లేఖనములు
ఈథర్ 12


12వ అధ్యాయము

దేవునియందు విశ్వసించమని ప్రవక్తయైన ఈథర్‌ జనులకు ఉద్భోధించును—విశ్వాసము ద్వారా చేయబడిన ఆశ్చర్యకార్యములను, అద్భుతకార్యములను మొరోనై చెప్పును—విశ్వాసము, జెరెడ్‌ యొక్క సహోదరుడు క్రీస్తును చూడగలుగునట్లు చేసెను—మనుష్యులు వినయము కలిగియుండునట్లు ప్రభువు వారికి బలహీనతనిచ్చును—విశ్వాసము ద్వారా జెరెడ్‌ యొక్క సహోదరుడు జెరిన్‌ కొండను కదిలించెను—రక్షణ కొరకు విశ్వాసము, నిరీక్షణ మరియు దాతృత్వము ఆవశ్యకము—మొరోనై, యేసును ముఖాముఖిగా చూచెను.

1 ఈథర్‌ యొక్క దినములు కోరియాంటమర్‌ యొక్క దినములందు ఉండెను; మరియు కోరియాంటమర్‌ దేశమంతటిపై రాజుగా ఉండెను.

2 ఈథర్‌ ప్రభువు యొక్క ప్రవక్తయైయుండెను; అందువలన ఈథర్‌, కోరియాంటమర్‌ యొక్క దినములందు వచ్చి జనులకు ప్రవచించుట ప్రారంభించెను, ఏలయనగా అతనిలోనున్న ప్రభువు యొక్క ఆత్మను బట్టి అతడు నిలువరించబడలేకపోయెను.

3 విశ్వాసము ద్వారా అన్ని సంగతులు నెరవేర్చబడునని వారికి చెప్పుచూ పశ్చాత్తాపము నిమిత్తము దేవునియందు విశ్వసించవలెనని, లేని యెడల వారు నాశనము చేయబడుదురని జనులకు ఉద్భోధించుచూ అతడు ఉదయమునుండి సూర్యుడు అస్తమించు వరకు ప్రకటించెను—

4 అందువలన దేవుని యందు విశ్వాసముంచు వాడెవడైనను నిశ్చయముగా మేలైన లోకము కొరకు, అనగా దేవుని యొక్క కుడిచేతి వైపున ఒక స్థలము కొరకు నిరీక్షించును; ఆ నిరీక్షణ విశ్వాసమును బట్టి వచ్చును, అది మనుష్యుల ఆత్మలకు ఒక లంగరు వంటిది, అది నిశ్చయముగా నిలకడగా ఎల్లప్పుడు సత్‌క్రియలలో వృద్ధి పొందుచూ దేవుడిని మహిమపరచుటకు వారు నడిపింపబడునట్లు చేయును.

5 ఈథర్‌ గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులను జనులకు ప్రవచించెను, అయితే వాటిని చూడనందున వారు విశ్వసించలేదు.

6 ఇప్పుడు మొరోనై అను నేను, ఈ సంగతులను గూర్చి కొంత మాట్లాడెదను; విశ్వాసమనగా నిరీక్షింపబడిన మరియు అదృశ్యమైన సంగతులు ఉన్నవనుట అని నేను లోకమునకు చూపెదను; అందువలన, మీరు చూడనందున వాదములాడవద్దు; ఏలయనగా, మీ విశ్వాసము పరీక్షించబడు వరకు మీరు ఎట్టి సాక్ష్యమును పొందరు.

7 క్రీస్తు మృతులలో నుండి లేచిన తరువాత, మన పితరులకు తనను కనబరచుకొనినది విశ్వాసము ద్వారానైయున్నది; వారు ఆయనయందు విశ్వాసము కలిగియుండు వరకు, ఆయన తనను వారికి కనబరచుకొనలేదు; అందువలన కొంతమంది ఆయనయందు తప్పక విశ్వాసము కలిగియుండవలెను, ఏలయనగా ఆయన లోకమునకు తనను కనబరచుకొనలేదు.

8 కానీ మనుష్యుల విశ్వాసమును బట్టి ఆయన తనను లోకమునకు కనబరచుకొనెను మరియు తండ్రి యొక్క నామమును మహిమపరచెను, తద్వారా వారు చూచియుండని ఆ సంగతుల కొరకు వారు నిరీక్షించునట్లు, ఇతరులు పరలోకపు బహుమానమందు పాలిభాగస్థులగునట్లు ఒక మార్గమును సిద్ధపరిచెను.

