లేఖనములు
హీలమన్ 8


8వ అధ్యాయము

చెడ్డ న్యాయాధిపతులు జనులను నీఫైకి వ్యతిరేకముగా రెచ్చగొట్టుటకు ప్రయత్నించెదరు—అబ్రాహాము, మోషే, జీనోస్, జీనోక్, ఎజియాసు, యెషయా, యిర్మియా, లీహై మరియు నీఫై అందరు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చిరి—ప్రధాన న్యాయాధిపతి యొక్క హత్యను ప్రేరేపణ ద్వారా నీఫై ప్రకటించును. సుమారు క్రీ. పూ. 23–21 సం.

1 ఇప్పుడు నీఫై ఈ మాటలను చెప్పినప్పుడు, గాడియాంటన్‌ యొక్క రహస్య ముఠాకు చెందియుండి న్యాయాధిపతులైన మనుష్యులు కొందరు అక్కడుండిరి; వారు కోపముగా ఉండి, అతనికి వ్యతిరేకముగా జనులకు ఇట్లు చెప్పుచూ కేకవేసిరి: అతడు చేసిన నేరమును బట్టి, అతడు శిక్షావిధి పొందునట్లు మీరెందుకు ఈ మనుష్యుని పట్టుకొని ముందుకు తీసుకొనిరారు?

2 మీరెందుకు ఈ మనుష్యుని చూచుచున్నారు మరియు ఈ జనులకు, మన చట్టమునకు వ్యతిరేకముగా దూషించుచున్న అతడిని వినుచున్నారు?

3 ఏలయనగా, వారి చట్టము యొక్క చెడుతనమును గూర్చి నీఫై వారితో మాట్లాడియుండెను; నీఫై అనేక వాక్యములు మాట్లాడెను, కానీ అవి వ్రాయబడలేవు; మరియు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనదేదియూ అతడు మాట్లాడలేదు.

4 రహస్యమైన వారి అంధకార క్రియలను గూర్చి అతడు వారితో స్పష్టముగా మాట్లాడినందున, ఆ న్యాయాధిపతులు అతనితో కోపముగానుండిరి; అయినప్పటికీ వారు తమ చేతులను అతనిపై వేయుటకు ధైర్యము చేయలేదు, ఏలయనగా వారికి వ్యతిరేకముగా జనులు కేకవేయుదురేమోనని వారు భయపడిరి.

5 కావున వారు ఇట్లు చెప్పుచూ జనులకు కేకవేసిరి: మనకు వ్యతిరేకముగా దూషించుటకు ఈ మనుష్యుని మీరెందుకు అనుమతించుచున్నారు? ఇదిగో, అతడు ఈ జనులందరిని నాశనమగునంతగా ఖండించుచున్నాడు; మన ఈ గొప్ప పట్టణములు మన నుండి తీసివేయబడునని, మనము వాటి యందు ఎట్టి స్థలము కలిగియుండమని కూడా చెప్పుచున్నాడు.

6 ఇప్పుడు ఇది అసాధ్యమని మనమెరుగుదుము, ఏలయనగా మనము శక్తిమంతులము మరియు మన పట్టణములు గొప్పవి, కావున మన శత్రువులు మనపై ఎట్టి శక్తి కలిగియుండలేరు.

7 ఆ విధముగా వారు నీఫైకి వ్యతిరేకముగా జనులను కోపమునకు పురిగొల్పిరి మరియు వారి మధ్య వివాదములను కలుగజేసిరి. ఏలయనగా అక్కడ ఇట్లు కేక వేసిన వారు కొందరుండిరి: ఈ మనష్యుని ఒంటరిగా విడువుము, ఏలయనగా అతడు మంచివాడు మరియు మనము పశ్చాత్తాపపడని యెడల, అతడు చెప్పిన ఆ సంగతులు నిశ్చయముగా జరుగును.

8 ఇదిగో, అతడు మనకు సాక్ష్యమిచ్చిన సమస్త తీర్పులు మనపై వచ్చును; ఏలయనగా అతడు మన దోషములను గూర్చి మనకు సరిగ్గా సాక్ష్యమిచ్చియున్నాడని మనమెరుగుదుము. అవి అనేకమున్నవి మరియు అతడు మన దోషములను గూర్చి ఎంత బాగుగా ఎరుగునో, అంతగా మనకు జరుగనున్న అన్ని సంగతులను అతడు ఎరుగును.

