లేఖనములు
హీలమన్ 5


5వ అధ్యాయము

నీఫై మరియు లీహై తమనుతాము బోధకు అర్పించుకొందురు—వారి పేర్లు, వారి జీవితములను వారి పూర్వీకుల మాదిరిని బట్టి జీవించుటకు ఆహ్వానించును—పశ్చాత్తాపపడిన వారిని క్రీస్తు విమోచించును—నీఫై మరియు లీహైలు అనేకమంది పరివర్తన పొందునట్లు చేయుదురు మరియు చెరసాలలో వేయబడుదురు, అగ్ని వారిని చుట్టుముట్టును—ఒక అంధకార మేఘము మూడు వందలమంది జనులను కమ్మును—భూమి కంపించును మరియు పశ్చాత్తాపపడమని ఒక స్వరము మనుష్యులను ఆజ్ఞాపించును—నీఫై మరియు లీహై దేవదూతలతో మాట్లాడుదురు మరియు సమూహము అగ్ని చేత చుట్టబడును. సుమారు క్రీ. పూ. 30 సం.

1 మరియు ఇదే సంవత్సరమందు, న్యాయపీఠమును సిజోరమ్ అను పేరు గల మనుష్యునికి నీఫై అప్పగించెను.

2 ఏలయనగా వారి చట్టములు, వారి ప్రభుత్వములు జనుల యొక్క స్వరము చేత స్థాపించబడినందున మరియు చెడును కోరుకొను వారు మంచిని కోరుకొను వారి కంటే ఎక్కువ సంఖ్యాకులైనందున వారు నాశనమునకు దగ్గరగుచుండిరి, ఏలయనగా చట్టములు చెరుపబడియుండెను.

3 ఇదియే అంతయు కాదు; వారు మెడబిరుసు జనులైయుండిరి, ఎంతగాననగా వారు నాశనము చేయబడుట తప్ప, చట్టము లేదా న్యాయము చేత వారు పరిపాలింపబడలేకపోయిరి.

4 వారి దుర్నీతిని బట్టి నీఫై విసుగు చెంది, న్యాయపీఠమును అప్పగించివేసెను; అతని శేషజీవితమంతయు దేవుని వాక్యము బోధించదలిచెను మరియు అతని సహోదరుడు లీహై కూడా అతని శేషజీవితమంతయు అలాగే చేయదలిచెను;

5 ఏలయనగా వారి తండ్రి హీలమన్‌ చెప్పిన మాటలను వారు జ్ఞాపకము చేసుకొనిరి మరియు అతడు చెప్పిన మాటలు ఇవే:

6 ఇదిగో నా కుమారులారా, దేవుని ఆజ్ఞలను నెరవేర్చుటను మీరు జ్ఞాపకముంచుకొనవలెనని నేను కోరుచున్నాను మరియు ఈ మాటలను మీరు జనులకు ప్రకటించవలెనని నేను కోరుచున్నాను. ఇదిగో యెరూషలేము దేశము నుండి బయటకు వచ్చిన మన మొదటి తల్లిదండ్రుల పేర్లను నేను మీకు పెట్టియున్నాను; మీరు మీ పేర్లను జ్ఞాపకము చేసుకొనునప్పుడు మీరు వారిని జ్ఞాపకము చేసుకొనునట్లు దీనిని నేను చేసియున్నాను; మీరు వారిని జ్ఞాపకము చేసుకొనునప్పుడు వారి క్రియలను జ్ఞాపకము చేసుకొనవచ్చును; మీరు వారి క్రియలను జ్ఞాపకము చేసుకొనునప్పుడు అవి మంచివని ఎట్లు చెప్పబడినదో మరియు వ్రాయబడినదో మీరు తెలుసుకొనగలరు.

7 కావున నా కుమారులారా, వారిని గూర్చి ఏవిధముగా చెప్పబడి వ్రాయబడినదో, అదే విధముగా మిమ్ములను గూర్చి కూడా చెప్పబడి వ్రాయబడునట్లు మీరు మంచిదైనది చేయవలెనని నేను కోరుచున్నాను.

