లేఖనములు
ఈథర్ 10


10వ అధ్యాయము

ఒక రాజు తరువాత ఇంకొకరు వచ్చును—రాజులలో కొంతమంది నీతిమంతులైయుండిరి; ఇతరులు దుష్టులైయుండిరి—నీతి ప్రబలినప్పుడు జనులు ప్రభువు చేత ఆశీర్వదింపబడి, వర్థిల్లజేయబడిరి.

1 షెజ్ తప్ప, హేత్ మరియు అతని ఇంటి వారందరు కరువు చేత నశించిపోయినందున, హేత్ వంశస్థుడైన షెజ్ తన జనులను తిరిగి బలపరచుట మొదలుపెట్టెను.

2 షెజ్ తన పితరుల నాశనమును జ్ఞాపకము చేసుకొనెను మరియు అతడు నీతిగల రాజ్యమును నిర్మించెను; ఏలయనగా, జెరెడ్‌ మరియు అతని సహోదరుడిని అగాధము మీదుగా తెచ్చుటలో ప్రభువు చేసిన దానిని అతడు జ్ఞాపకము చేసుకొనెను; అతడు ప్రభువు యొక్క మార్గములందు నడిచెను మరియు అతడు కుమారులను, కుమార్తెలను కనెను.

3 షెజ్ అను పేరు గల అతని పెద్ద కుమారుడు అతనికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసెను; అయినప్పటికీ, అధికమైన అతని సంపదలను బట్టి షెజ్ ఒక బందిపోటు చేతిలో చంపబడెను, అది అతని తండ్రికి మరలా శాంతి చేకూర్చెను.

4 అతని తండ్రి దేశమందు అనేక పట్టణములను నిర్మించెను మరియు జనులు తిరిగి దేశమంతటా వ్యాపించుట మొదలుపెట్టిరి. షెజ్ మిక్కిలి వృద్ధుడగు వరకు జీవించెను; అతడు రిప్లాకిష్‌ను కనెను. అతడు మరణించగా, రిప్లాకిష్‌ అతని స్థానములో పరిపాలించెను.

5 రిప్లాకిష్‌ ప్రభువు దృష్టిలో సరియైన దానిని చేయలేదు, ఏలయనగా అతడు అనేకమంది భార్యలను, ఉపపత్నులను కలిగియుండెను మరియు భరించుటకు బాధాకరమైన వాటిని మనుష్యుల భుజములపై మోపెను; అతడు వారికి భారమైన పన్నులు విధించెను మరియు పన్నులతో అతడు అనేక విశాలమైన భవనములను కట్టించెను.

6 అతడు తనకొరకు మిక్కిలి అందమైన సింహాసనమును నిర్మించుకొనెను; అతడు అనేక చెరసాలలను నిర్మించెను మరియు పన్నులకు లోబడియుండని వారిని అతడు చెరసాలలో పడవేసెను; పన్నులు కట్టలేకపోయిన వారిని కూడా అతడు చెరసాలలో వేసెను; వారి ఆధారము కొరకు వారు నిరంతరము పనిచేయునట్లు అతడు చేసెను మరియు పనిచేయుటకు తిరస్కరించిన వారు చంపబడునట్లు చేసెను.

7 కావున అతడు తన శ్రేష్ఠమైన పని అంతటినీ చేయించుకొనెను, అనగా అతని శ్రేష్ఠమైన బంగారము కూడా చెరసాలలో శుద్ధి చేయబడునట్లు చేసెను; శ్రేష్ఠమైన పనితనమంతయు చెరసాలలో చేయబడునట్లు అతడు చేసెను. అతని జారత్వములు మరియు హేయక్రియలతో అతడు జనులను బాధించెను.

8 అతడు నలుబది రెండు సంవత్సరముల పాటు పరిపాలించిన తరువాత, జనులు అతనికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసిరి. మరలా దేశమందు యుద్ధము మొదలాయెను, ఎంతగాననగా రిప్లాకిష్‌ చంపబడి, అతని వంశస్థులు దేశము నుండి బయటకు తరిమివేయబడిరి.

9 అనేక సంవత్సరముల తరువాత మోరియాంటన్‌ (అతడు రిప్లాకిష్‌ యొక్క వంశస్థుడైయుండెను), బహిష్కరించబడిన వారితో ఒక సైన్యమును సమకూర్చి, ముందుకు వెళ్ళి జనులతో యుద్ధము చేసెను; అతడు అనేక పట్టణములపై అధికారము సంపాదించెను; యుద్ధము మిక్కిలి తీవ్రమాయెను మరియు అనేక సంవత్సరముల పాటు కొనసాగెను; అతడు దేశమంతటిపై అధికారము సంపాదించి, తనను రాజుగా స్థాపించుకొనెను.

