లేఖనములు
హీలమన్ 3


3వ అధ్యాయము

అనేకమంది నీఫైయులు ఉత్తరము వైపునున్న దేశమునకు వలస వెళ్ళుదురు—వారు సిమెంటుతో ఇళ్ళను కట్టుదురు మరియు అనేక గ్రంథములను భద్రపరిచెదరు—పదుల వేలమంది పరివర్తన పొంది, బాప్తిస్మము పొందుదురు—దేవుని వాక్యము మనుష్యులను రక్షణ వైపు నడిపించును—హీలమన్‌ కుమారుడైన నీఫై న్యాయపీఠమును అధిష్టించును. సుమారు క్రీ. పూ. 49–39 సం.

1 ఇప్పుడు న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబది మూడవ సంవత్సరమందు సంఘమందున్న కొద్ది గర్వము తప్ప నీఫై జనుల మధ్య ఏ వివాదము లేకుండెను, అది జనుల మధ్య చిన్న విభేధములను కలుగజేసెను, ఆ వ్యవహారములు నలుబది మూడవ సంవత్సరాంతమున పరిష్కరించబడెను.

2 నలుబది నాలుగవ సంవత్సరమందు జనుల మధ్య ఏ వివాదము లేకుండెను; లేదా నలుబది అయిదవ సంవత్సరమందు కూడా అధిక వివాదము లేకుండెను.

3 నలుబది ఆరవ సంవత్సరమందు అనేక వివాదములు మరియు విభేధములుండెను; అందువలన అనేకమంది జరహేమ్ల దేశము నుండి బయటకు వెడలిపోయి, ఉత్తరము వైపునున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్ళిరి.

4 వారు అత్యధిక దూరము ప్రయాణము చేసిరి, ఎంతగాననగా వారు అధిక జలసముదాయములు మరియు అనేక నదుల యొద్దకు వచ్చిరి.

5 వారు దేశము యొక్క భాగములన్నింటిలోకి విస్తరించిరి, ముందుగా దేశమును స్వాస్థ్యపరచుకొన్న అనేకమంది నివాసుల మూలముగా నిర్జనము చేయబడకుండా కలపను కలిగియున్న ప్రతి భాగములోనికి విస్తరించిరి.

6 ఇప్పుడు కలప నిమిత్తము తప్ప, దేశము యొక్క ఏ భాగము నిర్జనముగా లేదు; కానీ దేశమును ముందుగా స్వాస్థ్యపరచుకొనియున్న జనుల యొక్క అధిక వినాశనమును బట్టి అది నిర్జనమని పిలువబడెను.

7 దేశమందు కొద్ది కలప మాత్రమే ఉన్నప్పటికీ, ముందుకు వెళ్ళిన జనులు సిమెంటు పని చేయుట యందు మిక్కిలి నేర్పరులైరి; కావున వారు సిమెంటు ఇండ్లను కట్టి, వాటియందు నివసించిరి.

8 వారు వృద్ధి పొంది, విస్తరించి దక్షిణము వైపు దేశము నుండి ఉత్తరము వైపునకు వెళ్ళిరి మరియు దక్షిణపు సముద్రము నుండి ఉత్తరపు సముద్రము వరకు, పశ్చిమ సముద్రము నుండి తూర్పు సముద్రము వరకు భూమియంతటిని నింపునట్లు వారు విస్తరించిరి.

9 ఉత్తరము వైపు దేశమందున్న జనులు గుడారములలో, సిమెంటు ఇండ్లలో నివసించిరి మరియు వారు తగిన సమయమందు వారి ఇండ్లు, పట్టణములు, దేవాలయములు, సమాజమందిరములు, పరిశుద్ధాలయములు మరియు సమస్త విధములైన భవనములు కట్టుకొనుటకు కలపను కలిగియుండునట్లు భూముఖముపై మొలిచిన ఏ చెట్టునైనను పైకి ఎదగనిచ్చిరి.

10 మరియు ఉత్తరము వైపునున్న దేశమందు కలప చాలా కొరతగా ఉన్నందున వారు సముద్ర మార్గమున ఓడల ద్వారా అధికముగా దిగుమతి చేసుకొనిరి.

11 ఆ విధముగా వారు కలప మరియు సిమెంటు రెండింటితో అనేక పట్టణములను కట్టుకొనగలుగునట్లు, వారు ఉత్తరము వైపునున్న దేశమందలి జనులను సమర్థులను చేసిరి.

12 మరియు జన్మతః లేమనీయులైన అమ్మోన్‌ యొక్క జనులలో అనేకులు కూడా ఈ దేశములోనికి వెళ్ళిరి.