8 ఇప్పుడు నా కుమారులారా, మీ నుండి నేను మరికొంత కోరదలిచాను, ఆ కోరిక ఏమనగా మీరు అతిశయించునట్లు ఈ క్రియలను చేయకుడి, కానీ నిత్యమైన, క్షీణించని నిధులను పరలోకమందు మీ కొరకు కూర్చుకొనునట్లు మరియు మన పితరులకు ఇవ్వబడియున్నదని తలంచుటకు మనము కారణము కలిగియున్న నిత్యజీవము యొక్క ప్రశస్థ బహుమానమును పొందునట్లు మీరు ఈ క్రియలను చేయుడి.

9 ఓ నా కుమారులారా, జ్ఞాపకముంచుకొనుడి, బెంజమిన్ రాజు అతని జనులకు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొనుడి; రాబోవు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త రక్తము ద్వారా తప్ప, మనుష్యుడు రక్షింపబడగలిగిన ఏ ఇతర మార్గము లేదా సాధనము లేదని జ్ఞాపకముంచుకొనుడి; ముఖ్యముగా, లోకమును విమోచించుటకు ఆయన వచ్చునని జ్ఞాపకముంచుకొనుడి.

10 అటులనే అమ్మోనైహా పట్టణమందు జీజ్రొమ్‌నకు అమ్యులెక్ చెప్పిన మాటలను కూడా జ్ఞాపకముంచుకొనుడి; ఏలయనగా తన జనులను విమోచించుటకు ప్రభువు నిశ్చయముగా వచ్చునని, అయితే ఆయన వారిని వారి పాపములలో విమోచించుటకు రాడు, గాని వారి పాపములనుండి వారిని విమోచించుటకు వచ్చునని అతడు అతనికి చెప్పెను.

11 మరియు పశ్చాత్తాపమును బట్టి, వారి పాపముల నుండి వారిని విమోచించుటకు తండ్రి నుండి ఆయనకు శక్తి ఇవ్వబడెను; కావున వారి ఆత్మల రక్షణకై జనులను విమోచకుని శక్తి యొద్దకు తెచ్చు పశ్చాత్తాపము యొక్క షరతులను గూర్చిన వార్తలను ప్రకటించుటకు ఆయన తన దేవదూతలను పంపెను.

12 ఇప్పుడు నా కుమారులారా! జ్ఞాపకముంచుకొనుడి, మీరు మీ పునాదిని దేవుని కుమారుడైన క్రీస్తు మరియు మన విమోచకుని యొక్క బండపై కట్టవలెనని జ్ఞాపకముంచుకొనుడి; అపవాది తన బలమైన గాలులను, సుడిగాలి యందు అతని బాణములను పంపునప్పుడు, అతని సమస్త వడగళ్ళు మరియు బలమైన గాలివాన మిమ్ములను కొట్టునప్పుడు, దౌర్భాగ్యపు అగాధము మరియు అంతము లేని శ్రమకు మిమ్ములను క్రిందికి లాగుకొనిపోవుటకు అది మీపై ఏ శక్తి కలిగియుండదు, ఏలయనగా మీరు కట్టబడిన ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది మరియు మనుష్యులు ఆ పునాదిపై కట్టబడిన యెడల ఎన్నటికీ పడిపోరు.

13 ఇప్పుడు హీలమన్‌ తన కుమారులకు ఉపదేశించిన మాటలు ఇవే; వ్రాయబడని అనేక సంగతులను మరియు వ్రాయబడిన అనేక సంగతులను అతడు వారికి ఉపదేశించెను.

14 వారు అతని మాటలను జ్ఞాపకముంచుకొనిరి; కావున దేవుని ఆజ్ఞలను పాటించుచూ సమృద్ధి పట్టణము వద్ద మొదలుకొని నీఫై యొక్క జనులందరి మధ్య దేవుని వాక్యమును బోధించుటకు వారు బయలు వెళ్ళిరి.

15 అక్కడ నుండి గిడ్‌ పట్టణమునకు మరియు గిడ్‌ పట్టణము నుండి ములెక్ పట్టణమునకు వెళ్ళిరి;

16 ఆవిధముగా ఒక పట్టణము నుండి మరియొకదానికి, దక్షిణము వైపు దేశములోనున్న నీఫై జనులందరి మధ్యకు వెళ్ళువరకు వారు ప్రయాణించిరి; అక్కడ నుండి జరహేమ్ల దేశములోనికి లేమనీయుల మధ్యకు వెళ్ళిరి.