10 తనను రాజుగా స్థాపించుకొనిన తరువాత అతడు జనుల యొక్క భారములను తేలిక చేసెను, దాని ద్వారా అతడు జనుల కన్నులలో అనుగ్రహము సంపాదించెను మరియు జనులు అతడిని తమ రాజుగా అభిషేకించిరి.

11 జనులకు అతడు న్యాయము జరిగించెను, కానీ అతని అధిక జారత్వమును బట్టి తనకుతాను న్యాయము చేసుకొనలేకపోయెను; అందువలన, అతడు ప్రభువు యొక్క సన్నిధి నుండి కొట్టివేయబడెను.

12 మరియు మోరియాంటన్‌ అనేక పట్టణములను నిర్మించెను; అతని పరిపాలనలో జనులు భవనములు, వెండి బంగారములలో, ధాన్యము పండించుటయందు, మందలు, గుంపులు మరియు వారికి పునఃస్థాపించబడిన అట్టి సంగతులలో మిక్కిలి ధనవంతులైరి.

13 మోరియాంటన్‌ అత్యధిక కాలము జీవించి, కిమ్‌ను కనెను మరియు కిమ్ తన తండ్రి స్థానములో పరిపాలించెను; అతడు ఎనిమిది సంవత్సరములు పరిపాలించిన తరువాత అతని తండ్రి మరణించెను. కిమ్ నీతిగా పరిపాలించనందున, అతడు ప్రభువు చేత అనుగ్రహింపబడలేదు.

14 అతని సహోదరుడు అతనికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి, అతడిని నిర్బంధించెను; అతడు తన దినములన్నియు చెరలో ఉండెను; అతడు చెరలో కుమారులను, కమార్తెలను కనెను; ముసలితనమందు అతడు లేవిని కనిన తరువాత మరణించెను.

15 అతని తండ్రి మరణించిన తరువాత నలుబది రెండు సంవత్సరముల పాటు లేవి దాస్యమందు సేవించెను. అతడు దేశము యొక్క రాజుకు వ్యతిరేకముగా యుద్ధము చేసి, తన కొరకు రాజ్యమును సంపాదించెను.

16 అతడు రాజ్యమును సంపాదించిన తరువాత, ప్రభువు దృష్టిలో సరియైన దానిని చేసెను మరియు జనులు దేశమందు వర్థిల్లిరి; అతడు చాలా వృద్ధుడగు వరకు జీవించి కుమారులను, కుమార్తెలను కనెను; అతడు కొరొమ్‌ను కూడా కనెను మరియు తన స్థానములో అతడిని రాజుగా అభిషేకించెను.

17 కొరొమ్ తన దినములన్నిటా ప్రభువు దృష్టిలో మంచిదైన దానిని చేసెను; అతడు అనేకమంది కుమారులను, కుమార్తెలను కనెను; అతడు చాలాకాలము జీవించిన తరువాత, భూమిపై జీవించిన ఇతరుల వలే అతడు కూడా గతించిపోయెను; అతని స్థానములో కిష్‌ పరిపాలించెను.

18 కిష్‌ కూడా గతించిపోయెను మరియు అతని స్థానములో లిబ్ పరిపాలించెను.

19 లిబ్ కూడా ప్రభువు దృష్టిలో మంచిదైన దానిని చేసెను. లిబ్ యొక్క దినములలో విషసర్పములు నాశనము చేయబడెను. అందువలన దేశ జనుల కొరకు ఆహారమును సంపాదించుటకు వారు దక్షిణము వైపు దేశములోనికి వెళ్ళిరి, ఏలయనగా ఆ దేశము అడవి మృగములతో నిండియుండెను. లిబ్ కూడా గొప్ప వేటగాడాయెను.

20 మరియు సముద్రము దేశమును విభజించు స్థలము ప్రక్కగా, దేశము యొక్క ఇరుకు కంఠస్థలమున వారు ఒక గొప్ప పట్టణమును నిర్మించిరి.

21 వేటాడుటకు ఒక అరణ్యము కొరకు దక్షిణము వైపు దేశమును వారు భద్రపరచిరి. ఉత్తరము వైపు దేశమంతయు నివాసుల చేత నింపబడెను.