9 అందువలన, మీరు కేవలము విశ్వాసము కలిగియున్న యెడల, మీరు నిరీక్షణ కూడా కలిగియుండెదరు మరియు బహుమానమందు పాలిభాగస్థులగుదురు.

10 ఇదిగో, విశ్వాసము ద్వారానే ప్రాచీన కాలపు జనులు దేవుని యొక్క పరిశుద్ధ క్రమము చొప్పున పిలువబడిరి.

11 అందువలన, విశ్వాసము ద్వారా మోషే ధర్మశాస్త్రము ఇవ్వబడినది. కానీ, ఆయన కుమారుని యొక్క బహుమానమందు దేవుడు అధిక శ్రేష్ఠమైన మార్గమును సిద్ధపరచియున్నాడు మరియు దాని నేరవేర్పు విశ్వాసము ద్వారానైయున్నది.

12 ఏలయనగా, నరుల సంతానమునకు విశ్వాసము లేని యెడల, దేవుడు వారి మధ్య ఏ అద్భుతమును చేయలేడు; కావున, వారు విశ్వాసమును సాధన చేయు వరకు ఆయన తనను కనబరచుకొనలేదు.

13 ఇదిగో, చెరసాల నేలకూలునట్లు చేసినది ఆల్మా మరియు అమ్యులెక్ యొక్క విశ్వాసమే.

14 లేమనీయులు అగ్నితోను, పరిశుద్ధాత్మతోను బాప్తిస్మము పొందునట్లు వారిలో మార్పు తెచ్చినది నీఫై మరియు లీహై యొక్క విశ్వాసమే.

15 లేమనీయుల మధ్య అంత గొప్పదైన అద్భుతము జరిగించినది అమ్మోన్‌ మరియు అతని సహోదరుల యొక్క విశ్వాసమే.

16 ముఖ్యముగా, అద్భుతములు చేసిన వారందరు కూడా వాటిని విశ్వాసము ద్వారానే చేసిరి, క్రీస్తుకు ముందున్న వారు మరియు తరువాత ఉన్నవారు కూడా.

17 ముగ్గురు శిష్యులు మరణమును రుచి చూడకూడదను వాగ్దానమును పొందినది కూడా విశ్వాసము ద్వారానైయున్నది; మరియు వారు విశ్వాసమును సాధన చేయు వరకు వారు ఆ వాగ్దానమును పొందలేదు.

18 ఏ సమయమందైనను, ఎవరైనను వారి విశ్వాసమును సాధన చేయు వరకు అద్భుతములను చేయలేదు; అందువలన, వారు మొదట దేవుని కుమారునియందు విశ్వాసముంచిరి.

19 క్రీస్తు వచ్చుటకు ముందు కూడా మిక్కిలి దృఢమైన విశ్వాసము గలవారు అనేకులుండిరి; వారు తెర లోపలివి చూడకుండా ఉంచబడలేకపోయిరి, కావున విశ్వాసపు కంటితో చూచిన దానిని వారు తమ కన్నులతో యథార్థముగా చూచి సంతోషించిరి.

20 జెరెడ్‌ యొక్క సహోదరుడు వీరిలో ఒకడని ఈ గ్రంథమందు మనము చూచియున్నాము; ఏలయనగా దేవునియందు అతని విశ్వాసము ఎంత గొప్పదనగా, విశ్వాసము ద్వారా అతడు పొందిన వాక్యము మరియు ఆయన అతనితో పలికిన వాక్యమును బట్టి, దేవుడు తన వ్రేలిని ముందుకు చాచినపుడు జెరెడ్‌ యొక్క సహోదరుని దృష్టి నుండి ఆయన దానిని దాచలేకపోయెను.

21 విశ్వాసము ద్వారా జెరెడ్‌ యొక్క సహోదరుడు పొందిన వాగ్దానమును బట్టి ప్రభువు వ్రేలిని జెరెడ్‌ యొక్క సహోదరుడు చూచిన తరువాత, అతని దృష్టి నుండి ప్రభువు దేనినీ దాచలేకపోయెను; అందువలన, ఆయన అతనికి అన్ని సంగతులను చూపెను, ఏలయనగా అతడు ఇకపై తెర వెలుపల ఉంచబడలేకపోయెను.