17 నీఫైయుల నుండి వెళ్ళిపోయిన ఆ అసమ్మతీయులలో అనేకుల గర్వము అణచునంతగా వారు గొప్ప శక్తితో బోధించిరి, ఎంతగాననగా వారు ముందుకు వచ్చి, వారి పాపములు ఒప్పుకొని, పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మము పొంది, వారు చేసిన తప్పిదములను సరిచేయుటకు ప్రయత్నించుటకై నీఫైయుల యొద్దకు వెంటనే తిరిగి వెళ్ళిరి.

18 నీఫై మరియు లీహై, లేమనీయులకు అంత గొప్ప శక్తి మరియు అధికారముతో బోధించిరి, ఏలయనగా వారు మాట్లాడగలుగునట్లు వారికి శక్తి మరియు అధికారము ఇవ్వబడినది, వారేమి మాట్లాడవలెనో కూడా వారికి ఇవ్వబడినది—

19 కావున వారు లేమనీయులు అధికముగా ఆశ్చర్యపడునట్లు వారిని ఒప్పించునట్లు మాట్లాడిరి, ఎంతగాననగా జరహేమ్ల దేశమందు మరియు దాని చుట్టూ ఉన్న లేమనీయులలో ఎనిమిది వేలమంది పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిస్మము పొంది, వారి పితరుల దుష్టాచారములను గూర్చి ఒప్పించబడిరి.

20 ఇప్పుడు నీఫై మరియు లీహై అక్కడ నుండి నీఫై దేశమునకు వెళ్ళుటకు ముందుకుసాగిరి.

21 వారు లేమనీయుల సైన్యము ద్వారా పట్టుకొనబడి చెరసాలలో వేయబడిరి; సరిగ్గా లింహై యొక్క సేవకుల ద్వారా అమ్మోన్‌ మరియు అతని సహోదరులు వేయబడిన అదే చెరసాలలో వేయబడిరి.

22 వారు అనేక దినములు ఆహారము లేకుండా చెరసాలలో వేయబడియున్న తరువాత, వారిని సంహరించునట్లు బయటకు తీసుకొని వచ్చుటకు వారు చెరసాలలోనికి వెళ్ళిరి.

23 నీఫై మరియు లీహై అగ్ని చేతవలే చుట్టూ చుట్టబడిరి, ఎంతగాననగా వారు కూడా కాల్చివేయబడుదురను భయముతో వారిపై తమ చేతులు వేయుటకు వారు ధైర్యము చేయలేదు. అయినప్పటికీ నీఫై మరియు లీహైలు కాల్చబడలేదు; వారు అగ్ని మధ్యలో నిలిచినట్లుండిరి, కానీ కాల్చబడలేదు.

24 వారు ఒక అగ్ని స్తంభముతో చుట్టబడియుండి, అది వారిని కాల్చకుండా ఉన్నట్లు చూచినప్పుడు వారి హృదయములు ధైర్యము తెచ్చుకొనెను.

25 ఏలయనగా లేమనీయులు తమ చేతులను వారిపై వేయుటకు ధైర్యము చేయలేదని లేదా వారి దగ్గరకు వచ్చుటకు వారు ధైర్యము చేయలేదని, కానీ వారు ఆశ్చర్యముతో మూగవారైనట్లు నిలువబడిరని వారు చూచిరి.

26 ఇప్పుడు నీఫై మరియు లీహై ముందుకు వచ్చి వారితో మాట్లాడుట మొదలుపెట్టి ఇట్లు చెప్పిరి: భయపడకుడి, ఏలయనగా మమ్ములను సంహరించుటకు మీ చేతులను మీరు మాపై వేయలేరని చూపుటకు ఈ అద్భుతమైన దృశ్యమును మీకు చూపించినది దేవుడే.

27 మరియు వారు ఈ మాటలను చెప్పినప్పుడు భూమి మిక్కిలిగా కంపించెను, చెరసాల గోడలు నేలకు కూలబోవుచున్నట్లుగా కంపించెను; కానీ అవి కూలిపోలేదు. ఇదిగో, చెరసాలయందున్న వారు లేమనీయులు మరియు అసమ్మతీయులైన నీఫైయులు.