9 అతడు ఒక ప్రవక్త అయ్యుండని యెడల, అతడు ఆ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చియుండేవాడు కాదు.

10 ఇప్పుడు నీఫైని నాశనము చేయుటకు కోరిన ఆ జనులు వారి భయమును బట్టి, అతనిపై వారి చేతులు వేయకుండునట్లు బలవంతము చేయబడిరి; కావున వారిలో మిగిలిన వారు భయపడునంతగా కొందరి కన్నులలో అతడు అనుగ్రహము సంపాదించియున్నాడని చూచి, అతడు తిరిగి వారితో మాట్లాడుట మొదలుపెట్టెను.

11 కావున వారితో ఇట్లు చెప్పుచూ అధికముగా మాట్లాడుటకు అతడు బలవంతము చేయబడెను: ఇదిగో నా సహోదరులారా, దేవుడు ఒక మనుష్యుడైన మోషేకు ఎఱ్ఱసముద్రపు జలములపై కొట్టుటకు శక్తినిచ్చెనని, అవి ఇటు-అటు విడిపోయెనని, ఎంతగాననగా మన పితరులైన ఇశ్రాయేలీయులు ఆరిన నేల గుండా వచ్చిరని, జలములు ఐగుప్తీయుల సైన్యములపై కమ్మెనని, వారిని మ్రింగివేసెనని మీరు చదివియుండలేదా?

12 ఇప్పుడు దేవుడు ఈ మనుష్యునికి అట్టి శక్తిని ఇచ్చిన యెడల, అప్పుడు మీరెందుకు మీ మధ్య వాదించుకొనుచున్నారు మరియు మీరు పశ్చాత్తాపపడని యెడల, మీ పైకి వచ్చు తీర్పులను గూర్చి నేను ఎరుగునట్లు ఆయన నాకు ఎట్టి శక్తిని ఇచ్చియుండలేదని చెప్పుచున్నారు?

13 ఇదిగో మీరు నా మాటలను మాత్రమే నిరాకరించుటలేదు, కానీ మన పితరుల చేత పలుకబడిన మాటలన్నిటినీ మరియు అట్టి గొప్ప శక్తి ఇవ్వబడిన ఈ మనుష్యుడు మోషే ద్వారా పలుకబడిన మాటలను, అనగా మెస్సీయ యొక్క రాకను గూర్చి అతడు పలికిన మాటలను కూడా మీరు నిరాకరించుచున్నారు.

14 దేవుని కుమారుడు రావలెనని అతడు సాక్ష్యము చెప్పలేదా? అతడు అరణ్యమందు ఇత్తడి సర్పమును పైకి ఎత్తినట్లుగా రానున్న ఆయన కూడా పైకి ఎత్తబడును.

15 మరియు ఆ సర్పము వైపు ఎంతమంది చూచెదరో అంతమంది జీవించుదురు, అట్లే ఎంతమంది నలిగిన ఆత్మ కలిగియుండి విశ్వాసముతో దేవుని కుమారునివైపు చూచెదరో అంతమంది ఆ నిత్యజీవము పొందుటకు జీవించుదురు.

16 ఇప్పుడు మోషే ఒక్కడే ఈ సంగతులను గూర్చి సాక్ష్యమివ్వలేదు, కానీ అతని దినముల నుండి అబ్రాహాము యొక్క దినముల వరకు పరిశుద్ధ ప్రవక్తలు అందరు కూడా సాక్ష్యమిచ్చిరి.

17 మరియు అబ్రాహాము ఆయన రాకను చూచి సంతోషముతో నింపబడి, ఆనందించెను.

18 ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, అబ్రాహాము మాత్రమే ఈ సంగతులను ఎరిగియుండ లేదు, కానీ దేవుని క్రమము ద్వారా ఆయన కుమారుని క్రమమును బట్టి పిలువబడిన వారు అబ్రాహాము యొక్క దినములకు ముందు అనేకులుండిరి; మరియు వారికి కూడా విమోచన వచ్చునని ఆయన రాకకు అనేక వేల సంవత్సరములకు ముందున్న జనులకు చూపబడవలెననియే ఇది చేయబడెను.

19 ఇప్పుడు అబ్రాహాము యొక్క దినముల నుండి కూడా అనేకమంది ప్రవక్తలు ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చియుండిరని మీరు ఎరుగవలెనని నేను కోరుచున్నాను; ఇదిగో ప్రవక్త జీనోస్ ధైర్యముగా సాక్ష్యమిచ్చెను మరియు దాని నిమిత్తము అతడు సంహరించబడెను.

