లేఖనములు
హీలమన్ 13


నీఫైయులకు లేమనీయుడైన సమూయేలు యొక్క ప్రవచనము.

13 నుండి 15 అధ్యాయములు కలిగియున్నవి.

13వ అధ్యాయము

వారు పశ్చాత్తాపపడని యెడల నీఫైయులు నాశనమగుదురని లేమనీయుడైన సమూయేలు ప్రవచించును—వారు మరియు వారి సంపదలు శపించబడినవి—వారు ప్రవక్తలను తిరస్కరించి రాళ్ళతో కొట్టుదురు, అపవిత్రాత్మలతో చుట్టబడియుందురు మరియు దుర్నీతిని జరిగించుటలో సంతోషమును వెదికెదరు. సుమారు క్రీ. పూ. 6 సం.

1 ఇప్పుడు ఎనుబది ఆరవ సంవత్సరమందు లేమనీయులు మోషే ధర్మశాస్త్రము ప్రకారము దేవుని ఆజ్ఞలను ఖచ్చితముగా పాటించుచుండగా నీఫైయులు దుష్టత్వమందు, అనగా అధిక దుష్టత్వమందు ఇంకను నిలిచియుండిరి.

2 ఈ సంవత్సరమందు సమూయేలు అనబడు ఒక లేమనీయుడు జరహేమ్ల దేశములోనికి వచ్చి, జనులకు బోధించుట ప్రారంభించెను. అనేక దినములపాటు అతడు జనులకు పశ్చాత్తాపమును బోధించెను మరియు వారు అతడిని బయటకు గెంటివేయగా, అతడు తన స్వదేశమునకు తిరిగి వెళ్ళబోవుచుండెను.

3 కానీ అతడు తిరిగి వెనుకకు వెళ్ళవలెనని మరియు అతని హృదయములోనికి వచ్చు సంగతులన్నిటినీ జనులకు ప్రవచించవలెనని ప్రభువు యొక్క స్వరము అతనికి చెప్పెను.

4 అతడు పట్టణములోనికి ప్రవేశించుటకు వారు అనుమతి ఇవ్వనందున, అతడు వెళ్ళి పట్టణపు ప్రాకారముపై నిలబడి, తన చేతిని ముందుకు చాపి బిగ్గరగా కేక వేసి, ప్రభువు అతని హృదయమందు ఉంచిన సంగతులను జనులకు ప్రవచించెను.

5 మరియు అతడు వారితో ఇట్లు చెప్పెను: ఇదిగో, లేమనీయుడనైన సమూయేలు అను నేను, ప్రభువు నా హృదయమందు ఉంచిన ఆయన మాటలను పలుకుచున్నాను; న్యాయపు ఖడ్గము ఈ జనులపై వ్రేలాడుచున్నదని ఈ జనులకు నేను చెప్పవలెనని ఆయన నా హృదయమందు ఉంచియున్నాడు; నాలుగు వందల సంవత్సరములు గడిచిపోక ముందే న్యాయపు ఖడ్గము ఈ జనులపై పడును.

6 ఈ జనుల కొరకు భారమైన నాశనము కనిపెట్టుకొనియున్నది, అది నిశ్చయముగా ఈ జనులపై వచ్చును; నిశ్చయముగా ఈ లోకములోనికి వచ్చి అనేక శ్రమలను అనుభవించి, తన జనుల కొరకు సంహరింపబడు ప్రభువైన యేసు క్రీస్తుపై విశ్వాసము మరియు పశ్చాత్తాపము తప్ప, ఏదియు ఈ జనులను రక్షించలేదు.

7 ఇదిగో, ప్రభువు యొక్క దేవదూత దానిని నాకు తెలియజేసెను మరియు నా ఆత్మకు సువర్తమానములను తెచ్చెను. మీరు కూడా సువర్తమానములను కలిగియుండునట్లు, దానిని మీకు ప్రకటించుటకు నేను మీ యొద్దకు పంపబడితిని; కానీ మీరు నన్ను చేర్చుకొనుట లేదు.

8 కావున, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నీఫై జనుల హృదయ కాఠిన్యమును బట్టి వారు పశ్చాత్తాపపడని యెడల, నేను నా వాక్యమును వారి నుండి తీసివేసెదను, నేను నా ఆత్మను వారి నుండి ఉపసంహరించెదను, నేను వారిని ఇక ఏమాత్రము సహించను మరియు నేను వారి సహోదరుల హృదయములను వారికి వ్యతిరేకముగా త్రిప్పెదను.