22 మరియు ఈ సంగతులు అన్యజనుల ద్వారా వారి సహోదరుల యొద్దకు రావలెనని నా పితరులు వాగ్దానము పొందినది విశ్వాసము ద్వారానైయున్నది; కావున ప్రభువైన యేసు క్రీస్తు కూడా నన్ను ఆజ్ఞాపించియున్నాడు.

23 మరియు నేను ఆయనకు ఇట్లు చెప్పితిని: ప్రభువా, వ్రాయుటలో మా బలహీనతను బట్టి అన్యజనులు ఈ సంగతులను గూర్చి ఎగతాళి చేయుదురు; ఏలయనగా ప్రభువా, నీవు మమ్ములను విశ్వాసము ద్వారా వాక్యమందు బలవంతులను చేసియున్నావు, కానీ వ్రాయుటలో మమ్ములను బలవంతులను చేయలేదు; వారికి ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి ఈ జనులందరు అధికముగా మాట్లాడగలుగునట్లు నీవు చేసియున్నావు;

24 మా చేతుల యొక్క మొరటుతనమును బట్టి మేము కొంచెము మాత్రమే వ్రాయగలుగునట్లు నీవు చేసియున్నావు. ఇదిగో, నీవు మమ్ములను జెరెడ్‌ యొక్క సహోదరునివలే వ్రాయుటలో బలముగా చేయలేదు, ఏలయనగా నీవున్నట్లే అతడు వ్రాసిన సంగతులు కూడా శక్తివంతముగా ఉండి, వాటిని చదువుటకు మనుష్యుడు బలవంతము చేయబడునట్లు నీవు చేసియున్నావు.

25 మేము వాటిని వ్రాయలేకపోవునట్లు నీవు మా మాటలను కూడా శక్తివంతముగా, గొప్పవిగా చేసియున్నావు; అందువలన మేము వ్రాయునప్పుడు, మేము మా బలహీనతను చూచెదము మరియు మా మాటల యొక్క ఉపయోగమును బట్టి పొరపాటు చేయుదుము; కావున, అన్యజనులు మా మాటలను ఎగతాళి చేయుదురేమోయని నేను భయపడుచున్నాను.

26 మరియు నేనిట్లు చెప్పినప్పుడు, ప్రభువు ఇట్లనుచూ నాతో మాట్లాడెను: మూర్ఖులు ఎగతాళి చేయుదురు, కానీ వారు దుఃఖించెదరు; మీ బలహీనతను వారి ప్రయోజనము కొరకు ఉపయోగించుకొనకుండునట్లు సాత్వీకులకు నా కృప చాలును;

27 మనుష్యులు నా యొద్దకు వచ్చిన యెడల, నేను వారికి వారి బలహీనతను చూపెదను. వారు వినయము కలిగియుండునట్లు నేను మనుష్యులకు బలహీనతనిచ్చెదను; నా యెదుట తమను తగ్గించుకొను మనుష్యులందరి కొరకు నా కృప చాలును; ఏలయనగా, నా యెదుట వారు తమను తగ్గించుకొని, నా యందు విశ్వసించిన యెడల, అప్పుడు నేను బలహీనమైన సంగతులను వారి కొరకు బలమైనవిగా చేయుదును.

28 ఇదిగో, నేను అన్యజనులకు వారి బలహీనతను చూపెదను మరియు విశ్వాసము, నిరీక్షణ, దాతృత్వములు సమస్త నీతి యొక్క ఊటయైన నా యొద్దకు తెచ్చునని నేను వారికి చూపెదను.

29 మరియు మొరోనై అను నేను, ఈ మాటలను విని ఆదరింపబడి, ఇట్లంటిని: ఓ ప్రభువా, నీ నీతివంతమైన చిత్తము జరుగును గాక, ఏలయనగా వారి విశ్వాసమును బట్టి నీవు నరుల సంతానముతో వ్యవహరించెదవని నేనెరుగుదును.

30 తొలగింపబడుమని జెరిన్‌ పర్వతముతో జెరెడ్‌ యొక్క సహోదరుడు చెప్పగా, అది తొలగింపబడెను. అతనికి విశ్వాసము లేకున్న యెడల, అది కదిలియుండెడిది కాదు; అందువలన, మనుష్యులు విశ్వాసమును సాధన చేసిన తరువాతే నీవు పని చేయుదువు.

