లేఖనములు
ఈథర్ 13


13వ అధ్యాయము

యోసేపు సంతానము ద్వారా అమెరికాలో నిర్మించబడవలసిన క్రొత్త యెరూషలేమును గూర్చి ఈథర్‌ చెప్పును—అతడు ప్రవచించును, బయటకు త్రోసివేయబడును, జెరెడీయుల చరిత్రను వ్రాయును మరియు జెరెడీయుల నాశనమును ముందుగా చెప్పును—దేశమంతటా యుద్ధము తీవ్రమగును.

1 ఇప్పుడు మొరోనై అను నేను ఎవరిని గూర్చి వ్రాయుచున్నానో, ఆ జనుల యొక్క నాశనమును గూర్చి నా వృత్తాంతమును ముగించుటకు సాగుచున్నాను.

2 ఇదిగో, వారు ఈథర్‌ మాటలన్నిటిని తిరస్కరించిరి; ఏలయనగా, అతడు వారికి నిజముగా మనుష్యుని యొక్క ఆరంభము నుండి అన్ని సంగతులను చెప్పెను; ఈ దేశము పైనుండి జలములు వెనుకకు పోయిన తరువాత, అది ఇతర దేశములన్నిటి కంటే శ్రేష్ఠమైన దేశముగా, ప్రభువుచేత ఎన్నుకొనబడిన దేశముగా ఆయెనని, అందువలన దానియందు నివసించు మనుష్యులందరు ఆయనను సేవించవలెనని ప్రభువు కోరుచున్నాడని;

3 అది పరలోకము నుండి దిగిరావలసిన నూతన యెరూషలేము యొక్క స్థలమని మరియు ప్రభువు యొక్క పరిశుద్ధ ఆలయమైయున్నదని చెప్పెను.

4 ఈథర్‌, క్రీస్తు యొక్క దినములను చూచెను మరియు ఈ దేశమందు ఒక నూతన యెరూషలేమును గూర్చి అతడు చెప్పెను.

5 అతడు ఇశ్రాయేలు వంశమును గూర్చి మరియు లీహై ఎక్కడి నుండి రావలెనో, ఆ యెరూషలేమును గూర్చి—అది నాశనము చేయబడిన తరువాత, అది ప్రభువుకు ఒక పరిశుద్ధ పట్టణముగా తిరిగి నిర్మించబడవలెనని కూడా చెప్పెను; అందువలన అది నూతన యెరూషలేము కాదు, ఏలయనగా అది ప్రాచీన కాలమందు ఉండెను; కానీ, అది తిరిగి నిర్మించబడవలెను మరియు ప్రభువు యొక్క పరిశుద్ధ పట్టణము కావలెను; అది ఇశ్రాయేలు యొక్క వంశము కొరకు నిర్మించబడవలెను—

6 యోసేపు సంతానము యొక్క శేషము కొరకు ఈ దేశమందు ఒక నూతన యెరూషలేము నిర్మించబడవలెను మరియు ఆ సంగతుల కొరకు ఒక నమూనా ఉండెను.

7 ఏలయనగా, యోసేపు తన తండ్రిని ఐగుప్తు దేశములోనికి తీసుకువచ్చెను మరియు అతడు అక్కడ మరణించెను; అందువలన, అతడు నశించకుండునట్లు యోసేపు తండ్రిపట్ల ఆయన కనికరము కలిగియున్నట్లే, వారు కూడా నశించిపోకుండునట్లు ఆయన యోసేపు సంతానముపట్ల కనికరము కలిగియుండునట్లు, ప్రభువు యోసేపు సంతానము యొక్క శేషమును యెరూషలేము దేశము నుండి బయటకు తీసుకువచ్చెను.

8 కావున, యోసేపు వంశము యొక్క శేషము ఈ దేశమందు స్థాపించబడును మరియు అది వారి స్వాస్థ్యమైన దేశమగును; వారు ప్రాచీన కాలపు యెరూషలేమువలే ప్రభువుకు ఒక పరిశుద్ధ పట్టణమును నిర్మించెదరు మరియు భూమి గతించిపోయి అంతము వచ్చు వరకు వారిక ఏ మాత్రము ఉనికిని కోల్పోరు.

