక దినములు అమ్యులెక్‌తో నివసించెను.

28 జనులు తమ దోషముల యందు అధికముగా విస్తరించిరి.

29 దేవుని వాక్కు ఆల్మాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను: వెళ్ళుము; నా సేవకుడైన అమ్యులెక్‌తో పాటు వెళ్ళి, జనులకు ఈలాగు ప్రవచించుము—మీరు పశ్చాత్తాపపడుడి, ఏలయనగా మీరు పశ్చాత్తాపపడని యెడల, నేను నా కోపముతో ఈ జనులను దర్శించెదనని, నా తీవ్రమైన కోపమునుండి నేను మరలిపోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

30 ఇప్పుడు జనులకు దేవుని వాక్యములను ప్రకటించుటకు ఆల్మా, అమ్యులెక్‌లు వారి మధ్యకు వెళ్ళిరి మరియు వారు పరిశుద్ధాత్మతో నింపబడిరి.

31 వారు చెరసాలలో బంధింపబడలేనంతగా వారికి శక్తి ఇవ్వబడెను; అంతేకాక, ఎవరైనా వారిని సంహరించుట అసాధ్యమైయుండెను; అయినప్పటికీ వారు బంధింపబడి, చెరసాలలో వేయబడు వరకు తమ శక్తిని వారు ఉపయోగించలేదు. ఇప్పుడు వారి యందు ప్రభువు తన శక్తిని చూపగలుగునట్లు ఇది చేయబడెను.

32 వారు వెళ్ళి, ప్రభువు వారికి ఇచ్చిన ఆత్మ మరియు శక్తిని బట్టి జనులకు బోధించుట, ప్రవచించుట మొదలుపెట్టిరి.