లేఖనములు
ఈనస్ 1


ఈనస్ గ్రంథము

1వ అధ్యాయము

ఈనస్ బలముగా ప్రార్థించి, తన పాపక్షమాపణను పొందును—భవిష్యత్తులో లేమనీయుల కొరకు రక్షణను వాగ్దానము చేయుచు ప్రభువు స్వరము అతని మనస్సులోనికి వచ్చును—నీఫైయులు, లేమనీయులను సంస్కరించుటకు ప్రయత్నించిరి—ఈనస్ తన విమోచకుని యందు ఆనందించును. సుమారు క్రీ. పూ. 420 సం.

1 ఈనస్ అను నేను, నా తండ్రి నీతిమంతుడని ఎరిగియుంటిని—ఏలయనగా ఆయన తన భాషలో, ప్రభువు యొక్క శిక్షణలో, ఉపదేశములో నాకు బోధించెను—ఇందు నిమిత్తము నా దేవుని నామము స్తుతించబడును గాక—

2 నా పాపక్షమాపణను పొందకముందు దేవుని యెదుట నేను కలిగియుండిన పెనుగులాటను గూర్చి మీకు చెప్పెదను.

3 నేను అడవులలో మృగములను వేటాడుటకు వెళ్ళితిని; తరచుగా నిత్యజీవము మరియు పరిశుద్ధుల సంతోషమును గూర్చి నా తండ్రి చెప్పగా నేను వినిన మాటలు నా హృదయములో లోతుగా నాటుకున్నవి.

4 నా ఆత్మ ఆకలిగొనెను; నేను నా సృష్టికర్త యెదుట మోకాళ్ళూని నా స్వంత ఆత్మ నిమిత్తము బలమైన ప్రార్థనయందు, విన్నపమందు ఆయనకు మొరపెట్టితిని; దినమంతయు నేను ఆయనకు మొరపెట్టితిని; రాత్రి వచ్చినప్పుడు నేను ఇంకను పరలోకములకు చేరునట్లు నా స్వరమును ఎలుగెత్తితిని.

5 అప్పుడు ఒక స్వరము నాతో ఇట్లనెను: ఈనస్, నీ పాపములు క్షమించబడినవి, నీవు ఆశీర్వదించబడుదువు.

6 ఈనస్ అను నేను, దేవుడు అబద్ధమాడడని ఎరుగుదును; కావున నా అపరాధము తొలగించబడెను.

7 మరియు నేను—ప్రభువా, ఇది ఎట్లు చేయబడెను? అని అంటిని.

8 ఆయన నాతో—నీవు ముందెన్నడూ వినియుండని, చూచియుండని ఆ క్రీస్తు నందున్న నీ విశ్వాసమును బట్టి ఇది చేయబడెను. ఆయన శరీరమునందు తననుతాను ప్రత్యక్షపరచుకొనుటకు ముందు అనేక సంవత్సరములు గడిచిపోవును; కావున వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను.

9 ఇప్పుడు నేను ఈ మాటలను వినినప్పుడు, నా సహోదరులైన నీఫైయుల క్షేమమును అభిలాషించనారంభించితిని; అందువలన, వారి కొరకు నేను నా పూర్ణాత్మతో దేవుడిని వేడుకొంటిని.

10 ఆత్మయందు నేనట్లు ప్రయాసపడుచుండగా, ప్రభువు స్వరము మరలా నా మనస్సులోనికి వచ్చి ఇట్లనెను: నా ఆజ్ఞలను అనుసరించుటలో వారి శ్రద్ధను బట్టి నేను నీ సహోదరులను దర్శించెదను. నేను వారికి ఈ దేశమును ఇచ్చియున్నాను, ఇది ఒక పరిశుద్ధ దేశమైయున్నది; దోషము వలన తప్ప నేను దానిని శపించను; అందువలన, నేను చెప్పినదాని ప్రకారము నీ సహోదరులను దర్శించెదను; వారు దుఃఖించునట్లు వారి అతిక్రమములను వారిపైకి తెచ్చెదను.