20 జీనోక్, ఎజియాసు, యెషయా, యిర్మియా కూడా (యిర్మియా యెరూషలేము యొక్క నాశనమును గూర్చి సాక్ష్యమిచ్చిన ప్రవక్త) మరియు ఇప్పుడు యిర్మియా మాటల ప్రకారము యెరూషలేము నాశనము చేయబడెనని మనము ఎరుగుదుము. అప్పుడు అతని ప్రవచనము ప్రకారము దేవుని కుమారుడు ఎందుకు రాడు?

21 ఇప్పుడు యెరూషలేము నాశనము చేయబడినదని మీరు తిరస్కరించెదరా? ములెక్ తప్ప, సిద్కియా యొక్క కుమారులందరు సంహరింపబడలేదని మీరు చెప్పుదురా? మరియు సిద్కియా యొక్క సంతానము మనతో ఉన్నారని, వారు యెరూషలేము దేశము నుండి బయటకు తరిమివేయబడిరని మీరు చూచుట లేదా? కానీ ఇదియే అంతయూ కాదు—

22 ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చినందున, మన పితరుడైన లీహై యెరూషలేము నుండి బయటకు తరిమివేయబడెను. నీఫై కూడా ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చెను మరియు దాదాపు ఈ సమయము వరకు మన పితరులందరు కూడా సాక్ష్యమిచ్చిరి; వారు క్రీస్తు యొక్క రాకడను గూర్చి సాక్ష్యమిచ్చి, ఎదురు చూచి, రానున్న ఆయన దినమందు ఆనందించియుండిరి.

23 ఇదిగో ఆయనే దేవుడు మరియు ఆయన వారితో ఉన్నాడు; ఆయన వారికి తనను ప్రత్యక్షపరచుకొనగా వారు ఆయన చేత విమోచింపబడిరి; మరియు రాబోవు దాని కారణముగా వారు ఆయనకు మహిమనిచ్చిరి.

24 ఇప్పుడు మీరు ఈ సంగతులను ఎరిగియున్నారు మరియు మీరు అబద్ధమాడితే తప్ప వాటిని కాదనలేరు, కావున దీనియందు మీరు పాపము చేసియున్నారు, ఏలయనగా మీరు పొందిన అనేకమైన సాక్ష్యములు ఉన్నప్పటికీ, మీరు ఈ సంగతులన్నిటిని తిరస్కరించియున్నారు; అవి సత్యమైనవనుటకు ఒక సాక్ష్యముగా పరలోకమందున్న వాటన్నిటిని మరియు భూమియందున్న వాటన్నిటిని మీరు పొందియున్నారు.

25 కానీ మీరు సత్యమును తిరస్కరించి, మీ పరిశుద్ధ దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసియున్నారు; ఈ సమయమున కూడా ఎక్కడైతే ఏదియూ చెరుపబడదో మరియు ఎక్కడైతే అపవిత్రమైనదేదియు రాలేదో, ఆ పరలోకమందు మీ కొరకు ఐశ్వర్యమును కూర్చుకొనుటకు బదులుగా మీరు తీర్పు దినమందు మీ కొరకు ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు.

26 ఈ సమయమున కూడా మీ హత్యలు, జారత్వము మరియు దుష్టత్వమును బట్టి నిత్య నాశనమునకు మీరు పరిపక్వమగుచున్నారు; మరియు మీరు పశ్చాత్తాపపడని యెడల, మీ యొద్దకు అది త్వరగా వచ్చును.

27 అది ఇప్పుడు మీ ద్వారముల యొద్ద ఉన్నది; మీరు న్యాయపీఠము వద్దకు వెళ్ళి, వెదకుడి; ఇదిగో మీ న్యాయాధిపతి హత్య చేయబడియున్నాడు మరియు అతడు రక్తపుమడుగులో పడియున్నాడు; న్యాయపీఠమును అధిష్ఠించవలెనని కోరిన అతని సహోదరుని చేత అతడు హత్య చేయబడియున్నాడు.

28 వారిరువురు మీ రహస్య ముఠాకు చెందియున్నారు, గాడియాంటన్‌ మరియు మనుష్యుల ఆత్మలను నాశనము చేయుటకు కోరు అపవాది దాని సృష్టికర్తలైయున్నారు.