లేఖనములు
ఈథర్ 4


4వ అధ్యాయము

జెరెడ్‌ యొక్క సహోదరుని వ్రాతలను ముద్ర వేయవలెనని మొరోనై ఆజ్ఞాపించబడెను—జెరెడ్‌ యొక్క సహోదరునివలే మనుష్యులు విశ్వాసము కలిగియుండు వరకు అవి బయలుపరచబడవు—ఆయన మాటలను మరియు ఆయన శిష్యుల మాటలను విశ్వసించమని క్రీస్తు మనుష్యులను ఆజ్ఞాపించును—పశ్చాత్తాపపడి, సువార్తను విశ్వసించి, రక్షింపబడుటకు మనుష్యులు ఆజ్ఞాపించబడిరి.

1 కొండ మీద ప్రభువు యొక్క సన్నిధి నుండి క్రిందికి వెళ్ళి, అతడు చూచిన సంగతులను వ్రాయవలెనని ప్రభువు జెరెడ్‌ యొక్క సహోదరుడిని ఆజ్ఞాపించెను; ఆయన సిలువపైన పైకెత్తబడునంత వరకు నరుల సంతానము యొద్దకు రాకుండా అవి నిషేధింపబడెను; ఈ హేతువు నిమిత్తము క్రీస్తు తననుతాను తన జనులకు కనబరచుకొనునంత వరకు అవి లోకములోనికి రాకూడదని రాజైన మోషైయ వాటిని భద్రపరిచెను.

2 మరియు క్రీస్తు తననుతాను తన జనులకు నిజముగా కనబరచుకొనిన తరువాత అవి చూపబడవలెనని ఆయన ఆజ్ఞాపించెను.

3 దాని తరువాత, వారందరూ తమ విశ్వాసమందు క్షీణించిపోయిరి; లేమనీయులు తప్ప, ఎవరూ లేకుండిరి మరియు వారు క్రీస్తు యొక్క సువార్తను తిరస్కరించిరి; కావున, వాటిని మరలా భూమిలో దాచివేయవలెనని నేను ఆజ్ఞాపించబడితిని.

4 ఇదిగో, జెరెడ్‌ యొక్క సహోదరుడు చూచిన అవే సంగతులను నేను ఈ పలకలపై వ్రాసితిని; జెరెడ్‌ యొక్క సహోదరునికి చూపబడిన వాటికంటే గొప్ప సంగతులు ఎన్నడూ చూపబడలేదు.

5 అందువలన వాటిని వ్రాయమని ప్రభువు నన్ను ఆజ్ఞాపించియుండెను; మరియు నేను వాటిని వ్రాసితిని. నేను వాటిని ముద్రవేయవలెనని ఆయన నన్ను ఆజ్ఞాపించెను; వాటి వివరణను కూడా నేను ముద్రవేయవలెనని ఆయన నన్ను ఆజ్ఞాపించియుండెను; అందువలన ప్రభువు యొక్క ఆజ్ఞ ప్రకారము, నేను అనువాదక సాధనములను ముద్రవేసితిని.

6 ఏలయనగా, ప్రభువు నాతో ఇట్లు చెప్పెను: వారి దుర్నీతిని బట్టి వారు పశ్చాత్తాపపడి, ప్రభువు యెదుట పవిత్రులగు దినము వరకు అవి అన్యజనుల యొద్దకు వెళ్ళవు.

7 ఆ దినమందు, వారు నా యందు పరిశుద్ధులు కాగలుగునట్లు జెరెడ్‌ యొక్క సహోదరునివలే నా యందు విశ్వాసమును సాధన చేసెదరని ప్రభువు చెప్పుచున్నాడు; అప్పుడు నా బయల్పాటులన్నియు వారికి బయల్పరచబడు వరకు జెరెడ్‌ యొక్క సహోదరుడు చూచిన సంగతులను నేను వారికి బయల్పరచెదనని భూమ్యాకాశములకు, వాటిలోనున్న సమస్తమునకు తండ్రియైన మరియు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు చెప్పుచున్నాడు.

8 మరియు ప్రభువు యొక్క వాక్యమునకు వ్యతిరేకముగా పోరాడువాడు శపించబడును గాక; ఈ సంగతులను తిరస్కరించువాడు శపించబడును గాక; ఏలయనగా, అట్టి వారికి నేను ఏ గొప్ప సంగతులను చూపనని, మాట్లాడువాడను నేనేయని యేసు క్రీస్తు చెప్పుచున్నాడు.

9 నా ఆజ్ఞ ప్రకారము పరలోకములు తెరువబడును మరియు మూయబడును; నా మాటకు భూమి కంపించును; నా ఆజ్ఞకు దానిలోని నివాసులు అగ్ని చేత నాశనము చేయబడుదురు.