13 ఇప్పుడు ఈ జనులలో అనేకులచేత ఈ జనుల వ్యవహారములను గూర్చిన అనేక గ్రంథములు వ్రాయబడినవి, అవి వారిని గూర్చి అధికముగా వివరించుచున్నవి.

14 కానీ ఇదిగో ఈ జనుల వ్యవహారముల యొక్క నూరవ భాగము, అనగా లేమనీయులు, నీఫైయులు, వారి యుద్ధములు, వివాదములు, విభేధములు, వారి బోధన, ప్రవచనములు, వారి ఓడలు, ఓడల నిర్మాణము, వారి దేవాలయములు, సమాజమందిరములు, పరిశుద్ధాలయముల నిర్మాణము, వారి నీతి, దుష్టత్వము, హత్యలు, దొంగతనములు, దోపిడీలు మరియు అన్ని విధములైన హేయకార్యములు, జారత్వముల యొక్క వృత్తాంతమును ఈ గ్రంథము కలిగియుండలేదు.

15 కానీ ప్రతివిధమైన పుస్తకములు మరియు గ్రంథములు అనేకమున్నవి, అవి ముఖ్యముగా నీఫైయుల చేత భద్రపరచబడియున్నవి.

16 మరియు వారు అతిక్రమములోనికి పడి, హత్య చేయబడి, దోచుకొనబడి, వేటాడబడి, తరుమబడి, సంహరింపబడి, భూముఖముపై చెదరగొట్టబడి, వారు ఇకపై నీఫైయులని పిలువబడకుండు వరకు లేమనీయులతో కలసి దుర్మార్గులు, క్రూరులు, భయంకరులై లేమనీయులగు వరకు కూడా అవి నీఫైయుల చేత ఒక తరము నుండి మరియొక దానికి అందించబడెను.

17 ఇప్పుడు నేను నా వృత్తాంతమునకు తిరిగి వెళ్ళెదను; కావున నేను పలికినవి, నీఫై జనుల మధ్య గొప్ప వివాదములు, గందరగోళములు, యుద్ధములు మరియు విభేధములు ఉండిన తరువాత జరిగెను.

18 న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబది ఆరవ సంవత్సరము ముగిసెను;

19 దేశమందు ఇంకను, నలుబది ఏడవ సంవత్సరమందు మరియు నలుబది ఎనిమిదవ సంవత్సరమందు కూడా గొప్ప వివాదము ఉండెను.

20 అయినప్పటికీ హీలమన్‌ న్యాయపీఠముపై న్యాయముతో, ధర్మముతో పరిపాలించెను; అతడు చట్టములను, న్యాయతీర్పులను, దేవుని ఆజ్ఞలను పాటించెను; అతడు నిరంతరము దేవుని దృష్టి యందు సరియైన దానిని చేసెను; మరియు అతడు దేశమందు వర్ధిల్లునంతగా తన తండ్రి అడుగుజాడలలో నడిచెను.

21 అతడు ఇద్దరు కుమారులను కలిగియుండెను. పెద్దవానికి నీఫై యొక్క పేరు, చిన్న వానికి లీహై యొక్క పేరు పెట్టెను. మరియు వారు ప్రభువునందు ఎదగసాగిరి.

22 ఇప్పుడు నీఫై జనులపై న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబది ఎనిమిదవ సంవత్సరము యొక్క అంతమందు నీఫైయుల మధ్య యుద్ధములు మరియు పోరాటములు కొద్ది పరిమాణములో నిలిచిపోనారంభించెను.

23 న్యాయాధిపతుల పరిపాలన యొక్క నలుబది తొమ్మిదవ సంవత్సరమందు దేశము యొక్క అధికముగా స్థిరపడిన భాగములందు దొంగయైన గాడియాంటన్‌ స్థాపించిన రహస్య కూడికలు తప్ప, దేశమందు నిరంతరమైన సమాధానము స్థాపించబడెను, ఆ సమయమున ఆ కూడికలు ప్రభుత్వాధికారులకు తెలియలేదు; కావున అవి దేశమందు లేకుండునట్లు నాశనము చేయబడలేదు.

24 మరియు అదే సంవత్సరములో సంఘము బహుగా వృద్ధి చెందెను, ఎంతగాననగా పశ్చాత్తాపము నిమిత్తము బాఫ్తీస్మము పొంది, సంఘమందు చేరినవారు వేల సంఖ్యలో ఉండిరి.

25 ప్రధానయాజకులు మరియు బోధకులు తమకైతాము అపరిమితముగా ఆశ్చర్యపడునంతగా సంఘము బహుగా వృద్ధి చెందెను మరియు జనులపై అత్యధిక ఆశీర్వాదములు క్రుమ్మరింపబడెను.