11 ఈనస్ అను నేను ఈ మాటలను వినిన తరువాత ప్రభువునందు నా విశ్వాసము నిశ్చలమగుట మొదలాయెను; నా సహోదరులైన లేమనీయుల కొరకు అనేక దీర్ఘ ప్రయాసములతో నేను ఆయనను ప్రార్థించితిని.

12 నేను పూర్ణ శ్రద్ధతో ప్రార్థించి శ్రమపడిన తరువాత, ప్రభువు నాతో ఇట్లనెను: నీ విశ్వాసమును బట్టి నీ కోరికల ప్రకారము నేను నీకు దయచేయుదును.

13 ఇప్పుడు, ఆయన నుండి నేను కోరిన కోరిక ఇదియే—నా జనులైన నీఫైయులు అతిక్రమములో పడి, ఏ కారణము చేతనైనను నాశనము చేయబడి, లేమనీయులు నాశనముకాకుండా ఉన్న యెడల, ప్రభువైన దేవుడు నా జనులైన నీఫైయుల వృత్తాంతమును భద్రపరచవలెను; అది ఆయన పరిశుద్ధ బాహువు యొక్క శక్తి చేత చేయబడినట్లైతే, లేమనీయులు రక్షింపబడునట్లు భవిష్యత్తులో వారి కొరకు అది ముందుకు తేబడవచ్చును.

14 ఏలయనగా ప్రస్తుతము వారిని నిజమైన విశ్వాసమునకు పునఃస్థాపించుటలో మా ప్రయాసములు వ్యర్థమైనవి. సాధ్యమైన యెడల వారు మా వృత్తాంతములను, మమ్ములను, మా పితరుల సమస్త వంశపారంపర్యాచారములను కూడా నాశనము చేయుదుమని తమ ఉగ్రతలో ఒట్టు పెట్టుకొనిరి.

15 అందువలన ప్రభువైన దేవుడు మా వృత్తాంతములను రక్షించుటకు సమర్థుడని ఎరిగియుండి, నేను ఆయనకు నిరంతరము మొరపెట్టితిని, ఏలయనగా ఆయన నాతో ఇట్లు చెప్పియుండెను: క్రీస్తు నామమందు మీరు పొందుదురని నమ్ముచూ విశ్వాసమందు మీరేది అడిగినను దానిని మీరు పొందెదరు.

16 నేను విశ్వాసము కలిగియుండి, వృత్తాంతములను ఆయన రక్షించవలెనని దేవునికి మొరపెట్టితిని; మరియు ఆయన యుక్త కాలములో లేమనీయుల కొరకు వాటిని ముందుకు తెచ్చెదనని ఆయన నాతో నిబంధన చేసెను.

17 ఆయన చేసియున్న నిబంధన ప్రకారమే అది జరుగునని ఈనస్ అను నేను ఎరిగియుంటిని; అందువలన నా ఆత్మ విశ్రమించెను.

18 మరియు ప్రభువు నాతో ఇట్లనెను: నీ పితరులు కూడా నా నుండి ఈ సంగతిని కోరియుండిరి; వారి విశ్వాసమును బట్టి అది వారికి చేయబడును; ఏలయనగా వారి విశ్వాసము నీవంటిదైయుండెను.

19 ఇప్పుడు ఈనస్ అను నేను, రాబోవు విషయములను గూర్చి ప్రవచించుచూ నేను వినియున్న, చూచియున్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చుచూ నీఫై జనుల మధ్య ప్రయాణించితిని.