28 వారు ఒక అంధకార మేఘముతో కప్పబడిరి మరియు ఒక భయంకరమైన గంభీరమైన భయము వారిపై వచ్చెను.

29 ఆ అంధకార మేఘము పైనుండి వచ్చుచున్నట్లు ఒక స్వరము ఇట్లు వినిపించెను: పశ్చాత్తాపపడుడి, పశ్చాత్తాపపడుడి, మీకు సువర్తమానములను ప్రకటించుటకు నేను పంపియున్న నా సేవకులను నాశనము చేయుటకు ఇక ఏమాత్రము ప్రయత్నించకుడి.

30 మరియు వారు ఈ స్వరమును విని, అది ఒక ఉరుము యొక్క స్వరము కాదని లేదా అది ఒక గొప్ప అల్లరి శబ్దము యొక్క స్వరము కాదని, కానీ అది గుసగుస వంటి పరిపూర్ణ మృదుత్వము యొక్క నిర్మలమైన స్వరమని మరియు అది సూటిగా ఆత్మకు కూడా గ్రుచ్చుకొనెనని చూచినప్పుడు—

31 ఆ స్వరము మృదువుగా ఉన్నప్పటికీ, భూమి మిక్కిలిగా కంపించి, భూమికి కూలబోవుచున్నట్లుగా చెరసాల యొక్క గోడలు తిరిగి వణికెను; మరియు వారిని కప్పియున్న అంధకార మేఘము వెళ్ళిపోలేదు—

32 ఇదిగో ఆ స్వరము తిరిగి వచ్చి ఇట్లు చెప్పెను: పశ్చాత్తాపపడుడి, పశ్చాత్తాపపడుడి, ఏలయనగా పరలోకరాజ్యము సమీపించియున్నది; నా సేవకులను నాశనము చేయుటకు ఇక ఏ మాత్రము ప్రయత్నించకుడి. అప్పుడు భూమి తిరిగి కంపించి, గోడలు వణికెను.

33 మరలా ఆ స్వరము తిరిగి మూడవసారి వచ్చి, మనుష్యుని చేత ఉచ్ఛరింపబడలేని అద్భుతమైన మాటలను వారితో చెప్పెను; గోడలు తిరిగి వణికెను మరియు రెండుగా చీలబోవునట్లుగా భూమి కంపించెను.

34 వారిని కమ్మిన అంధకార మేఘమును బట్టి లేమనీయులు పారిపోలేకపోయిరి; వారిపై వచ్చిన భయమును బట్టి, వారు కదలకయుండిరి.

35 ఇప్పుడు వారి మధ్య జన్మతః నీఫైయుడైన వాడొకడు ఉండెను, ఒకప్పుడు దేవుని సంఘమునకు చెందియున్న అతడు వారి నుండి విడిపోయెను.

36 అతడు ప్రక్కకు తిరిగి, అంధకార మేఘము గుండా నీఫై మరియు లీహై యొక్క ముఖములను చూచెను; అవి దేవదూతల ముఖముల వలే మిక్కిలి ప్రకాశించెను, వారు పరలోకమువైపు తమ కన్నులెత్తి, వారు చూచిన వారెవరితోనో మాట్లాడుచున్నట్లు లేదా స్వరములెత్తి పలుకుచున్నట్లు అతడు చూచెను.

37 వారు కూడా తిరిగి చూచునట్లు ఈ మనుష్యుడు సమూహమునకు కేక వేసెను. వారు తిరిగి చూచునట్లు వారికి శక్తి ఇవ్వబడగా, వారు నీఫై మరియు లీహై యొక్క ముఖములను చూచిరి.

38 మరియు వారు ఆ మనుష్యునితో ఇట్లనిరి: ఇదిగో, ఈ దృశ్యములన్నిటి అర్థమేమిటి? ఈ మనుష్యులు ఎవరితో మాట్లాడుచున్నారు?

39 ఆ మనుష్యుని పేరు అమినాదాబ్ మరియు వారు దేవుని దూతలతో మాట్లాడుచున్నారని అమినాదాబ్ వారితో చెప్పెను.