26 మరియు అనేక ఆత్మలు అనగా పదుల వేలమంది బాప్తిస్మము పొంది, దేవుని సంఘమందు చేరునంతగా ప్రభువు యొక్క కార్యము వర్థిల్లెను.

27 ఆ విధముగా యథార్థ హృదయముతో ఆయన పరిశుద్ధ నామమున ప్రార్థన చేయు వారందరిపట్ల ప్రభువు కనికరము కలిగియున్నాడని మనము చూడవచ్చు.

28 ఆ విధముగా పరలోకము యొక్క ద్వారము అందరికీ, అనగా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నామమందు విశ్వసించుచున్న వారందరికీ తెరువబడియున్నదని మనము చూచుచున్నాము.

29 తక్షణమైనది మరియు బలమైనది, అపవాది యొక్క సమస్త వంచన, వలలు మరియు తంత్రములను నేరుగా విభజించునది మరియు దుష్టులను చుట్టుకొనుటకు సిద్ధము చేయబడిన దౌర్భాగ్యము యొక్క ఆ నిత్య అగాధమునకు అడ్డముగా ఒక తిన్నని ఇరుకైన మార్గమందు క్రీస్తు యొక్క మనుష్యుని నడిపించు దేవుని వాక్యమును హత్తుకొనుటకు కోరువారెవరైనను—

30 వారి ఆత్మలను, అనగా వారి అమర్త్య ఆత్మలను ఇకపై వెలుపలకు వెళ్ళకుండా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో మరియు మన సమస్త పరిశుద్ధ పితరులతోపాటు పరలోక రాజ్యమందు దేవుని కుడి పార్శ్వమున కూర్చొనుటకు చేర్చుదురు.

31 మరియు ఈ సంవత్సరమందు జరహేమ్ల దేశమందు, చుట్టూనున్న ప్రాంతములన్నిటిలో, నీఫైయుల చేత స్వాధీనము చేసుకొనబడిన దేశమంతటా కూడా నిరంతరమైన సంతోషముండెను.

32 నలుబది తొమ్మిదవ సంవత్సరము యొక్క శేషమందు అక్కడ సమాధానము, గొప్ప సంతోషముండెను; మరియు న్యాయాధిపతుల పరిపాలన యొక్క యాభైయవ సంవత్సరమందు కూడా నిరంతరమైన సమాధానము మరియు గొప్ప సంతోషముండెను.

33 న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఏబది ఒకటవ సంవత్సరమందు కూడా సంఘములోనికి—దేవుని సంఘములోనికి కాదు, కానీ దేవుని సంఘమునకు చెందినట్టు చెప్పుకొనిన జనుల హృదయములలోనికి ప్రవేశించనారంభించిన గర్వము తప్ప, అక్కడ సమాధానము ఉండెను—

34 మరియు తమ సహోదరులలో అనేకులను హింసించునంతగా వారు గర్వమందు హెచ్చింపబడిరి. ఇప్పుడిది గొప్ప కీడు అయ్యుండి, జనులలో మిక్కిలి వినయము గలవారు గొప్ప హింసలను అనుభవించునట్లు మరియు అధికశ్రమ గుండా ప్రయాసముతో సాగిపోవునట్లు చేసెను.

35 అయినప్పటికీ సంతోషము మరియు ఓదార్పుతో వారి ఆత్మలు నింపబడు వరకు, అలాగే దేవునికి వారి హృదయములను వారు లోబరచుటను బట్టి వచ్చిన శుద్ధి వారి హృదయములను పవిత్రపరచి, శుద్ధి చేయువరకు కూడా వారు తరచుగా ఉపవాసముండి ప్రార్థించిరి; వారి తగ్గింపునందు బలముగా మరింత బలముగా మరియు క్రీస్తు యొక్క విశ్వాసమందు ధృఢముగా మరింత దృఢముగా అయ్యిరి.

36 జనుల హృదయములలో ప్రవేశించిన అధిక గర్వము తప్ప, ఏబది రెండవ సంవత్సరము కూడా సమాధానమందు ముగిసెను; ఈ గర్వము వారి అత్యధిక సంపదలు మరియు దేశమందు వారి అభివృద్ధి మూలముగా కలిగెను; మరియు ఇది వారిలో అనుదినము పెరిగెను.

37 ఇప్పుడు న్యాయాధిపతుల పరిపాలన యొక్క ఏబది మూడవ సంవత్సరమందు హీలమన్‌ మరణించెను మరియు అతని స్థానములో అతని పెద్దకుమారుడు నీఫై పరిపాలించుట ప్రారంభించెను. అతడు న్యాయపీఠముపై న్యాయముతో, ధర్మముతో పరిపాలించెను; అతడు దేవుని ఆజ్ఞలను నెరవేర్చెను మరియు తన తండ్రి అడుగుజాడలలో నడిచెను.