9 అక్కడ ఒక క్రొత్త పరలోకము మరియు ఒక క్రొత్త భూమి ఉండును; పాతవి గతించిపోయి, అన్ని విషయములు క్రొత్తవైనప్పటికీ అవి పాత వాటి వలే ఉండును.

10 అప్పుడు, క్రొత్త యెరూషలేము వచ్చును మరియు దానిలో నివసించు వారు ధన్యులు, ఏలయనగా వారు గొఱ్ఱెపిల్ల యొక్క రక్తము ద్వారా తమ వస్త్రములు తెల్లగా చేయబడిన వారు మరియు ఇశ్రాయేలు వంశము వారైన యోసేపు సంతానము యొక్క శేషము మధ్య లెక్కింపబడు వారు.

11 అప్పుడు, ప్రాచీన కాలపు యెరూషలేము కూడా వచ్చును మరియు దాని నివాసులు ధన్యులు, ఏలయనగా వారు గొఱ్ఱెపిల్ల యొక్క రక్తమందు కడుగబడియున్నారు; మరియు వారు చెదరగొట్టబడి, భూమి యొక్క నాలుగు మూలలనుండి ఉత్తరపు దేశముల నుండి సమకూర్చబడి, వారి తండ్రియైన అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన యొక్క నెరవేర్పునందు పాలి భాగస్థులైయున్నారు.

12 ఈ సంగతులు వచ్చినప్పుడు, మొదటి వారైయుండి కడపటి వారైన వారు ఉండిరి మరియు కడపటి వారైయుండి మొదటి వారైన వారు ఉండిరి అని చెప్పు లేఖనము నెరవేరును.

13 మరియు నేనింకను వ్రాయబోతిని, కానీ నేను నిషేధింపబడితిని; అయితే, ఈథర్‌ యొక్క ప్రవచనములు గొప్పవి మరియు ఆశ్చర్యకరమైనవి; కానీ, వారతడిని పనికిరాని వానిగా యెంచి, బయటకు త్రోసివేసిరి; అతడు పగటియందు ఒక బండ యొక్క సందులో తనను దాచుకొనెను మరియు రాత్రియందు, జనులపై రావలసిన సంగతులను చూచుచూ ముందుకు వెళ్ళెను.

14 అతడు ఒక బండ యొక్క సందులో నివసించుచుండగా, రాత్రియందు జనులపై వచ్చిన నాశనములను చూచుచూ అతడు ఈ వృత్తాంతము యొక్క శేషమును వ్రాసెను.

15 అతడు జనుల మధ్య నుండి బయటకు త్రోసివేయబడిన సంవత్సరమందే, జనుల మధ్య గొప్ప యుద్ధముండెను. ఏలయనగా, బలమైన మనుష్యులనేకులు ముందుకు వచ్చి, మొరోనై చేత చెప్పబడిన వారి దుష్ట రహస్య ప్రణాళికల ద్వారా కోరియాంటమర్‌ను నాశనము చేయుటకు కోరిరి.

16 ఇప్పుడు, కోరియాంటమర్‌ సమస్త యుద్ధకళలను, లోకము యొక్క సమస్త కపటత్వమును అభ్యసించియుండెను, అందువలన అతడిని నాశనము చేయగోరిన వారితో అతడు యుద్ధము చేసెను.

17 కానీ అతడు లేదా అతని అందమైన కుమారులు, కుమార్తెలు లేదా కొహోర్‌ యొక్క అందమైన కుమారులు, కుమార్తెలు లేదా కొరిహోర్‌ యొక్క అందమైన కుమారులు, కుమార్తెలు పశ్చాత్తాపపడలేదు. క్లుప్తముగా, భూముఖమంతటిపైనున్న అందమైన కుమారులు మరియు కుమార్తెలలో ఎవరూ వారి పాపముల విషయమై పశ్చాత్తాపపడలేదు.

18 అందువలన ఈథర్‌ ఒక బండ యొక్క సందులో నివసించిన మొదటి సంవత్సరమందు, వారు రాజ్యమును పొందునట్లు, కోరియాంటమర్‌కు వ్యతిరేకముగా పోరాడుచున్న ఆ రహస్యకూడికల యొక్క ఖడ్గము ద్వారా సంహరింపబడిన జనులు అనేకులుండిరి.