40 అప్పుడు లేమనీయులు అతనితో ఇట్లనిరి: ఈ అంధకార మేఘము మనలను కమ్ముట నుండి తీసివేయబడుటకు మనమేమి చేయవలెను?

41 మరియు అమినాదాబ్ వారితో ఇట్లు చెప్పెను: మీరు తప్పక పశ్చాత్తాపపడవలెను. ఆల్మా, అమ్యులెక్ మరియు జీజ్రొమ్ చేత మీకు ఉపదేశింపబడిన క్రీస్తు నందు మీరు విశ్వాసము కలిగియుండు వరకు ఆ స్వరమునకు మొరపెట్టవలెను; మీరు దీనిని చేసినప్పుడు అంధకార మేఘము మిమ్ములను కమ్ముట నుండి తీసివేయబడును.

42 అప్పుడు వారందరు భూమిని కంపింపజేసిన వాని స్వరమునకు మొరపెట్టుట ప్రారంభించిరి; అంధకార మేఘము పోవు వరకు వారు మొరపెట్టిరి.

43 వారు తమ కన్నులను చుట్టూ త్రిప్పి, అంధకార మేఘము వారిని కమ్ముట నుండి వెళ్ళిపోయినదని చూచినప్పుడు, వారిలో ప్రతి ఆత్మ ఒక అగ్ని స్తంభము చేత చుట్టబడినట్లు వారు చూచిరి.

44 నీఫై మరియు లీహై వారి మధ్య ఉండిరి; వారు చుట్టూ చుట్టబడిరి; వారు ఒక మండుచున్న అగ్ని మధ్య ఉన్నట్లు ఉండిరి, అయినను అది వారికి హాని చేయలేదు లేదా అది చెరసాల గోడలపై చుట్టుకొనలేదు మరియు చెప్పలేని సంతోషముతో, సంపూర్ణ మహిమతో వారు నింపబడిరి.

45 దేవుని యొక్క పరిశుద్ధాత్మ పరలోకము నుండి దిగి వచ్చి వారి హృదయములలోనికి ప్రవేశించెను మరియు వారు అగ్నితోయున్నట్లుగా నింపబడి, అద్భుతమైన మాటలు మాట్లాడగలిగిరి.

46 మరియు వారికి ఒక స్వరము, ఒక ప్రీతికరమైన స్వరము గుసగుసవలే ఇట్లు వినిపించెను:

47 లోకము పునాది వేయబడినప్పటి నుండి ఉన్న నా అతి ప్రియుని యందు మీ విశ్వాసమును బట్టి సమాధానము, మీకు సమాధానము కలుగునుగాక.

48 ఇప్పుడు వారిది వినినప్పుడు ఆ స్వరము ఎక్కడ నుండి వచ్చినదో చూచుటకన్నట్లు వారి కన్నులను పైకెత్తిరి; పరలోకములు తెరువబడి ఉండుటను వారు చూచిరి మరియు పరలోకము నుండి దేవదూతలు దిగివచ్చి, వారికి పరిచర్య చేసిరి.

49 ఈ దృశ్యములను చూచి, వినిన వారు అక్కడ సుమారు మూడు వందలమంది ఉండిరి; వారు ముందుకు వెళ్ళవలెనని, ఆశ్చర్యపడరాదని లేదా సందేహపడరాదని చెప్పబడిరి.

50 వారు ముందుకు వెళ్ళి, వారు విని చూచిన దృశ్యములన్నిటిని చుట్టూ ఉన్న ప్రాంతములంతటా ప్రకటించుచూ జనులకు పరిచర్య చేసిరి, ఎంతగాననగా వారు పొందిన సాక్ష్యముల గొప్పతనమును బట్టి, లేమనీయులలో అధిక భాగము వాటిని గూర్చి ఒప్పించబడిరి.

51 మరియు ఒప్పించబడిన వారందరు, వారి యుద్ధ ఆయుధములను క్రింద పడవేసి, వారి ద్వేషమును, వారి పితరుల ఆచారమును కూడా విడిచిపెట్టిరి.

52 వారి స్వాధీనములోనున్న దేశములను వారు నీఫైయులకు అప్పగించిరి.