9 నాలుగు వందల సంవత్సరములు గడిచిపోకముందే వారు మొత్తబడునట్లు నేను చేయుదును; నేను వారిని ఖడ్గముతో, కరువుతో, వ్యాధితో దర్శించెదను.

10 నా ఉగ్రతలో నేను వారిని దర్శించెదను మరియు మీ పూర్తి నాశనమును చూచుటకు మీ శత్రువుల యొక్క నాలుగవ తరము వారు అక్కడ జీవించియుండెదరు; మీరు పశ్చాత్తాపపడని యెడల, ఇది నిశ్చయముగా జరుగునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు మరియు నాలుగవ తరము వారు మీ నాశనమును చూచెదరు.

11 కానీ మీరు పశ్చాత్తాపపడి మీ దేవుడైన ప్రభువు తట్టు తిరిగిన యెడల, నేను నా కోపమును తొలగించెదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు; పశ్చాత్తాపపడి, నా తట్టు తిరుగు వారు ధన్యులు, కానీ పశ్చాత్తాపపడని వానికి ఆపద అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

12 ఈ గొప్ప జరహేమ్ల పట్టణమునకు ఆపద; ఏలయనగా నీతిమంతులను బట్టియే ఇది రక్షించబడినది; ఈ గొప్ప పట్టణమునకు ఆపద, ఏలయనగా అనేకులు, అనగా ఈ గొప్ప పట్టణములో అధికభాగము జనులు నాకు వ్యతిరేకముగా తమ హృదయములను కఠినపరచుకొనెదరని నేను చూచుచున్నానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

13 కానీ పశ్చాత్తాపపడిన వారు ధన్యులు, ఏలయనగా నేను వారిని వదిలిపెట్టెదను. కానీ ఈ గొప్ప పట్టణములో నీతిమంతులు లేని యెడల, పరలోకము నుండి అగ్ని వచ్చి దానిని నాశనము చేయునట్లు నేను చేయుదును.

14 కానీ, నీతిమంతుల నిమిత్తము అది విడిచిపెట్టబడినది. అయితే మీరు నీతిమంతులను మీ మధ్య నుండి బయటకు గెంటివేయు సమయము వచ్చును, అప్పుడు మీరు నాశనమునకు పరిపక్వమగుదురని ప్రభువు సెలవిచ్చుచున్నాడు; దానియందున్న దుష్టత్వము, హేయక్రియలను బట్టి ఈ గొప్ప పట్టణమునకు ఆపద.

15 మరియు దానియందున్న దుష్టత్వము, హేయక్రియలను బట్టి గిడియన్‌ పట్టణమునకు ఆపద.

16 ముఖ్యముగా, వాటియందున్న దుష్టత్వము, హేయక్రియలను బట్టి చుట్టూ ఉన్న దేశమందు నీఫైయుల చేత స్వాధీనము చేసుకొనబడిన పట్టణములన్నింటికి ఆపద.

17 ఇదిగో, దేశమందున్నజనులను బట్టి, వారి దుష్టత్వము, హేయక్రియలను బట్టి దేశముపై ఒక శాపము వచ్చునని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

18 మరియు దేశము పైనున్న గొప్ప శాపమును బట్టి, ఒకడు నీతిమంతుడైయుండి దానిని ప్రభువుకు దాచి ఉంచితే తప్ప, భూమి యందు నిధులను దాచివేయు వాడెవడైనను వాటిని ఇక ఏమాత్రము కనుగొనడని సైన్యములకధిపతి, మన గొప్ప సత్య దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

19 ఏలయనగా వారు నా కొరకు వారి నిధులను దాచవలెనని నేను కోరుదును; మరియు నా కొరకు తమ నిధులను దాచని వారు శాపగ్రస్తులు; ఏలయనగా నీతిమంతులు తప్ప, ఎవడును నా కొరకు నిధులను దాచడు; నా కొరకు నిధులను దాచనివాని యొక్క నిధి మరియు అతడు కూడా శాపగ్రస్తమగుదురు; దేశము పైనున్న శాపమును బట్టి, దానినెవడు విమోచించలేడని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

20 మరియు వారు తమ హృదయములను సంపదలపై పెట్టియున్నారు, కావున వారు తమ నిధులను దాచివేయు దినము వచ్చును; వారు తమ హృదయములను తమ సంపదలపై ఉంచి, వారి శత్రువుల యెదుట నుండి పారిపోవునప్పుడు వారి నిధులను దాచివేయుదురు; వారు నా కొరకు వాటిని దాచరు, కావున వారు మరియు వారి నిధులు కూడా శాపగ్రస్తమగును; ఆ దినమందు వారు మొత్తబడుదురని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

21 ఈ గొప్ప పట్టణము యొక్క జనులైన మీరు నా మాటలను ఆలకించుడి; అనగా, ప్రభువు సెలవిచ్చుచున్న మాటలను ఆలకించుడి; ఏలయనగా మీ సంపదలను బట్టి, మీరు శాపగ్రస్తులైయున్నారు; మీరు మీ హృదయములను వాటిపై ఉంచి, వాటిని మీకు ఇచ్చిన ఆయన యొక్క మాటలను ఆలకించనందువలన మీ సంపదలు కూడా శాపగ్రస్తమైనవి.