19 కోరియాంటమర్‌ యొక్క కుమారులు అధికముగా పోరాడి, అధికముగా రక్తము కార్చిరి.

20 రెండవ సంవత్సరమందు అతడు వెళ్ళి, కోరియాంటమర్‌కు ఈ విధముగా ప్రవచించవలెనని ప్రభువు యొక్క వాక్యము ఈథర్‌కు వచ్చెను: అతడు, అతని కుటుంబమంతయు పశ్చాత్తాపపడిన యెడల, ప్రభువు అతని రాజ్యమును అతనికిచ్చును మరియు జనులను విడిచిపెట్టును—

21 లేని యెడల, అతడు తప్ప అతని కుటుంబమంతయు నాశనము చేయబడును. వేరొక జనులు దేశమును వారి స్వాస్థ్యముగా పొందుటను గూర్చి చెప్పబడిన ప్రవచనముల యొక్క నెరవేర్పును చూచుటకే అతడు జీవించును మరియు కోరియాంటమర్‌ వారి చేత సమాధి చేయబడును; కోరియాంటమర్‌ తప్ప, ప్రతి ఆత్మ నాశనము చేయబడును.

22 కోరియాంటమర్‌ లేదా అతని ఇంటి వారు లేదా జనులు పశ్చాత్తాపపడలేదు మరియు యుద్ధములు ఆగలేదు; వారు ఈథర్‌ను చంపజూచిరి, కానీ అతడు వారి యెదుట నుండి పారిపోయి బండ యొక్క సందులో తిరిగి దాగుకొనెను.

23 అప్పుడు షారెద్‌ వచ్చి, కోరియాంటమర్‌తో యుద్ధము చేసి, అతడిని ఓడించెను; ఎంతగాననగా మూడవ సంవత్సరమందు అతడు, అతడిని దాస్యములోనికి తెచ్చెను.

24 మరియు నాలుగవ సంవత్సరమందు కోరియాంటమర్‌ యొక్క కుమారులు షారెద్‌ను ఓడించి, రాజ్యమును తమ తండ్రికి తిరిగి అప్పగించిరి.

25 ఇప్పుడు ప్రతి మనుష్యుడు తన ముఠాతో అతడు కోరిన దాని కొరకు పోరాడుచూ, దేశమంతటా యుద్ధము మొదలాయెను.

26 అక్కడ బందిపోటు దొంగలుండిరి మరియు క్లుప్తముగా, భూముఖమంతటా సమస్త విధమైన దుష్టత్వముండెను.

27 కోరియాంటమర్‌, షారెద్‌తో మిక్కిలి కోపముగా నుండి తన సైన్యములతో అతనికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు వెళ్ళెను; వారు మిక్కిలి కోపమందు గిల్గాల్ యొక్క లోయలో కలుసుకొనిరి మరియు యుద్ధము మిక్కిలి తీవ్రమాయెను.

28 షారెద్‌ అతనికి వ్యతిరేకముగా మూడు దినముల పాటు పోరాడెను. కోరియాంటమర్‌ అతడిని ఓడించి, అతడు హెష్లోను యొక్క మైదానములకు వచ్చువరకు అతడిని తరిమెను.

29 మరలా మైదానముల మీద షారెద్‌ అతనితో యుద్ధము చేసెను; అతడు కోరియాంటమర్‌ను ఓడించి, గిల్గాల్ లోయవరకు అతడిని తరిమివేసెను.

30 మరలా కోరియాంటమర్‌ గిల్గాల్ యొక్క లోయలో షారెద్‌తో యుద్ధము చేసెను, దానిలో అతడు షారెద్‌ను ఓడించి, అతడిని సంహరించెను.

31 షారెద్‌, కోరియాంటమర్‌ను అతని తొడపై గాయపరచగా, అతడు రెండు సంవత్సరముల పాటు తిరిగి యుద్ధమునకు వెళ్ళలేదు; ఆ సమయమందు దేశమందున్న జనులందరు రక్తము చిందించుచుండిరి మరియు వారిని ఆపువాడెవడూ లేకుండెను.