లేఖనములు
ఈథర్ 5


5వ అధ్యాయము

ముగ్గురు సాక్షులు మరియు ఈ కార్యము దానికదే మోర్మన్‌ గ్రంథము యొక్క సత్యమునకు ఒక సాక్ష్యముగా నిలుచును.

1 ఇప్పుడు, నా జ్ఞాపకమును బట్టి నాకు ఆజ్ఞాపించబడిన మాటలను మొరోనై అను నేను వ్రాసితిని; మరియు నేను ముద్రవేసిన సంగతులను నేను నీకు చెప్పియున్నాను; కావున, నీవు అనువాదము చేయునట్లు వాటిని తాకవద్దు; ఏలయనగా, దేవుని యందు వివేకమగు సమయము వరకు అది నీకు నిషేధింపబడినది.

2 మరియు ఈ కార్యమును ముందుకు తెచ్చుటలో సహాయము చేయువారికి నీవు పలకలు చూపునట్లు, నీవు విశేషాధికారము కలిగియుందువు;

3 దేవుని యొక్క శక్తి ద్వారా అవి ముగ్గురికి చూపబడును; అందువలన, ఈ సంగతులు సత్యమైనవని వారు నిశ్చయముగా తెలుసుకొందురు.

4 ముగ్గురు సాక్షుల నోట ఈ సంగతులు స్థాపించబడును; ముగ్గురి సాక్ష్యము, దేవుని శక్తి కనబరచబడు ఈ కార్యము మరియు ఆయన వాక్యము, వీటన్నిటిని గూర్చి తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఇచ్చు సాక్ష్యము—ఇవన్నియు అంత్యదినమున లోకమునకు వ్యతిరేకముగా ఒక సాక్ష్యముగా నిలుచును.

5 జనులు పశ్చాత్తాపపడి, యేసు నామమందు తండ్రి యొద్దకు వచ్చిన యెడల, వారు దేవుని రాజ్యములోనికి చేర్చుకొనబడుదురు.

6 ఇప్పుడు, ఈ సంగతుల కొరకు నాకు ఏ అధికారము లేనియెడల మీరు తీర్పు తీర్చుడి; ఏలయనగా, మీరు నన్ను చూచునప్పుడు మరియు అంత్యదినమున మనము దేవుని యెదుట నిలిచినప్పుడు నేను అధికారము కలిగియున్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్‌.