22 ఆయన మీకిచ్చిన ఆశీర్వాదములను బట్టి మీ దేవుడైన ప్రభువును మీరు జ్ఞాపకము చేసుకొనరు, మీరు మీ సంపదలను ఎల్లప్పుడు జ్ఞాపకము చేసుకొందురు, కానీ వాటి కొరకు మీ దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత చెప్పుటను మాత్రము జ్ఞాపకము చేసుకొనరు; మీ హృదయములు ప్రభువు వైపు ఆకర్షించబడలేదు, కానీ గొప్ప గర్వముతో డంబములు పలుకుటకు, గొప్పగా ఉప్పొంగుటకు, అసూయలు, కలహములు, ద్వేషములు, హింసలు, హత్యలు మరియు సమస్త విధములైన దుర్ణీతులు జరిగించుటకు అవి ఉప్పొంగును.

23 ఈ హేతువు నిమిత్తము ప్రభువైన దేవుడు దేశముపై, మీ సంపదలపై ఒక శాపము వచ్చునట్లు చేసెను; మరియు ఇది మీ దుర్ణీతులను బట్టియైయున్నది.

24 ఇప్పుడు వచ్చిన ఈ సమయమును బట్టి ఈ జనులకు ఆపద, ఏలయనగా ప్రాచీన కాలపు జనులు చేసినట్లు మీరు కూడా ప్రవక్తలను బయటకు గెంటివేసి, వారిని గేలిచేసి, వారిపైకి రాళ్ళు విసిరి, వారిని సంహరించి, వారిపట్ల సమస్త విధమైన దుర్నీతిని జరిగించిరి.

25 ఇప్పుడు మీరు మాట్లాడునప్పుడు మీరిట్లు చెప్పుదురు: ప్రాచీన కాలపు మా పితరుల దినములలో మేము జీవించియున్న యెడల, మేము ప్రవక్తలను సంహరించియుండేవారము కాము; మేము వారిని రాళ్ళతో కొట్టేవారము కాము మరియు బయటకు గెంటివేసేవారము కాము.

26 ఇదిగో మీరు వారి కంటే చెడ్డగా ఉన్నారు; ఏలయనగా ప్రభువు జీవముతోడు, ఒక ప్రవక్త మీ మధ్యకు వచ్చి మీ పాపములు మరియు దుర్ణీతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ప్రభువు యొక్క వాక్యమును మీకు ప్రకటించిన యెడల, మీరు అతనితో కోపముగానుండి అతడిని బయటకు గెంటివేయుదురు మరియు అతడిని నాశనము చేయుటకు అన్నిరకముల మార్గములను వెదికెదరు; మీ క్రియలు చెడ్డవని అతడు సాక్ష్యమిచ్చినందున అతడు ఒక అబద్ధ ప్రవక్తయని, పాపియని, అపవాది సంబంధియని మీరు చెప్పుదురు.

27 కానీ ఇదిగో, దీనిని చేయుడి, ఏ దోషము లేదు; దానిని చేయుడి, మీరు బాధపడరు అని మీ మధ్యకు ఒక మనుష్యుడు వచ్చి చెప్పిన యెడల, అలాగే మీ హృదయ గర్వమును బట్టి నడువుడి, మీ కన్నుల గర్వమును బట్టి నడువుడి మరియు మీ హృదయము కోరినదేదైనను చేయుడి అని ఒక మనుష్యుడు మీ మధ్యకు వచ్చి చెప్పిన యెడల, మీరు అతడిని చేర్చుకొని అతడొక ప్రవక్తయని చెప్పుదురు.

28 మీరు అతడిని హెచ్చించెదరు మరియు మీకు కలిగిన దాని నుండి అతనికిచ్చెదరు; మీ బంగారమును, వెండిని అతనికిచ్చెదరు, అతనికి ఖరీదైన వస్త్రములు ధరింపజేసెదరు; అతడు మీకు ఇచ్ఛకపుమాటలు చెప్పుచూ అంతయు క్షేమమని చెప్పును, కావున మీరు అతనిలో తప్పులెంచరు.