31 ఆ విధముగానే నిన్ను నీవు, నీ శిష్యులకు ప్రత్యక్షపరచుకొంటివి; ఏలయనగా, వారు విశ్వాసము కలిగియుండి నీ నామమందు మాట్లాడిన తరువాత, నిన్ను నీవు గొప్ప శక్తితో వారికి కనబరచుకొంటివి.

32 నీ తండ్రి నివాసముల మధ్య మనుష్యుని కొరకు స్థలము సిద్ధపరచితివని, దానిలో మనుష్యుడు అధిక శ్రేష్ఠమైన నిరీక్షణ కలిగియుండునని నీవు చెప్పితివని నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను; అందువలన మనుష్యుడు నిరీక్షణ కలిగియుండవలెను, లేని యెడల నీవు సిద్ధపరచిన స్థలమందు అతడు స్వాస్థ్యము పొందలేడు.

33 మరలా నరుల సంతానము కొరకు ఒక స్థలమును సిద్ధపరచుటకు, నీవు తిరిగి తీసుకొనునట్లు లోకము కొరకు నీ ప్రాణమును పణంగా పెట్టునంతగా కూడా నీవు లోకమును ప్రేమించియున్నావని నీవు చెప్పితివని నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను.

34 ఇప్పుడు, నరుల సంతానము కొరకు నీవు కలిగియున్న ఈ ప్రేమయే దాతృత్వమైయున్నదని నేనెరుగుదును; అందువలన మనుష్యులు దాతృత్వము కలిగియుండని యెడల, నీ తండ్రి యొక్క నివాసములందు నీవు సిద్ధము చేసిన స్థలమును వారు స్వాస్థ్యముగా పొందలేరు.

35 కావున, మా బలహీనతను బట్టి ఒకవేళ అన్యజనులు దాతృత్వము చూపని యెడల, నీవు వారిని పరీక్షించెదవని మరియు వారి తలాంతును, వారు పొందిన దానిని కూడా తీసివేసి, సమృద్ధిగా కలిగిన వారికి ఇచ్చెదవని నీవు చెప్పిన ఈ విషయమును బట్టి నేనెరుగుదును.

36 మరియు వారు దాతృత్వము కలిగియుండునట్లు ఆయన అన్యజనుల పట్ల కృప చూపవలెనని నేను ప్రభువుకు ప్రార్థన చేసితిని.

37 అంతట ప్రభువు నాతో ఇట్లనెను: వారు దాతృత్వము కలిగియుండని యెడల, అది నీ తప్పు కాదు; నీవు విశ్వాసము కలిగియున్నందున, నీ వస్త్రములు శుద్ధి చేయబడును. నీవు నీ బలహీనతను చూచియున్నావు, కావున నా తండ్రి యొక్క నివాసములందు నేను సిద్ధము చేసిన స్థలమందు కూర్చుండునంతగా నీవు బలవంతునిగా చేయబడుదువు.

38 ఇప్పుడు మొరోనై అను నేను, క్రీస్తు యొక్క న్యాయపీఠము యెదుట మనము కలుసుకొను వరకు అన్యజనులకు మరియు నేను ప్రేమించు నా సహోదరులకు కూడా వీడ్కోలు పలుకుచున్నాను, అక్కడ మనుష్యులందరు నా వస్త్రములు మీ రక్తముతో మలినము కాలేదని తెలుసుకొనెదరు.

39 అప్పుడు, నేను యేసును చూచియున్నానని, ఆయన నాతో ముఖాముఖిగా మాట్లాడియున్నాడని, ఈ సంగతులను గూర్చి నా స్వంత భాషలో ఒక మనుష్యుడు ఇంకొకనితో చెప్పునట్లుగా కూడా స్పష్టమైన వినయముతో ఆయన నాకు చెప్పియున్నాడని మీరు తెలుసుకొందురు.

40 మరియు వ్రాయుటలో నా బలహీనతను బట్టి, నేను కొంచెము మాత్రమే వ్రాసియున్నాను.

41 ఇప్పుడు తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు మరియు వారిని గూర్చి సాక్ష్యమిచ్చు పరిశుద్ధాత్మ యొక్క కృప నిరంతరము మీ యందు నిలిచియుండునట్లు, ఎవరిని గూర్చి ప్రవక్తలు మరియు అపొస్తలులు వ్రాసియుండిరో, ఆ యేసును వెదకమని నేను మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమేన్‌.