20 లేమనీయులను దేవునిలో నిజమైన విశ్వాసమునకు పునఃస్థాపించుటకు నీఫై జనులు శ్రద్ధగా ప్రయత్నించిరని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. కానీ మా శ్రమలు వ్యర్థమాయెను; వారి ద్వేషము స్థిరమైనది, వారు తమ దుష్ట స్వభావమును బట్టి క్రూరముగా, భీకరముగా, రక్తపిపాసులుగా, విగ్రహారాధకులుగా మారి మలినత్వముతో నిండియుండిరి; ఇతర జంతువులను చంపి తిను మృగములపై ఆధారపడుచూ గుడారములలో నివసించుచు తమ నడుముల చుట్టూ చిన్న చర్మపు దట్టీ కట్టుకొని, తమ తలలు బోడిచేసుకొని అరణ్యమందు తిరుగులాడుచుండిరి; వారి ప్రావీణ్యము విల్లు నందు, వంపుకత్తియందు, గొడ్డలియందు ఉండెను. వారిలో అనేకులు కేవలము పచ్చిమాంసము తినుచుండిరి; వారు నిరంతరము మమ్ములను నాశనము చేయుటకు ప్రయత్నించుచుండిరి.

21 ఇప్పుడు నీఫై జనులు భూమిని దున్ని అన్నిరకములైన ధాన్యములను, ఫలములను, గొఱ్ఱెల మందలను, అన్నిరకములైన పశువుల మందలను, మేకలను, అడవి మేకలను మరియు అనేక గుఱ్ఱములను కూడా పెంచుచుండిరి.

22 మా మధ్య అనేకమంది ప్రవక్తలుండిరి. మరియు జనులు మెడబిరుసు జనులుగా, గ్రహించలేని జనులుగా ఉండిరి.

23 ప్రభువు యందు భయభక్తులు కలిగియుండునట్లు వారిని నిరంతరము పురికొల్పుటకు అధికమైన కఠినతను ఉపయోగించుట, యుద్ధములు, వివాదములు, నాశనములను గూర్చి వారికి బోధించుట మరియు ప్రవచించుట, నిరంతరము మరణము, అనంత కాలపరిమితి, దేవుని న్యాయతీర్పులు, శక్తి వారికి జ్ఞాపకము చేయబడుట తప్ప మరేదియు చేయబడలేదు. ఇవన్నియూ మరియు అత్యంత సరళమైన భాష తప్ప వేగముగా నాశనము కాకుండా వారిని కాపాడేదేదియు లేదని నేను మీతో చెప్పుచున్నాను. ఈ విధముగా నేను వారిని గూర్చి వ్రాయుచున్నాను.

24 నా దినములలో నేను నీఫైయులకు లేమనీయులకు మధ్య యుద్ధములను చూచితిని.

25 నేను ముసలివాడగుచుంటిని మరియు మా తండ్రి అయిన లీహై యెరూషలేమును వదిలి వచ్చిన సమయము నుండి నూట డెబ్బై తొమ్మిది సంవత్సరములు గడిచిపోయెను.

26 నేను త్వరలో మరణించవలెనని గ్రహించి, నేను ఈ జనులకు బోధించవలెననియు ప్రవచించవలెననియు క్రీస్తు నందున్న సత్యమును బట్టి వాక్యమును ప్రకటించవలెననియు దేవుని శక్తి చేత ప్రభావితము చేయబడిన వాడనైయుండి నా దినములన్నిటిలో నేను దానిని ప్రకటించితిని మరియు లోకవిషయముల కంటే ఎక్కువగా దానియందు ఆనందించితిని.

27 నేను త్వరలో నా విమోచకునితో కూడిన నా విశ్రాంతి స్థలమునకు వెళ్ళుదును; ఏలయనగా ఆయనయందు నేను విశ్రాంతి పొందెదనని నేనెరుగుదును. నా క్షయత అక్షయతను ధరించుకొని ఆయన యెదుట నిలబడు దినమునందు నేను ఆనందించుదును; అప్పుడు నేను ఆయన ముఖమును సంతోషముతో చూచెదను మరియు ఆయన నాతో—ఆశీర్వదింపబడినవాడా నా యొద్దకు రమ్ము, నా తండ్రి ఇంట గల నివాసములలో నీ కొరకు స్థలము సిద్ధపరచబడినది అని చెప్పును. ఆమేన్‌.