29 ఓ, దుష్టులైన మూర్ఖతరము వారలారా, కఠినాత్ములు, మెడబిరుసు జనులైన మీరు, ఎంతకాలము ప్రభువు మిమ్ములను సహించునని తలంచుచున్నారు? ఎంతకాలము మీరు మూర్ఖులైన గ్రుడ్డి మార్గదర్శుల చేత నడిపించబడుటకు మిమ్ములను అనుమతించుకొందురు? ఎంతకాలము మీరు వెలుగుకు బదులుగా చీకటిని యెంచుకొందురు?

30 ఇదిగో, మీ పట్ల ప్రభువు యొక్క కోపము ఇప్పటికే రగులుకొనియున్నది; మీ దుర్నీతి నిమిత్తము ఆయన దేశమును శపించియున్నాడు.

31 ఆయన మీ సంపదలను శపించు సమయము వచ్చినప్పుడు అవి చేజారిపోవును, వాటిని మీరు పట్టుకొనలేరు; మీ పేదరికపు దినములందు మీరు వాటిని నిలుపుకొనలేరు.

32 మరియు మీ పేదరికపు దినములందు మీరు ప్రభువుకు మొరపెట్టుదురు; వ్యర్థముగానే మీరు మొరపెట్టుదురు, ఏలయనగా మీ నాశనము ఇదివరకే మీపైకి వచ్చినది మరియు మీ నాశనము నిశ్చయము చేయబడియున్నది; ఆ దినమందు మీరు ఏడ్చెదరు మరియు అరిచెదరు అని సైన్యములకధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు; అప్పుడు మీరు విలపించి, ఇట్లు చెప్పుదురు:

33 అయ్యో, నేను పశ్చాత్తాపపడి, ప్రవక్తలను చంపక, వారిని రాళ్ళతో కొట్టక, వారిని బయటకు గెంటివేయని యెడల ఎంత మేలు! మరియు ఆ దినమందు మీరిట్లు చెప్పుదురు: ఆయన మనకు సంపదలను ఇచ్చినప్పుడు మన దేవుడైన ప్రభువును మనము జ్ఞాపకము చేసుకొనియుండిన ఎంత మేలు; అప్పుడు మనము వాటిని పోగొట్టుకొనునట్లు అవి చేజారిపోయి ఉండేవి కావు; ఇదిగో, మన సంపదలు మన చేజారిపోయినవి.

34 మనము ఒక పనిముట్టును ఇక్కడ ఉంచిన యెడల, ఉదయమున అది పోవును; యుద్ధము కొరకు మనము ఖడ్గములు కోరు దినమందు అవి మన నుండి తీసివేయబడును.

35 మన నిధులను మనము దాచియుంటిమి మరియు దేశము పైనున్న శాపమును బట్టి, అవి మన చేజారిపోయినవి.

36 అయ్యో, ప్రభువు యొక్క వాక్యము మనకు వచ్చిన దినమందు మనము పశ్చాత్తాపడియున్న యెడల ఎంత మేలు! ఏలయనగా దేశము శపించబడినది; సమస్త వస్తువులు చేజారిపోయినవి మరియు మనము వాటిని పట్టుకొనజాలము.

37 ఇదిగో మనము దయ్యముల చేత చుట్టబడియున్నాము, మన ఆత్మలను నాశనము చేయగోరువాని దూతల చేత మనము చుట్టుకొనబడియున్నాము. మన దోషములు గొప్పవి. ఓ ప్రభువా, నీవు నీ కోపమును మా నుండి తొలగించలేవా? అనునది ఆ దినముల యందు మీ భాషయైయుండును.

38 కానీ, మీ పరీక్షా దినములు గతించిపోయినవి; శాశ్వతముగా మిక్కిలి ఆలస్యమై, మీ నాశనము నిశ్చయము చేయబడువరకు మీ రక్షణ దినమును మీరు వాయిదా వేసియుంటిరి; మీరు సంపాదించలేని దాని కొరకు మీ జీవితకాలమంతయూ మీరు వెదికిరి; దుర్నీతిని జరిగించుటలో మీరు సంతోషమును వెదికిరి, అది మన గొప్ప మరియు నిత్య అధిపతియందున్న నీతి స్వభావమునకు వ్యతిరేకమైయున్నది.

39 ఓ దేశ జనులారా, మీరు నా మాటలు విందురు గాక! ప్రభువు యొక్క కోపము మీ నుండి తొలగించబడవలెనని, మీరు పశ్చాత్తాపపడి, రక్షించబడవలెనని నేను ప్రార్థించుచున్నాను.