22 వారు మిక్కిలి శ్రమజీవులు మరియు లాభము పొందునట్లు వారు కొనుగోళ్ళు, అమ్మకాలు జరిపి, ఒకనితోనొకడు వ్యాపారము చేసిరి.

23 వారు అన్నిరకములైన ముడి లోహములతో పని చేసిరి; వారు బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి మరియు అన్ని రకములైన లోహములను చేసిరి; వారు భూమి నుండి వాటిని త్రవ్వితీసిరి; అందువలన బంగారము, వెండి, ఇనుము మరియు రాగి యొక్క ముడి లోహమును సంపాదించుటకు వారు పెద్ద మట్టికుప్పలను పేర్చిరి. వారు అన్ని రకములైన శ్రేష్ఠమైన పనులు చేసిరి.

24 వారు పట్టు వస్త్రములను మరియు శ్రేష్ఠముగా నేయబడిన వస్త్రములను కలిగియుండిరి; తమ దిగంబరత్వమును వస్త్రముతో కప్పుకొనునట్లు, వారు అన్ని రకములైన వస్త్రములను తయారుచేసిరి.

25 వారు భూమిని సాగు చేయుటకు, దున్నుటకు, విత్తుటకు, కోయుటకు, కలుపు తీయుటకు మరియు కుప్పనూర్చుటకు కూడా కావలసిన అన్నిరకముల పనిముట్లు తయారుచేసిరి.

26 మరియు వారి జంతువులతో పనిచేయించుటకు వారికి కావలసిన సకల విధముల పనిముట్లు తయారుచేసిరి.

27 వారు అన్నిరకముల యుద్ధ ఆయుధములను తయారుచేసిరి. మరియు మిక్కిలి వింతైన పనితనము గల సమస్త విధముల పనులు వారు చేసిరి.

28 వారి కంటే అధికముగా ఆశీర్వదింపబడిన వారు మరియు ప్రభువు యొక్క హస్తము చేత అధికముగా వర్థిల్లజేయబడిన జనులు ఎన్నడూ ఉండజాలరు. వారు సమస్త దేశములను మించిన శ్రేష్ఠమైన దేశములో ఉండిరి, ఏలయనగా ప్రభువు దానిని పలికెను.

29 మరియు లిబ్ అనేక సంవత్సరములు జీవించి కుమారులను, కుమార్తెలను కనెను; అతడు హర్తోమ్‌ను కూడా కనెను.

30 హర్తోమ్, తన తండ్రి స్థానములో పరిపాలించెను. హర్తోమ్ ఇరువది నాలుగు సంవత్సరములు పరిపాలించిన తరువాత, రాజ్యము అతని నుండి తీసివేయబడెను. అతడు అనేక సంవత్సరములు, అనగా అతని శేష దినములన్నియు కూడా దాస్యమందు సేవించెను.

31 అతడు హేత్‌ను కనెను మరియు హేత్ తన దినములన్నియు దాస్యమందు జీవించెను. హేత్, అహరోనును కనెను మరియు అహరోను తన దినములన్నియు దాస్యమందు జీవించెను; అతడు అమ్నిగద్దాను కనెను మరియు అమ్నిగద్దా కూడా అతని దినములన్నియు దాస్యమందు జీవించెను; అతడు కోరియాంటమ్‌ను కనెను మరియు కోరియాంటమ్ తన దినములన్నియు దాస్యమందు జీవించెను; అతడు కోమ్‌ను కనెను.

32 మరియు కోమ్, రాజ్యములో సగభాగమును నడిపించి వేసెను. అతడు రాజ్యము యొక్క సగభాగముపై నలుబది రెండు సంవత్సరములు పరిపాలించెను; అతడు, రాజైన అమ్గిద్‌కు వ్యతిరేకముగా యుద్ధమునకు వెళ్ళెను మరియు వారు అనేక సంవత్సరముల పాటు పోరాడిరి; ఆ సమయమందు కోమ్, అమ్గిద్‌పై జయముపొంది, రాజ్యము యొక్క మిగిలిన భాగముపై అధికారము సంపాదించెను.

33 కోమ్ యొక్క దినములలో దేశమందు బందిపోట్లు ఉండుట మొదలాయెను; వారు పాత ప్రణాళికలను స్వీకరించి, ప్రాచీన కాలపు వారివలె ప్రమాణములు చేసిరి మరియు రాజ్యమును తిరిగి నాశనము చేయజూచిరి.

34 ఇప్పుడు వారికి వ్యతిరేకముగా కోమ్ అధికముగా పోరాడెను; అయినప్పటికీ, అతడు వారిపై గెలువలేకపోయెను.