10 నా మాటలను విశ్వసించని వాడు, నా శిష్యుల మాటలను కూడా విశ్వసించడు; మరియు నేను మాట్లాడని యెడల, మీరు తీర్పుతీర్చుడి; ఏలయనగా, అంత్యదినమున మాటలాడునది నేనేయని మీరు తెలుసుకొందురు.

11 కానీ, నేను చెప్పిన ఈ సంగతులను విశ్వసించు వానిని నా ఆత్మ యొక్క ప్రత్యక్షతలతో నేను దర్శించెదను మరియు అతడు తెలుసుకొని, సాక్ష్యమిచ్చును. ఏలయనగా, నా ఆత్మను బట్టి ఈ సంగతులు సత్యమని అతడు ఎరుగును; ఏలయనగా, మంచిని చేయుటకు అవి మనుష్యులను ప్రోత్సహించును.

12 మరియు మంచి చేయుటకు మనుష్యులను ప్రోత్సహించు సంగతియేదైనను నా నుండియై యున్నది; ఏలయనగా మంచి నా నుండి తప్ప, మరెవరి నుండి రాదు. మనుష్యులను సమస్త మంచికి నడిపించు వాడను నేనే; నా మాటలను విశ్వసించని వాడు, నేను ఉన్నానని నమ్మడు; నన్ను విశ్వసించని వాడు, నన్ను పంపిన తండ్రిని విశ్వసించడు. ఏలయనగా, నేను తండ్రినైయున్నాను; నేను లోకమునకు వెలుగును, జీవమును, సత్యమునైయున్నాను.

13 ఓ అన్యజనులైన మీరు, నా యొద్దకు రండి; నేను మీకు గొప్ప సంగతులను, అవిశ్వాసమును బట్టి దాచిపెట్టబడిన జ్ఞానమును చూపెదను.

14 ఓ ఇశ్రాయేలు వంశస్థులైన మీరు, నా యొద్దకు రండి, లోకము పునాది వేయబడినప్పటి నుండి ఎంత గొప్ప సంగతులను తండ్రి మీ కొరకు సిద్ధపరిచెనో మీకు ప్రత్యక్షపరచబడును; మరియు అవిశ్వాసమును బట్టి అవి మీకు ప్రత్యక్షపరచబడలేదు.

15 ఇదిగో, మీ భయంకరమైన దుర్మార్గపు స్థితి, హృదయ కాఠిన్యము మరియు మనస్సు యొక్క గ్రుడ్డితనమందు మీరు నిలిచియుండునట్లు చేయు అవిశ్వాసపు తెరను మీరు ఎప్పుడు చించివేయుదురో, అప్పుడు లోకము పునాది వేయబడినప్పటి నుండి మీ నుండి దాచిపెట్టబడిన ఆ గొప్ప మరియు ఆశ్చర్యకరమైన సంగతులను మీరు తెలుసుకొందురు మరియు విరిగిన హృదయముతో, నలిగిన మనస్సుతో మీరు తండ్రికి నా నామమున ఎప్పుడు ప్రార్థన చేయుదురో, అప్పుడు ఓ ఇశ్రాయేలు వంశమా, మీ పితరులతో ఆయన చేసిన నిబంధనను తండ్రి జ్ఞాపకము చేసుకొనియున్నాడని మీరు తెలుసుకొందురు.

16 అప్పుడు, నా సేవకుడైన యోహాను చేత నేను వ్రాయించిన నా బయల్పాటులు జనులందరి కన్నుల యెదుట బయల్పరచబడును. జ్ఞాపకముంచుకొనుడి, మీరు ఈ సంగతులను చూచినపుడు, అవి నిజముగా ప్రత్యక్షపరచబడు సమయము సమీపించినదని మీరు తెలుసుకొందురు.

17 కావున, మీరు ఈ గ్రంథమును అందుకొనినప్పుడు దేశమంతటిపై తండ్రి యొక్క కార్యము ప్రారంభమైనదని మీరు తెలుసుకొందురు.

18 కావున భూదిగంతములారా, పశ్చాత్తాపపడి నా యొద్దకు రండి, నా సువార్తలో విశ్వాసముంచుడి మరియు నా నామమందు బాప్తిస్మము పొందుడి; ఏలయనగా నమ్మి, బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును; నా నామమందు నమ్మిన వారి వలన సూచకక్రియలు కనబడును.

19 అంత్యదినమున నా నామము పట్ల విశ్వాసముగా కనుగొనబడిన వాడు ధన్యుడు, ఏలయనగా లోకము పునాది వేయబడినప్పటి నుండి అతని కొరకు సిద్ధము చేయబడిన రాజ్యమందు నివసించుటకు అతడు పైకెత్తబడును. ఇదిగో, దీనిని పలికిన వాడను నేనే. ఆమేన్‌.